చిత్రం - జగదేకవీరుని కథ
సంగీతం - పెండ్యాల
శివశంకరీ శివానందలహరి శివ శంకరి
చంద్రకళాధరి ఈశ్వరీ
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ జూపవా
దీనపాలనము సేయవే
శివశంకరీ శివానందలహరి
శివశంకరి...
ఈ పాటకు కవి పింగళి నాగేంద్రరావు గారు ఇచ్చిన మాటలు ఇంతే. మిగిలినదంతా సంగీతదర్శకుడు పెండ్యాల గారి స్వరమహత్యం, గాన గంధర్వుడు ఘంటసాలవారి త్రిస్థాయి గళ మాధుర్యమే.
గాయకుడిగా ఘంటసాలవారికి, నటుడిగా ఎన్.టి.రామారావుగారికి
శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టిన ఈ 'శివశంకరి' విజయావారి 'జగదేకవీరుని కథ'
సినీమాలోనిదన్న విషయం జగమెరిగిన విషయం. నటుడు ఎన్.టి.రామారావుగారికి , గాయకుడు ఘంటసాలగారికి, గీత రచయిత పింగళి నాగేంద్రరావుగారికి విజయా ప్రొడక్షన్స్ మాతృస్థానం వంటిది. అటువంటి సంస్థ తీసిన సినిమాలోని పాట అజరామరత్వం పొందడం ఓ గొప్ప విశేషం.
ఇప్పుడు శ్రీ పింగళి నాగేంద్రరావుగారు వ్రాసిన ఒక పల్లవి, ఒకటే చరణం కలిగిన
'శివశంకరీ శివానంద లహరి' పాటను గురించి, ఆ పాట నేపథ్యం గురించి చూద్దాము.
1944లో కోయంబత్తూర్ పక్షిరాజా స్టూడియోస్ అధినేత ఎస్.ఎమ్. శ్రీరాములు నాయుడు 'జగదల ప్రతాపన్' అనే జానపద చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఈయన సోదరుడు ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు ప్రముఖ సంగీత దర్శకుడు ('మురిపించే మువ్వలు', 'విమల') కానీ జగదల్ ప్రతాపన్ తమిళ చిత్రానికి జి. రామనాధయ్యర్ సంగీతం సమకూర్చారు.
స్వతహాగా గాయకుడు కూడా అయిన పి.యు.చిన్నప్ప ఆ సినీమా హీరో. ఆ సినీమాలో హీరో పాటలన్నీ తానే పాడుకున్నారు. ఈ సినీమా తర్వాత హీరో పి.యు.చిన్నప్పకు ఆనాటి సూపర్ స్టార్ ఎమ్.కె.త్యాగరాజ భాగవతార్ తో సమానమైన కీర్తిప్రతిష్టలు లభించాయి.
ఆనాటికి ఇంకా డబ్బింగ్ సినీమా ప్రక్రియ రాలేదు. జగదల ప్రతాపన్ తమిళ చిత్రమే తెలుగునాట కూడా ప్రదర్శించబడి విపరీతమైన జనాదరణ పొందింది.
ఈ సినీమా వచ్చిన 18 ఏళ్ళ తర్వాత ఈ కథ ఆధారంగానే నాగిరెడ్డి-చక్రపాణి ల విజయా బ్యానర్ మీద శ్రీ కె.వి.రెడ్డి 'జగదేకవీరుని కథ' చిత్రం నిర్మించారు. కథ అంతా తమిళ సినీమా కధథే. అందులో కూడా నలుగురు హీరోయిన్లు. అగ్నికుమారిగా తమిళంలో ఎస్.వరలక్ష్మి నటించి తన పాటలు తానే పాడారు . తెలుగులో గాయని కాని నటి కమలకుమారి (జయంతి) ఆ వేషాన్ని పోషించారు. జీవరత్నం అనే మరో నటి మరో హీరోయిన్.
శివశంకరి పాట సన్నివేశంలో తమిళంలో ఒక 12 నిముషాల పాట. ఏకబిగిన పి.యు.చిన్నప్ప శుధ్ధ కర్ణాటిక్ పధ్ధతిలో పాడారు. కళ్యాణి రాగంలో జి.రమనాధన్ స్వరపర్చారు. ఈ పాటలో ఒకే ఫ్రేములో హీరో పి.యు.చిన్నప్ప వైలిన్, మృదంగం, ఘటం, కున్నక్కోల్ (దీనినే సొల్లుకట్టు అంటారు. అంటే నోటితోనే తాళగతులను చెప్పడం) వాయిస్తూ పాడతారు. (తెలుగులో సితార్ , తబలా, మృదంగం, తంబురా పక్క వాయిద్యాలుగా వాడారు).
తమిళంలో యీ పాట నిడివి ఎక్కువైపోయిన కారణంగా గ్రామఫోన్ రికార్డ్ గా రాలేదట. అసలు యీ పాట నలభై నిముషాల పాట అని మరొక చోట చదివాను. పి.యు.చిన్నప్ప తన శాస్త్రీయ సంగీత కచేరీలలో పాడేవారట.
ఈ పాట స్ధానంలోనే తెలుగులో జగదేకవీరుని కథలో ' శివశంకరీ శివానందలహరి అనే అజరామర గీతం దర్బారీకానడ రాగంలో మాస్టారి త్రిస్థాయి గళం నుండి జాలువారింది. ఈ పాటలోని స్వరకల్పనలు, సంగతులు, గమకాలు ఎంతటి మహాగాయకులకైనా పెను సవాలే. సరస్వతీ వరప్రసాది కావడం వలన ఘంటసాలవారు తప్ప మరొకరు ఈ పాటకు పరిపూర్ణ న్యాయం చేకూర్చలేరనే కీర్తి లభించింది.
పెండ్యాల నాగేశ్వరరావుగారు ఈ పాటను స్వరపర్చడానికి దర్బారీకానడ అనే హిందుస్తానీ రాగాన్ని తీసుకున్నారనే విషయం అందరికీ తెలిసినదే. దర్బారీకానడ అసావేరి థాట్ కు చెందిన రాగం. ఈ రాగాన్ని మొదటిసారిగా అక్బర్ పాదుషా ఆస్థాన గాయకుడు మియా తాన్సేన్ గానం చేసి ప్రచారంలోనికి తీసుకువచ్చారు. వివిధ భావావేశాలు ప్రకటించడానికి, త్రిస్థాయిలలో గానం చేయడానికి అనువైన రాగంగా చెపుతారు.
శివశంకరి పాటలో ప్రధానంగా వినిపించే వాయిద్యాలు - సితార్, ఫ్లూట్, తబలా, పక్వాజ్, తంబురా, వైయొలిన్స్, మొదలైన భారతీయ సంగీతానికి అనువైన వాయిద్యాలనే ఉపయోగించారు పెండ్యాల.
ఘంటసాల మాస్టారి గాత్రధర్మం గురించిచెపుతూ ఈ చిత్ర సంగీత దర్శకుడు
పెండ్యాల నాగేశ్వరరావుగారు - "ఏ గాయకుడి గాత్రమైనా గొప్పది, లేదా ఆ గాయకుడు గొప్ప గాయకుడు అని చెప్పడానికి ఆ గాయకుని గాత్రం త్రిస్థాయిలలోనూ శ్రుతిశుధ్ధంగా పలకాలి. మంద్రస్థాయిలో పాడినా, మధ్యమ స్థాయిలో పాడినా, తారస్థాయిలో పాడినా సంపూర్ణమైన
ధ్వనితో, నాదాన్ని అనుభవిస్తూ పాడగలగాలి. అటువంటి సంగీత కళాకారుడు యావద్భారత దేశంలో ఒక్క ఘంటసాలగారేనేమో అని అనిపిస్తుంది నాకు".
శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని అనుసరించి , అనేక స్వరకల్పనలతోను , జతులతోనూ నిండిన పాటను తెరమీద అభినయించడం, సంగీత పరిజ్ఞానం లేని ఏ నటుడికైనా కత్తిమీద సామువంటిదే. మూడు స్థాయిలలో వచ్చే స్వరాలకు నిర్దిష్టంగా నటుడు తన పెదవులు కదుపుతూ, ఆ గీతాన్ని సహజంగా తానే పాడుతున్న భ్రమను శ్రోతలకు కల్పించి మెప్పించడంరామారావుగారి వంటి నటరత్నానికే సాధ్యపడుతుంది. ఆయన శివశంకరి పాటకు తన నటనతో పరిపూర్ణ న్యాయంచేకూర్చి ఆ పాట శతాబ్దాలపాటు ప్రజల హృదయాలలో నిలిచిపోయేలా చేసారు.
ఒక్క కథ విషయంలో తప్ప తమిళానికి, తెలుగుకు ఏవిషయంలోనూ సాపత్యం లేదు. ముఖ్యంగా సంగీతం పూర్తిగా విజయా, కె.వి.గార్ల అభిరుచితోనే రూపొందించబడ్డాయి. ముందుగా పింగళిగారు వ్రాసి పెండ్యాలగారు స్వరపర్చిన ఒక పాట దాదాపు 15 నిముషాలుందని, అంతసేపు ఒక శాస్త్రీయ గీతాన్ని వినే ఓపిక మన తెలుగు ప్రేక్షకులకు లేదని కె.వి.రెడ్డిగారు భావించి దానిని ఆరు నిముషాలకు కుదించి ట్యూన్ కట్టమని ఆదేశించారట.
ఆ విధంగా ఆరు, ఏడు నిముషాలకు కుదించబడిన గీతమే 'శివశంకరి'.
తెలుగునాట ఒక పెద్ద సంచలనాన్ని, చరిత్రను సృష్టించింది.
గత రెండున్నర దశాబ్దాలుగా శివశంకరి పాట మీద వచ్చినన్ని సమీక్షలు, ప్రముఖుల అభిప్రాయాలు , చర్చలు మరే యితర పాట మీదా జరగలేదంటే అతిశయోక్తి కాదు.
ఈ పాట విషయంలో తరుచూ చాలా మంది అడిగే ప్రశ్న -
1. ఈ పాటను ఘంటసాలగారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు?
2. ఈ పాట ఒక్క టేక్ లోనే ఓకే అయిందా ? ఎన్ని టేకులులో పాట ఓకే అయింది.
3. ఈ పాటను ఘంటసాలవారు ఒక్కరే పాడారా లేక యితర గాయకులతో కలసి పాడారా ?
ఈ విధమైన సందేహాలను వెలిబుచ్చి రకరకాల అభిప్రాయాలు ప్రచారమయాయి.
ఈ పాట ట్యూన్ కట్టి, ప్రాక్టీస్ చేసి రికార్డింగ్ చేయడం, తర్వాత పాట షూట్ చేయడం వంటి ప్రక్రియలన్నీ మామూలుగానే అన్ని సినీమా పాటల్లాగే జరిగింది. కాకపోతే రాగప్రధానమై అనేక స్వరాలతో నిండిన పాట కనుక ఘంటసాలగారు మిగిలిన పాటలకంటే కొంచెం ఎక్కువకాలం ప్రాక్టీసు చేసారు. స్టూడియోలో పాట రికార్డింగ్ అయి, షూటింగ్ ముగిసి, ఆ పాట గ్రామఫోన్ రికార్డై వచ్చి, సినీమా విడుదలై హిట్ కావడం, పాటలన్నింటికన్నా మిన్నగా 'శివశంకరి' మరింత హిట్ కావడంతో ఘంటసాలవారి ఖ్యాతి మరింత పెరిగింది. సినీమా విడుదలకు ముందు ప్రివ్యూ చూసినవారంతా మాస్టారిని, పెండ్యాల వారిని అభినందించారు. అది అన్ని సినీమాల విషయంలో జరిగినట్లే జరిగింది.
అక్కడితో సరి. అప్పట్లో ఎవరు పై ప్రశ్నలను, సంశయాలను వెలిబుచ్చగా విన్న, లేదా చదివిన గుర్తులేదు.
ఇటీవలి కాలంలో, అంటే సోషియల్ మీడియా పెరిగిన తర్వాత, దాదాపు ఇరవై సంవత్సరాలుగా యీ పాట గురించి ఎవరికి తోచిన అభిప్రాయాలు, అతిశయోక్తులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ పాటలో ఘంటసాల మాస్టారితో పాటు మరో యిద్దరు కూడా గళం కలిపి పాడినట్లు కొంత ప్రచారం జరిగింది. కాని అది తప్పని ఘంటసాల ఒక్కరే మొత్తం పాడారని, ఆఖరిలో వచ్చిన ద్విగళాలు, ఆయన పాడగా మరో ట్రాక్ మీద రికార్డ్ చేసి మిక్స్ చేసామని ఆ పాట రికార్డ్ చేసిన వాహినీ స్టూడియో సౌండ్ ఇంజనీరు వల్లభజోస్యుల శివరాంగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పేరు.
గానగంధర్వుడు ఘంటసాల, ఆయన ఆప్తమిత్రుడు నటరత్న ఎన్.టి.రామారావుగార్ల శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో వారిద్దరి సమ్మేళనంలో రూపొందిన 'శివశంకరి శివానందలహరి ' నిజంగా సజీవరాగమే.
ఇది తెలుగు భాష ఉన్నంతవరకూ చిరస్మరణీయంగా, చిరంజీవిగా మిగిలిపోయే పాట అనేది అక్షరసత్యం.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
excellent sir.(psn murty)
ReplyDelete