Saturday, 31 August 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 45వ భాగం - మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రీ , తనయుడు ఎవరో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైనాలుగవ భాగం ఇక్కడ

45వ సజీవరాగం -  మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రీ , తనయుడు ఎవరో

చిత్రం - గాలిమేడలు
గానం - ఘంటసాల 
రచన - సముద్రాల
సంగీతం - టి.జి.లింగప్ప

పల్లవి:
మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రీ , తనయుడు ఎవరో ! మమతలు లేని !

చరణం:
ఏ కులమైనా నెలవెది అయినా
మదిలో కూరిమి జాలుకొనా
పిలిచి లాలించి కొడుకు చందాన - 2
చూచి కాచే దాతే నాయన కాదా 
! మమతలు!

చరణం:
మాటలు నమ్మీ మనసూ నీరై 
దరికీ తీసిన తండ్రులను
దేవుని  చందాన తలచీ పూజించి -2
కొలువూ చేసేవాడే కొడుకౌగాదా 
! మమతలు లేని !

యారిగె యారుంటూ ఎరవిన
సంసార నిర మెలగిన గుళ్ళే నిజవల్ల
హరియే యారిగె యారుంటూ 
( కన్నడ భాష తెలియనందున అక్షర దోషాలుంటాయి. అందుకు క్షంతవ్యుడిని)

1962లో "గాలిగోపుర" అనే కన్నడం సినీమా వచ్చింది. కన్నడంలో విపరీత జనాదరణ పొందిన ఈ గీతాన్ని వ్రాసిందెవరో తెలుసా! కర్ణాటక సంగీత పితామహుడిగా కీర్తిపొందిన 16వ శతాబ్దపు భక్త, కవి, గాయక, సంగీత విద్వాంసుడైన శ్రీ పురందర దాసులవారు. 

కర్ణాటక సంగీతాభ్యాసానికి కావలసిన ప్రాథమిక ప్రణాళికను రూపొందించినది శ్రీ పురందరదాసులే. సంగీత శిక్షణకు తొలి మెట్టయిన మాయామాళవగౌళ రాగంలోని సరళీస్వరాలు, జంటలు, అలంకారాలు, ఇవన్నీ రూపొందించింది ఈయనే. శ్రీ పురందరదాసుల వారి "లంబోదర లకుమికరా అంబాసుత అమరవినుత" అనే గణపతిస్తుతితోనే కర్ణాటక సంగీత శిక్షణ ఆరంభించడం సంప్రదాయం.

అంతటి లబ్దప్రతిష్టులైన వాగ్గేయకారుని గీతాన్ని సందర్భోచితంగా సినీమా లో ఉపయోగించిన ఘనత  'గాలిగోపుర' చిత్ర నిర్మాత, దర్శకుడు బి.ఆర్.పంతులుకు చెందుతుంది.

కన్నడ "గాలిగోపుర", తెలుగు  "గాలి మేడలు"  ఈ రెండు సినిమాలు ఒకేసారి సంయుక్తంగా నిర్మించబడ్డాయి. "యారిగె యారుంటూ" పాట భావార్ధంతోనే తెలుగులో "మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రీ తనయుడు ఎవరో" అనే పాట ఆవిర్భావం జరిగింది. ఈ తెలుగు పాటను సముద్రాల రామానుజాచార్యులుగారు వ్రాశారు. తెలుగు, కన్నడ భాషలు రెంటిలోనూ ఘంటసాలవారే పాడగా, ఈ రెండు చిత్రాలకు కన్నడ సంగీత దర్శకుడు టి.జి.లింగప్ప సంగీతం సమకూర్చారు.

ఘంటసాలగారు 'గాలిమేడలు' సినీమా లో పాడిన ఏకగళ  హృద్యమైన "మమతలు లేని మనుజులలోన" గీతమే నేటి మన మదిలో సదా మెదిలే సజీవరాగం.

నటనలో శిఖరాగ్రాలకు చేరుకున్న హేమాహేమీలు ఎన్.టి.రామారావు, నాగయ్యల మీద తెలుగులోనూ,  రాజ్ కుమార్, అశ్వథ్థ్ ల మీద కన్నడంలోనూ ఈ రెండు పాటలను చిత్రీకరించారు. ఈ అగ్రనటుల నటనకు ప్రాణ ప్రతిష్టచేసినది ఘంటసాలవారి గాన మాధుర్యం, భావార్ద్రత. అందువల్లనే ఈ రెండు పాటలు  రెండు రాష్ట్రాలలో విపరీత జనాదరణ పొంది, ఆరు దశాబ్దాల తర్వాత కూడా సంగీతాభిమానుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నాయి. 

పరభాషా చిత్రాలలో ఎన్ని వందల, వేల గీతాలు పాడినా ఒక గాయకుడికి తన మాతృభాషలో పాడేప్పుడు వున్న స్వేఛ్ఛ, స్వఛ్ఛత, తృప్తి పరాయి భాషలో పాడేప్పుడు వుండదనేది ఘంటసాలవారి నిశ్చితాభిప్రాయం. ఆ కారణం చేతనే తనకు లభించిన ఎన్నో అవకాశాలను నిరాకరించి స్థానిక గాయకుల చేతే పాడించమని ఘంటసాలవారు నిర్మాతలను ప్రోత్సహించేవారు. అయినప్పటికీ ఘంటసాల కన్నడ సినీమాలలో చాలా పాటలనే పాడి కన్నడిగుల అభిమాన గాయకుడయ్యారు.

మనుషుల్లో మమతానురాగాలు, ప్రేమ బంధాలు సమసిపోయి ద్వేషభావాలు పెరిగిపోయినప్పుడు తండ్రీ, కొడుకుల బాంధవ్యాలు తెగిపోతాయి. రక్త సంబంధీకులైనా చెల్లాచెదరై జీవితాలు అస్తవ్యస్తంగా మారుతాయి. ఇలాటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఓ యువకుడు ఓ వృధ్ధునికి (అతడే కన్నతండ్రని తెలియక) సేవ చేస్తూ నిర్వేదంతో హృదయవేదనతో  ఆలపించిన గీతం. ఒక రకంగా ఇది ఒక జోలపాట.  ఘంటసాలవారి కంఠంలో ఈ రకమైన వేదనాతప్త హృదయ గీతాలు ఎంత భావయుక్తంగా వుంటాయో అందరికీ తెలిసిందే.

టి.జి.లింగప్ప ఈ పాటను చాలా హృదయవిదారకంగా అందరి మనసులకు హత్తుకునేలే స్వరపర్చారు. ఈ పాట రాగం విషయంలో పలువురు పలు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందుచేత ఈ పాట ఫలానా రాగమని చెప్పే అర్హత నాకు లేదు. అది ఏ రాగమైనా ఘంటసాలవారి హృదయాంతరాళాలలో నుండి వెలువడి సన్నివేశ పరిపుష్టిని కలిగించిందనేది వాస్తవం. ఈ పాటకోసం టి.జి.లింగప్ప సితార్, వైయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్, చిటికెలు, డబుల్ బేస్ వంటి వాయిద్యాలు ఉపయోగించారు.

ఒక గాయకుడి పాట కానీ, ఒక నటుడి నటన కానీ రాణించాలంటే బలమైన సన్నివేశం వుండాలి. అప్పుడే గీత రచయిత ఉన్నత విలువలుగల పాటను వ్రాయగలుగుతాడు, సంగీతదర్శకుడు మంచి వరసను కూర్చగలుగుతాడు. అలాటి మంచి విలువలు గలిగిన పాట కావడం మూలాన్నే "గాలిమేడలు" సినీమాలోని ఘంటసాలవారి "మమతలు లేని మనుజులలోనా..." పాట సజీవమయింది.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్  

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...