Saturday 27 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 27వ భాగం - దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఆరవ భాగం ఇక్కడ

27వ సజీవరాగం -   

"దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో..."
              
 పల్లవి :
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో !

చరణం :
పాలిత కింకర భవ నాశంకర శంకర
పురహర నమో నమో
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో !

చరణం: 
దురిత విమోచన ఫాలవిలోచన 
పరమదయాకర నమో నమో
కరిచర్మాబర , చంద్రకళాధర 
సాంబ దిగంబర నమో నమో !

చరణం :
నారాయణ హరి నమో నమో
నారద హృదయవిహారీ నమో నమో
పంకజనయనా పన్నగశయనా
శంకరవినుత నమో నమో 
నారాయణ హరి నమో నమో !

శివకేశవులకు అభేదం అని మన ప్రాచీన పురాణాలెన్నో చెపుతున్నా శైవమతం , వైష్ణవమతమంటూ మానవులు భేదాలతో వైషమ్యాలతో కలహించుకుంటూ శాంతికి భంగం కలిగించడం మనకు తెలిసినదే. శివుడు, విష్ణువ  పేరిట ఆ విధమైన విద్వేషాలు తగవని  1958 లో వచ్చిన భూకైలాస్ సినీమాలోని కొన్ని సన్నివేశాలు మనకు ప్రబోధించడం గమనించవచ్చును.

అందులోని  "దేవ దేవ ధవళాచల మందిర" నేటి మన సజీవరాగం. ఈ పాటలో హరి హరుల ఇద్దరి ప్రస్తావనను అతి సమర్ధంగా తీసుకువచ్చారు గేయ రచయిత సముద్రాల రాఘవాచార్యులవారు. ఒకే సన్నివేశంలో  శివనామ స్మరణంతో రావణాసురుడు,  హరినామ స్మరణతో నారదుడు వస్తూ దారిలో కలుసుకుంటారు.   

పాత్రపరంగా హరి అవతారమైన రాముడు పేరుగల రామారావుగారు పరమేశ్వరుని; ఈశ్వర నామం గల అక్కినేని నాగేశ్వరరావు గారు నారాయణుని స్తుతిస్తూ  నటించడం శివకేశవులు ఒకటేనని చెప్పకచెప్పడం ఓ విశేషం.

భూకైలాస్ సినీమా పేరు చెప్పగానే వెంటనే మనం తల్చుకునేది ఆ సినీమాలోని ఘంటసాలవారి పాటలను, పద్యాలనే. భూకైలాస్ చిత్రం లో ఘంటసాలవారి  శాస్త్రీయ,/ లలిత గాన ప్రతిభ అణువణువునా ద్యోతకమౌతుంది. రావణాసురుడిగా రామారావుగారు, నారదుడిగా అక్కినేని వారు మన మనస్సుల్లో చిరస్థాయిగా నిల్చిపోవడానికి కారణం ఘంటసాల మాస్టారి అద్వితీయ దేవగానమే.

ఈ పాటలో శంకరుడికి సంబంధించిన పల్లవి, చరణాలను జంఝూటి రాగంలో, విష్ణువుకు సంబంధించిన చరణాన్ని కాపీ రాగంలో స్వరపర్చి  తగు మాత్రపు వాద్యాలు - ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, తబలాలు వంటివి మాత్రమే సున్నితంగా ఉపయోగించి గాత్రానికే ప్రాధాన్యతనిచ్చారు సంగీత దర్శకులు. ఈ పాటలో ఘంటసాలవారి గాత్రంలోని భక్తి తత్పరతలు, పరవశత్వం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది.

జంఝూటి రాగం హిందుస్తానీ సంప్రదాయ సంగీతపు రాగం. ఆరోహణలో ఆరు స్వరాలు , అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతూ, వక్ర సంచారం చేయడంవలన ఈ రాగాన్ని షాఢవ-సంపూర్ణ వక్ర రాగంగా పరిగణిస్తారు.

కర్నాటక సంగీత కాపి రాగం ఖరహరప్రియ జన్యరాగం. ఇది కూడా షాఢవ-సంపూర్ణ వక్రరాగమే. దీనికి సమాంతరమైన హిందుస్తానీ రాగం పీలు.

ఇంతటి చక్కటి పాటలను స్వరపర్చిన సుదర్శనం - గోవర్ధనం సోదరులు చిరస్మరణీయులు. ఏవిఎమ్ స్టూడియో వాద్యబృంద నిర్వాహకులుగా , ఎమ్మెస్ విశ్వనాధన్ కు సహాయకులుగా యీ సోదరులు చిరపరిచితులు.  ఏవిఎమ్ తీసిన అనేక చిత్రాలకు సుదర్శనం - గోవర్ధనం సోదరులు సంగీత దర్శకత్వం వహించారు.

భూకైలాస్ లో పాటలన్నీ సంప్రదాయబధ్ధంగా, రాగాలకు కట్టుబడే స్వరపర్చబడ్డాయి. ఈచిత్రంలో పాటలను ఘంటసాల, ఎమ్.ఎల్.వసంతకుమారి, కోమల, టి.ఎస్.భగవతి, సుశీల వంటి హేమాహేమీలు ఆలపించారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. 

ఘంటసాలవారి కంచుకంఠాన వెలువడిన యీ చిత్రంలోని ప్రతి పాట , పద్యం యీనాటికీ సంగీతాభిమానులందరికీ షడ్రసోపేత విందుభోజనమే. భూకైలాస్ లో మాస్టారు పాడిన - దేవ దేవ ధవళాచల మందిర, (జంఝూటి, కాపి) నీలకంధరా దేవా (తిలాంగ్ రాగం), తగునా వరమీయ ( మాయమాళవగౌళ, పీలు రాగాల మిశ్రమం) రాముని అవతారం రఘుకుల సొముని అవతారం, సుందరాంగ అందుకోరా - (సుశీలగారు పాడిన యీ పాట  నేపధ్యంలో ఘంటసాలవారు వివిధస్థాయిలలో ఆలపించిన ' ఓం నమశ్శివాయ ' నామం ఒక అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది.), వంటి పాటలతోపాటూ యితర పాటలు పద్యాలు కూడా  శాస్త్రీయ సంగీతాభిమానులందరినీ ఎంతగానో అలరించాయంటే అందుకు ప్రధాన కారణం ఘంటసాలవారి సంగీత విద్వత్తే అంటే అతిశయోక్తి కాదనే నా భావన.

అగ్రనటులు అక్కినేని, నందమూరి పోటాపోటిగా నటించి తమ నటనా వైదుష్యాన్ని కనపర్చిన చిత్రం భూకైలాస్. నందమూరి వారు రావణబ్రహ్మగా విశ్వరూపం దాల్చడానికి బీజం  యీ భూకైలాస్ లోనే పడిందని చెప్పవచ్చును.

సముద్రాల రాఘవాచార్యులవారు శుధ్ధశ్రోత్రీయ శ్రీవైష్ణవుడైనా, దేవదేవ ధవళాచల మందిర పాటలో శివ కేశవులిద్దరినీ సమానంగా తరతమ భేదం పాటించకుండా  స్తుతించి కవితా మర్యాదలను పాటించారు. 

దేవదేవ ధవళాచల మందిర పాటలో ఎన్.టి.ఆర్ , ఏ.ఎన్.ఆర్ యిద్దరికీ ఒకే సమయంలో  గాత్రదానం చేసి ఎంతో వైవిధ్యాన్ని చూపి శ్రోతలను మెప్పించిన ఘనత ఘంటసాలవారిదే. అక్కినేనే  పాడుతున్నారు , లేదు రామారావే పాడుతున్నారనే భ్రమలో పెట్టి పాడే సామర్ధ్యం ఒక్క ఘంటసాలవారి కే వుంది. వారిరువురి గాత్రధర్మాలకు తగినట్లు నామమాత్రపు శృతిభేధంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు వేలాది మనోజ్ఞగీతాలను ఆలపించిన ఘంటసాలవారు తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయులైనారు.

భూకైలాస్ కు ముందు మరే సినీమాలోనూ ఈ ఇద్దరు నటులకు ఒకేసారి ఒకే గాయకుడు పాడిన దాఖలాలు లేవు. ఆనాటికి ఇదొక అద్భుత గాత్ర ప్రయోగమేనని చెప్పాలి.

నిర్మాత  ఎ.వి.మెయ్యప్పన్, దర్శకుడు కె.శంకర్, సంగీతదర్శకులు  సుదర్శనం - గోవర్ధనం సోదరులు తెలుగువారు కానప్పటికి భూకైలాస్ వంటి అజరామరమైన పౌరాణిక చిత్ర కళాఖండాన్ని తెలుగువారి స్వంతం చేసినందుకు మనం చాలా ఋణపడివున్నామనే చెప్పాలి.

ఒక్క ఘంటసాలవారి కే కాక ఎన్.టి.రామారావు , అక్కినేని నాగేశ్వరరావుగార్లకు కూడా అజరామరత్వాన్ని కల్పించిన చిత్రరాజం భూకైలాస్.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...