Saturday 24 February 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 18వ భాగం - మది శారదాదేవి మందిరమే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదిహేడవ భాగం ఇక్కడ

18వ సజీవరాగం - 

"మది శారదాదేవి మందిరమే"

సాహిత్యం : మల్లాది రామకృష్ణ శాస్త్రి 
రాగం - కళ్యాణి 
చిత్రం - జయభేరి
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు


పాట సాహిత్యం - 
ముందుగా ఘంటసాలవారి ఆలాపన &
పల్లవి : 
మది శారదాదేవి మందిరమే - 2
కుదురైన నీమమున కొలిచే వారి
మది శారదాదేవి మందిరమే !

చరణం : పిబిఎస్ :
రాగ భావ మమరే గమకములా - 3

పాణిగ్రాహి :
నాద సాధనలే  దేవికి పూజా - 4

తరళ గానములే హారములౌ - 4

ఘంటసాలవారి స్వరకల్పనలు.... 

తరళ గానములే హారములౌ...

చరణం : ఘంటసాల
వరదాయిని గని గురుతెరిగిన 
మన మది శారదాదేవి మందిరమే

కుదురైన నీమమున కొలిచేవారి 
మది శారదాదేవి మందిరమే....

గత వారం ఘంటసాలవారి గళం నుండి మధురాతి మధుర కళ్యాణి రాగ కింకిణీ స్వనాలు విని పరవశం చెందాము. ఈ వారం కూడా అదే కళ్యాణి రాగాన్ని మరో కోణంలో విని ఆస్వాదిద్దాము. ఒకే రాగం వివిధ రసానుభూతులను శ్రోతలలో ఎలా కలిగిస్తుందో ఈ వారం పాట వింటే తెలుస్తుంది. అదే 1959 లో విడుదలైన "జయభేరి" చిత్రంలోని "మది శారదాదేవి మందిరమే" అనే పాట.

గత వారం కళ్యాణి ఘంటసాల బాణి. ఈ వారం కళ్యాణి పెండ్యాలగారి బాణి. ఆ వాణి చల్లగా,  శ్రావ్యంగా మనసులో ఏవో తెలియని మధుర ప్రణయ రాగాలను రేకెత్తిస్తే, పెండ్యాలగారి వాణి మరోవిధమైన అనుభూతిని, భావావేశాన్ని కలిగిస్తుంది. గత వారపు "రావే నా చెలియా"ను ఘంటసాలవారు ఏక గళ గీతంగా ఆలపిస్తే "మది శారదాదేవి మందిరమే" గీతాన్ని ఆయన, పి.బి. శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహిలతో కలసి గానం చేశారు.  ఈ రెండు పాటలు కళ్యాణి రాగంలో చేసినవే అయినా రెండు పాటల మధ్య ఎంతో వైవిధ్యాన్ని కనపర్చారు ఘంటసాల. అందుకే ఘంటసాల ఆ తరం గాయకులకు , ఈ తరం గాయకులకు మాస్టారు అయ్యారు.

"మది శారదాదేవి మందిరమే" గీతాన్ని సంగీత సాహిత్యాలలో మంచి అభినివేశం, అవగాహన కలిగిన జాను తెనుగు కవి  మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు వ్రాసారు. ఈ పాటలో కళావాణి, వాగ్దేవి అయిన సరస్వతీదేవీ అనుగ్రహం ఎలాటివారికి సిధ్ధిస్తుందో కవి ఒక నిశ్చితాభిప్రాయంగా (statement) తెలియజేసారు. పల్లవి లో కవి "కుదురైన నీమమున కొలిచేవారి మది శారదాదేవి మందిరమే " అంటారు. అంటే నియమనిష్టలతో ఏకాగ్ర చిత్తంతో ఎవరైతే సరస్వతీదేవిని ఉపాసిస్తారో వారి మనస్సు ఒక ఆలయం వలె పవిత్రంగా, నిర్మలంగా వుంటుంది.

మొదటి చరణంలో " రాగభావ మమరే గమకములా నాద సాధనలే దేవికి పూజ" అని వెల్లడించారు. రాగ భావాలతో, గమకయుక్తంగా గాయకులు  భక్తి ప్రపత్తులతో చేసే సాధన, నాదోపాసనే దేవి శార్వాణికి పూజలుగా అమరుతాయి. అమూల్యమైన కృతులను రత్నాల హారములుగా ధరించే ఆ వరప్రదాయిని సరస్వతి దేవిని గుర్తించగలిగితే మన మది శారదాదేవి మందిరమౌతుందని నొక్కి వక్కాణించారు కవి రామకృష్ణ శాస్త్రిగారు. 

కవి భావాన్ని క్షుణంగా అర్ధంచేసుకున్న సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారు ఈ పాటను అత్యద్భుతంగా, ఆపాతమధురంగా కళ్యాణి రాగంలో మలిచారు. ఈ గీతం సన్నివేశం  నిష్టాగరిష్టుడైన ఒక సంగీత గురువుగారి సన్నిధిలో పలువురు విద్యార్ధులు సంగీత సాధన చేస్తూ పాడే గీతం.  ఈ గీతంలో అనేక రసానుభూతులు వ్యక్తమయేలా పెండ్యాలగారు స్వరపర్చారు. విద్యార్ధులకు విద్యపట్ల, గురువులపట్ల గల శ్రధ్ధాసక్తులు,  భయభక్తులు, అదే సమయంలో తమ మధ్య గల పోటీ తత్త్వాన్ని కనపర్చే గుణం అన్నింటినీ మిళితం చేసి "మది శారదాదేవి మందిరమే" గీతాన్ని మలిచారు పెండ్యాల.

ఈ గీతాన్ని ఘంటసాల, పిబి శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి పోటాపోటీగా ఆలపించారు. ఈ పాటకు జీవస్వరం ఘంటసాలవారి గళ మాధుర్యం, గాన ప్రతిభే అంటే అది అతిశయోక్తి కాదు. అందుకు ఈ గీతంలో ఘంటసాలవారి గమకయుక్తమైన కళ్యాణి రాగ ఆలాపనలు, స్వరకల్పనలే సాక్ష్యంగా నిలుస్తాయి. ఘంటసాలవారి సంగీత ప్రతిభకు గీటురాయిగా నిలిచే పాట "మది శారదాదేవి మందిరమే". ఈ పాటలో ఘంటసాలవారి కంఠం ధాటీగా, అన్ని స్థాయిలలో కంచు గంటలా మ్రోగింది.  ఏ పాటైనా సజీవమై నిలవాలంటే  నాదం నాభిస్థానం నుండి పలికించాలనే తమ గురువాక్కును ఘంటసాల  ఈ పాటలోనే కాక జీవితాంతం పాటించారు. సంగీతపరంగా ఈ పాట గొప్పతనం సాధారణ శ్రోత వివరించలేడు. అనిర్వచనీయమైన రసానుభూతిని కలిగించి అజరామరత్వం పొందిన పాట ఇది. ఈ పాటలో పాలుపంచుకున్నవారంతా దిగ్దంతలే. ఒకరిని మించి మరొకరు తమ ఆధిక్యతను చాటుకోవడానికి చేసిన తపన కనిపిస్తుంది.

ఈ పాటలో మాస్టారు, పిబిశ్రీనివాస్ లతో గళం కలపిన రఘునాథే పాణిగ్రాహి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ గాయకుడు. ఈయన కూడా చిన్నతనంలో విజయనగరంలో సంగీతాభ్యాసం చేసినట్లు వినికిడి. తెలుగు బాగా వచ్చును. జయభేరి సినీమాలో ఈ  పాట రికార్డింగ్  కోసం మద్రాసులో ఉన్నప్పుడు తరచూ ఘంటసాలవారింటికి వచ్చేవారు. ఘంటసాలగారు, పాణిగ్రాహిగారు మంచి మైత్రితో మెలిగేవారు. తర్వాత కాలంలో రఘునాధ్ పాణిగ్రాహిగారు ప్రముఖ ఒడిస్సీ నర్తకి సంయుక్తగారిని వివాహం చేసుకొని ఒడిసీ సంగీత, నృత్య కళలకే అంకితమై ప్రసిధ్ధి పొందారు.

" మది శారదాదేవి మందిరమే"  పాటలో శుధ్ధ శాస్త్రీయ సంగీత కచేరీ గీతానికి కావలసిన లక్ష్య, లక్షణాలన్నీ ఉన్నాయి. గీతం ఆరంభంలో వినవచ్చే తంబురా శృతి, పాటకోసం ఉపయోగించిన సితార్, వీణ, ఫ్లూట్ వాద్యాలు;  ఆలాపనలు, స్వర కల్పనలు, లయ, తాళాల కోసం వాడిన మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్ లు ఈ గీతానికి  శుధ్ధ శాస్త్రీయ సంగీత కచేరీ అంతస్తును కలిగించాయి.

తెరపై ఈ గీతాన్ని సంగీతాచార్యుడు వి.నాగయ్యగారి మీద , శిష్యులు అక్కినేని , బృందం మీద చిత్రీకరించారు. "జయభేరి" సినీమాలో పాటలన్నీ ఆణిముత్యాలే. ఇది గొప్ప, ఇది తక్కువ అని చెప్పలేని సంగీతభరిత చిత్రం "జయభేరి". ఈ సినీమా లో ఉన్న 13 పాటలలో తొమ్మిది పాటలను ఘంటసాల మాస్టారే పాడారు. నవరసాలు ప్రతిబింబించేలా గానం చేయడంలో ఘంటసాలవారి విద్వత్ అణువణువునా గోచరమవుతుంది.  ఈ సినీమాలోని ఇతర గీతాలను పి సుశీల, ఎస్ జానకి, మాధవపెద్ది, పిఠాపురం పాడారు. వీరితోపాటు టి.ఎమ్.సౌందరరాజన్, బాలమురళీకృష్ణ, ఎమ్.ఎల్.వసంతకుమారి కూడా  పాడడం ఒక విశేషం.  ఈ పాటలలో అధిక భాగం మల్లాదివారి రచనలే. మిగిలిన వాటిని ఆరుద్ర, శ్రీశ్రీ, నారపురెడ్డి రచించారు.

అక్కినేని, నాగయ్య, గుమ్మడి, అంజలీ దేవి, ఎస్ వి రంగారావు, రాజసులోచన, రేలంగి , రమణారెడ్డి ముఖ్య తారాగణం. పి పుల్లయ్య దర్శకత్వం చేపట్టిన ఈ సంగీతభరిత కళాఖండాన్నివాసిరెడ్డి నారాయణరావు నిర్మించారు.

"జయభేరి " సినీమా కు మూలం సుప్రసిధ్ధ కళాత్మక దర్శక నిర్మాత వి.శాంతారాం తీసిన "మత్ వాలా షాయర్ రామ్ జోషి" అనే హిందీ సినీమా. తెలుగు వాతావరణానికి కావలసిన సముచిత మార్పులు, చేర్పులతో జయభేరిని పి.పుల్లయ్య తీసారు. తెలుగు చిత్రంతో పాటే తమిళంలో కూడా "కలైవాణన్" పేరిట నిర్మించారు. తెలుగులోని ప్రధాన పాత్రధారులతో పాటు పలువురు తమిళ నటీనటులు కూడా నటించారు. తెలుగు వరసలే తమిళంలో కూడా ఉపయోగించారు. తమిళంలో  కూడా "మదిశారదాదేవి",  "రాగమయీ రావే", "యమునా తీరమునా" పాటలను ఘంటసాలవారే పాడి అక్కడి శ్రోతల మెప్పులు పొందారు.  'రసికరాజా' పాటను శీర్కాళి గోవిందరాజన్ పాడారు. ఇతర పాటలను సౌందరరాజన్ ఆలపించారు.

జయభేరి సినీమా పాటల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఘంటసాల మాస్టారు  "మది శారదాదేవి మందిరమే" పాటే తనకు సవాలుగా, తన హృదయానికి హత్తుకుపోయిన పాటగా చెప్పేవారు. ఈ  పాట దృశ్యం విజయనగరంలో తమ గురుదేవులు పట్రాయని సీతారామశాస్త్రిగారి సన్నిధిలో ఇతర విద్యార్ధులతో కలసి చేసిన సంగీత సాధనలు, బోధనలు తనకు గుర్తుకు తెచ్చాయని,  చిత్రంలో గురుశిష్య సంబంధాన్ని చాలా బాగా చిత్రీకరించారని ఘంటసాలగారు అనేవారు.

జయభేరి సంగీత పరంగా అద్భుత కళాఖండమే అయినా ఆర్ధికంగా ఘన విజయం సాధించలేకపోయింది. ఉత్తమ చిత్రంగా ప్రభుత్వపు మెరిట్ సర్టిఫికెట్ మాత్రం లభించింది.

కొసమెరుపు -  జయభేరిలోని పాటల గాయకునిగా ఘంటసాలవారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభించినా, ఈ సినీమా లోని పాటలకుగాను తనకు రావలసిన పూర్తి పారితోషికాన్ని సినీమా రిలీజ్ అయిన తర్వాత కూడా నిర్మాత నుండి ఘంటసాల రాబట్టుకోలేకపోయారు.

(ఈ సినీమా తర్వాత ఆ నిర్మాత మరల సినీమాలు తీసినట్లుగా కనపడదు.)

సినీమా విజయానికి  అందులోని క్వాలిటీ కన్నా మార్కెటింగ్ స్ట్రాటజీ, మేనేజ్మెంట్ స్కిల్ మాత్రం అత్యంత ఆవశ్యకం.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 17 February 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 17వ భాగం - రావే నా చెలియా... నా జీవన నవ మాధురి నీవే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదహారవ భాగం ఇక్కడ

17వ సజీవరాగం - 

"రావే నా చెలియా నా జీవన... 
నవ మాధురి నీవే..."

సాహిత్యం :  సముద్రాల జూనియర్
రాగం - కళ్యాణి 
చిత్రం - మంచి మనసుకు మంచి రోజులు
సంగీతం - ఘంటసాల

సాకీ - కోమల కవితా తారా 
         ప్రేమసుధాధారా 
        మనోహర తారా 
        నా మధుర సితారా....

రావే నా చెలియా - 2
చెలియా 
నా జీవన నవ మాధురి నీవే
- 2 - !! రావే!!

నీ ఎలనవ్వుల పూచిన వెన్నెల
వెలుగును వేయీ చందమామలై
!! నీ ఎలనవ్వుల!
నీ చిరుగాజుల చిలిపి మ్రోతలే -2
తోచును అనురాగ గీతాలై ! తోచును!
రావే నా చెలియా !!

నీ అందియల సందడిలోన
నా యీ డెందము చిందులు వేయునే 
 - 2
నీ కనుగీటులే  వలపు పాటలే ....
రాగాలాపన .. ...

! నీ కనుగీటులే!
నీ కడ సురలోక భోగాలే - 2

రావే నా చెలియా - 
రావే ,రావే రావే నా చెలియా !


"జయహో ఘంటసాల! జయహో!" అని తెలుగు సంగీతాభిమానులందరిచేతా జేజేలు కొట్టించుకున్న ఘంటసాలగారికి అటు గాయకుడిగా, ఇటు సంగీత దర్శకుడిగా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన అజరామర గీతం, "రావే నా చెలియా" పాట. ఇది 1958 లో విడుదలైన "మంచి మనసుకు మంచి రోజులు" సినీమాలోనిది. ఘంటసాలగారు  ఏకగళ ప్రేమగీతాలు అనేకం పాడారు. అన్నీ జనాదరణ పొందినవే.  అయితే ఈ పాట ప్రత్యేకతే వేరు. 

ఈ సినీమా లో వివిధ రసాలతో కూడిన నాలుగైదు పాటలను ఘంటసాలవారు పాడారు. వాటన్నింటిలో మకుటాయమానంగా , మణికిరీటంగా భాసిల్లిన గీతం మాత్రం "రావే నా చెలియా" పాట మాత్రమే.  ఈ పాటను సముద్రాల రామానుజం గారు వ్రాసారు. ఇది భార్యాభర్తల మధ్య సాగే సున్నిత ప్రణయగీతం. ఇందులో తన భార్యను మనోహర తారగా, ప్రేమసుధా ధారగా, తన ప్రియతమ సితార గా అభివర్ణిస్తూ ఓ భావకుడు సితార్ వాయిస్తూ "రావే నా చెలియా, నా జీవన నవ మాధురి నీవే" నంటూ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. ఆమె ఎలనవ్వులు పూచిన వెన్నెలగా, వేయి చందమామల వెలుగును ప్రసరింపజేస్తున్నదట. ఆమె చేతి చిరుగాజుల మ్రోతలు చిలిపి మ్రోతలై అనురాగ గీతాలుగా ఆ నాయకునికి తోస్తున్నవట. అతని భావుకత అంతటితో ఆగలేదు, భార్య కాలి అందెల సవ్వడిలో ఆతని మనస్సు ఆనంద పారవశ్యంతో చిందులు వేస్తున్నదట, ఆమె కనుగీటులు వలపు పాటలై సురలోక భోగాలు అందిస్తాయట. ఎంత చక్కటి భావన. సున్నితమైన, సరళమైన మాటల ద్వారా జూనియర్ సముద్రాలగారు అద్భుతమైన రొమాంటిసిజమ్ సృష్టించారు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను తెలుగువారందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన కళ్యాణి రాగంలో స్వరపర్చి, మృదుమధురంగా ఆలపించారు.  ఘంటసాలవారు కళ్యాణి రాగంలో ఎన్ని పాటలు పాడినా దేని విశిష్టత దానిదే. ఈ పాట ప్రత్యేకత ఈ పాటదే. కళ్యాణి రాగ స్వరూపాన్నంతా ఒక ఆలాపన ద్వారా శ్రోతల హృదయాలను దోచుకున్నారు ఘంటసాల. ఈ పాటను ఎంతో మంది గాయకులు తమ కచేరీలలో పాడారు, పాడుతున్నారు. కానీ ఘంటసాల మాస్టారి కంఠంలోని మార్దవాన్ని, రాగ భావాన్ని మాత్రం పరిపూర్ణంగా ఎవరూ పలికించలేక పోతున్నారనే చెప్పాలి. 

మంచి మనసుకు మంచి రోజులు సినీమా హీరో ఎన్ టి రామారావే అయినా ఘంటసాలవారి ఈ పాటను తెరమీద పాడే అదృష్టం నూతన నటుడు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తికే దక్కడం అతని భాగ్యం. రమణమూర్తికి ఇది రెండవ చిత్రం. సినీమాలో ఈ పాటకు అభినయించడం ద్వారా రమణమూర్తికి చిత్రసీమలో మంచి భవిష్యత్తు ఏర్పడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలో రమణమూర్తికి జోడీ రాజసులోచన. ఈ సినీమా లో ఎన్.టి.ఆర్ రొమాంటిక్ హీరో కాదు. హీరోయిన్ అన్నగా ఒక గంభీరమైన పాత్రలో నటించారు. రామారావుకు, రమణమూర్తికి పాడిన పాటల మధ్య  ఘంటసాలగారు చూపించిన వైవిధ్యం ఒక్క ఘంటసాలగారికే సాధ్యం. అది తెలియాలంటే ఈ పాటను, "కలవారి స్వార్ధం", "అనుకున్నదొక్కటి అయినదిఒక్కటి", పడవ పాట,"వినవమ్మా, వినవమ్మా ఒక మాట వినవమ్మా", "భారతనారీ సీతామాతా",  మొదలైన పాటలను మరోసారి వినండి.

"రావే నా చెలియా" పాటలోని ముఖ్య వాయిద్యం సితార్. దానితోపాటు మువ్వలు, డబుల్ బేస్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను మాస్టారు ఉపయోగించారు. ఈ సినీమా నాటికి సితార్ జనార్దన్ సినీమాలకు రాలేదు. అప్పట్లో అన్నపూర్ణ అనే ఆవిడ ఘంటసాల ఆర్కెష్ట్రాలో ఈ రకమైన సితార్ పాటలను వాయించేవారు. ఈ పాటలో సితార్ వాదనం ఆవిడదే. 
ఈ పాటంతటికీ జీవం ఘంటసాల మాస్టారి కళ్యాణి రాగ ఆలాపనలే. కళ్యాణి రాగం గురించి గత పాటలలో చెప్పడం జరిగింది.

ఈ సినీమాకు తమిళ మూలం "తై పిరన్దాల్ వళి పిరక్కుం" అనే సినీమా. ఈ తెలుగు సినీమా నిర్మాత సుందర్లాల్ నహతాగారి ఆనవాయితీ ప్రకారం కొన్ని పాటలు తమిళంవే తీసుకోవడం జరిగింది. ఘంటసాలవారి సొంత ట్యూన్స్ ఓ రెండో మూడో ఉన్నాయి. అందులో " రావే నా చెలియా" ఒకటి. తమిళ చిత్రానికి మహాదేవన్ సంగీత దర్శకుడు. 

ఈ పాటను మామ మోహన కళ్యాణిలో స్వరపర్చారు.  మోహన ఐదు స్వరాలే కలిగిన ఔఢవరాగం. కళ్యాణి ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణరాగం. అంటే ఈ రాగ అరోహణాక్రమంలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు వినిపిస్తాయి. దాని ఆధారంగా చేసిన ఈ పాటను శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సినీ నేఫధ్యగాయకుడు అయిన శీర్కాళి గోవిందరాజన్ తనదైన బాణిలో పాడారు.  రెండు సినీమాలలో పాట సందర్భం ఒకటే అయినా రెండు పాటల మధ్య, రెండు గాత్రాల మధ్య, భావప్రకటన మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది మిన్న అనేది శ్రోతల రసజ్ఞత మీద ఆధారపడి వుంది.

తమిళ సినిమాలో ఈ పాటను ప్రేమ్ నజీర్, రాజసులోచనల మీద  చిత్రీకరించారు. మలయాళ సినీమాల సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ తొలిరోజుల్లో నటించిన ఐదారు తమిళం సినీమాలలో ఈ సినీమా ఒకటి. బాక్సాఫీస్ పరంగా, సంగీతపరంగా "మంచి మనసుకు మంచి రోజులు" ఘనవిజయం సాధించడానికి చాలా దోహదం చేసిన పాట " రావే నా చెలియా".





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 10 February 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 16వ భాగం - హాయి హాయిగా ఆమని సాగే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


   

💐గానగంధర్వుడు ఘంటసాల భౌతికంగా మనకు దూరమై ఐదు దశాబ్దాలు కావస్తున్నా ఆయన సుమధుర గాత్రం , స్వరపర్చిన అశేషమైన ఆపాతమధుర గీతాలు మాత్రం సజీవంగా ఇంకా మన చెవులలో మార్మోగుతూనే వున్నాయి. 

ఘంటసాల వారి 50 వ  వర్ధంతి సందర్భంగా  జాతీయస్థాయిలో బహుళ జనాదరణ పొందిన  సువర్ణసుందరి చిత్రంలోని ఈ ఆపాతమధుర గీత విశ్లేషణలోకి  తొంగిచూసేముందు ఈ శతాబ్ది గాయకుని గురించి  వారి గురుపుత్రులు ,  సంగీత సహచరులు  'కలైమామణీ' కీ.శే. శ్రీ పట్రాయని సంగీతరావుగారి మాటల్లో విందాము. 💐🙏



                                                  


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదిహేనవ భాగం ఇక్కడ

16వ సజీవరాగం - 

"హాయి హాయిగా ఆమని సాగే"
 సాహిత్యం :  సముద్రాల రాఘవాచార్య
సంగీతం : పి. ఆదినారాయణ రావు
చిత్రం : " సువర్ణసుందరి " 1957.

               
జి. " హాయి హాయిగా ఆమని సాగే 
  సోయగాల గనవోయీ సఖా, హాయి సఖా....
 
ఘం. లీలగా పువులు గాలికి ఊగ

ఘం. జి.  కలిగిన తలపుల వలపులు రేగ ఊగిపోవు మది ఉయ్యాలగా , జంపాలగా !

జి. ఏమో .... తటిల్లతిక మేమెరుపో ?
మైమరపేమో ...

ఘం. మొయిలురాజు  దరి మురిసినదేమో!
ఘం. జి . వలపు కౌగిళుల వాలి సోలి , ఊగిపోవు...

జి. చూడుమా చందమామ
ఘం. కనుమా వయ్యారి  శారదయామిని 
కవ్వించే ప్రేమా !!

జి. వగలా తూలి విరహిణుల 
ఘం. మనసున మోహము రేపు నగవుల !!ఊగిపోవు!!

ఘం. కనుగవ తనియగా , ప్రియతమా
కలువలు విరిసెనుగా 

జి. చెలువము కనుగొన
మనసానంద నాట్యాలు సేయునోయి ...


కొన్ని సినీమాలు ఎటువంటి కథాబలం లేకున్నా  కథాకథనం బాగుండకపోయినా అందులోని పాటల వలన  ఆ సినిమాలు చిరస్మరణీయమైపోతాయి. అలాటి సాధారణ జానపద చిత్రమే అక్కినేని, అంజలీదేవి జోడీగా నటించిన 1957వ  నాటి " సువర్ణసుందరి" సినీమా. 

అయినా ఆ సినిమా నేటికి బహుళ ప్రచారం లో వుంది. అందుకు కారణం ఆ సినీమాలోని పి.ఆదినారాయణ రావుగారి అద్భుత సంగీతం. జాతీయ స్థాయిలో ఆదినారాయణ రావుగారికి ఎనలేని కీర్తిప్రతిష్టలను, అపరిమితమైన ధనాన్ని సంపాదించి పెట్టిన సినీమా "సువర్ణసుందరి". ఇందులో వున్న 14 పాటల్లో కనీసం ఏడు పాటలైనా ఈ నాటికీ వర్ధమాన గాయనీగాయకులచేత గానం చేయబడుతున్నాయి. ఈ సినీమాలో ఘంటసాలగారు ఒక శ్లోకం, ఒక సోలో, ఒక డ్యూయెట్ మాత్రమే పాడారు.

ఈ సినీమా లో పాటలన్నింటినీ సముద్రాల రాఘవాచార్య వ్రాసారు. వాటిలో మకుటాయమానంగా అపాతమధురంగా, అజరామరత్వం పొందిన గీతం "హాయి హాయిగా ఆమని సాగే". అదే ఈనాటి ఘంటసాలవారి సజీవరాగం. ఇదొక యుగళగీతం. శ్రీమతి జిక్కి, ఘంటసాల ఆలపించిన ఈ గీతం  భారతదేశం లోని అన్ని భాషలవారినీ నేటికీ అలరిస్తూనే వుంది.

"హాయి హాయిగా ఆమని సాగే" పాటకు ఎంతో హాయైన సాహిత్యాన్ని ఆచార్యులవారు సమకూర్చారు. ఈ పాటలో వారు ఉపయోగించిన "ఆమని", "తటిల్లకము" ,"మేమెరుపు - మైమరపు",  "మొయిలురాజు", "శారదయామిని", "తనిసిన కనుగవ", "విరిసిన కలువలు", "చెలువము" , "ఆనందనాట్యాలు" వంటి పద ప్రయోగాలు ఈ పాటకు ఎంతో విశిష్టతను చేకూర్చాయి. పాటలోని సాహిత్యాన్నే మరుగుపరిచేలా మనసులను పరవశింపజేసే రాగాలతో ఈ పాటను ఆదినారాయణ రావుగారు స్వరపర్చారు. 

రాగమాలికలో ఈ పాటను రూపొందించడానికి ఆయన హిందుస్థానీ రాగాలను ఎన్నుకున్నారు. అవి - "సోహిని", "బహార్", "యమన్" అనే రాగాలు. ఈ మూడు రాగాలు మానసికోల్లాసాన్ని కలిగించే రాగాలు. వీటికి సమాంతరమైన కర్నాటక సంగీత రాగాలు  - "హంసానంది". ఇది ఆరు స్వరములు మాత్రమే కలిగిన షాఢవరాగం. 53వ మేళకర్త రాగమైన "గమనశ్రమ" రాగ జన్యం. రెండవది - "అసావేరి" - 8వ మేళకర్త రాగమైన హనుమతోడి జన్యరాగం. మూడవది - కళ్యాణి - సంపూర్ణ రాగం. 65 వ మేళకర్త  జన్యం. దీనినే మేచకళ్యాణి అని కూడా అంటారు.

ఆదినారాయణ రావుగారు స్వరపర్చిన ఈ పాటలోని రాగాలు అటు హిందుస్థానీ బాణీలో, ఇటు కర్నాటక సంగీత శైలిలో ఎంతో ప్రసిధ్ధిపొందిన రాగాలు. ఈ రాగాలలో ఎన్నో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మొదలైన అన్ని భాషలలో ఎన్నో సినీమా పాటలు స్వరపర్చబడ్డాయి. ఆ పాటలన్నింటికి మణిమకుటం "హాయి హాయిగా" పాటంటే అది అతిశయోక్తి కాదనే నా భావన.  ఈ పాట సృష్టించిన చరిత్ర ఇంతా అంతా కాదు.

"హాయి హాయిగ ఆమని సాగే" పాటను తెలుగులో ఘంటసాల, జిక్కి పాడగా, తమిళం "మణాలనే మంగైయిన్ బాగియం" లో జెమిని గణేశన్ కు కూడా ఘంటసాలగారే పాడారు. తెలుగులో ఈ సినిమాలో జిక్కి పాడిన పాట ఇదొక్కటే. తమిళంలో ఈ పాటను ఘంటసాలగారితో పి.సుశీల పాడారు.

ఘంటసాల, జిక్కి పాడిన ఈ రాగమాలిక గీతం ఈనాటికీ గాయకులందరికీ పెను సవాలే. ఈ పాటలో ఘంటసాలగారు ఆలపించిన స్థాయిలో ఆ  ఆలాపనలను, గమకాలు, సంగతులు,  స్వరకల్పనలను అంత మధురంగా, నిర్దిష్టంగా, భావయుక్తంగా, అలవోకగా మరే ఇతర గాయకులు నూరు శాతం పాడలేకపోతున్నారనే మాటను గాయకులు తప్పు పట్టరనే అనుకుంటున్నాను. 

హిందీలో సువర్ణసుందరి సినీమాను హిందీలో తీసినప్పుడు తెలుగు వరసలనే హిందీలో వుంచారు ఆదినారాయణ రావు. "హాయి హాయిగా" పాటను హిందీలో మహమ్మద్ రఫి , లతామంగేష్కర్ పాడారు. లతా, రఫీలంటే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గాయకులు. తెలుగు పాటను విన్న లతా మంగేష్కర్, హిందీపాటను తనతో కూడా ఘంటసాలగారిచేతే పాడించమని సూచించారట. అయితే వాణిజ్యపరమైన వ్యవహారాలవలన ప్రాంతీయ హిందీ గాయకులచేత పాడించవలసిన అగత్యం ఏర్పడింది.  కనీసం రికార్డింగ్ సమయంలోనైనా ఘంటసాలవారు పక్కనవుంటే బాగుంటుందని లతామంగేష్కర్ కోరారట. కానీ, నీతి నియమాలకు, సిధ్ధాంతాలకు ప్రాధాన్యమిచ్చే ఘంటసాలవారు అందుకు అంగీకరించలేదు. ఈ విషయమై ప్రచారం జరగడం కూడా ఆయన ఇష్టపడలేదు. పాట రికార్డింగ్ ముగిసిన తర్వాత తెలుగులో వున్నంత రిచ్ నెస్, క్వాలిటీ తమ  పాటలో ప్రతిఫలించలేదనే  అభిప్రాయాన్ని ఆ ఇద్దరు హిందీ గాయకులు వెలిబుచ్చారని చెప్పుకోవడం జరిగింది. అది ఆ గాయనీ గాయకుల సహృదయతను, సాటి గాయకుని పట్ల గల గౌరవమర్యాదలను తెలియజేస్తుంది. అంతమాత్రాన రఫీ, లతాల విద్వత్తునో, గానప్రతిభనో మనం తక్కువగా అంచనావేయకూడదు. ఎవరి శక్తి వారిదే, ఎవరి ప్రతిభ వారిదే. 

నాదశుధ్ధి, గాత్రశుధ్ధి, గమకశుధ్ధి దైవదత్తం. ఆ దైవానుగ్రహం పరిపూర్ణంగా పొందిన అపూర్వగాయకుడు మన ఘంటసాల మాస్టారు. రాశిపరంగా వారి పాటలు ఇతరులకంటే తక్కువే కావచ్చు, కానీ వాసిలో మాత్రం వారికి సరితూగగల గాయకులు బహు అరుదు.

హిందీ సువర్ణసుందరి సంగీత దర్శకుడిగా పి.ఆదినారాయణరావుగారికి ఆ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి లభించింది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో అంజలీ పిక్చర్స్ వారి సువర్ణసుందరి సినీమా ఘన విజయం సాధించింది.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 3 February 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 15వ భాగం - ఇది నా చెలి, ఇది నా సఖి నా మనోహరి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పధ్నాలుగవ భాగం ఇక్కడ

15వ సజీవరాగం - 

"ఇది నా చెలి, ఇది నా సఖి నా మనోహరి ..."
రాగం : రాగేశ్వరి
చిత్రం : చంద్రహారం
గీతరచన : పింగళి నాగేంద్ర రావు
సంగీతం, గానం : ఘంటసాల

పల్లవి :  ఇది నా చెలి , ఇది నా సఖి నా మనోహరి

చరణం: మనసులోని మమతలన్ని
                కనులముందు నిలచినటుల
                వన్నెలతో చిన్నెలతో
                 మనసుగొనిన ఊహాసుందరి
ఇది నా చెలి ....

చరణం 2 :  కలువకనుల చల్లని సిరి
                     ఉల్లములో ప్రేమలహరి
                     వినయ సహన శోభలతో
                     తనివినించు
                      సుగుణసుందరి

ఇది నా చెలి ... ఇది నా సఖి .... నా మనోహరి ....

ఘంటసాలవారి ఈ వారం సజీవరాగం "ఇది నా చెలి, ఇది నా సఖి , నా మనోహరి" అనే మనోజ్ఞమైన గీతం, 1954లో వచ్చిన " చంద్రహారం" చిత్రం లోనిది. ఈ పాటను ఘంటసాలగారు "రాగేశ్వరి" రాగంలో స్వరపర్చారు. రాగేశ్వరి రాగం ఘంటసాల మాస్టారికి ఇష్టమైన రాగాలలో ఒకటి.  ఈ రాగంలో ఘంటసాలగారు చేసిన చాలా పాటలు మంచి జనాదరణ పొందాయి. 

ఈ రాగేశ్వరి రాగం విషయంలో సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులామ్ ఆలీఖాన్ గారి ప్రభావం ఘంటసాలవారి మీద చాలానే ఉందని చెప్పుకోవడం ఉన్నది. ఖాన్ సాబ్ మద్రాస్ ఎప్పుడు వచ్చినా ఘంటసాలవారింటి మేడమీదనే బసచేసి వారి ఆతిధ్యం పొందేవారు. ఆయన అక్కడ ఉన్నంతకాలం మద్రాస్ లోని ప్రముఖ సంగీత విద్వాంసులంతా అర్ధరాత్రి దాటేవరకు ఆయనను దర్శనం చేసుకొని వారి గాత్రం విని ప్రేరణ పొందేవారు. ఆ సమయంలో ఘంటసాలగారు కూడా తాను చేసిన పాటలను పాడి వినిపించేవారు. 1959లో ఖాన్ సాబ్ సంగీతాన్ని, ఘంటసాలవారింట, ప్రత్యక్షంగా వినే మహాద్భాగ్యం నాకు కూడా కలిగింది. రాత్రిపూట ఆయన నిద్రలో కూడా ఆయన చేతి వ్రేళ్ళు తన గుండెలమీదున్న స్వరమండల్ ను మీటుతూనే వుండేవి.

రాగేశ్వరి రాగం హిందుస్థానీ శైలికి చెందినది. ఈ రాగానికి దగ్గరలో ఉండే కర్నాటక రాగం నాటకురింజి రాగం. 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగ జన్యరాగం నాటకురింజి. రాగేశ్వరి రాగంలో లేని పంచమ (ప) స్వరం నాటకురింజిలో వుంటుంది. ఆ ఒక్క తేడా తప్ప రెండు రాగాలు వినడానికి ఒకేలా ఉంటాయి.

చంద్రహారం లోని ఈ రాగేశ్వరి రాగ గీతం ఆనాటినుండి ఈనాటివరకు పండిత పామరులందరిచేతా ప్రశంసించబడుతూనే వుంది. అంత కోమలంగా, శ్రావ్యంగా ఆలపించి శ్రోతలను రంజింపజేసారు ఘంటసాల. ఈ పాటకు పింగళి నాగేంద్రరావుగారు  చాలా సరళమైన , భావయుక్తమైన సాహిత్యాన్ని అందించారు.

సినీమాలో కధానాయకుడు తన ఊహలలోని సుందరిని చిత్రిస్తూ  "ది నా చెలి, ఇది నా సఖి... నా మనోహరీ..." అంటూ ఈ పాటను ఆలపిస్తూంటాడు.

మనసులోని మమతలన్నింటినీ  కళ్ళెదుట నిల్పి తన సొగసు, సోయగాలతో  మనసును దోచుకున్న ఊహాసుందరిని చిత్రంలో చూసుకుంటూ మైమరచిపోతూంటాడు. రెండవ చరణంలో ఆ సుందరి అందాన్ని, గుణగణాలను   వర్ణిస్తూ --  కలువకనులతో చల్లదనాన్ని కురిపిస్తూ లక్ష్మీకరంగా  గోచరిస్తున్నదట; హృదయంలో ప్రేమ తరంగాలను ఉప్పొంగించే ఆ  సుగుణసుందరి సహనశీలియై, వినయ విధేయతలతో, శోభాయమానంగా  తనివితీరేలా దర్శనమిస్తున్న ఆ చెలే సఖియని, తన మనోహరి అని  అంటాడు ఆ ధీరలలిత నాయకుడు.  పింగళివారి పాళి ఈ మృదువైన భావాలను ఎంత సున్నితంగా వర్ణించిందో కదా!

పాట చాలా చిన్నదే. కానీ, ఘంటసాలవారి గాత్రంలోని భావసౌందర్యం, శ్రావ్యత అనితరసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. ఈ పాటలోని వాద్యగోష్టికూడా చాలా సున్నితంగా పాటను అనుసరించి పోతుంది. ఘంటసాలవారి గళంలోని తీయనైన గమకాలు, సంగతులు, మెల్లని ఉయ్యాలవూపు వంటి హాయినిగొలిపే చిన్న ఆలాపన ఈ పాటకు ఎంతో విశిష్టతను చేకూర్చాయి. రాగేశ్వరి రాగ మాధుర్యమంతా ఈ పాటలో ధ్వనించింది.

కావ్య నాయకుని లక్షణాలకు ప్రతీకగా చంద్రహారం కధానాయకుడు చందన దేశ యువరాజు  ఎన్.టి.రామారావు, అంతవరకు ఏ సినిమాలోను కనిపించనంత అందంగా, నవ మన్మధాకారంతో, హుందాగా నటించారు.

'మ్యాస్ట్రో' ఇళయరాజా అంతటి గొప్ప సంగీతమేధావి  తన చిన్నతనంలో చాలాఇష్టపడి  బాగా గుర్తుండిపోయిన పాటగా, బహుదా ప్రశంసించిన గీతం ఘంటసాలగారి' ఇది నాచెలి ఇది నా సఖి' పాట. 

ప్రముఖ దర్శకుడు ఎల్ వి ప్రసాద్ పర్యవేక్షణలో కమలాకర కామేశ్వరరావు తొలిసారిగా దర్శకత్వం చేపట్టిన  భారీ జానపద చిత్రం  'చంద్రహారం'. ఎన్టీఆర్, ఎస్.వి.రంగారావు, రేలంగి, జోగారావు, శ్రీరంజని, సావిత్రి, సూర్యకాంతం, మొదలగువారు నటించగా విజయా ప్రొడక్షన్స్ నాగిరెడ్డి-చక్రపాణి లు నిర్మించిన చిత్రం చంద్రహారం.

1954 లోనే దాదాపు పాతిక లక్షల ఖర్చుతో తెలుగు, తమిళ భాషలలో భారీ ఎత్తున  నిర్మించబడిన ఈ కళాత్మక జానపద చిత్రం బాక్సాఫీస్ దగ్గర  పరాజయంపాలైనా సంగీతపరంగా ఈ చిత్రంలోని పాటలన్నీ ఈనాటికీ ప్రజల హృదయాలలో నిలిచే ఉన్నాయి. తన తొలి చిత్రం అపజయంతో  కలిగిన అపప్రధను కమలాకర కామేశ్వరరావుగారు మరో ఎనిమిదేళ్ళ తర్వాత అదే విజయావారి గుండమ్మ కధ ఘనవిజయంతో తొలగించుకున్నారని పాత్రికేయుల విశ్లేషణ.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...