చిత్రం - మంచిరోజులు వచ్చాయి
గానం - ఘంటసాల
రచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం - తాతినేని చలపతిరావు
నేలతో నీడ అన్నది
నను తాకరాదని
పగటితో రేయి అన్నది
నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని
గడ్డిపరక అన్నది
నేడు భర్తనే
తాకరాదనీ ... హాహాహా...ఒక భార్య అన్నది
వేలి కొసలు
తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే
నల్లమబ్బు కురిసేనా
తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే నీవు లేవు, నేను లేను ---
నీవు లేవు నేను లేను లోకమే లేదులే
!నేలతో నీడ అన్నది!
చరణం 2:
రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు
కలవనిదే మమత లేదు, మనిషి లేడు
మమత లేదు,మనిషి లేడు మనుగడయే లేదులే
!నేలతో నీడ అన్నది!అంటరానితనము,ఒంటరితనము
అనాదిగా మీ జాతికి
మూలధనము
ఇక సమభావం,సమధర్మం
సమజీవనమనివార్యం
తెలుసుకొనుట మీ
ధర్మం
తెలియకుంటె మీ ఖర్మం
!నేలతో నీడ అన్నది!"చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం".... అని ఆనాడెప్పుడో కొసరాజుగారు అంటే సమభావం, సమధర్మం సమజీవనమనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం తెలియకుంటే మీ ఖర్మం..." అని ఇక్కడ నిరాశానిస్పృహలతో కృంగిపోతున్న కథానాయకుడి కోసం దేవులపల్లివారంటున్నారు. మంచి సంగీతపు మెట్టుల వల్ల కొన్ని పాటలు మనసులను ఆకర్షించి జనబాహుళ్యంలో నిలిచిపోతే మరికొన్ని పాటలు సంగీతబలం లేకున్నా గీత రచయిత పాండితీప్రకర్ష వలన బహుళ జనాదరణ పొందాయి. ఆ కోవలోనికి చెందినదే ... 'నేలతో నీడ అన్నది నను తాకరాదని'
అనే 'మంచిరోజులు వచ్చాయి' చిత్రంలోని ఘంటసాలవారి ఏకగళ గీతం. అదే నేటి మన సజీవరాగం.
సంగీతపరంగా ఈ పాటలో మనలను కట్టిపడవేసే అద్భుతమైన సంగీతం ఏదీ వినపడదు. ఈ రకమైన వరసలు అనేకం గతంలో వినివున్నాము. ఉన్నంతలో శ్రోతలంతా సులభంగా పాడుకునే రీతిలోనే పాట వరసను మలచారు సంగీతదర్శకుడు తాతినేని చలపతిరావు గారు. అయితే, ఈ పాటలోని ప్రధానాకర్షణ అంతా కృష్ణశాస్త్రిగారి కవితాశైలి వల్లనే. ఈ పాట ఆయన కాకుండా వేరెవరైనా వ్రాసివుంటే ఈనాడు మనం ఇలా తలచుకొని వుండేవారము కాదేమో!
చరణంలో ఒక దగ్గరంటారు ... 'అంటరానితనము, ఒంటరితనము అనాదిగా మీ జాతికి మూలధనము' అని. ఈ వాక్యంలో మూడు రకాల భావాలు స్ఫురిస్తాయి. ఒకటి ఒకప్పుడు అస్పృశ్యులుగా సమాజంలో నిరాదరణ పొందిన ఒక వర్గాన్ని సూచిస్తుంది. అయితే సన్నివేశపరంగా ఆ వర్గానికి చెందదు. ద్వేషం, కసి కారణాలతో భర్తను ఉదాసినపరుస్తున్న ఒక యువతిని ఉద్దేశిస్తూ పాడుతున్న పాట కావడం వలన ఈ వాక్యం స్త్రీ జాతికి అన్వయించవచ్చును. అలాగే, ధనమదంతో దుర్మార్గంగా పేద ప్రజలను హింసించే ధనికజాతిని కూడా ఉద్దేశించి ప్రయోగించిన వాక్యంగా కూడా భావించవచ్చును. ధనవంతులు, పేదలు అనే తారతమ్యం ఈ కథలోని నాయికా నాయకులను విడదీసింది. అనివార్య కారణాల వలన ధనిక వర్గానికి చెందిన నాయికకు, ఒక పేదవానితో ఇష్టంలేని బలవంతపు వివాహం జరుగుతుంది. మొదటినుండి అతనంటే తీవ్రంగా అసహ్యించుకునే ఆ నాయిక భర్త తనను తాకరాదని శాసిస్తుంది. భార్య విముఖతకు, అహంకారపూరిత ప్రవర్తనకు విసుగెత్తిన ఆ భర్త నిరాశా నిస్పృహలతో ఈ పాటను పాడతాడు. ఈ పాటలో భావోద్వేగాలు తప్ప వీనులవిందైన సంగీతానికి చోటులేదు. అయితే ఘంటసాల మాస్టారి గళంలో కృష్ణశాస్త్రి గారి మనో భావాలన్ని సుస్పష్టంగా ప్రతిధ్వనించి ఈ పాటను అజరామరం చేశాయి. ఈ పాటలో దేవులపల్లివారు చూపించిన ఉదాహరణలు వారి విశిష్ట కవితా శైలికి దర్పణం పడతాయి. ఈతెరపై ఈ పాటను పాడేది అక్కినేనివారు కావడంతో నేపథ్యంలో ఈ పాటను పాడడానికి ఘంటసాల మాస్టారే తప్పనిసరి. ఈ మాటను ప్రయోగించడానికి ఒక చిన్న కారణం వుంది.
'మంచిరోజులు వచ్చాయి' చిత్రాన్ని తమిళ నిర్మాతలైన జెమినీ స్టూడియో నిర్మించింది. దక్షిణాదిన ప్రతిష్టాత్మక చలనచిత్ర సంస్థగా పేరుపొందిన జెమినీవారు 1940ల నుండి వివిధ భాషలలో శతాధికంగా చిత్రాలు నిర్మించారు. వాటిల్లో కొన్ని తెలుగు వున్నాయి. అయితే అక్కినేని నాగేశ్వరరావు అంతవరకూ ఏ ఒక్క సినిమాలోను ఆ సంస్థకు పనిచేయలేదు. అలాగే ఘంటసాల మాస్టారు కూడా జెమినీ తీసిన ఒక్క'మనుషులు మారాలి' సినిమా లో మాత్రమే ఓ రెండు పాటలు పాడారు. అలాంటి జెమినీ వారు ఎస్.ఎస్.బాలన్ (ఎస్.ఎస్. వాసన్ కుమారుడు) నిర్మాతగా మొదటిసారిగా అక్కినేని హీరోగా, వి.మధుసూదనరావు దర్శకత్వంలో ఒక తెలుగు సినిమా తీయ సంకల్పించారు. ఆ సందర్భంగా నాగేశ్వరరావుగారు మాస్టారితో మాట్లాడుతూ "జెమినిలో ఫస్ట్ టైమ్ పనిచేస్తున్నాను. నా పాటలన్నీ మీరే పాడాలని చెప్పాను. వారు అడిగితే కాదనకండి, ఇది మనకో ప్రిస్టేజ్ పిక్చర్" అని చెప్పారట. "మంచిరోజులు వచ్చాయి" సినిమాలో ఘంటసాల మాస్టారు మూడు సోలోలు, మూడు డ్యూయెట్లు మొత్తం ఆరు పాటలు పాడారు. వాటన్నిటిలో కృష్ణశాస్త్రిగారు వ్రాసి, ఘంటసాలగారు అద్భుతంగా ఆలపించిన 'నేలతో నీడ అన్నది నను తాకరాదని' పాటే తలమానికంగా భాసిల్లింది. ఈ సినిమా అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని అక్కినేని, ఘంటసాలగార్ల పేరు నిలబెట్టింది.
అయితే ఈ పాటకు, సినిమాకు మూలం లేకపోలేదు, ఆ విషయమూ చెప్పుకోవాలి. సుప్రసిధ్ధ తమిళ నటుడు 'నడిగర్ తిలకం' శివాజీ గణేశన్ 150 వ చిత్రంగా 1971 లో 'సవాలే సమాళి' అనే తమిళ చిత్రం వచ్చింది.
జయలలిత హీరోయిన్. ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం. అందులో కన్నదాసన్ వ్రాసిన 'నిలవై పార్త్ వానమ్ సొన్నదు ఎన్నై తొడాదే' అనే పాటలోని మూలభావమే తెలుగులోని ' నేలతో నీడ అన్నది...' పాటలో కూడా ధ్వనిస్తుంది. కన్నదాసన్, కృష్ణశాస్త్రి ఇద్దరూ కవికుల తిలకాలే. ఎవరి శైలి వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే. ఈ సినిమా కథలోని విశేషమేమిటో గానీ తమిళ మూల సినీమా ఆధారంగా తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా తీసిన సినిమాలు అన్ని భాషలలోనూ విజయవంతం కావడం విశేషం.
ప్రణవ స్వరాట్
చాలా మంచి వ్యాఖ్య
ReplyDeleteSuperb సార్.
ReplyDelete“ సదా మదిలో మెదిలే సజీవరాగం” శీర్షికతో సాగుతున్న ఈ కార్యక్రమంలో నేటి గీతం - “ నేలతో నీడ అన్నది….నను తాకరాదని…”! శ్రీ ప్రణవ స్వరాట్ గారి విశ్లేషణ చదివేంత వరకు ఈ కోణంలో సాహిత్యం మీద దృష్టి పోలేదంటే నమ్మాలి మీరు. మాస్టారి గళంలో సుమధురంగా సాగిన దేవులపల్లి వారి గీతాన్ని మరీ మరీ పాడుకోవడమే గాని, సాహిత్యంలో శాస్త్రి గారి మెలికలు గమనించనే లేదు. అది ‘ నేలతో నీడ’ నా లేక ‘నీడతో నేల’ నా - అన్న మీమాంస స్ఫురించనే లేదు.
ReplyDelete💎నిజానికి కణ్ణదాసన్ గారి ఒరిజినల్ గీతంలో వాడిన పదజాలం “నిలవే పార్త్ వానమ్ సొన్నదు ఎన్నై తొడాదే” అన్న మూల భావం సహజరీతిలోనే సాగుతుంది. ఐతే, శాస్త్రి గారు తన గీతంలో పూర్తిగా భావాన్ని తనదైన శైలిలో చెప్పడం జరిగింది. మరి ఇందులో వున్న ఔచిత్యమేమిటి?
💎సమయాన్ని బట్టి నీడ నేలను తాకుతుంది. నేల స్థిరమైంది. కాని నీడ, ఓ కల్పిత ఆకారం. దానికంటూ ఓ నిర్దిష్టమైన పరిమాణం గాని, ఆకారం గాని స్వంతం కాదు. పైగా, అది నేల పై పడితేనే “ నీడ” అనే ఆకారం తీసుకుని అలా పిలువబడుతుంది. నేలకు నీడ యొక్క అవసరం గాని, నీడ పైని ఆధారం గాని వుండదు. పైగా, నీడకే నేల యొక్క అవసరం, నేలపై దాని ఆధారమున్నూ. మరి గర్వం తలకెక్కినపుడు తనకు ఆధారమైన వాటినే తిరస్కరించడం జరుగుతుంది. ‘నీడ’కు పొగరెక్కి తన ఆకారానికి ఆధారమైన ‘నేల’నే తృణీకరించడం సన్నివేశ సారాంశం. అలాగే, భరించే వాడు భర్త! భార్య పోషణ కట్టుకొన్న వాడి విధి. భార్య భర్త పోషణపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంది. ఈ విధంగా భర్త పై ఆధారపడి జీవిస్తున్న భార్య అతణ్ణే తనను తాకరాదని శాసించడం విచిత్రం!
💎ఈ పాట చరణాల్లో శాస్త్రి గారు పేర్కొన్న తార్కాణాలన్నీ ఇలా వైపరీత్యంతో కూడినవే. నీటి ప్రవాహంపై ఆధారపడిన గడ్డిపరక, నీరు తన్ను తాకరాదని అనడం; వీణ పలుకు మాధుర్యానికి కారణమైనది వేలి కొసలు మీటడమే; స్వతహాగా వీణ పలుకదు; నల్లమబ్బు కురియడానికి చల్లగాలి స్పర్శ అవసరం; చల్లగాలికి మబ్బు అవసరం ఎక్కడిది! రవి కిరణం అవసరం సర్వ జీవులకూ వుంటుంది. అలా, కమలం విరియాలన్నా ఆ కిరణమే మూలం! మరి కమలమే కిరణాన్ని త్యజించి శాసించగలదా?
💎ఇలాంటి ప్రకృతి వైపరీత్యం తన విషయంలో జరుగుతోందని కథానాయకుడు మధనపడుతూ పాడే పాట సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది. ఘంటసాల మాస్టారి గళంలో కవి హృదయం పురివిప్పి పలికింది! ప్రేక్షకజనాదరణ మెండుగా లభించింది. ఈ చర్చను సమూహంలో లేవనెత్తిన శ్రీ స్వరాట్ గారికి వందనములు!!🙏🙏🙏