Saturday, 7 December 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 59వ భాగం - విధి వంచితులై విభవము వీడి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైఎనిమిదవ భాగం ఇక్కడ

59వ సజీవరాగం -  
చిత్రం - పాండవవనవాసము
గానం - ఘంటసాల 
రచన - సముద్రాల
సంగీతం - ఘంటసాల 

పల్లవి:  విధి వంచితులై విభవము వీడి

సాకీ - న్యాయానికే పరాజయమా

వంచనకే ధర్మము తలవంచేనా..

 

బృందం - ఆ... ఆ....

పల్లవి : విధి వంచితులై విభవము వీడి

అన్న మాటకోసం అయ్యో

అడవిపాలయేరా !!విధి!!

చరణం 1: నీ మది రగిలే కోపానలము ఈ

మహినంతా దహియించేనని మోమును

దాచేవ ధర్మరాజా !

 బృం: అయ్యో.. అడవిపాలయేరా..

చరణం 2: సభలో చేసిన శపధముదీరా

పాపుల ననిలో త్రుంచెద నేనని

బాహువులూచేవ భీమసేనా

 బృం: ఆహా.. అడవిపాలయేరా...

 చరణం 3:  ఆలములోన కౌరవసేనా

అమ్ములవానా ముంచెదనేనని

ఇసుమును చల్లేవ సవ్యసాచీ!! విధి!

చరణం 4: ఏ యుగమందూ ఏ ఇల్లాలూ

ఎరుగదు తల్లీ ఈ అవమానం !! ఏ యుగమందూ!!

నీ పతిసేవయె నీకు రక్ష

 బృందం :  ఆ..ఆ..ఆ..

జీవితంలో ధర్మాన్ని, నీతి నియమాలను పాటిస్తూ ఒక లక్ష్యసాధన కోసం ముందుకు సాగేవారికి అడుగడుగునా కష్టాలే. భగవంతుడు వారికి అండగా నిలిచినా, ధర్మానికే అంతిమ విజయం సిధ్ధించినా వారు తరచూ విధి చేత వంచింపబడుతూంటారు. అలాటి వారి దుఃఖం, మనోవేదన, పడే కష్టాలు మామూలు మాటలకు అందనివి; ఇతరులకు ఏమాత్రం అర్ధంకానివి.

ఇలాటి దుస్థితులే గత తరం  సినీమా కధలలోని పాత్రలకు ఏర్పడితే అలాటి సన్నివేశాలు రక్తికట్టడానికి,  ఆ పాత్రల మనోభావాలు ప్రేక్షకుల హృదయాలను సూటిగా తాకడానికి  దర్శకులు పాత్రల సంభాషణల ద్వారా కాక సంగీతం ద్వారా - నేపధ్యగీతం - ద్వారా తాము ఆశించిన ఫలితాన్ని రాబట్టుకునేవారు.

ఆనాటి సినిమాలలో సన్నివేశపరమైన ఉదాత్త భావాలను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా నేపథ్యంలో  ఆలపించగల ఏకైక గాయకుడు  ఘంటసాల. సందర్భానుసారం నవరసాలలో తన మధుర, గంభీర కంఠస్వరం ద్వారా నటించగల ప్రతిభావంతుడు.

పాండవవనవాసము చిత్రం కోసం తన స్వీయ సంగీతదర్శకత్వంలో  ఘంటసాల మాస్టారు ఆలపించిన ఆవేశపూరితమైన,  ఆవేదనాభరితమైన "విధి వంచితులై విభవము వీడి..." అనే నేపధ్యగీతమే ఈ నాటి మన సజీవరాగం.

సినీమాలో ఈ సన్నివేశం చాలా కీలకమైనది. ఉదాత్తమైనది, ఉద్రేకభరితమైనది.

మాయాజూదంలో దాయాదులచే దయాదాక్షిణ్యం లేకుండా పరాభవించబడిన పాండవులు, పాండవ ధర్మపత్ని అవమానభారంతో కౌరవ సభనుండి తలలు వంచుకొని హస్తినాపురం ప్రజల ముందునుండి అడవులకేగుతున్న సందర్భం. అంతకుముందు వరకు కౌరవ సభలో దుర్యోధనుడు, భీముడి మధ్య జరిగిన తీవ్ర వాదోపవాదాలు, భీకర ప్రతిజ్జలతో, ద్రౌపది ధర్మాధర్మ చర్చలు, దీనాలాపనలు చాలా ఉద్విగ్నభరితంగా సాగాయి. పాండవులు పూర్తిగా నిస్తేజులైపోయారు.  అరణ్యవాసం ఒక్కటే వారికి గత్యంతరమయింది.

పాండవులంతా విధవిధాలుగా పరితపిస్తూ, వివిధ భావోద్వేగాలతో ముందుకు పోతున్నారు. ఏమీ మాట్లాడలేని దుస్థితి. ఆ దుర్భర స్థితిని వివరిస్తూ ఆక్రోశంతో, ఆవేశంతో ఆవేదనా భరితంగా ఘంటసావారి నేపథ్యగీతాన్ని ఎంతో కరుణరసాత్మకంగా చిత్రీకరించారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు.

ఆ సన్నివేశంలో పాండవుల మనోభావాలను, చేష్టలను సముద్రాలవారు తన గీతంలో సజెస్టివ్ గా వెల్లడించడం వలన పాట చిత్రీకరణలో ధర్మ, భీమ, అర్జున, ద్రౌపది పాత్రధారుల హావభావాలు ఘంటసాలవారి భావోద్వేగాలకు దీటుగా సరితూగాయి.  ఈ పాటలో సముద్రాలవారు  అని', 'ఆలము', 'ఇసుము', 'అమ్ములవాన' వంటి పదాలను భవిష్యత్ లోని సమయ సందర్భాలను సూచిస్తూ ప్రయోగించారు.  ఈ చిత్రానికి అర్ధవంతము, సమర్ధవంతము అయిన సంభాషణలను వ్రాసినది కూడా సముద్రాల రాఘవాచార్యులుగారే.

ఘంటసాల మాస్టారు ఈ పాటను చక్రవాకం రాగంలో స్వరపర్చారు. 72 మేళకర్తలలో 16వ మేళకర్త చక్రవాకం. మేళకర్త అంటేనే ఏడు స్వరములు గల సంపూర్ణరాగం. ఈ రాగాన్ని ముత్తుస్వామి దీక్షితర్ సంప్రదాయంలో "తోయగవాహిని" అని అంటారు. హిందుస్థానీ సంగీతంలో చక్రవాకానికి సమాంతరమైన రాగం "అహిర్ భైరవ్".  చక్రవాకం  రాగ లక్షణ ప్రకారం భక్తి, కరుణ, సానుభూతి వంటి రసాలను ప్రతిఫలించే రాగంగా సంగీతకారులు వర్ణించారు. చక్రవాక రాగాన్ని  సినీమా లలో బాగా ప్రచారంలోకి తీసుకువచ్చిన ఘనత ఘంటసాల మాస్టారిదే. తన సంగీతదర్శకత్వంలో వచ్చిన ' పెళ్ళిచేసి చూడు' సినీమా లో పి.లీల పాడిన 'ఏడుకొండల వాడా వెంకటా రమణా' పాటను మొదటిసారిగా చక్రవాకం రాగంలోనే చేసి ఎంతో పేరు పొందారు.

అక్కడ భక్తిపూర్వకంగా వినిపించిన చక్రవాకాన్ని 'విధి వంచితులై 'పాటలో కొంత ఆక్రోశాన్ని, కొంత కరుణను మిళితం చేసి వినిపించారు. ఒక రాగానికి  శాస్త్రరీత్యా ఏ లక్షణాలు ఆపాదించి చెప్పినా సినీమా మాధ్యమంలో  ఆ రాగాన్ని ఏవిధమైన రసానికైనా సమర్ధవంతంగా ఉపయోగించవచ్చని నిరూపించిన ప్రతిభాశాలి ఘంటసాల మాస్టారు.

"విధివంచితులై" పాట  ఐదు వైయొలిన్ బ్యాంగ్ లతో మొదలవుతుంది "న్యాయానికే పరాజయమా" అని తారస్థాయిలో  సాకీతో ప్రారంభించిన ఘంటసాలవారి కంచుకంఠం శ్రోతలకు  గగుర్పాటు కలిగిస్తుంది. అరిచినట్టుగా కాకుండా, తారస్థాయిలో కూడా గాత్రాన్ని వినసొంపుగా మాధుర్యంగా వినిపించగల గాయకులు అరుదు. ఘంటసాలవారి ఆ ప్రతిభ అనుపమం.  

పాట పల్లవికి ముందు కోరస్, తర్వాత వచ్చే షెహనాయ్ ఆలాపన చక్రవాక రాగ లక్షణాన్ని సంపూర్ణంగా మనకు అవగతం చేస్తాయి. ఈ పాటలో ప్రధాన వాద్యాలుగా షెహనాయ్   వైయొలిన్స్, తబలా, వైబ్రోఫోన్ వాద్యాలు పాటకు కావలసిన రసోత్పత్తిని కలిగించాయి.

పాండవవనవాసములో పాటల సంగీతమే కాదు నేపథ్య సంగీతం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సినీమాలో ప్రధాన పాత్రలైన ఎన్.టి.రామారావు (భీముడు),  లింగమూర్తి (శకుని)లకు  బేస్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్ ల మీద  మాస్టారు వినిపింపజేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి.

మాటకు  మెట్టా; లేక మెట్టుకు మాటా? అనేది ఒక సమస్యే కాదు. ఆనాటి సంగీతదర్శకులు, గీతరచయితలు రెండు ప్రక్రియలకు అనుగుణంగా పనిచేయగల సమర్ధులే. పరస్పర అవగాహనతో, సహకార దృక్పథంతో గీత రచన, స్వర రచన సాగేవి. ఏ పధ్ధతిలో స్వరరచన చేసినా అది సన్నివేశపరంగా రక్తికట్టాలి. జనాకర్షణ కలిగివుండాలి. అదే ఆనాటి గీత రచయితల, సంగీతదర్శకుల లక్ష్యంగా వుండేది. పాండవవనవాసములో గల మొత్తం  ఇరవైరెండు పాటల, పద్యాల స్వరరచన ఆ పధ్ధతిలోనే సాగింది.

ఈ చిత్రంలోని పాటలన్నింటిని సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, కొసరాజు వ్రాయగా కొన్ని పద్యాలను సముద్రాల వ్రాశారు. ఓ రెండు పద్యాలను నన్నయ భారతం నుండి , మరొకటి సూర్యాష్టకం నుండి తీసుకున్నారు. ఈ సినీమా లో ఓ పన్నెండు పాటలు, పద్యాలు, దండకం ఘంటసాల మాస్టారు పాడగా మిగిలిన వాటిని సుశీల, లీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, బాలమురళీకృష్ణ మొదలగువారు పాడారు.

పాండవవనవాసానికి నేపథ్య కధానాయకుడు ఘంటసాలగారైతే తెరమీద కథానాయకులు ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు. ఈ ఇద్దరూ పోటాపోటీగా తమ రాజసాన్ని అభిజాత్యాన్ని ప్రదర్శించారు. ద్రౌపదిగా సావిత్రి నటీ శిరోమణి అనిపించుకున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో  లింగమూర్తి, కాంతారావు, గుమ్మడి, బాలయ్య, రాజనాల, హరనాథ్, ఎల్.విజయలక్ష్మి,  రాజసులోచన, మొదలగు అగ్రశ్రేణి నటులంతా తమ తమ పాత్రలలో రాణించి పాండవ వనవాసం 175 రోజుల దిగ్విజయోత్సవానికి  కారణకర్తలయ్యారు.

దర్శకేంద్రుడిగా ప్రఖ్యాతి పొందిన కె.రాఘవేంద్రరావు  తొలిసారిగా ఈ సినిమాలో కమలాకర కామేశ్వరరావు కు సహాయకుడిగా పనిచేశారు. అలాగే ఆధునిక చిత్రాలలో సాధారణంగా ఐటం సాంగ్ అన్న ప్రక్రియలో ఆనాటికి పాపులర్ కథానాయికతో కథకి సంబంధంలేని ఒక నృత్యసన్నివేశాన్ని జొప్పించడం పరిపాటి. దానికి విరుద్ధంగా కథలో భాగంగా పాండవవనవాసములో అటువంటి ఒక ఐటం సాంగ్ లో కనిపించిన అప్పటికి అనామక నాట్యకారిణి తరవాత కాలంలో డ్రీం గర్ల్ గా పేరుప్రఖ్యాతులు సంపదించుకున్న నటిగా ఎదగడం విశేషం. 

బహు భాషలలోకి తర్జుమా చేయబడి విజయం సాధించిన సినీమా. పౌరాణిక సినీమా తీయాలంటే తెలుగువారే తీయాలని మరోసారి నిరూపించిన చిత్రం పాండవ వనవాసం. వాణీ ఫిలింస్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు మాధవీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా తొలిసారి గా నిర్మించి ఘన విజయం సాధించిన చిత్రం 'పాండవవనవాసం' ఇదే సంస్థ నిర్మించిన మరో రెండు సినీమా లకు కూడా ఘంటసాలవారే సంగీతం నిర్వహించారు.

పాండవ వనవాసం సినీమాలోని  అనేక పాటల కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్, రీరికార్డింగ్ కార్యక్రమాలను నేను పూర్తిగా పక్కనే వుండి చూడగలగడం నేనెప్పుడు మర్చిపోలేని ఆనందదాయకమైన విషయం.


https://youtu.be/n_0tJSZXgMk?si=86_8RObQhiBFtSJb

విధివంచితులై


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 


ప్రణవ స్వరాట్ 



Saturday, 30 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 58వ భాగం - మనసున మనసై బ్రతుకున బ్రతుకై

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయెనిమిదవ భాగం ఇక్కడ

58వ సజీవరాగం -  మనసున మనసై బ్రతుకున బ్రతుకై
చిత్రం - డాక్టర్ చక్రవర్తి
గానం - ఘంటసాల 
రచన - శ్రీశ్రీ
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:
మనసున మనసై బ్రతుకున బ్రతుకై 
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము !!మనసున!!

ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో
ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో 
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
                           !!మనసున!!

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు 
నీకోసమే కన్నీరునించుటకు - 2
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము...
                          !!మనసున!!

చెలిమియె కరువై వలపే అరుదై
చెదరిన హృదయమె శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము... మనసున మనసై!
                          !!మనసున!!

          
సంతోషం , దుఃఖం; విజయం , ఓటమి - ఇవన్నీ ఒకే సమయంలో సంభవిస్తే  ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు; అతనిలోఈ భావాలు ఎలా ప్రతిఫలిస్తాయి. మాటల్లో చెప్పలేని  భావాలు సంగీతం ద్వారా వ్యక్తపర్చవచ్చని సంగీతజ్ఞులు అంటారు.  సంగీతరాగాల ద్వారా ఆయా మనోభావాలను స్పష్టంగా ప్రకటించవచ్చని గతకాలపు సంగీతవిద్వాంసులు నిరూపించారు. హిందుస్థానీ సంగీతంలో రాగాలను ఆలపించడానికి  ప్రత్యేకమైన కాలనిర్ణయం వుంది.

ఉదయకాలపు రాగాలు, సాయంకాల రాగాలు, రాత్రివేళ రాగాలుగా వర్గీకరించడం జరిగింది. గత తరం ప్రముఖ సంగీత విద్వాంసులందరూ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించేవారు. ఆయా సమయాలకు నిర్దేశించిన రాగాలను మాత్రమే తమ కచేరీలలో వినిపించడం ద్వారా రసస్ఫూర్తిని సాధించేవారు. హిందుస్థానీ సంగీతంలో  'జయజయవంతి ' అనే రాగం వుంది. ఖమాస్ థాట్ కు చెందిన రాగం. దీనినే కర్ణాటక సంగీతంలో ద్విజావంతి అంటారు. 28 వ మేళకర్త హరికాంభోజి జన్య సంపూర్ణరాగం.  జయజయవంతి సాయంకాలపు రాగంగా నిర్ణయించడం జరిగింది. మనిషిలో సంతోషం, దుఃఖం, సాధన, ఓటమి పొందినప్పుడు కలిగే భావాలన్నీ ఈ జయజయవంతి లేదా ద్విజావంతి రాగంలో ప్రతిఫలిస్తాయని సంగీత విశ్లేషకులు చెపుతారు. ఈ రాగానికి దగ్గరలో వుండే మరో హిందుస్థానీ రాగం 'గార'.  నౌషద్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్  ' ముఘల్ ఈ అజం' సినీమా కోసం పాడిన ' మోహెపన్ ఘట్ పె నందలాల్' భక్తిగీతం ఈ ' గార' రాగంలో చేసినదే.

భక్త జయదేవ చిత్రం కోసం సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపర్చిన 'ప్రియే చారుశీలే', 'పాండవ వనవాసం' కోసం ఘంటసాలగారు చేసిన ' హిమగిరి సొగసులు' ,  అలాగే ఘంటసాలవారి' భక్త రఘునాధ్' లోని 'ఈ మరపేలా ఈ వెరపేలా' వంటి పాటలు ' ద్విజావంతి' రాగంలోనే వున్నాయి. 

ద్విజావంతి రాగంలో  'డాక్టర్ చక్రవర్తి' సినీమా కోసం సాలూరు వారు స్వరపర్చిన  మరువలేని మరో  అద్భుత గీతం
'మనసున మనసై బ్రతుకున బ్రతుకై''.   అదే ఈనాటి మన  ఘంటసాలవారి   సజీవరాగం .

కవుల సహజ ప్రవృత్తికి విరుధ్ధంగా వైవిధ్యభరితమైన పాటలు వ్రాయించుకోవడంలో అన్నపూర్ణా మధుసూధనరావుగారు దిట్ట. తమ తొలి చిత్రాలలో ఒకటైన ' తోటికోడళ్ళు' సినిమా లో మనసు కవిగా పేరుపొందిన ఆత్రేయగారి చేత  'కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిచాన', ' డా.చక్రవర్తి లో శ్రీశ్రీగారు వ్రాసిన ' మనసున మనసై ' పాటలు ఇందుకు నిదర్శనం. శ్రీశ్రీగారు, ఆత్రేయగారు తమ మనసులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఈ పాటలు వ్రాసారేమో అనే సందేహం శ్రోతలకు కలగడం సహజం. 

అన్నపూర్ణా మధుసూధనరావుగారి మనసెరిగిన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు. అలాగే రాజేశ్వరరావు గారి స్వేఛ్ఛకు, స్వాతంత్య్రానికి భంగం కలగకుండా తనకు కావలసిన పధ్ధతిలో అమృతగుళికలవంటి పాటలను చేయించుకున్న ఘనత మధుసూధనరావుగారిది. ఈ సంస్థకోసం సాలూరు వారు స్వరపర్చిన అసంఖ్యాక గీతాలు ఘంటసాల , సుశీల గాత్ర మాధుర్యం వలన నేటికి అజరామరంగా నిలిచిపోయాయి. 

అలాటి ఆపాతమధురమే ఘంటసాలవారు ఎంతో మనోజ్ఞంగా ఆలపించిన  "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాట. శ్రీశ్రీ, రాజేశ్వరరావు, ఘంటసాల అపురూప కలయికలో రూపొందిన ఈ పాట గత ఆరు దశాబ్దాలుగా తెలుగువారందరినీ ఎంతో ప్రభావితం చేసింది. మనసు చెదిరి మనోక్లేశానికి గురియైన ఎందరికో స్వాంతన చేకూర్చిన గీతం 'మనసున మనసై'.  అన్నీ కలిగివున్న  సంస్కారవంతుడైన ఒక ప్రముఖ డాక్టర్ కు, తన మనసును అర్ధం చేసుకోలేని  ఒక సగటు స్త్రీ జీవిత భాగస్వామిగా లభించి అతని జీవితం నరకప్రాయమైనప్పుడు,  అతని హృదయంలో రగిలే బాధ, ఆవేదనలకు 
ప్రతీక ఈ పాట. ఈ భావాలన్నింటికి తమ అద్వితీయ గాన పటిమతో  ఘంటసాల, నటనా వైదుష్యంతో అక్కినేని నాగేశ్వరరావు గార్లు ప్రాణప్రతిష్ట చేసి చక్రవర్తి అనే ఒక ఉన్నత వ్యక్తిని మన కళ్ళెదుట నిలబెట్టారు.  ఒకరికోసం మరొకరు పుట్టారన్నట్లుగా తెలుగువారంతా భ్రమించడానికి ఈ రకమైన భావగాంభీర్యం గల పాటలే ముఖ్యకారణం.

శాస్త్రీయ సంగీత రాగాల పట్ల గల  చక్కటి అవగాహనతో ద్విజావంతి రాగ లక్షణాలన్నింటిని  ఈ పాటలో ఘంటసాల తన గాత్రమాధుర్యంతో మరింత ఇనుమడింపజేసారు.

కధానాయకుని మనోభావాలను, ఆవేశ, ఆవేదనలను పరిపూర్ణంగా తనలో అనుభవిస్తూ చక్రవర్తి పాత్రలో పూర్తిగా లీనమైపోయి ఆర్తితో ఘంటసాలవారు ఈ పాటను గానం చేశారు. తోడుగా సితార్ జనార్దన్ లాటి ప్రతిభావంతులైన కళాకారులు వాద్యబృందంలో వుంటే హృద్యమైన గీతాలకు స్వరకల్పన చేయడం రాజేశ్వరరావుగారిలాటి వారికి నల్లేరు మీద నడకే. ఈ పాటలో సితార్ తో పాటు ఫ్లూట్, వైయొలిన్స్, పియోనా, తబలా, రిథిమ్స్  వంటి వాద్యాలు సున్నితంగా , శ్రావ్యంగా వినిపిస్తాయి.

తెరమీద అక్కినేని తో పాటు జగ్గయ్య , సావిత్రి కూడా ఈ పాట  సన్నివేశం రక్తికట్టడానికి తోడ్పడ్డారు.

తెలుగు పత్రికా రంగాన  మహిళా రచయిత్రుల నవలలు రాజ్యమేలుతున్న తరుణంలోనే సినీమాలకు కావలసిన మసాలా దినుసులన్నీ వుండే నవలలు చాలానే వెలువడ్డాయి. వాటిలో కోడూరి కౌసల్యాదేవిగారి ' చక్రభ్రమణం' నవల ఒకటి. ఆంధ్రప్రభలో ఉత్తమ నవలగా బహుమతి పొంది ధారావాహిక గా ప్రచురించబడి పత్రిక సర్క్యులేషన్ ను ఎంతగానో పెంచింది. ఆ నవల దుక్కిపాటి , ఆదుర్తి దృష్టిలో పడి  'డా. చక్రవర్తి' సినీమా గా రూపొందింది. గొల్లపూడి మారుతీరావు, ఆత్రేయ  సంభాషణాబలం,  అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, జానకి, గుమ్మడి, కృష్ణకుమారి మొదలగువారి నటకౌశలం, అన్నిటికి మించి సాలూరి వారి సంగీతం, ఘంటసాల, సుశీల  గానామృతం డాక్టర్ చక్రవర్తి సినీమా ఘనవిజయానికి ఢోకాలేకుండా చేసింది. 1964 సంవత్సరం లో కేంద్రప్రభుత్వ ఉత్తమ చిత్ర బహుమతిని , రాష్ట్రప్రభుత్వం బంగారు నందిని 'డా. చక్రవర్తి' తన సొంతం చేసుకున్నది. 

తెలుగునాట తెలుగు పాట వున్నంతకాలం తెలుగు హృదయాలలో ఘంటసాలవారి ఈ మనసున మనసై పాట చిరస్థాయిగా నిలిచేవుంటుంది.  



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 23 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 57వ భాగం - జగమే మారినది మధురముగా ఈవేళ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయారవ భాగం ఇక్కడ

57వ సజీవరాగం - జగమే మారినది మధురముగా ఈవేళ 
చిత్రం - దేశద్రోహులు
గానం - ఘంటసాల 
రచన - ఆరుద్ర
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:
జగమే మారినది మధురముగా ఈవేళ 
కలలు కోరికలు తీరినవి మనసారా 
                                  !!జగమే!!

మనసాడెనే మయూరమై పావురములు
పాడే ఎల పావురములు పాడే
!మనసాడెనే!
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట
నెనరూ కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింత
                                  !!జగమే!!

విరజాజుల సువాసన స్వాగతములు
పలుక సుస్వాగతములం పలుక.. ఆ....
తిరుగాడును తేనెటీగ తీయదనముకోరి
అనురాగాల తేలి కమ్మని భావమే
కన్నీరై చిందెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి
                                  !!జగమే!!

"నెనరుంచినాను అన్నిటికి నిదానుడని నేను నీదుపై నెనరుంచినాను" - అంటే ఈ లోకంలో జరిగే సకల కార్యాచరణకు కారణభూతుడవని విశ్వసించి నేను నీపై కృతజ్ఞత కలిగియున్నాను అని అంటారు సద్గురు త్యాగరాజస్వామి తమ కీర్తనలో. నెనరు -  అనే మాటకు ప్రేమ, దయ, విశ్వాసము, స్నేహము,  కృతజ్ఞత వంటి అర్ధాలు ఎన్నో ఉన్నాయి. కవులు తమ తమ భావాలకు అనుగుణంగా ఈ ' నెనరు' అనే మాటను ప్రయోగిస్తూంటారు.

నేటి ఘంటసాల సజీవరాగం లో 'నెనరు కూరిమి ఈనాడే పండెను' అనే పదజాలంతో ఆరుద్ర ఒక పాటలోని చరణాన్ని పూరించారు. ఇక్కడ వారు ఉపయోగించిన 'నెనరు' ప్రేమకు పర్యాయపదంగా భావించవచ్చును.

ఈ మాటలు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట "జగమే మారినది మధురముగా ఈవేళ", దేశద్రోహులు సినీమాలోని పాటే. ఇదే నేటి మన సజీవరాగం.

దేశద్రోహులు చిత్రంలో ఉన్న పది పాటలను ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, చెరొక ఐదు పాటలు వ్రాసారు. ఈ సినీమాలో ఇన్ని పాటలున్నా, దేశద్రోహులు సినిమా పేరు చెప్పగానే సంగీతాభిమానుల కు గుర్తు వచ్చే పాట "జగమే మారినది మధురముగా ఈవేళ" పాట ఒక్కటే. సాలూరి రాజేశ్వరరావుగారి స్వరకల్పనలో ఈ పాట ఆపాతమధురమై అజరామరమయింది.

కళ్యాణి రాగంలో స్వరపర్చబడిన ఈ మధురగీతం సినిమా ప్రధమార్ధంలో ఘంటసాల, సుశీల పాడిన యుగళగీతంగా, ద్వితీయార్థంలో ఘంటసాలవారి సుస్వరంలో ఏకగళ గీతంగా శ్రోతల హృదయాలను దోచుకున్నది. కళ్యాణి రాగ వైశిష్ట్యాన్ని గురించి గతంలో ఇదే శీర్షికలో పలుమార్లు ముచ్చటించడం జరిగింది, కనుక ఆ రాగాన్ని గురించిన పరిచయం చర్వితచరణమే అవుతుంది.

గతంలో కళ్యాణి రాగంలో ఏ సంగీత దర్శకుడు ఏ పాట చేసినా అధికసంఖ్యాకమైన గీతాలను ఘంటసాలే ఆలపించడం, వాటిని పరవశత్వంతో విని ఆదరించిన సంగీతాభిమానులు ఘంటసాల అభిమాన రాగం కళ్యాణి అని ప్రేమతో ఆపాదించడం జరిగింది. ఆ రాగంలో ఎన్ని పాటలు పాడినా ప్రతి ఒక్క పాటకు తన గాన ప్రతిభతో  ఘంటసాల జీవంపోసారు. 

దేశద్రోహులు చిత్రంలో "జగమే మారినది" పాట రెండు సార్లు పునారావృతం కావడం మూలాన మరింతగా శ్రోతల హృదయాలకు చేరువయింది. మొదటిసారిగా ప్రేయసీ ప్రియులు పాడుకునేప్పుడు ఈ పాట  సాహిత్యం అంతిమ చరణంలో ...."ఎదలో ఇంతటీ సంతోషామెందుకో ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో జగమే మారినది మధురమూగా ఈవేళా" అని నాయకుని పరంగా " కలలు కోరికలు తీరినవి మనసారా" అని నాయిక పరంగా పద ప్రయోగం చేసిన ఆరుద్ర రెండవసారి కధానాయకుడు మాత్రమే పాడేటప్పుడు ఆఖరి చరణంలో "కమ్మని భావమే కన్నీరై చిందెను ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి" అనే గంభీరమైన భావంతో పాటను ముగించారు.

తోటలోని యుగళగీతం , తర్వాత పదిమంది మధ్య ఒక పార్టీలో తన ప్రేయసి మరొకరి భార్యగా కనిపించినప్పుడు ఆ మనోభావాల వైవిధ్యాన్ని అత్యద్భుతంగా తన గళంలో పలికించారు ఘంటసాల. ఈ పాట సోలోగా పాడినప్పుడు పైస్థాయిలో సంచారం, కళ్యాణి రాగాలాపన ఘంటసాలవారి గానప్రతిభకు దర్పణం.

ఈ పాట స్వరకల్పనలో రాజేశ్వరరావుగారి ముద్ర సుస్పష్టం. ఆయన ఈ పాటను వెస్ట్రన్ వాల్ట్జ్ బాణీలో చేసారు. భారతీయ, పాశ్చాత్య బాణీల మిశ్రమంగా ఈ పాటను సుస్వరామృతంలో ముంచెత్తారు రాజేశ్వరరావుగారు. ఈ పాట ఆద్యంతం వినిపించే పియోనా, డబుల్ బేస్, తబలా, సితార్, వైయొలిన్, ఫ్లూట్ ల సమ్మేళనం సాలూరి వారి orchestration ప్రతిభకు ఒక మచ్చుతునక.

తెరపై యుగళగీతంలో పాల్గొన్న ఎన్.టిఆర్., దేవికల సరస శృంగారాభినయాలు, ఏకగళ గీతంలో ఎన్.టి.ఆర్ ప్రదర్శించిన గాంభీర్యం, హుందాతనం ఈ పాటకు మరింత విశిష్టతను చేకూర్చింది.

దేశద్రోహులు సినీమా విజయం మాట ఎలా వున్నా , ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఈ ఘంటసాల కళ్యాణి గీతం తెలుగువారందరినీ  నిత్యకళ్యాణిగా అలరిస్తూనేవుంది. 







వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 16 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 56వ భాగం - అలిగినవేళనే చూడాలీ గోకులకృష్ణుని అందాలూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయైదవ భాగం ఇక్కడ

56వ సజీవరాగం - అలిగినవేళనే చూడాలీ గోకులకృష్ణుని అందాలూ
చిత్రం - గుండమ్మ కథ
గానం - ఘంటసాల 
రచన - పింగళి
సంగీతం - ఘంటసాల

పల్లవి:
అలిగినవేళనే చూడాలి
గోకులకృష్ణునీ అందాలూ - 2

రుసరుసలాడే చూపులలోనే -2
ముసిముసి నవ్వుల అందాలూ 
                !! అలిగినవేళనే...!!
చరణం 1 :
అల్లన మెల్లన నల్లపిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన-2
తల్లి మేలుకొని దొంగను చూసి ఆ...2
అల్లరిదేమని అడిగినందుకే !     
                !! అలిగినవేళనే...!!
చరణం 2 :
మోహన మురళీ గానము వినగా
తహతహలాడుచు తరుణులు
రాగా !! మోహన !!
ద్రిష్టి తగులునని జడిసి యశోద
!!ద్రిష్టి!!
తనను చాటుగా దాచినందుకే
                !! అలిగినవేళనే...!

అలగడం ఆడవారి జన్మహక్కు. వారి అలుకలు తీర్చి అనునయంతో వారిని సంతోషపెట్టడం మగవారి బాధ్యత.  భరించువాడే భర్త అనే నానుడి వుంది కదా. భర్తలు తప్పు చేసినా చేయకపోయినా అలగడమనేది స్త్రీ నైజం. ప్రేయసీ ప్రియుల మధ్య, భార్యాభర్తల మధ్య అలుకలు, కోపతాపాలు రావడం సహజం 'అల్క మానవుకదా అరాళకుంతలా' అని కృష్ణుడు కాళ్ళబేరానికి వచ్చినా కూడా భామచేత తన్నింపజేశారు  నంది తిమ్మన్నగారు తమ పారిజాతాపహరణం లో. 

శ్రీకృష్ణుడంతటి మోహనాకారుడైన భర్త అలిగితే అతనిని తన చేష్టలతో మరింత రెచ్చగొట్టకుండా  తన భర్తలో బాలకృష్ణునిపరంగా ఆ  చిలిపిచేష్టలను ఊహించుకొని  ఒక ఆదర్శమూర్తి తన  ముద్దు మురిపాలతో అతనిని అనునయించి ,అలుకలు తీర్చి ఎలా తన దారికి తెచ్చుకుందో అనే విషయాన్ని "అలిగినవేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు" అనే పాటలో అతి  రసరమ్యంగా చూపించారు దర్శకుడు కమలాకర,  నిర్మాణ సంచాలకుడు చక్రపాణి, గీత రచయిత పింగళినాగేంద్రరావుగార్లు. 

ఈ పాట గుండమ్మకథ చిత్రంలోనిదని ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. చక్కన్నగారికి ఏడుపుగొట్టు వ్యవహారాలు నచ్చవు.  తన సినిమా లోని హీరో హీరోయిన్ లు లైవ్లీగా, లౌవ్లీగా వుంటూ అందరికీ ఆనందం కలిగించాలి. ప్రేక్షకుల ఆనందమే తన ఆనందం. ఆ ఆశయంతోనే  తన సినిమా లన్నీ  సభ్యతతో కూడిన సున్నితమైన హాస్యంతో,  వినోదమే ప్రధానంగా నిర్మించారు. 

మెలొడీ అంటే ప్రాణం పెట్టే గాయక,  సంగీతదర్శకుడు ఘంటసాల. విజయావారి మనసెరిగిన సంగీత దర్శకుడు. ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో విజయావారి చిత్రాలెన్నో సంగీతపరంగా అఖండ విజయాన్ని సాధించాయి. అలాటివాటిలో గుండమ్మకథ ఒకటి. ఈ సినీమా లోని టైటిల్ మ్యూజిక్ తో సహా అన్ని పాటలు సూపర్ హిట్ చేయడంలో ఘంటసాలవారి కృషి , ప్రతిభ అనితరసాధ్యం. 

ఈ సినీమా లోని ప్రతీ ఒక్క పాటా ఒక ఆణిముత్యం, ఒక సజీవరాగం. అలాటి ఒక సజీవరాగమే శ్రీమతి పి. సుశీలగారు అలవోకగా,  సుమధురంగా ఆలపించిన ఏకగళ గీతం  "అలిగినవేళనే చూడాలి". సుశీలగారి గాత్రం ద్వారా ఈ పాటలో వినిపించే ప్రతీ భావము, గమకం, శ్రావ్యత ఘంటసాల మాస్టారి బాణీకి, ప్రతిభకు ప్రతిబింబం.

మాస్టారు ఈ పాటను హిందుస్థానీ రాగమైన 'దేశ్' రాగంలో చేశారు. ఖమాస్ థాట్ కు చెందిన ఈ జన్యరాగం ఔడవ సంపూర్ణరాగం. అంటే అరోహణాక్రమంలో ఐదు స్వరాలు, అవరోహణాక్రమంలో ఏడు స్వరాలు వినిపిస్తాయి.  'దేశ్' రాగంలాగే అనిపించే మరో రాగం ' తిలక్ కామోద్'. ఈ  రెండు రాగాల పట్ల పూర్తి అవగాహన లేకపోతే ఒకదానికొకటి పొరపాటు పడే అవకాశం వుంది.  హిందుస్థానీ సంగీతంలోనే 'దేశి' అని మరో రాగం వుంది. దీనికి దానికి సంబంధం లేదు. 'దేశ్' కు సమాంతరమైన కర్ణాటక రాగం 'కేదారగౌళ'. మనసుకు ప్రశాంతతను, హాయిని చేకూర్చే రాగం 'దేశ్'. ఘంటసాలగారు ఈ రాగంలో అనేక మంచి పాటలు చేశారు. 

ఘంటసాల మాస్టారు ఈ పాటలో ప్రధాన వాద్యంగా షెహనాయ్ ను వినిపించారు. దాక్షిణాత్య సినీమా లలో సితార్ కు మిట్టా జనార్దన్ ఎలా ప్రసిధ్ధుడో, షెహనాయ్ వాద్యానికి పిఠాపురం సత్యం అంతటి లబ్దప్రతిష్టుడు. షెహనాయ్ సత్యం అంటే చిత్రసీమలో తెలియనివారే వుండరు. ఆ సత్యమే ఈ పాటకు షెహనాయ్ వాయించారు.  షెహనాయ్ తో పాటు ఈ పాటలో ఫ్లూట్,  తబలా, కోలు, సితార్, గజ్జెలు, మొదలైన వాద్యాలు ఎంతో మనోజ్ఞంగా వినిపిస్తాయి. శ్రీమతి పి.సుశీలగారి కంఠంలో, పాట మధ్యలో వచ్చే గాత్ర ,   షెహనాయ్  ఆలాపనలు దేశ్ రాగ శ్రావ్యతను, ఆ రాగ విశిష్టతను తెలియజేస్తాయి. సుశీలగారి కంఠంలోంచి వెలువడే పద స్పష్టత, భావప్రకటన, మాధుర్యం, శ్రుతిశుధ్ధత అవి ఆవిడకు మాత్రమే సొంతం. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పాటలో ఆవిడ గళంలోనుండి వినిపించిన ప్రతి గమకాలు, సంగతులు, భావప్రకటన అన్ని ఘంటసాలవారి బాణీకి replica.

ఇక తెరపై ఈ పాటకు అభినయించిన సావిత్రి, ఎన్.టి.ఆర్. ఎంతో హుందాగా, చాలా అందంగా కనిపించారు. వారి ఉదాత్త నటకౌశలం, బాలకృష్ణుని  తైలవర్ణ చిత్రాలు, ఈ పాటకు, సన్నివేశానికి మరెంతో పుష్టిని, నిండుదనాన్ని కలిగించి 'అలిగినవేళనే చూడాలి' పాట సజీవరాగమై నిలవడానికి దోహదం చేశాయి.

విలియం షేక్స్పియర్ 'టేమింగ్ ఆఫ్ ది ష్రూ' నాటకం నుండి కొంత, బి.విఠలాచార్యగారి 'మనె తుంబిద హెన్ను' అనే సినిమా కథ నుండి మరికొంత ప్రేరణను పొంది తనదైన బాణీలో చక్రపాణిగారు ఈ చిత్రాన్ని నిర్మించారు.   డైరెక్టర్ గా తన తొలి చిత్రం 'చంద్రహారం'  పరాజయం తర్వాత  విజయా సంస్థలో స్థానం కోల్పోయిన కమలాకర కామేశ్వరరావుగారికి  'గుండమ్మకథ' ద్వారా మరల తన సత్తాను చాటుకునే అవకాశం లభించింది. టైటిల్ రోల్ లో సూర్యకాంతం, ఎన్.టిఆర్., ఎ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్., సావిత్రి, జమున, రమణారెడ్డి, ఛాయాదేవి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మి, రాజనాల, మిక్కిలినేని మొదలగు వారి అద్భుత నటనా ప్రతిభవలన, చక్రపాణిగారి కథాసంవిధానం వలన  ఘంటసాలవారి సంగీతం, గానం వలన గుండమ్మకథ అఖండ విజయం సాధించి  అనేక కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ద్విభాషా చిత్రంగా మొదలైన గుండమ్మకథ తమిళంలో కూడా "మణిదన్ మారవిల్లై"గా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగు లో ఎన్.టి.ఆర్ పాత్రను తమిళంలో జెమినీ గణేశన్ పోషించారు.  తమిళ వెర్షన్ కు కూడా ఘంటసాలవారే సంగీతం నిర్వహించారు. తెలుగు పాటల వరసలే తమిళంలో ఉపయోగించారు. తాను తెలుగులో పాడినవాటిని తమిళంలో శీర్కాళి గోవిందరాజన్, ఎ.ఎల్.రాఘవన్ ల చేత  పాడించారు. కొన్ని పాటల మధ్యలో వచ్చే హమ్మింగ్స్ మాత్రం ఘంటసాలవారివి అలాగే ఉంచడం జరిగింది. 

గుండమ్మకథ సినీమా ద్వారా చిత్రంలోని ప్రతీ పాట, డాన్స్ మ్యూజిక్, టైటిల్ మ్యూజిక్ హిట్ చేసిన ఘనత ఘంటసాల మాస్టారికి దక్కింది. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 9 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 55వ భాగం - ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైనాలుగవ భాగం ఇక్కడ

55వ సజీవరాగం - ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
చిత్రం - అమరశిల్పి జక్కన్న
గానం - ఘంటసాల 
రచన - ఆత్రేయ
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు

పల్లవి:
ఈ నల్లని రాలలో ఏ కన్నులు
దాగెనో .. ఈ బండల మాటునా
ఏ గుండెలు మ్రోగెనో ఓ....
                        !!ఈ నల్లని రాలలో!!
చరణం 1:
పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి
మునులవోలె కారడవుల
మూలలందు పడియున్నవి
                        !!ఈ నల్లని రాలలో!!
చరణం 2:
కదలలేవు మెదలలేవు
పెదవివిప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే
జలజలమని పొంగి పొరలు
                        !!ఈ నల్లని రాలలో!!
చరణం 3:
పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న
శిలలే నయమనిపించును
                        !!ఈ నల్లని రాలలో!!

మోహనా? బిలహరిలా వుంది!... పహడి కావచ్చు!?... ఇలాటి అసందిగ్ధతను ఏర్పర్చడం ఒక్క సినీమా పాటలకే సాధ్యం. సినిమా పాటలకి రాగనిర్ణయం చేయడం అంత సులభమూ కాదు, అంత అవసరమూ లేదని సంగీత విశ్లేషకులెందరో అభిప్రాయ పడుతున్నా ఒక మంచి పాట వింటున్నప్పుడు ఈ ఏ రాగంలో చేసివుంటారానే జిజ్ఞాస సంగీతాభిమానులలో కలగడం సహజం. నాలాటి సామాన్య శ్రోతలకి ఏ రాగమైనా ఒక్కటే. ఏ రాగమైతేనేం? శ్రావ్యమైనదిగా,  మనసుకు హాయిని, చెవులకు ఇంపును కలిగించేదిగా వుండే ప్రతీ  పాటా జనరంజకమై శాశ్వతత్త్వాన్ని పొందుతుంది. సజీవరాగమై నిలుస్తుంది. అటువంటి సుశ్రావ్యగీతమే "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో..." అదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.

ఈ ప్రకృతిలో జడ పదార్ధంగా గోచరించే కొండలలోని బండలన్నింటినీ తన ఉలితో  సౌందర్యమూర్తులుగా మలచి వాటికో నూతనత్వాన్ని, అస్తిత్వాన్ని కలిగించాలని ప్రతి శిల్పి కలలు కంటాడు. అహర్నిశలు శ్రమిస్తాడు. శిల్పకళకే తన జీవితం ధారపోస్తాడు. శిల్పికి, శిలకు మధ్య విడదీయలేని రాగానుబంధం వుంటుంది. ప్రాణంలేని రాయి రప్పలలో  సజీవమైన సౌందర్యాన్ని శిల్పి వీక్షిస్తాడు. బండలలోని హృదయాన్ని, మానవత్వాన్ని శిల్పి అర్ధం చేసుకోగలడు. పైకి కఠినంగా వుండే ఆ రాళ్ళు శిల్పికి మృదువుగా, మెత్తగా తోస్తాయి. రాగద్వేషాలకు అతీతంగా వుండే మునులలాగ కారడవులలో మౌనంగా వుంటాయి. స్వార్ధంతో ఇతరులకు హాని కలిగించే ప్రాణమున్న మనిషికన్నా  చైతన్యంలేని శిలలే నయమనిపిస్తాయి. 

దాదాపు ఆరు దశాబ్దాలకు ముందు డా. సి.నారాయణరెడ్డి గారు ఆకాశవాణి కోసం  "రామప్పకొండ" అనే శ్రవ్యనాటకాన్ని  వ్రాసారు. అందులో ఒక శిల్పియొక్క మనోగతమే ఈ సున్నితమైన , ఉదాత్తమైన "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో" అనే గీతం. ఆకాశవాణి కార్యక్రమం కోసం పాలగుమ్మి విశ్వనాథంగారు ఈ పాటను జోగ్ అనే హిందుస్థానీ రాగంలో స్వరపర్చి గాయకులు ఎమ్.చిత్తరంజన్ గారి చేత పాడించారు.

తర్వాత కొన్నేళ్ళకు ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎస్ రంగా ఈస్ట్ మన్ కలర్ లో కన్నడ, తెలుగు భాషలలో జక్కనాచార్య అనే శిల్పి కథను సినీమాగా తీస్తున్న సమయంలో డా.సి.నారాయణరెడ్డిగారిని పాటలు వ్రాయవలసిందిగా కోరినప్పుడు ఆయన ఈ పాటను నిర్మాతకు వినిపించడం, అది అందరి అమోదం పొందడం జరిగింది. అప్పట్లో తెలుగు సినిమా నిర్మాణం ఎక్కువగా మద్రాసులో సాగడం, నారాయణరెడ్డిగారు హైదరాబాద్ లో స్థిరపడడం వలన ఆయన వ్రాసిన అధిక సంఖ్యాకమైన పాటలు పాటకు మెట్టు కూర్చడమనే పధ్ధతిలోనే సాగేది. 

అమరశిల్పి జక్కన్న తెలుగు కన్నడ భాషలు రెండింటి కీ సాలూరు రాజేశ్వరరావు గారే సంగీతదర్శకుడు. రెండు భాషలలోనూ ఘంటసాల, సుశీలలే ఎక్కువ పాటలు పాడారు. కన్నడంలో కళ్యాణ్ కుమార్, తెలుగులో నాగేశ్వరరావు హీరోలుగా నటించారు. బి.సరోజాదేవి, నాగయ్య, హరనాథ్, ఉదయకుమార్, ధూళిపాళ రెండు భాషల్లో నటించారు.

నృత్య, సంగీతాలకు అధిక ప్రాధాన్యత వున్న ఈ సినీమాలోని పాటలన్నీ అత్యంత జనాదరణపొందాయి. రాజేశ్వరరావుగారి ప్రతిభకు గీటురాయిగా నిలిచే చిత్రం "అమరశిల్పి జక్కన్న". ఈ చిత్రంలో ఘంటసాలగారు పాడిన మూడు సోలోలు, మూడు డ్యూయెట్లు ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. వాటన్నిటిలోకి మకుటాయమానంగా  ఈనాటికీ ప్రజలందరి మనసులలో నిలచిపోయిన గీతం "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో". ఘంటసాలవారి గళ మాధుర్యం, రస భావ ప్రకటనలు, తెరపై అక్కినేని వారి సున్నితమైన హావభావాలు పూవుకు తావి అద్దినట్లుగా ఈ పాట ఆపాతమధురంగా, అజరామరం గా నిల్చిపోయింది.

పాట ప్రారంభంలో కొండలలో ప్రతిధ్వనిస్తూ వినిపించే ఘంటసాల మాస్టారి ఆలాపన, దానికి ఊపిరిపోస్తూ ట్యూబోఫోన్, మువ్వల మేళవింపుతో వినవచ్చే ఉలుల శబ్దాలు, శ్రోతను పాటలో లీనమయేలా చేస్తాయి. చరణాల మధ్య వచ్చే బిజిఎమ్స్ లో రాజేశ్వరరావు గారికే  సొంతమైన సంగతులు, గమకాల పోకడలు వైయొలిన్స్ మీద చిత్ర విచిత్రంగా వినిపించి శ్రోతలకు పరవశత్వం కలిగిస్తాయి. 

ఇక ఈ పాట పాడిన ఘంటసాలవారి గాన మాధుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. Melancholy తో పాటు భావగాంభీర్యంగల పాటలు పాడడంలో ఘంటసాల మాస్టారికి మించిన గాయకులు లేరంటే అది అతిశయోక్తి కానేరదు.

బి.ఎస్.రంగాగారి నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం అన్నివిధాల ఘనవిజయం సాధించింది. కన్నడంలో ఈస్ట్ మన్ కలర్ లో వచ్చిన మొట్టమొదటిచిత్రం  "అమరశిల్పి జక్కనాచార్య".

ఇదే కథ ఆధారంగా ప్రముఖ దర్శకనిర్మాత వి.శాంతారాం హిందీలో 'గీత్ గాయా పథ్థరోంనే' అనే సాంఘిక సినీమాగా నిర్మించారు. ఇందులో జంపింగ్ జాక్ జితేంద్ర హీరోగా నటించడం ఒక విశేషం. 




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 2 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 54వ భాగం - నీ సుఖమే నే కోరుతున్నా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైమూడవ భాగం ఇక్కడ

54వ సజీవరాగం - నీ సుఖమే నే కోరుతున్నా
చిత్రం - మురళీకృష్ణ
గానం - ఘంటసాల 
రచన - ఆత్రేయ
సంగీతం - మాస్టర్ వేణు

పల్లవి: 
ఎక్కడవున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా.....
నీ సుఖమే నే కోరుతున్నా ... 2
నినువీడి అందుకే వెళుతున్నా....
                            !!నీ సుఖమే!!

చరణం 1:
అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని
                            !!నీ సుఖమే!!
చరణం 2:
పసిపాప వలె ఒడి జేర్చినాను
కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేశాను - 2
నువు వుండలేనని వెళ్ళావు 
                            !!నీ సుఖమే!!
చరణం 3:
వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే 
మన్నించుటయే ఋజువుకదా
                            !!నీ సుఖమే!!
చరణం 4:
నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ..
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని - 2
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి
వారై వేరైనా....
                            !!నీ సుఖమే!! 

"నాకు దక్కని అందం , ఆనందం మరొకరి సొంతమవుతూంటే చూస్తూ వూరుకోవడానికి నేనేం చచ్చు దద్దమ్మను కాను, ఈ ఏసిడ్ తో నీ అందాన్ని, నిన్ను సర్వనాశనం చేస్తాను..." అనే పైశాచిక ప్రేమికులే ఎక్కువగా ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో ... " నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా..." అని అనే  ఉదారమైన, ఉన్నత సంస్కారం గల భర్తలు ఈ రోజుల్లో బహు అరుదుగా కనిపిస్తారు. కట్టుకున్న భార్యను తనకు నచ్చినవాడితో కలసి సుఖంగా జీవించమని ఆమెతో గల భార్యాభర్తల అనుబంధాన్ని త్రెంచుకొని ఎక్కడో దూరంగా ఒంటరిగా భార్య జ్ఞాపకాలతో  అలమటిస్తున్న ఓ భర్త  శోక గీతమే నేటి మన సజీవరాగం.

సినీమాలు కేవలం కాలక్షేపం కోసం తప్ప వాటివల్ల సమాజానికి ఏ ప్రయోజనం లేదనే వాదన సరికాదని నిరూపిస్తుంది ఈనాటి ఘంటసాల సజీవరాగం. అదే " నీ సుఖమే నే కోరుతున్నా.." 

పి. పుల్లయ్యగారి "మురళీకృష్ణ" సినీమా కోసం ఆత్రేయగారు వ్రాసిన ఈ పాట నిజమైన ప్రేమకు దర్పణం. బాహ్యాకర్షణ వలన ఏర్పడిన ప్రేమలో, అనుబంధంలో మోహావేశం తప్ప  నిజాయితీ, గాఢత్వం వుండవు. ఎదుటి మనిషి మనసును, వ్యక్తిత్వాన్ని గుర్తించి హృదయాంతర్గతమైన ప్రేమతో ఒకరినొకరు అర్ధం చేసుకున్నప్పుడే ఆ ప్రేమానుబంధం శాశ్వతంగా నిలుస్తుంది. అధికారంతో, బలవంతాలతో ప్రేమ నిలవదు. అవసరమైతే ప్రేమ త్యాగానికి సంసిధ్ధం కావాలి.  నిజమైన ప్రేమకు  అనుబంధానికి గల నిర్వచనమేమిటో ఆత్రేయగారు ఈ పాటలో చాలా చక్కగా విశదీకరించారు.

" అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని...."

"మనసిచ్చినదే నిజమైతే 
మన్నించుటయే ఋజువుకదా..."

" నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ ( తొలగిపోవాలనే అర్ధంలో)
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని...."

ఎంతటి ఉదాత్తమైన భావన. ఆత్రేయగారి ప్రేమ -మనసు- మమతలకు సంబంధించిన పాటలేవైనా  చాలా మనోమథనం జరిగిన తర్వాతే  అక్షరరూపం దాలుస్తాయి.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మాస్టర్ వేణు. విషాదభావోద్వేగాలతో కూడిన ఈ పాటను  వేణు శ్రీరాగం లో స్వరపర్చారు. శ్రీరాగం కర్ణాటక సంగీతంలో అతి ప్రాచీనమైనది. 22వ మేళకర్త కరహరప్రియ జన్యం. ఔడవ వక్ర సంపూర్ణ రాగంగా పేర్కొంటారు. ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. సంగీత ముమూర్తుల రచనలెన్నో శ్రీరాగంలో వున్నాయి. ఘనరాగ పంచకంలో శ్రీరాగం ఐదవది.  త్యాగయ్య గారి పంచరత్న కీర్తనలలోని "ఎందరో మహానుభావులు" శ్రీరాగంలోనే స్వరపర్చబడింది. శ్రీరాగంలో చేసిన సినీమా పాటలెన్నో బహుళజనాదరణ పొందాయి. 

వైయొలిన్స్, సెల్లోస్, సితార్, ఫ్లూట్, జలతరంగ్, తబలా, కాంగోడ్రమ్స్, బాంగోస్ వంటి హెవీ ఆర్కెస్ట్రాతో రూపొందిన ఈ పాటను మాస్టర్ వేణు ఘంటసాల మాస్టారి చేతే పాడించారు. నవరసాలను తన గొంతులో అవలీలగా పలికించగల ఘంటసాల గారు ఈ పాటను మృదుమధురంగా, విషాదభావాలు తొణికిసిలాడేలా గంభీరంగా ఆలపించారు. నాగేశ్వరరావుగారే  పాడుతున్నారనే భ్రమను కల్పించారు. 

ఉత్తమ ప్రమాణాలతో చక్కని సందేశాత్మక గీతానికి ప్రతీక ఘంటసాలవారి "నీ సుఖమే నే కోరుతున్నా..."

భగ్న ప్రేమికుని పాత్రలకు  అక్కినేని నాగేశ్వరరావుగారు పెట్టింది పేరు. డా.కృష్ణ పాత్రలో సంపూర్ణంగా ఇమిడిపోయి నటించారు. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమానురాగాలు వున్నా అపోహలకారణంగా విడిపోయి అనేక సంఘటనల తర్వాత మరల ఒకటి కావడమే ఈ "మురళీకృష్ణ" సినీమా.  అక్కినేని, జమున, హరనాథ్, శారద, ఎస్.వి. రంగారావు, గుమ్మడి మొదలగువారు నటించిన చిత్రం. పద్మశ్రీ పిక్చర్స్ పి పుల్లయ్య దర్శక నిర్మాత.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 26 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 53వ భాగం - పాడుతా తీయగా చల్లగా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయొకటవ భాగం ఇక్కడ

53వ సజీవరాగం - పాడుతా తీయగా చల్లగా
చిత్రం - మూగమనసులు
గానం - ఘంటసాల 
రచన - ఆత్రేయ
సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి: 
పాడుతా తీయగా సల్లగా -2
పసిపాపలా నిదరపో
బంగారు తల్లిగా  !! పాడుతా !!

కునుకుపడితె మనసు కాస్త
కుదుటపడతది
కుదుటపడ్డ మనసు
తీపి కలలు కంటది - ! కునుకు!
కలలె మనకు మిగిలిపోవు
కలిమి సివరకు - 2
ఆ కలిమి కూడా దోచుకునే
దొరలు ఎందుకు !! పాడుతా !!

గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు 
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు -2
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు
!! పాడుతా !!

మణిసిపోతె మాత్రమేమి 
మనసు వుంటది
మనసుతోటి మనసెపుడో 
కలసిపోతదీ - 2
సావు పుటక లేనిదమ్మ
నేస్తమన్నది జనమ జనమకదీ
మరీ గట్టిపడతది !! పాడుతా !!

'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు' అని అనడంలో మన భారతీయ సంస్కారం ఎంత గొప్పదో చాటి చెప్పారు కవి ఆత్రేయ. మన కళ్ళెదటలేని, గతించిపోయిన వ్యక్తుల గురించి అనౌచిత్య ప్రస్తావనలు సముచితం కాదని అందరిలోనూ మంచితనాన్నే చూడాలనే నీతిని పరోక్షంగా నేర్పే గీతం "పాడుతా తీయగా చల్లగా". అదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.

'మనసులు' తో అంతమయ్యే అనేక సినీమాలలో  సాదాసీదా మాటలతో పాషాణ హృదయాలను కూడా కరిగించి కలకాలం గుండెల్లో హత్తుకుపోయేలా గీతాలను రచించి 'మనసు కవి' గా తెలుగువారి మన్ననలందిన గీత రచయిత ఆత్రేయ. ఆత్రేయ వ్రాసిన 'పాడుతా తీయగా' పాట తెలుగు శ్రోతల మనసులలో ఎంతటి సంక్షోభాన్ని, సంచలనాన్ని సృష్టించిందో తెలుగు సినిమా అభిమానులందరికీ తెలుసు. గుండెలను పిండే  రాగభావాలతో, శోకరసాభినయాలతో నిండిన ఈ పాట ప్రతి తెలుగుల నోట ఈనాటికీ స్మరించబడుతూనే వుంది. అందుకు కారణభూతులైనవారు ఒకరా, ఇద్దరా! ఆత్రేయ, కె.వి.మహాదేవన్, ఘంటసాల, ఆక్కినేని, సావిత్రి, ఆదుర్తి  - అందరూ తెలుగు సినిమా  పరిశ్రమలో పట్టుకొమ్మలే. నిత్య స్మరణీయులే. 

గోపి, రాధ, గౌరీ -  ఈ మూడు బాధాతప్త హృదయాల మౌనవేదనే మూగ మనసులు సినీమా. గత జన్మ వాసనల వల్లన జరిగిన కథను గుర్తుకు తెచ్చుకున్న ఓ యువ జంట. దీనంతటికి  నిండుకుండలాటి గోదావరియే సాక్షి.

అంతరాంతరాల్లో ఒకరిపట్ల ఒకరికి ప్రేమానురాగాలు వున్నా పైకి చెప్పలేని మూగబాధ. దానికి కారణం అంతస్తులలోని అంతరాలు. గొప్పింటి అమ్మాయి, పేదింటి అబ్బాయిల మధ్య గల పవిత్ర మూగ ప్రేమను గుర్తించి వారి అనురాగబంధాన్ని వివాహబంధంతో ముడివేయగల పెద్దలే కరువయ్యారు. అమ్మాయిగారు వేరొకరికి సొంతమైనా తాళి కట్టిన  కొద్ది క్షణాలలోనే ఆ భర్త గోదావరికి బలి అవడం, దానితో అమ్మాయిగారిని విధవరూపంలో చూడవలసిరావడం ఎంతటి బాధాకరం. ఆ అమ్మాయిగారిని మౌనంగా ఆరాధించి, అభిమానించే పడవలవాడు గోపి మానసికంగా కృంగిపోతాడు. అమ్మాయిగారి హృదయానికి స్వాంతన కలిగేలా మంచి మాటలతో మరపించడానికి ప్రయత్నిస్తూంటాడు. ఆమె తన బాధలను మరచి నిదురపోయేలా జోలపాడతాడు. ఆ పాటే 'పాడుతా తీయగా చల్లగా'.

కథ, కథనం బాగా వుంటే సాహితి , సంగీతపు విలువలున్న మంచి పాటలు పుడతాయనడానికి మూగమనసులు సినీమాయే సాక్ష్యం. ఈ సినీమా విజయానికి కె.వి.మహాదేవన్ సంగీతం ఎంతో దోహదం చేసింది.

 ఈ సినీమా లో వున్న ఎనిమిది పాటలనూ ఆత్రేయ వ్రాయగా వాటిని ఘంటసాల, సుశీల, జమునారాణి ఆలపించారు.  ప్రతీ ఒక్క పాట ఆపాతమధురమే. ఘంటసాలగారు మూడు డ్యూయెట్లు, రెండు సోలోలు పాడారు. సన్నివేశపరంగా ఘంటసాలగారు పాడిన రెండు సోలో గీతాలు చిత్రంలో చాలా కీలకమైనవి, ఉదాత్తమైనవి. ఆత్రేయగారి రచన వైదుష్యానికి, మహాదేవన్ స్వరకల్పన ప్రతిభకు, ఘంటసాల గాన రాగ భావనా పటిమకు గీటురాళ్ళుగా నిలిచిపోయాయి. అందులో మొదటిది 'ముద్దబంతి పూవులో', రెండవది 'పాడుతా తీయగా చల్లగా'.

కష్టాల్లో వున్న మనిషికి  మనసుకు ఊరట కలిగించే అనునయం, సానుభూతి ఎంతో అవసరం. అది తన మనసెరిగిన వ్యక్తి ద్వారా పొందడం వలన హృదయానికి ఎంతో శాంతిని కలిగిస్తుంది. ఈ పాటను ఆత్రేయగారు చాలా సరళమైన భాషలో మనశ్శాంతి ని కలిగించే జోలపాటలా వ్రాస్తూనే, కొన్ని జీవితసత్యాలను, వేదంత విషయాలను మనసుకు హత్తుకునేలా వ్రాశారు.

సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ ను తెలుగువారికి అత్యంత సన్నిహితుడిని చేసింది 'పాడుతా తీయగా చల్లగా' పాటేనంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మహాదేవన్ పాటల ఆర్కెస్ట్రేషన్ కు ఒక ప్రత్యేకత వుంది. ఆ ముద్ర ఆయన పాటలన్నింటిలో స్పష్టంగా కనిపిస్తుంది.  ఈ పాటలో మహాదేవన్ సితార్,  ఫ్లూట్, వైయొలిన్స్, గిటార్, తబలా, డోలక్, బాంగోస్, కబాష్ వంటి వాద్యాలను చాలా సమర్ధంగా ఉపయోగించారు. ఈ పాటలో పహడి, కాపి, పీలు రాగాల ఛాయలున్నాయి. ఈ మూడు రాగాలు సున్నితమైన భావాలను, శోక రసాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ రాగ లక్షణాలన్నింటినీ మనసున నింపుకొని మహా ఆర్ద్రతతో ఎలాటి మనస్తాపాన్నైనా తొలగించి మనసారా ప్రశాంతంగా నిదురపోయేలా ఘంటసాల మాస్టారు చాలా భావోద్వేగంతో ఈ పాటను పాటను పాడారు. మధ్య మధ్య సావిత్రి గారి 'గోపి, గోపి' అనే పిలుపులు ఈ పాటకు మరింత  రససిధ్ధి కలిగించాయి. ఈ పాటకు ఘంటసాల మాస్టారిని తప్ప వేరొక గాయకుడిని ఊహించుకోలేము. ఇక తెరమీద నాగేశ్వరరావుగారు, సావిత్రిగారు  ఈ పాటలో నటించలేదు, పరిపూర్ణంగా జీవించారు. తద్వారా ఆత్రేయ, కె.వి.మహాదేవన్, ఘంటసాల, అక్కినేని, సావిత్రి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

జమున, గుమ్మడి, పద్మనాభం, సూర్యకాంతం, నాగభూషణం, అల్లురామలింగయ్య, పువ్వుల లక్ష్మీకాంతమ్మ, ఇంకా మరెందరో మూగమనసులు ఘనవిజయానికి ఇతోధికంగా దోహదం చేశారు. తెలుగులో సిల్వర్ జూబ్లీ సినీమాగా నమోదైన మూగమనసులు సినీమాను ఎల్.వి.ప్రసాద్ గారు, ఆదుర్తి దర్శకత్వంలో 'మిలన్' గా నిర్మించి గొప్ప ఆర్ధిక విజయంతో పాటు  అవార్డ్లు సంపాదించారు.

1971లో 'మూగ మనసులు' సినీమాను నటి సావిత్రి తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో  తమిళంలో 'ప్రాప్తం'  విడుదల చేశారు. శివాజీ గణేశన్,  సావిత్రి,  ఎమ్.ఎస్.విశ్వనాధన్ వంటి ఉద్దండులు పనిచేసినా కూడా 'ప్రాప్తం' సావిత్రికి అశనీపాతం అయింది. ఆవిడ పతనావస్థకు ముఖ్య కారణమయింది.

ఘంటసాలవారి సజీవరాగం గా కోట్లాది తెలుగు హృదయాలలో నిలిచిపోయిన 'పాడుతా తీయగా' ను  బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా చిత్ర గాయక చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు తర్వాతి కాలంలో  తన సంగీతకార్యక్రమాలకు మకుటంగా చేసుకొని సాధించిన ఘనవిజయం లోకవిదితమే.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  

Saturday, 19 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 52వ భాగం - నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయొకటవ భాగం ఇక్కడ

52వ సజీవరాగం - నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో 
చిత్రం - పూజాఫలం
గానం - ఘంటసాల 
రచన - డా.సి. నారాయణరెడ్డి
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు

పల్లవి: 
నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
తీగసాగెనెందుకో!! 
                                నిన్నలేని !!

పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో
                            నిన్నలేని !!

తెలి నురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే
                           నిన్నలేని...!!

పసిడి యంచు పైట జార... ఆ... ఓ... - 2

పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే  పరవశించెనే..
                            నిన్నలేని !!  

మునిపల్లె రాజుగారు రక్షణశాఖోద్యోగి. ఉద్యోగకాలంలో రచన ఆయన ప్రవృత్తి. తర్వాతి కాలంలో వృత్తి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. మునిపల్లె రాజుగారు వ్రాసిన ' పూజారి' నవల బి.ఎన్.రెడ్డిగారి దర్శకత్వంలో  "పూజాఫలం" సినీమాగా 1964లో విడుదలయింది. అక్కినేని, సావిత్రి, జమున, జగ్గయ్య మొదలగువారు నటించారు. 

ఆ సినీమాలో ఘంటసాలగారు ఆలపించిన  "నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో" అనే  సుశ్రావ్యగీతమే నేటి మన సజీవరాగం.

కొత్తగా ప్రేమాంకురం మొలకెత్తిన హృదయంలో కదలాడే ఊహలకే కన్నులుంటే... అరుణోదయం నవనవోన్మేషంగా వుంటుంది. నిన్నటివరకు లేని  కొత్త  కొత్త అందాలేవో నిద్రలేచినట్లనిపిస్తుంది. ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. హృదయతంత్రులు తెలియరాని తీయని రాగమేదో పలికిస్తాయి. పసిడి అంచు పైట జారిన మేఘబాల అరుణారుణ కాంతిరేఖలకు పరవశించిపోతుంది. ఎంతటి మధురమైన భావన. 

అంతవరకు ఆడగాలి సోకని ఆ అమాయక యువకుని జీవితంలో ఒక అందమైన సుందరితో పరిచయం ఏర్పడగానే కదలాడే మధురోహలు, సుతిమెత్తని మధురభావనలు. ఇంతటి భావుకతతో మనసు పరవశించేలా గీతాలను రాయడంలో అందెవేసిన కలం  కవి డా.సి. నారాయణరెడ్డిగారిది.

బి.ఎన్.రెడ్డిగారు కమర్షియల్ సినీమా డైరెక్టర్ కాదు.  ఆయన తన వాహినీ బ్యానర్ మీద అనేక ఉదాత్త,  కళాత్మక చిత్రాలను నిర్మించారు. బయట నిర్మాతలకు ఆయన చేసిన సినీమాలు బహు అరుదు. ఆయన అభిరుచి, సంస్కారాన్ని అర్ధంచేసుకొని ఆయనతో సినీమా లు తీసిన నిర్మాతలు ఇద్దరు మాత్రమే . ఒకరు "భాగ్యరేఖ" నిర్మాత పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి; మరొకరు శంభూ ఫిలింస్ దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి. ఈయన నిర్మించిన చిత్రమే "పూజాఫలం".

బి.ఎన్.రెడ్డిగారి మనసెరిగిన సంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు. వీరిద్దరి కలయికలో ఎన్నో మూల్యమైన అమృతగుళికలవంటి పాటలు తెలుగువారిని అలరించాయి. అలాగే "పూజాఫలం"లోని పాటలన్నీ మధురాతిమధురంగా, ఉదాత్తమైన రీతిలో మలచబడ్డాయి. ఈ సినీమాలో స్త్రీ పాత్రలకే ఎక్కువ పాటలు. ఆ ఏడు పాటలను పి.సుశీల, ఎస్.జానకి , బి.వసంత పాడారు. హీరో అక్కినేని కి ఒకే ఒక్క పాట " నిన్నలేని అందమేదో" పాట.

రాజేశ్వరరావుగారి సిగ్నేచర్ కనిపించే గీతం. రాజేశ్వరరావు , ఘంటసాల ఇద్దరూ ఆరితేరిన సంగీతకళాకారులు. ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉండేది. మల్లీశ్వరి నుండి యశోదాకృష్ణ వరకు మధ్య వచ్చిన ఎన్నో సినీమాలలో మరపురాని మంజులగీతాలెన్నో వీరి కలయిక లో రూపొందాయి  లలిత సంగీతానికి సరికొత్త భాష్యం చెప్పాయి. వారి వారి ప్రతిభలు వీరి కీర్తి ప్రతిష్టలకు పరస్పరం దోహదపడ్డాయి.

"నిన్నలేని అందమేదో" పాటను ఘంటసాల చాలా మనోజ్ఞంగా, సున్నితంగా  ఆలపించారు. ఆ కథానాయకుడికి తాను తప్ప మరొకరు నప్పరనే రీతిలో పాడి శ్రోతలను ఒప్పించారు. ఇది రాజేశ్వరరావు బాణియని చెప్పకనే చెప్పే గీతం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో రాజేశ్వరరావుగారి ముద్ర సుస్పష్టంగా తెలిపే పాట. "పసిడి అంచు పైట జార" తర్వాత వచ్చే ఆలాపన  ఘంటసాల బాణీకి దర్పణం. ఈ పాటలో వినిపించే  ఫ్లూట్, వైబ్రోఫోన్, సితార్, డబుల్ బేస్, వైయొలిన్స్, తబలాలు, బర్డ్స్ ఎఫెక్ట్స్ ఈ పాటకు కొత్త సొబగులు చేకూర్చాయి. 

ఈ పాట శుద్ధసావేరి రాగలక్షణాలతోనే ఉన్నట్టుగా భావించవచ్చు. ఆరభి లక్షణాలు కొందరికి వినిపించినా, అవరోహణలో గాంధార ప్రయోగం లేదన్నది, నిషాదం కూడా అల్పప్రయోగంగా వినిపిస్తున్నది అన్నది గమనించగలం*. అయినా, సినిమా సంగీత దర్శకుడుకి నిత్యం కొత్తదనాన్ని సృష్టించవలసిన అవసరం ఉన్నది కనుక, రాగలక్షణాల విషయంలో ఎంతో కొంత స్వంతత్రంగా వ్యవహరించడం సినిమా సంప్రాదాయం.  సినీమా పాటలు పరిపూర్ణంగా శాస్త్రీయ రాగాధారితంగానే వుండాలన్న నియమ నిబంధనలేవీ లేకపోవడం వల్ల ఈ పాటను సుస్వరాజేశ్వర గీతంగా భావించి, మనసారా విని ఆనందిద్దాము. రాగం ఏదైతేనేం, గత ఆరు దశాబ్దాలుగా ఈ పాట సంగీతాభిమానుల హృదయాలలో సజీవరాగంగా ఇంకా నిలిచేవుంది.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 
*Disclaimer: ఈ వ్యాసాల్లో అప్పుడప్పుడు రాగాల గురించి ప్రస్తావించే విషయాలు నా స్వంత రాగ పరిజ్ఞానం కావు. అనుభవజ్ఞులనుండి తెలుసుకున్నవినికిడి జ్ఞానమేనని గ్రహించగలరు.

Saturday, 12 October 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 51వ భాగం - ఎవరివో నీవెవరివో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయవ భాగం ఇక్కడ

51వ సజీవరాగం -  ఎవరివో నీవెవరివో
చిత్రం - పునర్జన్మ
గానం - ఘంటసాల 
రచన - శ్రీశ్రీ
సంగీతం - టి.చలపతిరావు

పల్లవి: 
ఓ.... సజీవ శిల్పసుందరీ
నా జీవనరాగ మంజరీ...

ఎవరివో నీవెవరివో - 3

నా భావనలో నా సాధనలో - 2
నాట్యము చేసే రాణివో !! ఎవరివో!!

చరణం:
దివినే వదలి భువికేతెంచిన 
తేనెల వెన్నెల సోనవో ! దివినే!
కవితావేశమే కలలై అలలై
కురిసిన పూవుల వానవో ... ఎవరివో!

చరణం:
నవ వసంతమున 
నందనవనమున ఆ.... ! నవ !
కోయిల పాడిన పాటవో ! నవ వసంతమున!
వలపు కొలనులో  కలకల విరిసిన
కలువల కన్నుల కాంతివో .. ఎవరివో

చరణం:
నీ కరకంకణ నిక్వణమా అది
వాణీ వీణా నినాదమా
నీ పద నూపుర నిస్వనమా అది
జలధి తరంగ మృదంగ నాదమా
రావే మోహన రూపమా
రావే నూతన తేజమా
రావే... రావే.... 

Cigarette smoking is injurious to health (in the long run and at times it can cause instant damage and loss of memory in a cinematic way and of course therefore dangerous to life)!

ఘంటసాలవారి సజీవరాగం అని చెప్పి స్టాట్యూటరీ వార్నింగ్ ఇస్తున్నానేమిటా ? అని అనుకుంటున్నారా ?

ఒక కాల్చి పారేసిన సిగరెట్ పీక నాలుగు భాషల్లో మూడు గంటల సినీమాకు మూలకారణమయింది.  అదే 1963ల నాటి 'పునర్జన్మ' తెలుగు సినీమా. అందులోని ఘంటసాలగారు ఆలపించిన ' ఎవరివో నీవెవరివో'' పాట ఈ వారం మన సజీవరాగం.

కళాకారులు చాలా సహృదయులుగాను, అతి సున్నిత మనస్కులుగాను వుంటారని లోక ప్రతీతి. అలాటివారి మనసు వికలం చెందేలా ఏ సంఘటన జరిగినా దానికి వారు తీవ్రంగా స్పందించి ఉన్మాదులవుతారు. వారి జీవిత సరళీయే మారిపోతుంది.  అలాటి ఒక శిల్పకళాకారుని కథయే 'పునర్జన్మ'.

చక్కని కథాంశంగల సినీమాలో చిక్కని సన్నివేశం లభించినప్పుడు ఏదైనా పాటను తయారు చేయాలంటే రచయిత, సంగీతదర్శకుడు, గాయకుడు, నటుడు, దర్శకుడు అందరికీ ఆనందమే. అలాటి పాటలలో మంచి సాహిత్యానికి, శ్రావ్యమైన సంగీతానికి ఎక్కువ అవకాశం వుంటుంది. ఘంటసాలవారి పరిభాషలో పదికాలాలపాటు ప్రజల హృదయాలలో  నిల్చిపోతుంది. " ఎవరివో నీవెవరివో" పాటకు అలాటి అదృష్టం లభించింది.

తన స్వహస్తాలతో రూపొందించిన శిల్పసుందరికి ప్రాణప్రతిష్టచేయాలని సంకల్పిస్తాడు ఆ శిల్పి. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి,  ఆరిన దీపాలు వెలుగుతాయి, మ్రోళ్ళు చిగురిస్తాయి, మేఘాలు వర్షిస్తాయి. అలాటి శక్తివంతమైన సంగీతంతో తన శిల్ప స్వప్నసుందరిని నిజమైన సజీవసుందరిగా ఆమె నాట్యం చేస్తే చూసి ఆనందించాలని  తన చేతిలోని సగం కాలిన సిగరెట్ ను గిరాటేసి పక్కనున్న సితార్ ను చేతిలోకి తీసుకొని తన గానం ప్రారంభిస్తాడు.

సన్నివేశం బలంగా ఉంటే పాటలోని సాహిత్యము, సంగీతము కూడా ఉదాత్తంగా మనసుకు హత్తుకునేలా రూపొందుతాయి. శ్రీశ్రీ వంటి మహాకవి మనసు పెట్టి " ఓ సజీవ శిల్ప సుందరీ, నా జీవనరాగ మంజరీ.. ఎవరివో నీవెవవరివో " అనే పల్లవిని అందించారు. భావనలో, సాధనలో నాట్యం చేసే రాణివా, లేక , దివిని వదలి భువికి వచ్చిన తేనెల వెన్నెల సోనవా? అంటూ ప్రశ్నించారు. కవితావేశంతో పూవుల వాన కురిపించి నవవసంత నందనవనంలో కోయిలపాటలు పాడించారు. వలపు కొలనులో కలువకన్నుల కాంతిని నింపారు. తన్నెదుట  సజీవంగా నిల్చి (భ్రమలో) నవసోయగాలతో నాట్యమాడే ఆ సుందరి కరకంకణ నిక్వణాలను, వీణా నినాదాలను, ఆమె పద నూపుర నిస్వనాలను జలధి తరంగ మృదంగ నాదాలుగా అభివర్ణిస్తూ మోహావేశం ఉప్పొంగగా ఆ సమ్మోహన రూపంలో మైరచిపోతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి శిల్పస్వప్నసుందరి దగ్ధమైపోతుంది  అక్కడితో శ్రీశ్రీ గారి మనోజ్ఞ భావనా చెదరిపోయింది.  అప్పుడే సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారు కవిగారి ఉదాత్త భావనలకు స్వరాలుకల్పించారు. పాటను ప్రధానంగా కళ్యాణి రాగంలో చేస్తూ, మోహన, హంసధ్వని (రెండు మధ్యమ స్వరాలు వలన) రాగ ఛాయలు కూడా ధ్వనింపజేస్తూ ఈ పాటను సుశ్రావ్యంగా మలచారు. నృత్య ప్రధానగీతం కావడం వలన అనేక తాళ వాద్యాలను ముక్తాయింపులతో సమర్ధవంతంగా ఉపయోగించారు. 

మిట్ట జనార్దన్ గారి సితార్ వాదనం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. హార్ప్, ట్యూబోఫోన్ , వైబ్రోఫోన్ , తబలా, డోలక్ ,  తబలాతరంగ్ , వంటి తాళవాద్య సమ్మేళనంతో ఈ పాట చాలా హృద్యంగా సాగింది.

ఇక ఈ పాటను ఆలపించిన ఘంటసాలవారి గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పగలను. పాట ఆరంభంలో వచ్చే సాకీలోనే ఘంటసాల ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెరమీద కనిపించేది నాగేశ్వరరావు గారు కావడాన అందుకు కావలసిన లాలిత్యం, భావోద్రేకం, మాధుర్యం ఘంటసాలవారి గళంలో అలవోకగా పలికాయి. తెరమీద అక్కినేని గానానికి, దివినుండి దిగి వచ్చిన అప్సరసలా ఎల్.విజయలక్ష్మి చేసిన నృత్యం ఈ పాటకే జీవం, ప్రధానాకర్షణ.

సుప్రసిధ్ధ రచయిత గుల్షన్ నందా వ్రాసిన "పత్థర్ కె హోన్ట్" కథ  ఆధారంగా నిర్మించబడిన 'పునర్జన్మ'  తెలుగు సినిమాలో అక్కినేని, కృష్ణకుమారి, వాసంతి, గుమ్మడి, ప్రభాకరరెడ్డి మొదలగువారు ప్రధాన తారగణం. ఈ సినీమా ఘనవిజయంతో ఈ కథ హిందీలో 'ఖిలోనా' గా, తమిళంలో "ఎంగిరిన్దో వన్దాళ్"  మలయాళం లో "అమృతవాహిని" గా ఆయా సినీమాలు మంచి విజయం పొందాయి.

1970 లో జరిగిన బ్రహ్మాండమైన ఘంటసాల సీనీజీవిత రజతోత్సవ సంగీత విభావరిలో ఘంటసాల మాస్టారు ఈ పాటను అక్కినేని వంటి ప్రముఖుల,  వేలాది ప్రేక్షకుల సమక్షంలో సంగీత దర్శకుడు టి.చలపతిరావు పర్యవేక్షణలో  అద్భుతంగా పాడి అందరి హర్షధ్వానాలు పొందారు.

ఇంతమంది హేమాహేమీల ప్రతిభావంతమైన కృషివలన ఘంటసాలవారు ఆలపించిన "ఎవరివో నీవెవరివో" పాట  పునర్జన్మ  సినీమా వచ్చిన 60 ఏళ్ళ తర్వాత కూడా సజీవరాగం గా నిల్చివుంది.

ఈ సినీమా లో ఏడు పాటలుండగా ఒక్కటి కూడా డ్యూయెట్ లేకపోవడం విశేషం. ఐదు సోలోలను పి.సుశీల పాడగా రెండు సోలోలను ఘంటసాల పాడారు. అందులో ఒకటి "ఎవరివో నీవెవరివో".

కొసమెరుపు :
సినీమాకు ముందే విడుదలైన ఈ పాటను గ్రామఫోన్ లో వింటూ పునర్జన్మ సినీమా ప్రివ్యూ కోసం ఎదురుచూస్తూన్నం. ఒకరోజు పిఎపి సుబ్బారావుగారి ఆఫీస్ నుండి  ఘంటసాల వారింటికి వర్తమానం వచ్చింది, ఫలానా స్టూడియోలో ఫలానా టైముకు ప్రివ్యూ వుంది, మాస్టారి కుటుంబం అంతా రమ్మనమని. ఎప్పటిలాగే ఆలస్యంగా ఇంటికి చేరిన మాస్టారు మమల్నందరిని తీసుకొని, కోడంబాక్కం రైల్వేగేట్ అవాంతరాలన్నీ దాటి స్టూడియోలో ప్రివ్యూ థియేటర్ చేరేసరికి సినీమా మొదలెట్టేసారు. మేము సీట్లలో కూర్చోని తెరవేపు చూసేసరికి, మేము ఎంతో ఆసక్తితో చూడాలనుకున్న ఘంటసాల మాస్టారి "ఎవరివో నీవెవరివో" పాట అయిపోయి,  ఎల్.విజయలక్ష్మి మాయమై, విగ్రహం ఏదో పూర్తిగా మంటల్లో కాలిపోవడం కనిపించింది. అప్పటికి దాదాపు పావుగంట సినీమా అయిపోయిందని తెలిసింది.  మళ్ళీ ప్రివ్యూ వేస్తారుకదా, అప్పుడు వద్దురుగాని అని ఇంట్లోవారిని సముదాయించారు. ఘంటసాల మాస్టారికి తాను పాడిన సినీమాలు చూడడంలోగాని, తన పాటలు తిరిగి రిపీటెడ్ గా వినడంలో కాని పెద్ద ఆసక్తి వుండేది కాదు.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 34 - దయరాదా నామీదా మరియాదా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...