"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
56వ సజీవరాగం - అలిగినవేళనే చూడాలీ గోకులకృష్ణుని అందాలూచిత్రం - గుండమ్మ కథ
గానం - ఘంటసాల
రచన - పింగళి
సంగీతం - ఘంటసాల
పల్లవి:
అలిగినవేళనే చూడాలి
గోకులకృష్ణునీ అందాలూ - 2
రుసరుసలాడే చూపులలోనే -2
ముసిముసి నవ్వుల అందాలూ
!! అలిగినవేళనే...!!
చరణం 1 :
అల్లన మెల్లన నల్లపిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన-2
తల్లి మేలుకొని దొంగను చూసి ఆ...2
అల్లరిదేమని అడిగినందుకే !
!! అలిగినవేళనే...!!
చరణం 2 :
మోహన మురళీ గానము వినగా
తహతహలాడుచు తరుణులు
రాగా !! మోహన !!
ద్రిష్టి తగులునని జడిసి యశోద
!!ద్రిష్టి!!
తనను చాటుగా దాచినందుకే
!! అలిగినవేళనే...!
అలగడం ఆడవారి జన్మహక్కు. వారి అలుకలు తీర్చి అనునయంతో వారిని సంతోషపెట్టడం మగవారి బాధ్యత. భరించువాడే భర్త అనే నానుడి వుంది కదా. భర్తలు తప్పు చేసినా చేయకపోయినా అలగడమనేది స్త్రీ నైజం. ప్రేయసీ ప్రియుల మధ్య, భార్యాభర్తల మధ్య అలుకలు, కోపతాపాలు రావడం సహజం 'అల్క మానవుకదా అరాళకుంతలా' అని కృష్ణుడు కాళ్ళబేరానికి వచ్చినా కూడా భామచేత తన్నింపజేశారు నంది తిమ్మన్నగారు తమ పారిజాతాపహరణం లో.
శ్రీకృష్ణుడంతటి మోహనాకారుడైన భర్త అలిగితే అతనిని తన చేష్టలతో మరింత రెచ్చగొట్టకుండా తన భర్తలో బాలకృష్ణునిపరంగా ఆ చిలిపిచేష్టలను ఊహించుకొని ఒక ఆదర్శమూర్తి తన ముద్దు మురిపాలతో అతనిని అనునయించి ,అలుకలు తీర్చి ఎలా తన దారికి తెచ్చుకుందో అనే విషయాన్ని "అలిగినవేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు" అనే పాటలో అతి రసరమ్యంగా చూపించారు దర్శకుడు కమలాకర, నిర్మాణ సంచాలకుడు చక్రపాణి, గీత రచయిత పింగళినాగేంద్రరావుగార్లు.
ఈ పాట గుండమ్మకథ చిత్రంలోనిదని ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. చక్కన్నగారికి ఏడుపుగొట్టు వ్యవహారాలు నచ్చవు. తన సినిమా లోని హీరో హీరోయిన్ లు లైవ్లీగా, లౌవ్లీగా వుంటూ అందరికీ ఆనందం కలిగించాలి. ప్రేక్షకుల ఆనందమే తన ఆనందం. ఆ ఆశయంతోనే తన సినిమా లన్నీ సభ్యతతో కూడిన సున్నితమైన హాస్యంతో, వినోదమే ప్రధానంగా నిర్మించారు.
మెలొడీ అంటే ప్రాణం పెట్టే గాయక, సంగీతదర్శకుడు ఘంటసాల. విజయావారి మనసెరిగిన సంగీత దర్శకుడు. ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో విజయావారి చిత్రాలెన్నో సంగీతపరంగా అఖండ విజయాన్ని సాధించాయి. అలాటివాటిలో గుండమ్మకథ ఒకటి. ఈ సినీమా లోని టైటిల్ మ్యూజిక్ తో సహా అన్ని పాటలు సూపర్ హిట్ చేయడంలో ఘంటసాలవారి కృషి , ప్రతిభ అనితరసాధ్యం.
ఈ సినీమా లోని ప్రతీ ఒక్క పాటా ఒక ఆణిముత్యం, ఒక సజీవరాగం. అలాటి ఒక సజీవరాగమే శ్రీమతి పి. సుశీలగారు అలవోకగా, సుమధురంగా ఆలపించిన ఏకగళ గీతం "అలిగినవేళనే చూడాలి". సుశీలగారి గాత్రం ద్వారా ఈ పాటలో వినిపించే ప్రతీ భావము, గమకం, శ్రావ్యత ఘంటసాల మాస్టారి బాణీకి, ప్రతిభకు ప్రతిబింబం.
మాస్టారు ఈ పాటను హిందుస్థానీ రాగమైన 'దేశ్' రాగంలో చేశారు. ఖమాస్ థాట్ కు చెందిన ఈ జన్యరాగం ఔడవ సంపూర్ణరాగం. అంటే అరోహణాక్రమంలో ఐదు స్వరాలు, అవరోహణాక్రమంలో ఏడు స్వరాలు వినిపిస్తాయి. 'దేశ్' రాగంలాగే అనిపించే మరో రాగం ' తిలక్ కామోద్'. ఈ రెండు రాగాల పట్ల పూర్తి అవగాహన లేకపోతే ఒకదానికొకటి పొరపాటు పడే అవకాశం వుంది. హిందుస్థానీ సంగీతంలోనే 'దేశి' అని మరో రాగం వుంది. దీనికి దానికి సంబంధం లేదు. 'దేశ్' కు సమాంతరమైన కర్ణాటక రాగం 'కేదారగౌళ'. మనసుకు ప్రశాంతతను, హాయిని చేకూర్చే రాగం 'దేశ్'. ఘంటసాలగారు ఈ రాగంలో అనేక మంచి పాటలు చేశారు.
ఘంటసాల మాస్టారు ఈ పాటలో ప్రధాన వాద్యంగా షెహనాయ్ ను వినిపించారు. దాక్షిణాత్య సినీమా లలో సితార్ కు మిట్టా జనార్దన్ ఎలా ప్రసిధ్ధుడో, షెహనాయ్ వాద్యానికి పిఠాపురం సత్యం అంతటి లబ్దప్రతిష్టుడు. షెహనాయ్ సత్యం అంటే చిత్రసీమలో తెలియనివారే వుండరు. ఆ సత్యమే ఈ పాటకు షెహనాయ్ వాయించారు. షెహనాయ్ తో పాటు ఈ పాటలో ఫ్లూట్, తబలా, కోలు, సితార్, గజ్జెలు, మొదలైన వాద్యాలు ఎంతో మనోజ్ఞంగా వినిపిస్తాయి. శ్రీమతి పి.సుశీలగారి కంఠంలో, పాట మధ్యలో వచ్చే గాత్ర , షెహనాయ్ ఆలాపనలు దేశ్ రాగ శ్రావ్యతను, ఆ రాగ విశిష్టతను తెలియజేస్తాయి. సుశీలగారి కంఠంలోంచి వెలువడే పద స్పష్టత, భావప్రకటన, మాధుర్యం, శ్రుతిశుధ్ధత అవి ఆవిడకు మాత్రమే సొంతం. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పాటలో ఆవిడ గళంలోనుండి వినిపించిన ప్రతి గమకాలు, సంగతులు, భావప్రకటన అన్ని ఘంటసాలవారి బాణీకి replica.
ఇక తెరపై ఈ పాటకు అభినయించిన సావిత్రి, ఎన్.టి.ఆర్. ఎంతో హుందాగా, చాలా అందంగా కనిపించారు. వారి ఉదాత్త నటకౌశలం, బాలకృష్ణుని తైలవర్ణ చిత్రాలు, ఈ పాటకు, సన్నివేశానికి మరెంతో పుష్టిని, నిండుదనాన్ని కలిగించి 'అలిగినవేళనే చూడాలి' పాట సజీవరాగమై నిలవడానికి దోహదం చేశాయి.
విలియం షేక్స్పియర్ 'టేమింగ్ ఆఫ్ ది ష్రూ' నాటకం నుండి కొంత, బి.విఠలాచార్యగారి 'మనె తుంబిద హెన్ను' అనే సినిమా కథ నుండి మరికొంత ప్రేరణను పొంది తనదైన బాణీలో చక్రపాణిగారు ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ గా తన తొలి చిత్రం 'చంద్రహారం' పరాజయం తర్వాత విజయా సంస్థలో స్థానం కోల్పోయిన కమలాకర కామేశ్వరరావుగారికి 'గుండమ్మకథ' ద్వారా మరల తన సత్తాను చాటుకునే అవకాశం లభించింది. టైటిల్ రోల్ లో సూర్యకాంతం, ఎన్.టిఆర్., ఎ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్., సావిత్రి, జమున, రమణారెడ్డి, ఛాయాదేవి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మి, రాజనాల, మిక్కిలినేని మొదలగు వారి అద్భుత నటనా ప్రతిభవలన, చక్రపాణిగారి కథాసంవిధానం వలన ఘంటసాలవారి సంగీతం, గానం వలన గుండమ్మకథ అఖండ విజయం సాధించి అనేక కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ద్విభాషా చిత్రంగా మొదలైన గుండమ్మకథ తమిళంలో కూడా "మణిదన్ మారవిల్లై"గా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగు లో ఎన్.టి.ఆర్ పాత్రను తమిళంలో జెమినీ గణేశన్ పోషించారు. తమిళ వెర్షన్ కు కూడా ఘంటసాలవారే సంగీతం నిర్వహించారు. తెలుగు పాటల వరసలే తమిళంలో ఉపయోగించారు. తాను తెలుగులో పాడినవాటిని తమిళంలో శీర్కాళి గోవిందరాజన్, ఎ.ఎల్.రాఘవన్ ల చేత పాడించారు. కొన్ని పాటల మధ్యలో వచ్చే హమ్మింగ్స్ మాత్రం ఘంటసాలవారివి అలాగే ఉంచడం జరిగింది.
గుండమ్మకథ సినీమా ద్వారా చిత్రంలోని ప్రతీ పాట, డాన్స్ మ్యూజిక్, టైటిల్ మ్యూజిక్ హిట్ చేసిన ఘనత ఘంటసాల మాస్టారికి దక్కింది.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment