Saturday, 7 September 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 46వ భాగం - మౌనముగా నీ మనసుపాడినా వేణుగానమును వింటిలే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైయైదవ భాగం ఇక్కడ

46వ సజీవరాగం -  మౌనముగా నీ మనసుపాడినా
                            వేణుగానమును వింటిలే
చిత్రం - గుండమ్మ కథ
గానం - ఘంటసాల 
రచన - పింగళి
సంగీతం - ఘంటసాల

పల్లవి:
మౌనముగా నీ మనసుపాడినా 
వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే నీ అనురాగము నీ
కనులనే కనుగొంటిలే నీ మనసు
నాదనుకొంటిలే !! మౌనముగా!!

చరణం:
కదలీకదలని లేత పెదవుల
తేనెల వానలు కురిసెనులే ఆ.... !!కదలీ
ఆనందముతో అమృతవాహిని
ఓలలాడి మైమరచితిలే !! మౌనముగా

చరణం:
ముసిముసి నవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే ఆ..ఆ..
!!ముసిముసి!!
రుసరుసలాడుచు విసిరిన వాల్జడ 
వలపుపాశమని బెదరితిలే!! 

1962 తెలుగు చిత్ర సంగీతానికి సంబంధించినంతవరకు స్వర్ణవత్సరంగా చెప్పుకోవాలి. ఆ ఏడాది అత్యధిక సంఖ్యలో సినీమాలు రావడమూ, వాటిలో అధికసంఖ్యాకం ఘనవిజయం సాధించడం జరిగింది. ఆ ఏ ఏడాది అగ్రనటులైన ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల సినీమాలు కూడా అత్యధిక సంఖ్యలో పోటాపోటీగా విడుదలై అత్యధిక సంఖ్యలో ఘనవిజయాన్ని సాధించాయి. ఆ ఏడాది విడుదలైన సినీమాలలోని పాటలన్నీ ఈ నాటికీ సజీవంగా నిల్చివున్నాయి. అంతేకాదు ఆ సంవత్సరం అగ్రనటులిద్దరూ కలసి నటించి, రజతోత్సవం జరుపుకున్న చిత్రం "గుండమ్మ కథ". ఈ సినీమా ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్. ఇద్దరికీ మైలురాయి. గుండమ్మకథ తెలుగు వెర్షన్ ఎన్.టి.రామారావు నూరవచిత్రమైతే, ఆ సినీమా తమిళ వెర్షన్ "మణిదన్ మారవిల్లై" అక్కినేని నాగేశ్వరరావుకు నూరవచిత్రంగా చెపుతారు. 

గుండమ్మకథ లోని 8 పాటలు సూపర్ హిట్ పాటలుగా ఈనాటికీ తెలుగునాట మార్మోగుతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా గుండమ్మకథలోని అక్కినేని వారి ఏకగళ గీతం "మౌనముగా నీ మనసు పాడిన వేణుగానము వింటిలే" పాటను నేటి  ఘంటసాల సజీవరాగంగా తీసుకోవడం జరిగింది. 

గుండమ్మకధ విజయావారికి కత్తిమీద సాము. అవి ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల మధ్య ప్రఛ్ఛన్నయుధ్ధం సాగుతున్న రోజులు. ఆ ఇద్దరూ కలసి నటిస్తున్న సినిమా అంటే దర్శక నిర్మాతలకు గుండెలమీద కుంపటే. అదీకాక ఈ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావుకు విజయా సంస్థలో లభించిన రెండవ అవకాశం. ఆ సంస్థలొ దర్శకుడిగా లభించిన తొలి భారీ చిత్రం " చంద్రహారం" చావుదెబ్బకొట్టింది. పర్యవసానం, ఎనిమిదేళ్ళపాటు కమలాకర విజయాకు దూరమయ్యారు. పౌరాణిక చిత్రాలకు అలవాటుపడ్డ కామేశ్వరరావుగారికి ఈ సాంఘిక చిత్రాన్ని, అందునా హాస్యరస ప్రధానమైన సినిమాను  డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది. అయితే ఇది పూర్తిగా చక్రపాణిగారి సినీమా కావడంవలన చక్కన్న చెప్పిందే వేదం. ఆ చక్రాయుధానికి తిరుగులేదు. ఓ కన్నడ సినీమా కథను తీసుకొని దాని రంగు, రుచి, వాసన అన్నీ మార్చేసి హాస్య రస ప్రధానమైన ట్రీట్మెంట్ తో టైటిల్ రోల్ ను సూర్యకాంతానికి ఇచ్చి "గుండమ్మకథ" ను నిర్మించారు విజయావారు.

గుండమ్మకధ సంగీత నిర్వహణా భాధ్యత లను ఘంటసాలవారి కి అప్పగించారు. మాయాబజార్ తర్వాత ఘంటసాల విజయాకు సంగీతం చేసిన తెలుగు, తమిళ చిత్రం "గుండమ్మ కథ". గుండమ్మకధ లో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు. ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్, సావిత్రి , జమున.  తమిళం వెర్షన్ " మణిదన్ మారవిల్లై" లో ఎన్టీఆర్ కు బదులు సావిత్రి జోడీగా జెమినీ గణేశన్ నటించారు. తెలుగులోని ట్యూన్లే తమిళంలో ఉపయోగించారు. గాయకులు వేరే.

పాటల పంపకం విషయంలో చక్రపాణి, కమలాకర,  పింగళి, ఘంటసాల చాలా జాగ్రత్తగా వ్యవహించారు.  ఒకరికి అట్టు ఒకరికి ముక్క అని కాకుండా ఉన్న ఎనిమిది పాటలను అక్కినేని, ఎన్.టి.ఆర్., సావిత్రి, జమునల మధ్య సరిమానంగా పంచారు. అందరికీ చెరి ఒక సోలో, రెండేసి డ్యూయెట్ల చొప్పున ఏ హెచ్చుతగ్గులు లేకుండా పంచారు. ఘంటసాలవారి సంగీతంలో పాటలన్నీ అమృతప్రాయంగా రూపొందాయి. ఈ చిత్రంలో ఘంటసాల ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల మధ్య వారధిలా నిల్చారనడంలో సందేహమేలేదు. తన కంఠస్వరాన్ని ఏక కాలంలో ఇద్దరి హీరోలకు ఎరువిచ్చి,ఆ పాటలను వారే పాడుతున్నారా అనే అనుభూతిని కల్పించారు.  "కోలు కోలోయన్న కోలో నా సామి" పాటలో ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ఇద్దరికి ఘంటసాలవారి గాత్రం వినిపిస్తుంది. ఆ ఇద్దరు నటుల మధ్య కంబైన్డ్ షాట్స్ లేకపోయినా ఆ పాటను వేర్వేరు సమయాలలో షూట్ చేసి ఒకే సన్నివేశంలో ఇద్దరు హీరోలను, ఇద్దరు హీరోయిన్ లను రసవత్తరంగా చూపిన ఘనత కెమేరామెన్ మార్కస్ బార్ట్ లీ కే దక్కుతుంది.

"మౌనముగా నీ మనసు పాడిన" పాటలో అటు ఎ.ఎన్.ఆర్ ను , ఇటు జమునను ఇద్దరినీ ముగ్ధమనోహరంగా చూపించారు బార్ట్ లీ. ఆ పాటను మధురాతిమధురంగా ఆలపించి తేనెల వానలో మత్తెక్కి మైమరచిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించారు ఘంటసాల మాస్టారు.

మోహన రాగ సమ్మోహనత్వాన్ని అంతా రెండు చరణాల అంతంలో వచ్చే తన ఆలాపనలోనే నింపారు ఘంటసాలగారు. రెండవ ఆలాపనలో మూడు స్థాయిలలో మోహన రాగ స్వరూపాన్నంతా చూపించిన విధానం ఘంటసాలవారికి మాత్రమే సాధ్యం. మోహనరాగ సున్నితత్వం, లాలిత్యం అంతా ఘంటసాలవారి గళంలో, వాద్యబృంద నిర్వహణలో గోచరిస్తుంది. ఘంటసాల మాస్టారు ఈపాటలో సితార్, ఫ్లూట్, పియానో, డబుల్ బేస్, వైయొలిన్స్, తబలా, డోలక్ వంటి చాలా తక్కువ వాద్యాలను మాత్రమే ఉపయోగించారు. ఒక పాట పదికాలాలపాటు ప్రజలకు గుర్తుండాలంటే పాట సాహిత్యం, సంగీతం సరళంగా, సులభంగా వుండాలి. వాద్యగోష్టి సున్నితంగా గాయకుడిని అనుసరించిపోవాలే తప్ప, అఖ్ఖరలేని జోరు , హోరుతో గాత్రాన్ని అధిగమించి పోకూడదనేది ఘంటసాలవారు పాటించిన సూత్రం.

"గుండమ్మకథ",  తమిళ వెర్షన్ "మణిదన్ మారవిల్లై"  రెండూ ఒకేసారి తీశారు విజయావారు. ఘంటసాలగారే తమిళ చిత్రనికి కూడా సంగీత దర్శకుడు. జెమినీ గణేశన్ పాటలను శీర్కాళి గోవిందరాజన్, అక్కినేని పాటలను ఎ.ఎల్.రాఘవన్ పాడారు. ఇందులో ఓ విశేషం ఏమంటే హీరోల పాటల్లో వినవచ్చే రాగాలాపనలు అన్నీ ఘంటసాలగారు తెలుగుకోసం పాడిన ఆలాపనలే. తమిళంలో కూడా ఈ పాటలన్నీ మంచి జనాదరణ పొందాయి. ఆ పాటలన్నీ ఇప్పటికీ టివి ఛానల్స్ లో దర్శనమిస్తాయి.

ఆరు దశాబ్దాలుగా శ్రోతలను సమ్మోహనపరుస్తున్న ఘంటసాలవారి   ఈ మోహనరాగం సజీవంగా సదా మీ మదిలో మెదులుతూ  అక్కినేని వారి శత జయంతి సందర్భంగా మిమ్మల్నందరిని ఆనందపరుస్తుందనే భావిస్తున్నాను.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...