"రావే నా చెలియా నా జీవన...
నవ మాధురి నీవే..."
సాహిత్యం : సముద్రాల జూనియర్
రాగం - కళ్యాణి
చిత్రం - మంచి మనసుకు మంచి రోజులు
సంగీతం - ఘంటసాల
సాకీ - కోమల కవితా తారా
ప్రేమసుధాధారా
మనోహర తారా
నా మధుర సితారా....
రావే నా చెలియా - 2
చెలియా
నా జీవన నవ మాధురి నీవే
- 2 - !! రావే!!
నీ ఎలనవ్వుల పూచిన వెన్నెల
వెలుగును వేయీ చందమామలై
!! నీ ఎలనవ్వుల!
నీ చిరుగాజుల చిలిపి మ్రోతలే -2
తోచును అనురాగ గీతాలై ! తోచును!
రావే నా చెలియా !!
నీ అందియల సందడిలోన
నా యీ డెందము చిందులు వేయునే
- 2
నీ కనుగీటులే వలపు పాటలే ....
రాగాలాపన .. ...
! నీ కనుగీటులే!
నీ కడ సురలోక భోగాలే - 2
రావే నా చెలియా -
రావే ,రావే రావే నా చెలియా !
"జయహో ఘంటసాల! జయహో!" అని తెలుగు సంగీతాభిమానులందరిచేతా జేజేలు కొట్టించుకున్న ఘంటసాలగారికి అటు గాయకుడిగా, ఇటు సంగీత దర్శకుడిగా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన అజరామర గీతం, "రావే నా చెలియా" పాట. ఇది 1958 లో విడుదలైన "మంచి మనసుకు మంచి రోజులు" సినీమాలోనిది. ఘంటసాలగారు ఏకగళ ప్రేమగీతాలు అనేకం పాడారు. అన్నీ జనాదరణ పొందినవే. అయితే ఈ పాట ప్రత్యేకతే వేరు.
ఈ సినీమా లో వివిధ రసాలతో కూడిన నాలుగైదు పాటలను ఘంటసాలవారు పాడారు. వాటన్నింటిలో మకుటాయమానంగా , మణికిరీటంగా భాసిల్లిన గీతం మాత్రం "రావే నా చెలియా" పాట మాత్రమే. ఈ పాటను సముద్రాల రామానుజం గారు వ్రాసారు. ఇది భార్యాభర్తల మధ్య సాగే సున్నిత ప్రణయగీతం. ఇందులో తన భార్యను మనోహర తారగా, ప్రేమసుధా ధారగా, తన ప్రియతమ సితార గా అభివర్ణిస్తూ ఓ భావకుడు సితార్ వాయిస్తూ "రావే నా చెలియా, నా జీవన నవ మాధురి నీవే" నంటూ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. ఆమె ఎలనవ్వులు పూచిన వెన్నెలగా, వేయి చందమామల వెలుగును ప్రసరింపజేస్తున్నదట. ఆమె చేతి చిరుగాజుల మ్రోతలు చిలిపి మ్రోతలై అనురాగ గీతాలుగా ఆ నాయకునికి తోస్తున్నవట. అతని భావుకత అంతటితో ఆగలేదు, భార్య కాలి అందెల సవ్వడిలో ఆతని మనస్సు ఆనంద పారవశ్యంతో చిందులు వేస్తున్నదట, ఆమె కనుగీటులు వలపు పాటలై సురలోక భోగాలు అందిస్తాయట. ఎంత చక్కటి భావన. సున్నితమైన, సరళమైన మాటల ద్వారా జూనియర్ సముద్రాలగారు అద్భుతమైన రొమాంటిసిజమ్ సృష్టించారు.
ఘంటసాల మాస్టారు ఈ పాటను తెలుగువారందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన కళ్యాణి రాగంలో స్వరపర్చి, మృదుమధురంగా ఆలపించారు. ఘంటసాలవారు కళ్యాణి రాగంలో ఎన్ని పాటలు పాడినా దేని విశిష్టత దానిదే. ఈ పాట ప్రత్యేకత ఈ పాటదే. కళ్యాణి రాగ స్వరూపాన్నంతా ఒక ఆలాపన ద్వారా శ్రోతల హృదయాలను దోచుకున్నారు ఘంటసాల. ఈ పాటను ఎంతో మంది గాయకులు తమ కచేరీలలో పాడారు, పాడుతున్నారు. కానీ ఘంటసాల మాస్టారి కంఠంలోని మార్దవాన్ని, రాగ భావాన్ని మాత్రం పరిపూర్ణంగా ఎవరూ పలికించలేక పోతున్నారనే చెప్పాలి.
మంచి మనసుకు మంచి రోజులు సినీమా హీరో ఎన్ టి రామారావే అయినా ఘంటసాలవారి ఈ పాటను తెరమీద పాడే అదృష్టం నూతన నటుడు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తికే దక్కడం అతని భాగ్యం. రమణమూర్తికి ఇది రెండవ చిత్రం. సినీమాలో ఈ పాటకు అభినయించడం ద్వారా రమణమూర్తికి చిత్రసీమలో మంచి భవిష్యత్తు ఏర్పడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలో రమణమూర్తికి జోడీ రాజసులోచన. ఈ సినీమా లో ఎన్.టి.ఆర్ రొమాంటిక్ హీరో కాదు. హీరోయిన్ అన్నగా ఒక గంభీరమైన పాత్రలో నటించారు. రామారావుకు, రమణమూర్తికి పాడిన పాటల మధ్య ఘంటసాలగారు చూపించిన వైవిధ్యం ఒక్క ఘంటసాలగారికే సాధ్యం. అది తెలియాలంటే ఈ పాటను, "కలవారి స్వార్ధం", "అనుకున్నదొక్కటి అయినదిఒక్కటి", పడవ పాట,"వినవమ్మా, వినవమ్మా ఒక మాట వినవమ్మా", "భారతనారీ సీతామాతా", మొదలైన పాటలను మరోసారి వినండి.
"రావే నా చెలియా" పాటలోని ముఖ్య వాయిద్యం సితార్. దానితోపాటు మువ్వలు, డబుల్ బేస్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను మాస్టారు ఉపయోగించారు. ఈ సినీమా నాటికి సితార్ జనార్దన్ సినీమాలకు రాలేదు. అప్పట్లో అన్నపూర్ణ అనే ఆవిడ ఘంటసాల ఆర్కెష్ట్రాలో ఈ రకమైన సితార్ పాటలను వాయించేవారు. ఈ పాటలో సితార్ వాదనం ఆవిడదే.
ఈ పాటంతటికీ జీవం ఘంటసాల మాస్టారి కళ్యాణి రాగ ఆలాపనలే. కళ్యాణి రాగం గురించి గత పాటలలో చెప్పడం జరిగింది.
ఈ సినీమాకు తమిళ మూలం "తై పిరన్దాల్ వళి పిరక్కుం" అనే సినీమా. ఈ తెలుగు సినీమా నిర్మాత సుందర్లాల్ నహతాగారి ఆనవాయితీ ప్రకారం కొన్ని పాటలు తమిళంవే తీసుకోవడం జరిగింది. ఘంటసాలవారి సొంత ట్యూన్స్ ఓ రెండో మూడో ఉన్నాయి. అందులో " రావే నా చెలియా" ఒకటి. తమిళ చిత్రానికి మహాదేవన్ సంగీత దర్శకుడు.
ఈ పాటను మామ మోహన కళ్యాణిలో స్వరపర్చారు. మోహన ఐదు స్వరాలే కలిగిన ఔఢవరాగం. కళ్యాణి ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణరాగం. అంటే ఈ రాగ అరోహణాక్రమంలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు వినిపిస్తాయి. దాని ఆధారంగా చేసిన ఈ పాటను శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సినీ నేఫధ్యగాయకుడు అయిన శీర్కాళి గోవిందరాజన్ తనదైన బాణిలో పాడారు. రెండు సినీమాలలో పాట సందర్భం ఒకటే అయినా రెండు పాటల మధ్య, రెండు గాత్రాల మధ్య, భావప్రకటన మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది మిన్న అనేది శ్రోతల రసజ్ఞత మీద ఆధారపడి వుంది.
తమిళ సినిమాలో ఈ పాటను ప్రేమ్ నజీర్, రాజసులోచనల మీద చిత్రీకరించారు. మలయాళ సినీమాల సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ తొలిరోజుల్లో నటించిన ఐదారు తమిళం సినీమాలలో ఈ సినీమా ఒకటి. బాక్సాఫీస్ పరంగా, సంగీతపరంగా "మంచి మనసుకు మంచి రోజులు" ఘనవిజయం సాధించడానికి చాలా దోహదం చేసిన పాట " రావే నా చెలియా".
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment