Saturday 27 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 27వ భాగం - దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఆరవ భాగం ఇక్కడ

27వ సజీవరాగం -   

"దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో..."
              
 పల్లవి :
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో !

చరణం :
పాలిత కింకర భవ నాశంకర శంకర
పురహర నమో నమో
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో !

చరణం: 
దురిత విమోచన ఫాలవిలోచన 
పరమదయాకర నమో నమో
కరిచర్మాబర , చంద్రకళాధర 
సాంబ దిగంబర నమో నమో !

చరణం :
నారాయణ హరి నమో నమో
నారద హృదయవిహారీ నమో నమో
పంకజనయనా పన్నగశయనా
శంకరవినుత నమో నమో 
నారాయణ హరి నమో నమో !

శివకేశవులకు అభేదం అని మన ప్రాచీన పురాణాలెన్నో చెపుతున్నా శైవమతం , వైష్ణవమతమంటూ మానవులు భేదాలతో వైషమ్యాలతో కలహించుకుంటూ శాంతికి భంగం కలిగించడం మనకు తెలిసినదే. శివుడు, విష్ణువ  పేరిట ఆ విధమైన విద్వేషాలు తగవని  1958 లో వచ్చిన భూకైలాస్ సినీమాలోని కొన్ని సన్నివేశాలు మనకు ప్రబోధించడం గమనించవచ్చును.

అందులోని  "దేవ దేవ ధవళాచల మందిర" నేటి మన సజీవరాగం. ఈ పాటలో హరి హరుల ఇద్దరి ప్రస్తావనను అతి సమర్ధంగా తీసుకువచ్చారు గేయ రచయిత సముద్రాల రాఘవాచార్యులవారు. ఒకే సన్నివేశంలో  శివనామ స్మరణంతో రావణాసురుడు,  హరినామ స్మరణతో నారదుడు వస్తూ దారిలో కలుసుకుంటారు.   

పాత్రపరంగా హరి అవతారమైన రాముడు పేరుగల రామారావుగారు పరమేశ్వరుని; ఈశ్వర నామం గల అక్కినేని నాగేశ్వరరావు గారు నారాయణుని స్తుతిస్తూ  నటించడం శివకేశవులు ఒకటేనని చెప్పకచెప్పడం ఓ విశేషం.

భూకైలాస్ సినీమా పేరు చెప్పగానే వెంటనే మనం తల్చుకునేది ఆ సినీమాలోని ఘంటసాలవారి పాటలను, పద్యాలనే. భూకైలాస్ చిత్రం లో ఘంటసాలవారి  శాస్త్రీయ,/ లలిత గాన ప్రతిభ అణువణువునా ద్యోతకమౌతుంది. రావణాసురుడిగా రామారావుగారు, నారదుడిగా అక్కినేని వారు మన మనస్సుల్లో చిరస్థాయిగా నిల్చిపోవడానికి కారణం ఘంటసాల మాస్టారి అద్వితీయ దేవగానమే.

ఈ పాటలో శంకరుడికి సంబంధించిన పల్లవి, చరణాలను జంఝూటి రాగంలో, విష్ణువుకు సంబంధించిన చరణాన్ని కాపీ రాగంలో స్వరపర్చి  తగు మాత్రపు వాద్యాలు - ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, తబలాలు వంటివి మాత్రమే సున్నితంగా ఉపయోగించి గాత్రానికే ప్రాధాన్యతనిచ్చారు సంగీత దర్శకులు. ఈ పాటలో ఘంటసాలవారి గాత్రంలోని భక్తి తత్పరతలు, పరవశత్వం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది.

జంఝూటి రాగం హిందుస్తానీ సంప్రదాయ సంగీతపు రాగం. ఆరోహణలో ఆరు స్వరాలు , అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతూ, వక్ర సంచారం చేయడంవలన ఈ రాగాన్ని షాఢవ-సంపూర్ణ వక్ర రాగంగా పరిగణిస్తారు.

కర్నాటక సంగీత కాపి రాగం ఖరహరప్రియ జన్యరాగం. ఇది కూడా షాఢవ-సంపూర్ణ వక్రరాగమే. దీనికి సమాంతరమైన హిందుస్తానీ రాగం పీలు.

ఇంతటి చక్కటి పాటలను స్వరపర్చిన సుదర్శనం - గోవర్ధనం సోదరులు చిరస్మరణీయులు. ఏవిఎమ్ స్టూడియో వాద్యబృంద నిర్వాహకులుగా , ఎమ్మెస్ విశ్వనాధన్ కు సహాయకులుగా యీ సోదరులు చిరపరిచితులు.  ఏవిఎమ్ తీసిన అనేక చిత్రాలకు సుదర్శనం - గోవర్ధనం సోదరులు సంగీత దర్శకత్వం వహించారు.

భూకైలాస్ లో పాటలన్నీ సంప్రదాయబధ్ధంగా, రాగాలకు కట్టుబడే స్వరపర్చబడ్డాయి. ఈచిత్రంలో పాటలను ఘంటసాల, ఎమ్.ఎల్.వసంతకుమారి, కోమల, టి.ఎస్.భగవతి, సుశీల వంటి హేమాహేమీలు ఆలపించారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. 

ఘంటసాలవారి కంచుకంఠాన వెలువడిన యీ చిత్రంలోని ప్రతి పాట , పద్యం యీనాటికీ సంగీతాభిమానులందరికీ షడ్రసోపేత విందుభోజనమే. భూకైలాస్ లో మాస్టారు పాడిన - దేవ దేవ ధవళాచల మందిర, (జంఝూటి, కాపి) నీలకంధరా దేవా (తిలాంగ్ రాగం), తగునా వరమీయ ( మాయమాళవగౌళ, పీలు రాగాల మిశ్రమం) రాముని అవతారం రఘుకుల సొముని అవతారం, సుందరాంగ అందుకోరా - (సుశీలగారు పాడిన యీ పాట  నేపధ్యంలో ఘంటసాలవారు వివిధస్థాయిలలో ఆలపించిన ' ఓం నమశ్శివాయ ' నామం ఒక అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది.), వంటి పాటలతోపాటూ యితర పాటలు పద్యాలు కూడా  శాస్త్రీయ సంగీతాభిమానులందరినీ ఎంతగానో అలరించాయంటే అందుకు ప్రధాన కారణం ఘంటసాలవారి సంగీత విద్వత్తే అంటే అతిశయోక్తి కాదనే నా భావన.

అగ్రనటులు అక్కినేని, నందమూరి పోటాపోటిగా నటించి తమ నటనా వైదుష్యాన్ని కనపర్చిన చిత్రం భూకైలాస్. నందమూరి వారు రావణబ్రహ్మగా విశ్వరూపం దాల్చడానికి బీజం  యీ భూకైలాస్ లోనే పడిందని చెప్పవచ్చును.

సముద్రాల రాఘవాచార్యులవారు శుధ్ధశ్రోత్రీయ శ్రీవైష్ణవుడైనా, దేవదేవ ధవళాచల మందిర పాటలో శివ కేశవులిద్దరినీ సమానంగా తరతమ భేదం పాటించకుండా  స్తుతించి కవితా మర్యాదలను పాటించారు. 

దేవదేవ ధవళాచల మందిర పాటలో ఎన్.టి.ఆర్ , ఏ.ఎన్.ఆర్ యిద్దరికీ ఒకే సమయంలో  గాత్రదానం చేసి ఎంతో వైవిధ్యాన్ని చూపి శ్రోతలను మెప్పించిన ఘనత ఘంటసాలవారిదే. అక్కినేనే  పాడుతున్నారు , లేదు రామారావే పాడుతున్నారనే భ్రమలో పెట్టి పాడే సామర్ధ్యం ఒక్క ఘంటసాలవారి కే వుంది. వారిరువురి గాత్రధర్మాలకు తగినట్లు నామమాత్రపు శృతిభేధంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు వేలాది మనోజ్ఞగీతాలను ఆలపించిన ఘంటసాలవారు తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయులైనారు.

భూకైలాస్ కు ముందు మరే సినీమాలోనూ ఈ ఇద్దరు నటులకు ఒకేసారి ఒకే గాయకుడు పాడిన దాఖలాలు లేవు. ఆనాటికి ఇదొక అద్భుత గాత్ర ప్రయోగమేనని చెప్పాలి.

నిర్మాత  ఎ.వి.మెయ్యప్పన్, దర్శకుడు కె.శంకర్, సంగీతదర్శకులు  సుదర్శనం - గోవర్ధనం సోదరులు తెలుగువారు కానప్పటికి భూకైలాస్ వంటి అజరామరమైన పౌరాణిక చిత్ర కళాఖండాన్ని తెలుగువారి స్వంతం చేసినందుకు మనం చాలా ఋణపడివున్నామనే చెప్పాలి.

ఒక్క ఘంటసాలవారి కే కాక ఎన్.టి.రామారావు , అక్కినేని నాగేశ్వరరావుగార్లకు కూడా అజరామరత్వాన్ని కల్పించిన చిత్రరాజం భూకైలాస్.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 20 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 26వ భాగం - నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణీ ఆ చిన్నదీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైమూడవ భాగం ఇక్కడ

26వ సజీవరాగం -   

నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణీ ఆ చిన్నది...

ఆమె చిరునవ్వులోనే హాయున్నది
మనసు పులకించగా  మధురభావాలు నాలోన కలిగించింది... నిన్న!!

మరచిపోలేను ఆ చూపు ఏనాటికీ
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటీ
తలచుకొనగానే ఏదో ఆనందము
వలపు జనియించగా ప్రణయగీతాలు
నాచేత పాడించింది..... నిన్న!!

సొగసు కనులారా చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగురించే ఇంపారగా
నడచిపోయింది ఎంతో నాజూకుగా
విడచి మనజాలను విరహతాపాలు
మోహాలు రగిలించింది...  నిన్న !!

ప్రేమ అనే రెండక్షరాలు కలిగించే మత్తు,  మహిమ అంతా ఇంతాకాదు. తొలిసారిగా ప్రేమలో పడినవాడికి ఎటువంటి మధురానుభూతులు కలిగిస్తాయో ఈ పాట చెపుతుంది. ప్రేమ మైకంలో ఉన్నవాడికి కనిపించే ప్రతీ మగాడు తన ప్రేయసిలాగే కనిపిస్తాడు. ఆ పరవశత్వంలో తానేంజేసేది తనకే తెలియనంత మోహంలో మునిగిపోతాడు. సాలూరి వారు ,ఘంటసాలవారు కలసి ఆపాతమధురాలెన్నో సృష్టించారు. అలాగే ఆరుద్ర , ఘంటసాల కాంబినేషన్లో కూడా ఆణిముత్యాలవంటి పాటలు అనేకం మనలను రంజింపజేసాయి.
పదకర్త ఆరుద్రగారికి, స్వరకర్త సాలూరి రాజేశ్వరరావుగారికి, గాత్ర ప్రదాత ఘంటసాలవారికి  మైలురాయిలా, కలికితురాయిలా నిలిచిపోయే మధుర విరహగీతం, 'రాణీ రత్నప్రభ' చిత్రంలోని "నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణీ ఆ చిన్నది... " 

ఏపాటనైనా  మృదువుగా, భావయుక్తంగా హృదయాలను తాకి మైమరపించేలా స్వరపర్చడంలో సిధ్ధహస్తుడు రసాలూరించే రాజేశ్వరరావు గారు. భీంప్లాస్, ఖరహరప్రియ ఈ రెండు చాలా సుప్రసిద్ధ రాగాలు కర్ణాటక సంగీతంలోని అభేరి హిందుస్తానీ సంగీతంలో భీంప్లాస్. అలాగే, హిందుస్తానీ కాపి రాగం కర్నాటక సంగీతంలో ఖరహరప్రియ.  ఈ రాగాలు రెండింటిని  మిళితం చేసి రాజేశ్వరరావుగారు రూపొందించిన ఈ అద్భుతమైన ఏకగళ గీతానికి ఘంటసాలవారి గాత్రంలోని గమకాల మాధుర్యం, మాటల విరుపులు, భావ గాంభీర్యం మరింత నిండుదనాన్ని, హుందాతనాన్ని  చేకూరిస్తే తెరమీద ఎన్.టి.రామారావుగారి అద్భుత హావభావాలు ఈ పాటకు శాశ్వతత్వాన్ని చేకూర్చింది. 

పాట పల్లవి మొదలు, చరణాలంతం వరకు ఆరుద్రగారు అల్లిన సొంపైన , ఇంపైన సుమాక్షరాలు  శ్రోతల హృదయాలలో మల్లెలు పూయిస్తుంది. మూగకోరికలేవేవో రేకెత్తిస్తుంది. పాట ఆద్యంతమూ రాజేశ్వరరావుగారి బాణీ మనలను పరవశింపజేస్తుంది. ఈ పాటలో పియోనా, ఫ్లూట్, క్లారినెట్ వంటి మరెన్నో వాద్యాలున్నా వాటన్నింటికీ మిన్నగా పిఠాపురం సత్యం (షెహనాయ్ సత్యం) గారి షెహనాయ్ వాద్యమే సంగీతాభిమానులకు పులకరింతలు కలిగిస్తుంది.

మహారాజు స్వగతంలా సాగే ఈ విరహగీతంలో హీరో ఎన్.టి.రామారావు , హీరోయిన్ అంజలీ దేవి, విదూషకులు రేలంగి, సీతారాం, మంత్రి సి.ఎస్.ఆర్.,లు కూడా కనిపించి ప్రేక్షకులంతా మనసారా హాయిగా నవ్వుకునేలా   ఒక్కింత హాస్యాన్ని కూడా జోడించారు. బి ఎ సుబ్బారావు నిర్మాణ, దర్శకత్వంలో 1960 మే నెలలో విడుదలైన 'రాణి రత్నప్రభ' మంచి విజయాన్నే సాధించింది.
ఈ సినీమా లో హీరో ఎన్.టి.ఆర్ కు ఘంటసాలగారు పాడింది ఈ ఒక్క పాటే. కానీ రేలంగి పాత్రకు మూడు పాటలు పాడి తన గాత్ర వైవిధ్యాన్ని నిరూపించారు ఘంటసాల.

కలకాలం గుర్తుండిపోయే ఘంటసాలవారి ఆహ్లాదకరమైన గీతం "నిన్న కనిపించింది నన్ను మురిపించింది" పాట.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 13 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 25వ భాగం - పయనించే మన వలపుల బంగరు నావ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై నాలుగవ భాగం ఇక్కడ

25వ సజీవరాగం -   

పయనించె మన వలపుల బంగరునావ
శయనించవె హాయిగ జీవనతారా 

నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో చెలరేగే అలల మీద ఊయలలూగే.. పయనించె...

వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు , రవళించె వేణుగీతి
రమ్మని పిలువ ---
పయనించె మన వలపుల ...

చాలా చిన్న పాట, కానీ, చిరకాలం మదిలో మెదిలే మధురాతి మధురమైన పాట. ఈ సినీమా ఎవరికీ తెలియదు. చూసిన గుర్తు చాలామందికి లేదు. అయినా ఈ సినీమా లోని మొత్తం పది పాటల్లో నాలుగు పాటలు - 'నీలి మేఘాలలో‌, ' పయనించె మన వలపుల', ' ముక్కోటి దేవతలు', 'హృదయమా ఓ బేల హృదయమా', ఎప్పుడు, ఎక్కడ విన్నా సరే, వెంటనే ఈ పాటలు "బావామరదళ్ళు' సినీమాలోవి కదా అని ఈనాటికి గుర్తుపట్టి మనసారా, హాయిగా హమ్ చేసుకుంటున్నారు.

'మామా, అల్లుళ్ళు' - మహా ప్రస్థాన కవి శ్రీశ్రీగారు, సమగ్రాంధ్ర సాహిత్య గ్రంథకర్త ఆరుద్రగారు ఈ పాటలకు నిత్యనూతనత్వం, చిరంజీవత్వం కల్పించారు. ఇందులో స్వరకర్త పెండ్యాల, గాయకులు ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకిగార్ల పాత్ర తక్కువేమీ కాదు.

ఈనాడు ఈ పాట సన్నివేశం ఏమిటో నాకు గుర్తులేదు కానీ సినీమాలో రెండుసార్లు వస్తుంది - ఒకటి సంతోషంగా, మరొకటి విషాదంగా. మృదుమధురమైన ఘంటసాల, సుశీల గాత్రాలలో ఈ పాటలోని సంతోషం, దుఃఖం మధ్య గల వైవిధ్యం అనితరసాధ్యం గా వినిపిస్తుంది. ఈ రెండు పాటలూ వెనువెంటనే వినడానికి అందుబాటులో లేవు, ఒక్క విషాద గీతం తప్ప. రెండు పాటల సాహిత్యం, వరస ఒకటే అయినా రసపోషణ, భావ ప్రకటన వేరే వేరే.

నెలబాలుని చిరునవ్వులు, తెలివెన్నెల సోనలు, చెలరేగే అలల మీద ఊగిసలాటలు ... వికసించె విరజాజులు, వెదజల్లుతున్న పరిమళాలు , రవళించె వేణుగీతాలు మనలను రారమ్మని ఆహ్వానిస్తున్నా సన్నివేశపరమైన విషాదాన్ని హృదయం నిండా నింపుకొని శ్రోతల హృదయాలను బరువెక్కించి కంటతడి పెట్టించారు ఘంటసాల, సుశీల.

ఈ సినీమాకు పెండ్యాలగారు అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు.   పెండ్యాలగారు ఈ పాటను ఖరహరప్రియ రాగంలో స్వరపర్చి ఆ రాగ మాధుర్యాన్నంతా పిండి  ఘంటసాలవారి గళం ద్వారా మనకు అందించారు. 

కర్నాటక సంగీతంలోని 72 మేళకర్తలలో ఖరహరప్రియ 22వ మేళకర్త. సప్తస్వరాలు కలిగిన సంపూర్ణరాగం. అత్యంత కరుణారస ప్రధానమైనది.  హిందుస్థానీ సంగీతంలో ఈ రాగానికి సమాంతర రాగం కాపి. పయనించె మన వలపుల పాటకు ఖరహరప్రియ రాగాన్ని ఎన్నుకొని ఆ పాటకు ఎంతో సార్ధకతను చేకూర్చారు పెండ్యాల.  పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఫ్లూట్ , వైలిన్స్ కాంబినేషన్ ఎంతో హృద్యంగా ఉంటుంది. శ్రీశ్రీగారి కవిత్వంలోని సున్నితత్వమంతా పెండ్యాలగారి స్వరకల్పనలో, ఘంటసాల, సుశీల అమృతగానంలో ద్యోతకమవుతుంది.

"బావ మరదళ్ళు" లో బావ రమణమూర్తి అయితే ఒక మరదలు (భార్య కూడా) మాలిని , మరో మరదలు కృష్ణకుమారి. ఈ ముగ్గురి మధ్య సాగే మానసిక సంఘర్షణలు, సమస్యలే ఈ సినీమా ఇతివృత్తం.

ఈ పాట విన్నప్పుడల్లా మరొక మరపురాని సంఘటన కూడా గుర్తుకు వచ్చి  ఆనందంతో పాటు మనసు బరువెక్కుతూంటుంది. 

అది 1985 - 90 ల మధ్య జరిగినది. మా మద్రాస్ తెలుగు అకాడెమీ ఒక ఉగాది సందర్భంగా ఘంటసాలవారికి నివాళిగా సకల గాయక సంగీతోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపింది. ఆనాడు తెలుగు సినిమా రంగంలో ప్రసిధ్ధులైన గాయనీగాయకులంతా పాల్గొని ఘంటసాలవారి పాటలు తలా ఒక పాట పాడారు. వేదిక మద్రాస్ మ్యూజిక్ ఎకాడమీ మెయిన్ ఆడిటోరియం.  ఆడిటోరియం కెపాసిటికి మించి ప్రేక్షకులు రావడంతో ఎసి యూనిట్లు పనిచేయని పరిస్థితి. అంతటి వేడిలో కూడా దాదాపు పది పన్నెండు గంటల భారీ కార్యక్రమాలు ప్రతీ ఏటా నిర్వహించడం మాకు, క్రమం తప్పక వేల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి ఈ ఉగాది ఉత్సవాలు చూసి ఆనందించడం, ఆనవాయితీగా జరిగేదే.

ఘంటసాలవారి నిలువెత్తు కటౌట్ వేదిక మీద కనిపిస్తుండగా ప్రతీ గాయనీ గాయకుడు తమ స్వరార్చనతో ఆ గాన గంధర్వునికి నివాళులు అర్పించారు. ఆ కార్యక్రమంలో ఆఖరు పాటగా ఘంటసాలవారు పాడిన " పయనించే మన వలపుల బంగరునావ"  పాటను ప్రముఖ బహుభాషా గాయకుడు, మా జంట సంస్థల గౌరవ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయిన శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ఘంటసాలవారి గురించి వినయపూర్వకంగా ప్రస్తుతిస్తూ, మాస్టారి పాటలు పాడడంలో తనకు గల సాధకబాధకాలను వివరించి పాట ప్రారంభించారు. పాటలో లీనమైపోయి అద్భుతంగా ఆలపిస్తున్నారు. పాట చివరకు వచ్చేప్పటికి స్టేజ్ మీద ఉన్న ఘంటసాలవారి నిలువెత్తు కటౌట్ క్రమక్రమంగా నీలిమేఘాలలోకి మాయమైపోయింది( సురభి నాటక సంస్థ సాంకేతిక కళాకారుల సౌజన్యంతో).  ఒక్కసారిగా ఆడిటోరియం లోని వేలాది  ప్రేక్షకులంతా బరువెక్కిన హృదయాలతో తమ సీట్లలోంచి లేచి నిలబడి నాన్ స్టాప్ గా కరతాళ ధ్వనులు చేయడం మొదలెట్టారు. బాలుగారికి బ్యాక్ గ్రౌండ్ లో జరిగిన విషయమే తెలియదు. విషయం తెలిసి ఆయన కూడా కన్నీటిపర్యంతమై మౌనంగా నిలబడిపోయారు. 

 మధురమైన ఈ అపురూప సంఘటన నాకెన్నటికీ మరపురాని విషయం.









వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.


ప్రణవ స్వరాట్

Saturday 6 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 24వ భాగం - శ్రీ నగజా తనయం, సహృదయం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైమూడవ భాగం ఇక్కడ

24వ సజీవరాగం -   

"శ్రీ నగజా తనయం, సహృదయం!
చింతయామిసదయం
త్రిజగన్మహోదయం  - శ్రీ నగజా తనయం!

"శ్రీరామ భక్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కధ! నలభై రోజులనుంచి చెప్పిన కధ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తున్నది, నాయనా! కాస్తా పాలు,మిరియాలు ఏమైనా...!"

" చిత్తం, సిధ్ధం!"

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచి
విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ
ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి 
అతడెవరయ్యా అంటే ---

రఘురాముడు! రమణీయ, వినీల ఘనశ్యాముడు! - 2

వాడు, నెలరేడు, సరిజోడు, మొనగాడు!
వాని కనులు మగమీల నేలురా!
వాని నగవు రతనాలజాలురా! - 2
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు మరో మరుడు, మనోహరుడు! రఘురాముడు!

స్వరకల్పనలు, వైయొలిన్, మృదంగం 
తనీ ఆవర్తనాలు -- రఘురాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడూ....

శభాష్... శభాష్ !

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున శ్రీరామచంద్రమూర్తిని
అంతఃపురగవాక్షం నుండి సీతాదేవి
ఓరకంటజూచినదై చెంగటనున్న
చెలికత్తెతో ---

ఎంత సొగసుగాడే,  - 2
మనసింతలోనె
దోచినాడె!
మోము కలువరేడే - నా నోము ఫలము వీడే, శ్యామలాభిరాముని చూడగ
నా మది వివశమాయె నేడే - ఎంత సొగసుగాడే!

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా, అక్కడ స్వయంవర సభామండపంలో
జనకమహీపతి సభాసదులను జూచి

అనియెనిట్లు , ఓ యనఘులార!
నా అనుగుపుత్రి సీత వినయాధిక
సద్గుణ వ్రాత, ముఖ విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి
జోదును నేడు మక్కువ మీరగ వరించి
మల్లెల మాలవైచి పెండ్లాడు!

అని ఈ ప్రకారంబుగ జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడే చల్లబడిపోయారట! మహావీరుడైన రావణాసురుడు కూడా "హా! ఇది నా ఆరాధ్యదైవమగు శివుని చాపము , దీనిని స్పృజించుటయే మహా పాపము" అని అనుకొనినవాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున --

ఇనకుల తిలకుడు  నిలకడగల  క్రొక్కారు మెరుపు వలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని 
ఆశీర్వాదము తలదాల్చి 
సదమల మదగజ గమనముతోడ
స్వయంవర వేదిక చెంత
మదనవిరోధి శరాసనమును తన
కరమున బూనినయంత
ఫెళ్ళుమనె విల్లు , గంటలు ఘల్లుమనె
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము
ఒక నిమేషమ్మునందె నయము
జయమును ,భయము , విస్మయము
గదుర! ..శ్రీమద్రమారమణ గోవిందో...హరి
గోవిందో... హరి!

భక్తులందరూ చాలా నిద్రావస్థలో వున్నట్టుగావుంది,  మరొక్కసారి ..
జై! శ్రీమద్రమారమణ గోవిందో...హరి గోవిందో...హరి...

భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి  శివధనుర్భంగం
గావించాడు. అంతట

భూతలనాధుడు రాముడు
ప్రీతుండై  పెండ్లియాడె ఫృథుగుణమణి
సంఘాతన్ భాగ్యోపేతన్ , సీతన్ - 2

శ్రీమద్రమారమణ గోవిందో... హరి...

మన తెలుగువారి ప్రాచీన కళా ప్రక్రియలలో ముఖ్యమైనది హరికథ ఒకటి. సంగీత, సాహిత్య సమ్మిళితమైన హరికథను అనేక పాత సినీమాలలో సందర్భోచితంగా ప్రయోగించడం జరిగింది. అలాటివాటిలో తలమానికంగా నిలిచేది వాగ్దానం సినీమా కోసం ఘంటసాల భాగవతార్ గారు చెప్పిన సీతాకళ్యాణ సత్కధ.

హరికథ అని చెప్పగానే అందరికీ వెంటనే స్ఫురించే పేరు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. హరికథా పితామహుడు. ఆట పాటల మేటి.  బహుభాషాకోవిదుడు. ప్రవీణుడు. విజయనగరంలోని మహారాజా సంగీత కళాశాలకు ప్రప్రథమ ప్రిన్సిపాల్. వారి హయాంలో హరికథ మూడుపువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లింది. విజయనగర చుట్టుప్రక్కల ప్రాంతమంతా హరిదాసులకు నిలయమయింది. నారాయణదాసు గారి శిష్య, ప్రశిష్యులెందరో వందల, వేల సంఖ్యలో దేశమంతా వ్యాపించారు. దాసుగారి శిష్యులమని చెప్పుకోవడమే ఘనతగా భావించేవారు. నారాయణదాసుగారి కాలంలో పుట్టకపోయినా, వారిని చూడకపోయినా వారి శిష్యులమని, శిష్య ప్రశిష్యులమని  చెప్పుకుటూ చెలామణి అయే హరిదాసులు ఈనాటికీ ఉన్నారు. రాగస్ఫూర్తికి, రసస్ఫూర్తికి ప్రాధాన్యత నిస్తూ నారాయణదాసుగారు అనేక హరికథలు రచించి గానం చేశారు. 

విజయనగరం సాంస్కృతిక మట్టి వాసనను అనుభవించిన ఉద్దండులు - కవివరేణ్యుడు శ్రీశ్రీ, మహాగాయకుడు, స్వయంగా స్వరకర్త అయిన ఘంటసాల సహాయ సహకారాలతో పెండ్యాల నాగేశ్వరరావుగారి ఆపాతమధురమైన ఆరున్నర నిముషాల, అత్యద్భుత హరికథ వాగ్దానం చిత్రం ద్వారా తెలుగువారి సొంతమయింది. రోజుల తరబడి ఎన్నో గంటలసేపు జరిగే సీతాకళ్యాణ గాధను కేవలం ఆరున్నర నిముషాలలో చెప్పడమంటే సామాన్యమైన విషయం కాదు.  హరికథ ప్రక్రియ పట్ల మంచి అవగాహన, అందులోని సారాన్ని క్షుణంగా అర్ధం చేసుకున్నవారే  దానికి పరిపూర్ణంగా న్యాయం చేకూర్చగలరు. అందుకే వాగ్దానం నిర్మాత, దర్శకుడు, రచయిత అయిన ఆత్రేయ ఈ హరికథను రూపొందించే బాధ్యతను శ్రీశ్రీగారికి అప్పగించారు. సంప్రదాయ సంగీత రీతులలో నిష్ణాతుడైన పెండ్యాలగారి స్వర రచనలో ఈ హరికథ అజరామరమయింది. మరి అలాటి జనరంజకమైన హరికధను గానం చేయడానికి ఆనాడు ఘంటసాలవారు తప్ప మరో గాయకుడు లేరనేది నిర్వివాదాంశం. ఆ గురుతర బాధ్యతను ఘంటసాల అనితరసాధ్యంగా నిర్వహించారు. నారాయణదాసుగారి శిష్యులెందరినో ఎరిగి వారి ద్వారా ఎన్నో కథలను విని హరికథ మట్టులను క్షుణంగా ఆకళింపుజేసుకున్న ఘంటసాల ఈ సినీమాలోని హరికథకు ప్రాణప్రతిష్ట చేశారు. సంప్రదాయబధ్ధమైన గానం, మాటల విరుపులు, నడక, వివిధ రసాల పోషణ ఘంటసాలవారి ఈ హరికథాగానంలో ద్యోతకమవుతాయి.

ఈ హరికథ హాస్యరస ప్రధానంగా చిత్రీకరించబడింది. తెరవెనుక ఘంటసాలవారి గానానికి తెరమీద హరిదాసుగా  రేలంగి జీవంపోసారు. హరిదాసుగారి భార్య, పుత్రులే పక్కవాద్యగాళ్ళు. భార్యగా సూర్యకాంతం వైయొలిన్ తో, కొడుకు పద్మనాభం మృదంగంతో సన్నివేశానికి కావలసిన హాస్యాన్ని పుష్కలంగా పండించారు. ఈ హరికథలో వినవచ్చే వైలిన్ సోలోలు ప్రముఖ సినీ వైయొలినిస్ట్ శ్రీ హరి అచ్యుతరామశాస్త్రిగారు (ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీ హరి నాగభూషణంగారి తనయుడు) వాయించారు.

హరికథ పామరజనాలను ఆకర్షించే ప్రక్రియ. అందువల్ల సందర్భానుసారం అనేక పిట్టకధలను జోడించి శ్రోతలకు హుషారు కలిగిస్తూంటారు. ఈ కధ ప్రారంభంలో  "..... నలభైరోజుల నుంచి చెప్పిన కధ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను...." అని చెప్పించడం ద్వారా ఆ హరిదాసుగారి ప్రతిభ, కీర్తి శ్రోతలకు చెప్పక చెపుతూ దాసుగారి కీర్తికి భంగం కలగకుండా "మిరియాల పాలు" కోసం గుర్తు చేయడం.....  " చిత్తం! సిధ్ధం" (ఈ డైలాగ్ సంగీత దర్శకుడు పెండ్యాలగారిది) అంటూ పాల గ్లాసు అందించడం; "నిద్రావస్థలో ఉన్న శ్రోతలచేత గోవింద నామ స్మరణ చేయించడం వంటి డైలాగ్స్ చెప్పడంలో హరికథా సరళి, ఘంటసాలవారిలోని  రేలంగి (హాస్యనటుడు) మనకు కనిపిస్తాయి.

కథ మధ్యలో తనకూ సంగీతజ్ఞానం ఉందని నిరూపించేందుకు  దాసుగారు చేసిన స్వరకల్పనలు, వాద్యాల ముక్తాయింపులు, ఇవన్నీ హరికథాగానంలోని భాగాలే. అలాగే హరికథలోని నృత్యగమనం, నడక కూడా  "సదమల మదగజ గమనము తోడ..." అనేప్పుడు దాసుగారి నృత్యం మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. హాస్య, శృంగార, ఆశ్చర్యరసాలన్నింటినీ ఘంటసాలగారు  ఈ సంక్షిప్త సీతాకళ్యాణ సత్కథలో మేళవించి శ్రోతలను పరవశులను చేశారు.

ఘంటసాలవారిని మించిన మహాగాయకులెందరో వుండవచ్చుగాక! (sic) కానీ వారెవరిలోని లేని గాత్రమాధుర్యం సౌలభ్యం, భావ ప్రకటనలో సహజత్వం, మాట స్పష్టత మాత్రం ఒక్క ఘంటసాలగారిలో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఘంటసాలవారి ఈ హరికథ 63 సంవత్సరాల తర్వాత కూడా అంత నిత్యనూతనంగానే వుంది.

సినీమా లో జరిగే సన్నివేశానికి బలంచేకూరుస్తూ ఈ హరికథ సాగడం ఒక విశేషం. ఈ సన్నివేశంలో సినీమాలోని ప్రముఖ నటులంతా --- అక్కినేని, కృష్ణకుమారి, చలం, గుమ్మడి, రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం, మొదలగువారంతా కనిపిస్తారు.

సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ బాబు (శరత్చంద్ర ఛటర్జీ) వ్రాసిన "వాగ్దత్త" బెంగాలీ నవల ఆధారంగా మనసుకవి ఆత్రేయ సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం "వాగ్దానం".

సంగీత దర్శకుడు పెండ్యాల గారు ఈ హరికథను స్వరపర్చడానికి పూర్తిగా కర్నాటక రాగాలనే ఎన్నుకున్నారు . కానడ, శంకరాభరణం, మోహన, ధన్యాసి, కేదారగౌళ, కళ్యాణి రాగాలు ఈ హరికథలో రసస్ఫూర్తితో వినిపిస్తాయి.

 ఈ హరికథా గానంలోని విశిష్టత, రసాలు, సొగసులు అనుభవైకవేద్యం, మాటలకందనివి.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...