Saturday 18 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఏడవ భాగం ఇక్కడ  

30వ సజీవరాగం - రసికరాజ తగువారము కామా
చిత్రం - జయభేరి
సంగీతం - పెండ్యాల

ముందుగా చిన్న ఆలాపన...
తర్వాత పాట పల్లవి -

రసికరాజ తగువారము కామా - 3

అగడు సేయ తగవా
ఏలు దొరవు అరమరికలు లేక 
ఏలవేల సరసాల సురసాల - ఏలు !! - 2
చరణం :

నిన్ను తలచి గుణగానము చేసి - 3
దివ్యనామ మధుపానము చేసీ !! నిన్ను!!

స్వరకల్పనలు - వివిధ స్థాయీ భేదంతో

నిన్ను దలచి గుణగానము చేసి
దివ్యనామ మధుపానము చేసి
సారసాక్ష మనసా వచసా
నీ సరస చేరగనే సదా వేదనా
ఏలు దొరవు అరమరికలు ఏల
ఏలవేల సరసాల సురసాల ఏలు దొరా......

గతవారం ఘంటసాలవారి సజీవరాగంగా 'దర్బారీకానడ' రాగంలో ' శివశంకరి శివానందలహరి' ని గుర్తు చేసుకున్నాం. ఈ వారం 'చక్రవాక, కానడ రాగాల మిశ్రమం అయిన "రసికరాజ తగువారము కామా" అనే ఆపాతమధురాన్ని మరోసారి ఆస్వాదిద్దాము.

శాస్త్రీయ సంగీత బాణీలో ఘంటసాల వారు అద్వితీయంగా ఆలపించి ఆ గీతానికి శాశ్వతత్వం కల్పించారు. నిజం చెప్పాలంటే 'శివశంకరి' పాటకు
ముందే ' రసికరాజ' తెలుగువారి హృదాయాలలో సుస్థిరపీఠం వేసుకు కూర్చుంది. అక్కినేని నాగేశ్వరరావుగారికి 'రసికరాజా', ఎన్.టి.రామారావుగారికి 'శివశంకరి' గీతాలను ఆలపించడం ద్వారా  ఘంటసాల ఆ ఇద్దరు మహా నటుల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసారు.

ఈనాటి సజీవరాగం 'జయభేరి'  సంగీత రసభరిత చిత్రంలోనిది. ఇటీవలే 'మదిశారదాదేవి' పాటను గురించి చెప్పుకున్నప్పుడు 'జయభేరి' సినిమా పూర్వాపరాలు ముచ్చటించడం జరిగింది.

శివశంకరి, రసికరాజ  -  ఈ రెండు పాటలకు  మూలాధార రాగం 'కానడ'
కర్నాటక సంగీత 'కానడ' రాగం నుండే హిందుస్తానీ 'దర్బారీకానడ' ఆవిర్భావం జరిగిందని చెపుతారు.

"రసికరాజ తగువారము కామా" పాటకు కథాపరంగా కవి మల్లాది రామకృష్ణశాస్త్రిగారు పెట్టిన పేరు 'విజయానందచంద్రిక'. ఈ
పాటలో చక్రవాక, కానడ రాగాలు రెండూ వున్నాయి. 
చక్రవాకం కర్నాటక సంగీతంలో 16 వ మేళకర్త రాగం. దీనికి దగ్గరలో వుండే హిందుస్థానీ రాగం అహిర్ భైరవ్. కానడ రాగం  20వ మేళకర్త రాగమైన నఠభైరవి జన్యం. 72 మేళకర్తల స్వరాల సమ్మేళనతో అనగా ఆయా స్వరాల permutations and combinations తో సుమారు ముప్ఫైవేల రాగాల రూపకల్పనకి సావకాశం ఉంది. అందులో నామకరణం జరిగిన 2044 రాగాల పేర్లు 1914 లో ముద్రితమైన 'సంగీతప్రస్తారసాగరం' అన్న గ్రంథంలో గ్రంథస్థమై ఉన్నాయి. అటువంటి గ్రంథాలలో మరికొన్ని రాగాల పేర్లు ఉండవచ్చు.   కానీ ఆ పేరు పెట్టబడిన రాగాలలో చక్రవాక-కానడ రాగస్వరమిశ్రమానికి ఏ పేరూ ఉన్నట్టు కనిపించదు. సంగీత గ్రంథాలలో నామకరణం జరగని ఆ స్వర మిశ్రమానికి  'విజయానందచంద్రిక' అన్న పేరు పెట్టిన సాహితీవేత్త మల్లాదివారి సంగీతజ్ఞానం ఈ పాట ద్వారా తెలుసుకోగలం. అంతేకాదు నేను ఓ కొత్త రాగం కనిపెట్టేను అని మల్లాదివారు జబ్బలు చఱచుకోలేదన్నదీ గమనించాల్సిన విషయమే. 

పెళ్ళిచేసి చూడు చిత్రం ద్వారా 'చక్రవాక' రాగాన్ని  తొలిసారిగా సినీ సంగీతలోకానికి పరిచయం చేసిన ఘనత ఘంటసాలవారిదే.

రసికరాజ, శివశంకరి పాటలకు సృష్టికర్త పెండ్యాలగారైతే, రసపుష్టికర్త శతాబ్ది గాయకుడు ఘంటసాలగారు. వీరిద్దరు ఈ రెండుపాటల ద్వారా తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసారు. ఈ రెండు పాటలు వెలువడి ఆరు దశాబ్దాలు దాటినా ఈ పాటలను తలచుకోని, మననం చేయని తెలుగువారు వుండరంటే అది అతిశయోక్తికానేకాదు. 

ఘంటసాలవారి పరిపూర్ణ సంగీత ప్రతిభ 'రసికరాజ' పాటలో దర్శనమిస్తుంది. 
ఒక గాయకుడికి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం, ప్రవేశం, అవగాహన ఎంత ముఖ్యమో ఈ రెండు పాటలు పాడేవారికి తెలుస్తుంది. సంగీతాభ్యాసం ప్రారంభదశలో గురువులు సంగీత విద్యార్ధుల చేత నిరంతరం అకార సాధన చేయిస్తారు. అందులో కఠోరసాధన చేసిన పరిపూర్ణత పొందగలిగినవారు మాత్రమే "రసికరాజ తగువారము కామా" వంటి పాటలు పాడడానికి సాహసం చేయగలుగుతారు. ఈ గీతంలో సాహిత్యం కంటే స్వరకల్పనలకే ప్రాధాన్యత నిచ్చారు. అవి సమస్థాయిలో, మంద్రస్థాయిలో ఒకేసారి సాగుతాయి.  ఇందుకు నాదశుధ్ధి ఎంతో అవసరం. సంప్రదాయబధ్ధంగా శాస్త్రీయ సంగీతంలో విశేష కృషి చేసినవారే ఈ తరహాపాటలను శ్రుతిశుధ్ధంగాఅత్యంత శ్రావ్యంగా అలపించగలుగుతారు. ఈ విషయంలో ఘంటసాలవారి ఆరేళ్ళ అసుర సాధన
తర్వాతి కాలంలో సినీమా రంగంలో ఆయనకు ఎంతగానో ఉపయోగించింది.

జయభేరి చిత్రంలో ' రసికరాజ తగువారము కామా' అంటూ మహారాజు సమక్షంలో ఒక సంగీత కళాకారుడు కచేరీ పధ్ధతిలో ఆలాపన మొదలెడతాడు. స్వరకర్త పెండ్యాల , గాయకుడు ఘంటసాల ఇద్దరకు ఇద్దరే. Perfection విషయంలో ఒకరికొకరు పోటీ. శాస్త్రీయ సంగీతకచేరీ బాణీ స్ఫురించేలా  పెండ్యాలగారు ఈ పాటలో వీణ, వైలిన్స్,  మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్  వంటి భారతీయ వాద్యాలనే ఉపయోగించి మెట్టు కట్టారు. కచేరీ పధ్ధతిలోలాగే వాద్యకారుల తనీ ఆవర్తనాలు ఈ గీతంలో వినిపిస్తాయి. చక్రవాక- కానడ రాగ లక్షణాలు,  రాగభావం, రసపోషణ ఘంటసాలవారి గాత్రంలో నూటికి నూరుపాళ్ళు గోచరిస్తాయి.

మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు వ్రాసిన 'రసికరాజ తగువారము కామా' పాట సాహిత్యపరంగా కూడా ' ఎంతో ఉన్నతమైనది.  

అగడు సేయు ( అవమానించు); సురసాల (కల్పతరువు);
ఏల, ఏలు మాటలతో వివిధార్ధాలు ధ్వనింపజేసారు; దివ్యనామ మధుపానము;
సారసాక్ష ( కమలాక్షుడు); మనసా, వచసా - వంటి పదప్రయోగాలతో మల్లాదివారు ఎంతటి ఉన్నతస్థాయి కవివరేణ్యుడో మనకు అవగతమవుతుంది.

మహారాజులు ఆగ్రహానుగ్రహ సమర్ధులు. రాజుల ఆదరణ పొందాలంటే వారిని రకరకాల స్తోత్రాలతో సంతృప్తిపరచి  ఆనందపర్చాలి. వారి మెప్పులు పొందాలి. 
అందుకు తగిన విధంగా గీతం ఆరంభంలోనే మహారాజుకు ప్రీతిపాత్రమైన చక్రవాక, కానడ రాగాలు మిళితంచేసి 'విజయానందచంద్రిక' పేరుతో మహారాజును, సభలోని పండితులను మెప్పింపజేయాలని ఆశిస్తున్నట్లు  జనపద కళాకారుడుగా పేరు పొందిన ఆ గాయకుడు ప్రకటించి తన దేవగానాన్ని ప్రభువుల ముందు వినిపిస్తాడు. అందుకు తగిన ఆణిముత్యాలవంటి మాటలను పొదిగారు మల్లాదివారు. 

ఎంతో ఉదాత్తము, గంభీరము అయిన ఆ సన్నివేశంలో మహారాజుగా ఎస్.వి.రంగారావు, ఆ జనపద గాయకుడంటే విముఖత కలిగిన రాజనర్తకిగా రాజసులోచన, వీరందరి మెప్పులు పొందడానికి పోటీ పరిక్షకు సిధ్ధపడిన గాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు అతని భార్యగా అంజలీ దేవి అద్యంతం
అద్భుతంగా నటించారు.

ముఖ్యంగా కథానాయకుడు అక్కినేనివారికి ఈ పాత్ర చాలా క్లిష్టతరమైన పాత్ర. మామూలు లలితగీతాలకు నటించడం వేరు, ఈలాటి శాస్త్రబధ్ధమైన గీతాలకు నటించడానికి సంగీత విద్వాంసుల ఆహార్యం, హావభావల పట్ల అవగాహన చాలా ముఖ్యం.

ఈ పాట సందర్భంలోని విషయాన్ని, పాటకి ముందు పాత్రల సంభాషణ చూస్తే ఈరోజు  అటువంటి సందర్భాన్ని, కథని ఊహించి అంతటి ఔచిత్యంతో సంభాషణలు రాయగలిగే రచయితలు, దాన్ని అంత అద్భుతంగానూ దృశ్యీకరించగల దర్శకులు, ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగల నటులూ లేరనే అనిపిస్తుంది.

ఘంటసాలవారి గానంలోని సంగతులు, గమకాలు, స్వరకల్పనలు వాటన్నికి తగినట్లు పెదవులను, కంఠనాళాలను కదల్చడం, అందుకు తగిన హావభావాలను తన ముఖంలో ప్రదర్శించడం విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు చూపిన టైమింగ్, ప్రతిభ అమోఘమైనది. కేవలం గాయక నటులు మాత్రమే అంత నిర్దుష్టంగా నటించగలుగుతారు. ఈ విషయంలో అక్కినేనిని మించిన నటులు బహు అరుదు.

చిత్ర జయాపజయాల విషయం పక్కనపెడితే పి.పుల్లయ్యగారి దర్శకత్వంలోని  'జయభేరి' ఒక గొప్ప సంగీత దృశ్యకావ్యం. తెలుగు సినిమా కీర్తి కిరీటంలో పొదగబడిన అమూల్య రత్నం.

ఒక కళాకారుడి ప్రతిభని అంచనావేసే విషయాలు ఆ కళాపరమైనవిగానే ఉండాలి తప్ప అతని కులం, మతం, ప్రాంతం, భాషా, వ్యక్తిగత అభిప్రాయాల ప్రాతిపదికనగాదు అన్నది సినిమాలో ఈ పాట సందర్భంలోని విషయం. కానీ ఈ సినిమా విడుదలైన అరవై అయిదేళ్ళ తరవాత కూడా కొందరి ఆలోచనాధోరణి అంతలోనే, ఆ గిరిలోనే  కొట్టుకుంటూండడం ఆశ్చర్యం. జయభేరి సినిమాలోని కాశీనాథశాస్త్రి  వ్యక్తిత్వం, ఈ సంవత్సరం మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వారి "సంగీత కళానిధి" పురస్కార వివాదంలోని కేంద్రబిందువు శ్రీ T M కృష్ణ వ్యక్తిత్వాలలోని సారూప్యం గమనించకుండా ఉండలేము. ఆ విషయం గ్రహించడానికే ఈ పాట సందర్భంలోని ముందు మాటలతో ఈరోజు వీడియో సమర్పిస్తున్నాను. 








వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్


Saturday 11 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 29వ భాగం - శివశంకరీ శివానందలహరి శివ శంకరి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఏడవ భాగం ఇక్కడ

29వ సజీవరాగం -   "శివశంకరీ శివానందలహరి శివశంకరి"
చిత్రం -  జగదేకవీరుని కథ
సంగీతం - పెండ్యాల


శివశంకరీ శివానందలహరి శివ శంకరి

చంద్రకళాధరి ఈశ్వరీ 
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ జూపవా
దీనపాలనము సేయవే
శివశంకరీ  శివానందలహరి
శివశంకరి...

ఈ పాటకు కవి పింగళి నాగేంద్రరావు గారు ఇచ్చిన మాటలు ఇంతే. మిగిలినదంతా సంగీతదర్శకుడు పెండ్యాల గారి స్వరమహత్యం, గాన గంధర్వుడు ఘంటసాలవారి త్రిస్థాయి గళ మాధుర్యమే.

గాయకుడిగా ఘంటసాలవారికి, నటుడిగా ఎన్.టి.రామారావుగారికి
శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టిన ఈ 'శివశంకరి' విజయావారి 'జగదేకవీరుని కథ'
సినీమాలోనిదన్న విషయం జగమెరిగిన విషయం.  నటుడు ఎన్.టి.రామారావుగారికి , గాయకుడు ఘంటసాలగారికి, గీత రచయిత పింగళి నాగేంద్రరావుగారికి విజయా ప్రొడక్షన్స్ మాతృస్థానం వంటిది.  అటువంటి సంస్థ తీసిన సినిమాలోని పాట అజరామరత్వం పొందడం ఓ గొప్ప విశేషం.

ఇప్పుడు శ్రీ పింగళి నాగేంద్రరావుగారు వ్రాసిన ఒక పల్లవి, ఒకటే చరణం కలిగిన
'శివశంకరీ శివానంద లహరి' పాటను గురించి, ఆ పాట నేపథ్యం గురించి చూద్దాము.

1944లో కోయంబత్తూర్ పక్షిరాజా స్టూడియోస్ అధినేత ఎస్.ఎమ్. శ్రీరాములు నాయుడు  'జగదల ప్రతాపన్' అనే జానపద చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఈయన సోదరుడు ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు ప్రముఖ సంగీత దర్శకుడు ('మురిపించే మువ్వలు', 'విమల') కానీ జగదల్ ప్రతాపన్ తమిళ చిత్రానికి జి. రామనాధయ్యర్ సంగీతం సమకూర్చారు.
స్వతహాగా గాయకుడు కూడా అయిన పి.యు.చిన్నప్ప ఆ సినీమా హీరో. ఆ సినీమాలో హీరో పాటలన్నీ తానే పాడుకున్నారు. ఈ సినీమా తర్వాత హీరో పి.యు.చిన్నప్పకు  ఆనాటి సూపర్ స్టార్ ఎమ్.కె.త్యాగరాజ భాగవతార్ తో సమానమైన కీర్తిప్రతిష్టలు లభించాయి.

ఆనాటికి ఇంకా డబ్బింగ్ సినీమా ప్రక్రియ రాలేదు. జగదల ప్రతాపన్ తమిళ చిత్రమే తెలుగునాట కూడా ప్రదర్శించబడి విపరీతమైన జనాదరణ పొందింది.

ఈ సినీమా  వచ్చిన 18 ఏళ్ళ తర్వాత ఈ కథ  ఆధారంగానే  నాగిరెడ్డి-చక్రపాణి ల విజయా బ్యానర్ మీద  శ్రీ కె.వి.రెడ్డి 'జగదేకవీరుని కథ' చిత్రం నిర్మించారు. కథ అంతా తమిళ సినీమా కధథే. అందులో కూడా నలుగురు హీరోయిన్లు. అగ్నికుమారిగా తమిళంలో ఎస్.వరలక్ష్మి నటించి తన పాటలు తానే పాడారు . తెలుగులో గాయని కాని నటి కమలకుమారి (జయంతి) ఆ వేషాన్ని పోషించారు. జీవరత్నం అనే మరో నటి మరో హీరోయిన్.

శివశంకరి పాట సన్నివేశంలో తమిళంలో ఒక 12 నిముషాల పాట. ఏకబిగిన పి.యు.చిన్నప్ప శుధ్ధ కర్ణాటిక్ పధ్ధతిలో పాడారు. కళ్యాణి రాగంలో జి.రమనాధన్ స్వరపర్చారు. ఈ పాటలో ఒకే ఫ్రేములో హీరో పి.యు.చిన్నప్ప వైలిన్, మృదంగం, ఘటం, కున్నక్కోల్ (దీనినే సొల్లుకట్టు అంటారు. అంటే నోటితోనే తాళగతులను చెప్పడం) వాయిస్తూ పాడతారు. (తెలుగులో సితార్ ,  తబలా, మృదంగం,  తంబురా పక్క వాయిద్యాలుగా వాడారు).

తమిళంలో యీ పాట నిడివి ఎక్కువైపోయిన కారణంగా గ్రామఫోన్ రికార్డ్ గా రాలేదట. అసలు యీ పాట నలభై నిముషాల పాట అని మరొక చోట చదివాను. పి.యు.చిన్నప్ప తన శాస్త్రీయ సంగీత కచేరీలలో పాడేవారట. 

ఈ పాట స్ధానంలోనే తెలుగులో జగదేకవీరుని కథలో ' శివశంకరీ శివానందలహరి అనే అజరామర గీతం దర్బారీకానడ రాగంలో మాస్టారి త్రిస్థాయి గళం నుండి జాలువారింది. ఈ పాటలోని స్వరకల్పనలు, సంగతులు, గమకాలు ఎంతటి మహాగాయకులకైనా పెను సవాలే. సరస్వతీ వరప్రసాది కావడం వలన ఘంటసాలవారు తప్ప మరొకరు ఈ పాటకు పరిపూర్ణ న్యాయం చేకూర్చలేరనే కీర్తి లభించింది.

పెండ్యాల నాగేశ్వరరావుగారు ఈ పాటను స్వరపర్చడానికి దర్బారీకానడ అనే హిందుస్తానీ రాగాన్ని తీసుకున్నారనే విషయం అందరికీ తెలిసినదే. దర్బారీకానడ అసావేరి థాట్ కు చెందిన రాగం.  ఈ రాగాన్ని మొదటిసారిగా అక్బర్ పాదుషా ఆస్థాన గాయకుడు మియా తాన్సేన్ గానం చేసి ప్రచారంలోనికి తీసుకువచ్చారు. వివిధ భావావేశాలు ప్రకటించడానికి, త్రిస్థాయిలలో గానం చేయడానికి అనువైన రాగంగా చెపుతారు.

శివశంకరి పాటలో ప్రధానంగా వినిపించే వాయిద్యాలు - సితార్, ఫ్లూట్, తబలా, పక్వాజ్, తంబురా, వైయొలిన్స్, మొదలైన భారతీయ సంగీతానికి అనువైన వాయిద్యాలనే ఉపయోగించారు పెండ్యాల.

ఘంటసాల మాస్టారి గాత్రధర్మం గురించిచెపుతూ ఈ చిత్ర సంగీత దర్శకుడు
పెండ్యాల నాగేశ్వరరావుగారు - "ఏ గాయకుడి గాత్రమైనా గొప్పది, లేదా ఆ గాయకుడు గొప్ప గాయకుడు అని చెప్పడానికి ఆ గాయకుని గాత్రం త్రిస్థాయిలలోనూ శ్రుతిశుధ్ధంగా పలకాలి. మంద్రస్థాయిలో పాడినా, మధ్యమ స్థాయిలో పాడినా, తారస్థాయిలో పాడినా సంపూర్ణమైన
ధ్వనితో, నాదాన్ని అనుభవిస్తూ పాడగలగాలి. అటువంటి సంగీత కళాకారుడు యావద్భారత దేశంలో ఒక్క ఘంటసాలగారేనేమో అని అనిపిస్తుంది నాకు".

శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని అనుసరించి , అనేక స్వరకల్పనలతోను , జతులతోనూ నిండిన పాటను తెరమీద అభినయించడం, సంగీత పరిజ్ఞానం లేని ఏ నటుడికైనా కత్తిమీద సామువంటిదే. మూడు స్థాయిలలో వచ్చే స్వరాలకు నిర్దిష్టంగా నటుడు తన పెదవులు కదుపుతూ, ఆ గీతాన్ని సహజంగా తానే పాడుతున్న భ్రమను శ్రోతలకు కల్పించి మెప్పించడంరామారావుగారి వంటి నటరత్నానికే సాధ్యపడుతుంది. ఆయన శివశంకరి పాటకు తన నటనతో పరిపూర్ణ న్యాయంచేకూర్చి  ఆ పాట శతాబ్దాలపాటు ప్రజల హృదయాలలో నిలిచిపోయేలా చేసారు.

ఒక్క కథ విషయంలో తప్ప తమిళానికి, తెలుగుకు ఏవిషయంలోనూ సాపత్యం లేదు. ముఖ్యంగా సంగీతం పూర్తిగా విజయా, కె.వి.గార్ల అభిరుచితోనే రూపొందించబడ్డాయి. ముందుగా పింగళిగారు వ్రాసి పెండ్యాలగారు స్వరపర్చిన  ఒక పాట దాదాపు 15 నిముషాలుందని, అంతసేపు  ఒక శాస్త్రీయ గీతాన్ని వినే ఓపిక మన తెలుగు ప్రేక్షకులకు లేదని కె.వి.రెడ్డిగారు భావించి దానిని ఆరు నిముషాలకు కుదించి ట్యూన్ కట్టమని ఆదేశించారట.
ఆ విధంగా ఆరు,  ఏడు నిముషాలకు కుదించబడిన గీతమే 'శివశంకరి'.
తెలుగునాట ఒక పెద్ద సంచలనాన్ని, చరిత్రను సృష్టించింది.

గత రెండున్నర దశాబ్దాలుగా శివశంకరి పాట మీద వచ్చినన్ని సమీక్షలు, ప్రముఖుల అభిప్రాయాలు , చర్చలు మరే యితర పాట మీదా జరగలేదంటే అతిశయోక్తి కాదు.

ఈ పాట విషయంలో తరుచూ చాలా మంది అడిగే ప్రశ్న - 
1. ఈ పాటను ఘంటసాలగారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు?
2. ఈ పాట ఒక్క టేక్ లోనే ఓకే అయిందా ? ఎన్ని టేకులులో పాట ఓకే అయింది.
3. ఈ పాటను ఘంటసాలవారు ఒక్కరే పాడారా లేక యితర గాయకులతో కలసి పాడారా ?
ఈ విధమైన సందేహాలను వెలిబుచ్చి రకరకాల అభిప్రాయాలు ప్రచారమయాయి.

ఈ పాట ట్యూన్ కట్టి, ప్రాక్టీస్ చేసి రికార్డింగ్ చేయడం, తర్వాత పాట షూట్ చేయడం వంటి ప్రక్రియలన్నీ మామూలుగానే అన్ని సినీమా పాటల్లాగే జరిగింది. కాకపోతే రాగప్రధానమై అనేక స్వరాలతో నిండిన పాట కనుక ఘంటసాలగారు  మిగిలిన పాటలకంటే కొంచెం ఎక్కువకాలం ప్రాక్టీసు చేసారు. స్టూడియోలో పాట రికార్డింగ్ అయి, షూటింగ్ ముగిసి,  ఆ పాట గ్రామఫోన్ రికార్డై వచ్చి, సినీమా విడుదలై హిట్ కావడం, పాటలన్నింటికన్నా మిన్నగా 'శివశంకరి' మరింత హిట్ కావడంతో  ఘంటసాలవారి ఖ్యాతి మరింత పెరిగింది.  సినీమా విడుదలకు ముందు ప్రివ్యూ చూసినవారంతా మాస్టారిని, పెండ్యాల వారిని అభినందించారు. అది అన్ని సినీమాల విషయంలో జరిగినట్లే జరిగింది. 

అక్కడితో సరి. అప్పట్లో ఎవరు పై ప్రశ్నలను, సంశయాలను వెలిబుచ్చగా విన్న, లేదా చదివిన గుర్తులేదు.

ఇటీవలి కాలంలో, అంటే సోషియల్ మీడియా పెరిగిన తర్వాత,  దాదాపు ఇరవై సంవత్సరాలుగా యీ పాట గురించి ఎవరికి తోచిన అభిప్రాయాలు, అతిశయోక్తులు  తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ పాటలో ఘంటసాల మాస్టారితో పాటు మరో యిద్దరు కూడా గళం కలిపి పాడినట్లు  కొంత ప్రచారం జరిగింది. కాని అది తప్పని  ఘంటసాల ఒక్కరే  మొత్తం పాడారని, ఆఖరిలో వచ్చిన ద్విగళాలు, ఆయన పాడగా మరో ట్రాక్ మీద రికార్డ్ చేసి మిక్స్ చేసామని ఆ పాట రికార్డ్ చేసిన వాహినీ స్టూడియో సౌండ్ ఇంజనీరు  వల్లభజోస్యుల శివరాంగారు  ఒక ఇంటర్వ్యూలో చెప్పేరు.

గానగంధర్వుడు ఘంటసాల, ఆయన ఆప్తమిత్రుడు నటరత్న ఎన్.టి.రామారావుగార్ల శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో  వారిద్దరి సమ్మేళనంలో రూపొందిన 'శివశంకరి శివానందలహరి ' నిజంగా సజీవరాగమే.

ఇది తెలుగు భాష ఉన్నంతవరకూ చిరస్మరణీయంగా, చిరంజీవిగా మిగిలిపోయే పాట అనేది అక్షరసత్యం.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 4 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 28వ భాగం - నా హృదయంలో నిదురించే చెలీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఏడవ భాగం ఇక్కడ

28వ సజీవరాగం -   

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోన కవ్వించే సఖీ మయూరివై
వయారివై నేడే నటనమాడి నీవే నన్ను
దోచినావే - నా హృదయంలో !!

నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానే - నా హృదయంలో !!

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే 
పల్లవిగా పలుకరించ రావే, నీ వెచ్చని నీడా వెలసెను నా
వలపుల మేడా నివాళితో చేయిచాచి
ఎదురు చూచినానే నిదుర కాచినానే
- నా హృదయంలో నిదురించే చెలీ...!!
                
శంకరాభరణం చాలా విశిష్టత కలిగిన రాగం. 29 వ మేళకర్త ధీరశంకరాభరణం జన్యం. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతున్నందువలన ఇది సంపూర్ణ రాగంగా పరిగణించబడుతున్నది. గమక ప్రాధాన్యత గల రాగం. ఈ ధీరశంకరాభరణం రాగానికి ప్రసిధ్ధి పొందిన అనేక జన్యరాగాలు వున్నాయి. బిలహరి, దేవగాంధారి, ఆరభి, అఠాణా, కురింజి, కదనకుతూహలం, శుధ్ధ సావేరి, కేదారం, ఇలా ఎన్నోరాగాలు ధీరశంకరాభరణ  జన్యాలే. ఈ రాగాలన్నింటిలో బహుళ జనాదరణ పొందిన  సినిమా పాటలు అసంఖ్యాకంగా వున్నాయి. శంకరాభరణం రాగాన్ని హిందుస్తానీ సంగీతశైలిలో బిలావల్ అంటారు. (కానీ  స్వరాల మూర్చన  బిలహరికి దగ్గరగా వుంటుందని అంటారు). ఈ  శంకరాభరణం రాగం మన భారతీయ సంగీతంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల సంగీతంలో కూడా వినిపిస్తుంది. వెస్టర్న్ మ్యూజిక్ సిస్టమ్ లో శంకరాభరణాన్ని లోనియన్ మోడ్ లేదా మేజర్ స్కేల్ అంటారు. శ్రావ్యమైన, మృదుమధుర భావాలను వెల్లడించడానికి శంకరాభరణం రాగం చాలా అనువైన రాగంగా సంగీతజ్ఞులు భావిస్తారు.

ఈ శంకరాభరణ రాగ స్వరాలతో వచ్చిన పాటలెన్నింటినో అమరగాయకుడు ఘంటసాలవారు ఆలపించి వాటికి అజరామరత్వం కల్పించారు. సీతారామ కళ్యాణంలో  రామారావు గారికి పాడిన "కానరార కైలాసనివాస", భార్యాభర్తలులో అక్కినేని వారికి పాడిన "జోరుగా హుషారు షికారు పోదమా", శాంతినివాసం లోని "కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే", అభిమానం సినిమాలోని "లపు తేనె పాట"(అన్య స్వరాలతో)... చెప్పుకుంటూపోతే  ఇలాఎన్నో మనోరంజకమైన పాటలున్నాయి.

ఆ కోవలోకి చెందినదే నేటి మన ఘంటసాల మాస్టారి సజీవరాగం
"నా హృదయంలో నిదురించే చెలీ"
శంకరాభరణం రాగంలో స్వరపర్చబడింది.

ఈ పాట అక్కినేని, సావిత్రి , రాజశ్రీ, గిరిజ, జగ్గయ్య, రేలంగి మొదలగువారు నటించిన 1962లో విడుదలైన "ఆరాధన" సినీమాలోనిది. ఇదొక ట్రైయాంగిల్ లౌవ్ స్టోరీ. 

జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద విబి రాజేంద్రప్రసాద్ నిర్మించిన రెండవ సినీమా " ఆరాధన". అమోఘమైన విజయం సాధించింది. అందుకు కారణం ఈ సినీమా సంగీతం , ముఖ్యంగా, "నా హృదయంలో నిదురించే చెలీ" పాట.

ఈ సినీమాకు సంగీతదర్శకుడు సుస్వరాల రసాలూరు రాజేశ్వరరావుగారు. వివిధ వాద్యాలు వాయించడంలో, విభిన్న సంగీత బాణీలు సృష్టించడంలో నిష్ణాతుడు.

"నా హృదయంలో నిదురించ చెలీ" పాటను శ్రీ శ్రీ వ్రాసారు. "మనసు కవి" కితాబును మనవాళ్ళు ఆత్రేయగారికి ఇచ్చారు కానీ అలాటి హృద్యమైన , మనసులో చిరస్థాయిగా నిలచిపోయే పాటలెన్నింటినో శ్రీశ్రీ గారు వ్రాసారు.

ఈ ఆరాధన చిత్రానికి  మాతృక 'సాగరిక' అనే  బెంగాలీ సినీమా, 1956లో వచ్చింది. ఉత్తమ్ కుమార్, సుచిత్రాసేన్ ప్రధాన పాత్రలు ధరించారు. రాబిన్ ఛటర్జీ సంగీతంలో శ్యామల్ మిత్ర అనే గాయకుడు పాడిన పాట వరసనే  తెలుగులో "నా హృదయంలో నిదురించే చెలి " గా మలిచారు రాజేశ్వరరావు గారు.

పాట మూలం బెంగాలీయే అయినా దానికి పూర్తి తెలుగుదనాన్ని ఆపాదించినవారు మాత్రం సాలూరు రాజేశ్వరరావుగారు, ఘంటసాలగారు మాత్రమే. గమకప్రాధాన్యంగల సుశాస్త్రీయ శంకరాభరణ రాగాన్ని లలితమైన గమకాలతో అత్యంత శ్రావ్యంగా, మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ అమోఘంగా గానం చేసారు ఘంటసాల.

మన పాత సినిమాలలో హీరో, హీరోయిన్లు లేదా వ్యాంప్ పాత్రధారులు చేత పియోనా వాయిస్తూ పాటలు పాడించడమనేది అనవాయితీగా వచ్చిన బాక్సాఫీస్ ఫార్ములా.  రాజేశ్వరరావుగారు చాలా బాగా పియోనా వాయిస్తారు. కానీ, తన సినిమా లలో పియోనా పాటలన్నీ తన పెద్ద కుమారుడు రామలింగేశ్వరావు చేతే వాయింపజేసేవారు. ఈ పాట చిత్రీకరణ లో పియోనా వాయిస్తూ  క్లోజప్ లో కనిపించే చేతులు రామలింగంవే అని చెప్పుకోవడం నేను విన్నాను.

పియోనా, ఫ్లూట్, తబలా ప్రధానంగా సాగే ఈ పాటలో ఘంటసాలవారి కంఠస్వరం  ప్రతీ నోట్ ను చాలా ఖణీగా, సుస్పష్టంగా శ్రోతల హృదయాలను తాకేలా పలికింది.

ఈ సినీమా లో ఏడు పాటలుండగా హీరో అక్కినేనికి ఒకే ఒక్క పాట ఈ సూపర్ హిట్ సాంగ్. మాస్టారు పాడారు. ఆనాటి సినీమాలలో హీరోల కంటే రేలంగికే ఎక్కువ పాటలుండేవి. ఆరాధనలో  రేలంగికి ఉన్న రెండు డ్యూయెట్ లను ఘంటసాల మాస్టారే పాడారు. ఆ పాటలలో ఘంటసాలవారి గాత్ర వైవిధ్యం విన్నవారికే ఎరుక.

అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు బెంగాలీ సాగరికలోని పాటకన్నా అరాధన చిత్రంలోని "నా హృదయంలో నిదురించే చెలీ" పాటే మిన్నగా భావిస్తాను. అందువల్లే ఈ పాట గత అరవై సంవత్సరాలుగా తెలుగు హృదయాలను దోచుకుంటూనే వుంది, గాయకులందరి నోటా వినవస్తూనే వుంది.

ఈ శీర్షిక విషయంగా చిన్న మాట.
ఘంటసాల పాట మీద ఉన్న ఆరాధనతో ఈ 'సజీవరాగం' సమీక్ష మొదలుపెట్టానే కానీ, ఆ యా పాటలలో గల సంగీత సాహిత్య వైశిష్ట్యాన్ని సోదోహరణంగా చెప్పడానికి  నాకు భాషలోగానీ, సంగీతంలో గానీ ఏమాత్రం ప్రవేశం లేదు. అందుచేత నా యీ వ్యాసాలు vague గా , shallow గా వుండే అవకాశం వుంది. 
అందరూ సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తాను.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...