"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
42వ సజీవరాగం - పుత్తడి బొమ్మా పూర్ణమ్మచిత్రం - కన్యాశుల్కం
గానం - ఘంటసాల & బృందం
రచన - గురజాడ అప్పారావు పంతులు
సంగీతం - ఘంటసాల
సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం మన సమాజంలో ప్రబలివున్న కన్యాశుల్క దురాచారాన్ని, బాల్య వివాహ దురాగతాలను రూపుమాపి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఆనాటి సంఘసంస్కర్తలెందరో కృషిచేశారు. అలాటివారిలో గురజాడ అప్పారావు పంతులుగారు ప్రముఖులు. ఆనాటి విజయనగర సంస్థానాధీశుడు ఆనందగజపతి మహారాజావారి ఆంతరంగిక మిత్రుడు. ఉభయభాషలలో మంచి కవి, రచయిత అయిన గురజాడ అప్పారావుగారి సహాయ సహకారాలతో ఆనాటి సమాజంలో నెలకొన్న మూఢాచారాలను తొలగించి, బాల్య వివాహాలు, బాల వితంతువుల విషయంలో ప్రజల దృక్పధాన్ని, జీవనవిధానాన్ని మార్చడానికి ఆనందగజపతి చాలా కృషిసల్పారు.
దాని ఫలితంగా నే గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం, 'పూర్ణమ్మ కథ' అనే గేయం వెలుగులోకి వచ్చి ఒక గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. గురజాడ వారి కవితాశిల్పానికి , రచనావైశిష్ట్యానికి, సంస్కార హృదయానికి దర్పణం పట్టే ఒక కరుణ రసాత్మక గాధ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ. పూర్తిగా పదేళ్ళు కూడా నిండని పూర్ణమ్మ అనే బాలికను ఆమె తల్లిదండ్రులు కన్యాశుల్కానికి ఆశపడి అరవైఏళ్ళు దాటిన ఒక వృధ్ధుడితో పెళ్ళిచేయ సంకల్పిస్తారు. ఆ పిల్ల ఆశలు, ఆశయాలు, కొరికలు ఏమిటో పెద్దలెవరికి పట్టవు. ఆనాడు ఆడదంటే అబల, ఓ కీలుబొమ్మ. ఆమెకు ఓ మనసుంటుందని , దానికి గౌరవం ఇవ్వాలనే భావనే లేని రోజులు. అలాటి పరిస్థితులలో, అభం శుభం తెలియని ఆ అమాయ బాలిక వివాహం జరిపిస్తారు . తర్వాత, భర్తతో అత్తింటికి వెళ్ళే సమయంలో పూర్ణమ్మ ఓ కొలనులో దూకి ఆత్మహత్య చేసుకొని తాను నమ్మిన దేవత దుర్గమ్మ లో ఐక్యమైపోతుంది. ఇది స్థూలంగా పూర్ణమ్మ కథ. ఈ కథను గురజాడ అప్పారావు గారు నడిపించిన తీరు కటిక పాషాణాలను కూడా కరిగిస్తుంది.
ఆ పూర్ణమ్మ కథే నేటి మన సజీవరాగం.
బుర్రకథ మన తెలుగువారి ప్రాచీన జానపద కళాప్రక్రియలలో ఒకటి. సినీమా, టి.వి. మాధ్యమాలు లేని రోజుల్లో హరికథ, రంగస్థలనాటకాలు, వీధిభాగవతాలతో సమానంగా బుర్రకథ కూడా బహుళ జనాదరణ పొందింది. కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞాన ప్రభావంతో అన్ని ప్రాచీన కళాప్రక్రియలలో లాగే బుర్రకధ కూడా క్షీణించింది. బొబ్బిలియుధ్ధం, పల్నాటి యుధ్ధం, అల్లూరి సీతారామరాజు, బాలనాగమ్మ వంటి వీర, కరుణ, శోక రసాత్మక గాధలెన్నో బుర్రకథలుగా ప్రచారమై ప్రజలలో ఉత్తేజాన్ని, నవచైతన్యాన్ని కలిగించాయి. బుర్రకథ పేరు చెప్పగానే వెంటనే మన స్ఫురణకు వచ్చే పేరు షేక్ నాజర్. గుంటూరు జిల్లాకు చెందినవారు. బుర్రకథా పితామహుడిగా కీర్తిపొందినవారు.
ఈ బుర్రకథా గానం పేరుకు ముగ్గురితో నిర్వహించినా ప్రధాన కథకుడిదే ముఖ్యపాత్ర. మిగిలిన ఇద్దరూ తందానా ... తాన తందనానా అని వంతపాడుతూ మధ్య మధ్య హాస్యాన్ని పంచుతూ, వర్తమాన విషయాలను ప్రస్తావిస్తూంటారు. అటువంటి ఈ బుర్రకధను మన తెలుగు సినిమాలు కూడా సందర్భోచితంగా ఉపయోగించుకున్నాయి.
అలాటివాటిలో ప్రధానంగా పేర్కొనదగ్గది 1955 లో వచ్చిన వినోదావారి కన్యాశుల్కం సినీమా. గురజాడ అప్పారావుగారి నాటకం ఆధారంగా ఓ మూడుగంటల కాలానికి అనువుగా మార్పులు, చేర్పులు చేసి తీసిన సినిమా. కన్యాశుల్కం నాటకం వేరు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ వేరు. ఈ రెంటిని సమన్వయపరుస్తూ సందర్భోచితంగా కన్యాశుల్కం సినీమా లో ఒక బుర్రకథ రూపంలో పూర్ణమ్మ కథను ప్రవేశపెట్టి నూతన ప్రయోగం చేసారు దర్శకుడు పి.పుల్లయ్య.
ఘంటసాలవారు ఈ సినీమాకు సంగీతదర్శకుడు, ఈ బుర్రకథ గాయకుడు కూడా. తెరమీద ప్రధాన కథకుడిగా నటించినవారు మోపర్రు దాసు. ఈయన ఆనాటి ప్రముఖ హరికథా కళాకారులలో ఒకరు. ఈ బుర్రకథలో మోపర్రు దాసు తో పాటు నేపథ్యంలో పూర్ణమ్మ కథ దృశ్య చిత్రీకరణ, అందులోని పాత్రధారులు సన్నివేశానికి కావలసిన పుష్టిని చేకూర్చారు. ఘంటసాల వారి నాద హృదయమే ఈ పూర్ణమ్మకు జీవం.
ఘంటసాల విజయనగర సంగీత సంపర్కం ఈ సినీమాకు ఎంతగానో ఉపయోగించింది. విజయనగరం, ఆ పరిసర ప్రాంతాలన్నీ వివిధ కళాప్రక్రియలకు కేంద్రాలు. ఆ కళా సంస్కృతినంతా క్షుణంగా ఆకళింపు చేసుకొని తనలో జీర్ణింపజేసుకున్న సంగీతజ్ఞుడు ఘంటసాలవారు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆ అనుభవమంతా కన్యాశుల్కం సినీమా సంగీతంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ సంగీత కళా ప్రక్రియైనా అది తన స్వంతం అనిపించేలా గానం చేయడం ఘంటసాల మాస్టారి ప్రతిభ , విశిష్టత. అసలు సిసలు బుర్రకధా కళాకారుడిగా పరకాయ ప్రవేశం చేసి ఘంటసాలవారు పూర్ణమ్మ కథను వినిపించారు. వారి హృదయంలోని కరుణ, శోక భావాలు ఈ బుర్రకథ రూపంలో ప్రస్ఫుటమై శ్రోతల హృదయాలు కరిగింపజేసి, కంటతడిపెట్టిస్తాయి. గాత్రంతో వారికి సహకారం అందించిన గాయనీ గాయకులు కూడా భావయుక్తంగా గానంచేసి రసోద్దీపన కలిగించారు. బుర్రకథ కళా స్వరూప సహజత్వాన్ని, గానంలో, వాద్యాలలో ప్రతిబింబించేలా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఘంటసాల మాస్టారు పూర్ణమ్మ కథకు తగు వరస సమకూర్చారు. ఇదొక రాగమాలికా గేయం. ఆనందభైరవి, శుభపంతువరాళి, సింధుభైరవి, కాపి, నవరోజ్, జంఝూటీ వంటి రాగాలను సమయస్ఫూర్తి తో ఉపయోగించి ఈ గీత వైశిష్ట్యాన్ని పెంచారు ఘంటసాల. ఇందులో జానపద వాద్యాలైన డప్పు, జముకు, డక్కి, మువ్వలు ను కూడా చక్కగా వినియోగించారు ఘంటసాల.
భావాన్ని అనుభవిస్తూ హృదయాంతరాళాలలోనుండి గానం చేసే ఏకైక గాయకుడు ఘంటసాల అనే విషయాన్ని ఈ పూర్ణమ్మ మరోసారి నిరూపిస్తుంది. ఈ గేయంలోని ఆర్ద్రతకు, కరుణకు కరగని తెలుగు హృదయమే వుండదు. అందుకే పుత్తడిబొమ్మ పూర్ణమ్మ మన మదిలో మెదిలే సజీవరాగం అయింది.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
రచన చాలా బాగుంది.
ReplyDeleteరెండు వందల సంవత్సరాల క్రితం నాటి సాంఘిక దూరాచారాల నేపథ్యంలో గురజాడవారి కరుణ రసాత్మక గేయ రచన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ను గురించి,
ReplyDeleteకన్యాశుల్కం చలనచిత్రం కోసం ఈ గేయాన్ని ఘంటసాలవారు కరుణ రసాత్మకంగా గానం చేసిన విధానాన్ని, ఉపయోగించిన రాగాలు, జానపద వాద్యాలను గురించి రచయిత హృద్యంగా వివరించారు. ధన్యవాదాలు.
ఇలాంటివి చరిత్రగా మిగిలిపోయినా, నేటి తరంవారికి రాబోయే తరంవారికీ అలనాటి ఆచారాలను తెలిసికోవడం ఎంతైనా అవశ్యం. ఎంత చక్కగా బుర్రకథగా చిత్రీకరించారో
ReplyDeleteమనస్సును కదిల్చివేసిన గళం, సంగీతం. 400 పేజీల కథను 4 నిమిషాల్లో పొందిచడం .. వాహ్వా… చిరస్మరణీయులు. స్వరాట్ గారికి ధనియవాదములు