Saturday 25 November 2023

సదా మదిలో మెదిలే సజీవరాగం - ఐదవ భాగం - కుడియెడమైతే - దేవదాసు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నాలుగవ భాగం ఇక్కడ 

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదక, మునకే సుఖమనుకోవోయ్

మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ
కొండలే రగిలే వడగాలి.... నీ సిగలో పూవేలోయ్?

చందమామ మసకేసి పోయె
ముందుగా కబురేలోయ్?
లాహిరి నడి సంద్రములోన 
లంగరుతో పనిలేదోయ్  


గాయకుడిగా ఘంటసాలవారికి అజరామరమైన కీర్తిని సంపాదించి పెట్టిన  ఈ పాట అర్ధం గురించి పలువురు పలు రకాలుగా విమర్శించడం జరిగింది, విశ్లేషించడమూ జరిగింది.

"త్రాగుబోతు వాడి మాటకీ పాటకి అర్ధమేముంటుంది" అని అన్నవారే,  ఆలోచించే జిజ్ఞాసాపరులకు తగిన వేదాంతార్ధం ఈ పాటలో లభిస్తుందని కూడా శెలవిచ్చారు.

మనిషి జన్మ దుఃఖం, మనిషి మరణం దుఃఖం ......అనే వేదాంత సూక్తిని గుర్తు చేసే పాట 'కుడి ఎడమైతే'.

సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఈ పాట గురించి ఆయనే తర్వాత ఎప్పుడో ఎవరికో చెప్పినట్లు ఆయన కుమారుడు,  సినీగీత రచయిత సముద్రాల రామానుజాచార్యులు (సముద్రాల జూ.) చెప్పిన అర్ధం యొక్క సారాంశం ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

" కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది. అది జీవితంలో  సహజం. అంతమాత్రాన ఓడిపోయాననుకోకు.

పార్వతి తనదే అనుకున్నాడు దేవదాసు. కానీ, ఆమె అతనికి దక్కలేదు. ఆ బాధను మర్చిపోవడానికి త్రాగుడు ప్రారంభించాడు.  ఇది ఒక సుడిగుండం. అలవాటు పడితే బయటపడడం కష్టం అని తెలిసికూడా ఈ త్రాగుడనే సుడిగుండంలో దూకాడు. ఇప్పుడింక ఎందురీత తెలివితక్కువ. 
ములిగిపోవడమే సుఖం. ఇలా తప్పతాగుతూనే జీవితం ముగించుకో. 

పార్వతి మేడపైనున్న బంగారు బొమ్మ.  నీ చేతికి చిక్కదు. నీవంటే ప్రాణాలిచ్చే చంద్రముఖి నీ నీడలోనే వుంది. కానీ నీ స్థితి ఏమిటి ? కొండల్నే రగిల్చే వడగాలి వీస్తోంది. నీ గుండెలో సుకుమారమైన ప్రాణాలు ఎంతకాలం నిలుస్తాయి. ఎందుకీ ప్రాణాలు ? తప్పతాగి జీవితం చాలించు. చావడానికి నిర్ణయించుకున్నాక ఎవరికీ కబురు చెప్పవలసిన పనిలేదు.

చందమామ లాటి నీ బ్రతుకు మసకేసిపోయింది. నడి సముద్రాన వున్న నావలా వుంది నీ బ్రతుకు, ములిగిపోవడానికి సిధ్ధంగా. ఒడ్డున వుండేవాడికి లంగరు గానీ, నడి సముద్రంలో నీరుపట్టిన నావకు లంగరు ఎందుకు ?

ఇది దేవదాసు మానసిక పరిస్థితి.

దేవదాసు మానసిక స్థితిని ఇంత సింబాలిజంతో పాటను వ్రాసి కవిగా తన సుపీరియారిటిని, సీనియార్టీని నిరూపించుకున్నారు కవివరేణ్యులు సీనియర్ సముద్రాల. కవి ఆవేశాన్ని అర్ధం చేసుకొని పాటను స్వరపర్చారు సి.ఆర్.సుబ్బురామన్ దగ్గర సహాయకులుగా పనిచేసిన విశ్వనాథన్ - రామమూర్తిలు. (సి.ఆర్.సుబ్బురామన్ ఆకస్మిక మరణంతో దేవదాసు రెండు పాటలు - 'జగమేమాయ', 'కుడిఎడమైతే'  పాటలను విశ్వనాథన్ - రామమూర్తిల చేత చేయించారట. ఈ రెండు పాటలను మరింత ఆ‌ర్తితో, భావోద్వేగంతో  అనుభవించి  పాడారు ఘంటసాల.

దేవదాసు లోని ' కుడి ఎడమైతే' పాట,  గత వారం ఈ శీర్షిక లోని ' ఆ మనసులోనా'  పాట  రెండు కూడా కళ్యాణి రాగంలో మలచబడినవే. రాగం ఒకటే అయినా ఈ రెండుపాటల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆ వైవిధ్యానికి కారణం ఘంటసాలవారి గాన ప్రతిభే. తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మించబడిన దేవదాసు లోని పాటలన్నీ ఘంటసాలవారే పాడారు. ఈ ఒక్క సినిమా లోని పాటలతోనే కోట్లాది తమిళులు ఈనాటికీ ఘంటసాలవారి ని గుర్తుపెట్టుకొని ఆ పాటలను నిరంతరం మననం చేసుకుంటూనే ఉన్నారు.

1917 లో శరత్ బాబు (శరత్చంద్ర ఛటర్జీ) వ్రాసిన దేవదాసు బెంగాలీ నవల ఆధారంగా ఇప్పటికీ వివిధ భాషలలో 14 సార్లు దేవదాసు ను సినీమాగా తీసారు. ఇన్నిసార్లు ఇన్ని భాషలుగా రూపొందినా 1953లో అక్కినేని నటించిన తెలుగు దేవదాసే ఉత్తమమైనదని ఆ పాత్రలో తన కంటే అక్కినేని నాగేశ్వరరావు నటనే పరాకాష్ట కు చేరుకున్నదని హిందీ దేవదాసు కధానాయకుడు, సుప్రసిధ్ధ నటుడు దిలీప్ కుమార్ అక్కినేని ని ప్రశంసలతో ముంచెత్తారు.

దేవదాసు చిత్రనిర్మాణ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అహర్నిశలు కష్టపడి పనిచేసారు. ముఖ్యంగా అక్కినేని తాగుబోతుగా నటించడానికి కావలసిన మూడ్ రావడానికి ఆ సీన్లు అర్ధరాత్రి సమయంలో నిద్రకు కళ్ళు బరువెక్కి మూతలు పడుతూండగా ఆ నిద్రమత్తు కళ్ళతోనే షూటింగ్ జరిపేవాళ్ళమని అందుకే ఆ సీన్లలో  తన ముఖంలో ఆ త్రాగుబోతు లక్షణాలు కనపడడానికి దోహదపడ్డాయని అక్కినేని తరచూ తన ఇంటర్వ్యూలలో చెప్పేవారు.

తెలుగునాట 'దేవదాసు' ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ సినీమా వచ్చిన కొత్తల్లో ఊరూవాడా ఎక్కడ చూసినా ఘంటసాల దేవదాసు పాటలే. ప్రేమలో విఫలమైన ప్రతీ భగ్నప్రేమికుడు అక్కినేని లాగే పైజమా జుబ్బాలతో, చింపిరిజుట్టు, మాసిన గెడ్డం, చేతిలో సిగరెట్ తో వీధికి ఒకరు చొప్పున లైట్ స్థంభాలక్రింద ఈ పాటలు పాడుతూ దర్శనమిచ్చేవారు.

కళ్యాణి రాగంలో చేయబడిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' పాటలో చాలా తక్కువ వాద్యగోష్టి వినిపిస్తుంది. తబలా, క్లారినెట్, వైలిన్స్ మాత్రమే ప్రధానంగా వినపడే వాద్యాలు. ఈ పాటలో  వినవచ్చే పదాలు ఓడిపోలేదోయ్,  సుఖమనుకోవోయ్, చిలకమ్మా, పూలేలోయ్, లంగరుతో పనిలేదోయ్ అనేచోట  వచ్చే సంగతులు, గమకాలు, ఎదురీదకా, కబురేలో  తర్వాత వచ్చే ఆలాపనలు కళ్యాణి రాగ మాధుర్యానికి మచ్చుతునకలు. ఆ రాగ స్వరూపాన్ని అంత నిర్దిష్టంగా రసభావానికి తగినట్లుగా ఆలపించడం ఒక్క ఘంటసాలవారికే సాధ్యం. అలాగే ఈ పాటను సంగీతపరంగా విశ్లేషించాలన్నా సంగీతం బాగా తెలిసినవారికే సాధ్యం. నాలాటి వాళ్ళు ఆయా గమకాలను, సంగతులను విని ఆనందించగలరే తప్ప వివరణాత్మక విశ్లేష చేయలేరు.

ఒక గాయకుడి ప్రతిభను మరో గాయకుడు లేదా గాయని మాత్రమే చక్కగా చెప్పగలరు. దేవదాసు సినీమాలోని 'కుడిఎడమైతే' పాట విన్నాక ఘంటసాలవారి తీవ్ర అభిమానిగా మారిపోయానని , అలాటి  గొప్ప గాయకుడు మరల పుట్టడని ,అలాటి గాయకునితో కలసి అనేక పాటలు పాడే భాగ్యం తనకు కలిగిందని గాయని ఎల్.ఆర్.ఈశ్వరి ఎంతో భావోద్వేగాలతో మాట్లాడడం నేను విన్నాను.

ఎన్ని యుగాలైనా  'కుడిఎడమైతే పొరపాటు లేదోయ్'  పాట, 'దేవదాసు' లోని ఇతర పాటలు, వాటి ఆవిర్భావానికి కారణభూతులైన సీనియర్ సముద్రాల, సి.ఆర్.సుబ్బురామన్,  విశ్వనాధన్ రామమూర్తి, ఘంటసాల, అక్కినేని, సావిత్రి,  వేదాంతం రాఘవయ్య, డి.ఎల్.నారాయణలు తెలుగువారి గుండెలలో సజీవంగా నిల్చిపోయేవుంటారు. 

మదిలో సదా మెదిలే ఘంటసాలవారి మరో సజీవ రాగంతో మళ్ళీ వచ్చే ఆదివారం ...


💐🙏💐ప్రణవ స్వరాట్💐🙏💐



Saturday 18 November 2023

సదా మదిలో మెదిలే సజీవరాగం - 4వ భాగం - ఆ మనసులోనా - పల్లెటూరు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

ఘంటసాల -
సదా మదిలో మెదిలే సజీవరాగం!! 
మూడవభాగం ఇక్కడ



'ఆ మనసులోనా'
ఆ మనసులోన‌, ఆ చూపులోన
పరుగులెత్తే మృదుల భావనామాలికల
అర్ధమేమిటో తెల్పుమా, ఆశ ఏమిటో చెప్పుమా !

ఆ నడతలోన, ఆ నడకలోన
దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై మొగ్గు
అంతరార్ధము తెల్పుమా, ఆశయము వివరింపుమా !

ఆ కులుకులోన, ఆ పలుకులోన
పెనవేసికొని యున్న, వెలికి రాలేకున్న 
తలపులేవో తెల్పుమా, వలపులేవో చెప్పుమా !

ఆ సొగసులోన , ఆ నగవులోన;
తొగరు వాతెరగప్పి చిగురించు కోరికల :
మరుగదేమిటో తెల్పుమా , తెరగదేమిటో చెప్పుమా !

ఆ హృదిలో, ఈ మదిలో
పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని 
పరిమళించునె తెల్పుమా !
ఫలితమిచ్చునె చెప్పుమా !!

                                                                                   🌷🔔🌷

నా చిన్నప్పుడు నేను విజయనగరంలో ఉన్నప్పుడు ఈ పాట గ్రామఫోన్లు ఉన్న ప్రతీ ఇంట్లో, కాఫీ హోటల్స్ లో, పబ్లిక్ పార్క్ రేడియో లో ఉదయాస్తమానం తెగ వినిపించేది. సంగీతాభిమానులంతా కూడా మనసారా ఈ పాటను పాడుకునేవారు. ఈ పాట  విన్నప్పుడల్లా నాకు మాత్రం గుర్తుకు వచ్చే మాటలు రెండే రెండు - ఒకటి  - చెప్పు, మరొకటి ఉప్మా (చెప్పుమా). ఆ వయసులో నాకున్న లోకజ్ఞానం అంతే.

ఘంటసాలవారి అసలైన గాత్రధర్మం , సంగీత ప్రతిభ 1950 ల నుండి 1965 మధ్య వచ్చిన సినీమాలలోనే ద్యోతకమవుతుంది.  అలాటి పాటలలో ప్రముఖ స్థానం వహించేది పల్లెటూరు సినీమా లోని పాటలు.

సుప్రసిద్ధ  దర్శకుడు తాతినేని ప్రకాశరావుగారు తొలిసారిగా దర్శకత్వం వహించిన సామాజిక స్పృహ కలిగిన సాంఘిక చిత్రం 'పల్లెటూరు'. పీపుల్స్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ మీద నిర్మించిన పల్లెటూరు చిత్రం తాతినేని వారికి మాత్రమే కాక వి మధుసూదనరావు, అట్లూరి పుండరీకాక్షయ్య, అచ్చయ్యచౌదరీ వంటి యువ కళాకారులకు కూడా మొదటి చిత్రం. వారంతా తెరవెనుకే కాక తెరమీద కూడా  అభ్యుదయ వాదియైన కధానాయకుడు ఎన్.టి.రామారావు మిత్రబృందంలో కనిపిస్తారు.

దేశభక్తి, సోషలిజం, సంఘ విద్రోహక చర్యలు, ప్రేమ వంటి  వివిధ అంశాలతో ఈ సినీమాను రూపొందించారు.

 నవసమాజోధ్ధరణలో భాగంగా కొన్ని దశాబ్దాలపాటు  సామాజిక నాటక ప్రదర్శనలు నిర్వహించిన సుంకర సత్యనారాయణ- వాసిరెడ్డి భాస్కరరావు జంటకవులు ఈ సినీమాకు మాటలు, పాటలు వ్రాసారు.

పల్లెటూరు సినీమాలో వీరు వ్రాసిన పదకొండు పాటలతో పాటు, అంతకుముందే సినీమాలతో సంబంధం లేకుండా వ్రాయబడిన  మహాకవి శ్రీశ్రీ గారి 'పొలాలనన్ని హలాల దున్ని'  అనే విప్లవగీతం, వేములపల్లి శ్రీకృష్ణగారి 'చేయెత్తి జైకొట్టు తెలుగోడా' అనే ప్రబోధగీతం కూడా ఈ సినీమా ఔన్నత్యానికి దోహదం చేసాయి.

ఈ రెండు పాటల్లో ఘంటసాలవారితో పాటు బృందగానం చేసినవారిలో మా నాన్నగారు - సంగీతరావుగారు కూడా ఉన్నారు. 

విప్లవధోరణికి అలవాటు పడిన కవులు  కవిత్వ  గుబాళింపులతో లాలిత్యమైన ప్రేమ భావగీతాలను జనరంజకంగా వ్రాయగలగడం చాలా ఆశ్చర్యకరం. 

అలాటి మృదు మధురభావ ప్రేమ గీతమే "ఆ మనసులోన, ఆ చూపులోన" పాట.

పల్లెటూరు చిత్రానికి అత్యద్భుతమైన, సందర్భోచితమైన సంగీతాన్ని ఘంటసాలవారు సమకూర్చారు. వాటిలో మకుటాయమానంగా చెప్పదగినది ఈ ప్రేమగీతం.

'మృదుల భావనామాలిక
నడత, నడక
నునుసిగ్గు దొంతరలు, మొగ్గు
కులుకు, పలుకు
తలపులు, వలపులు
తొగరు, వాతెరగప్పి
మరుగు, తెరగు
పొటమరింపు,
దిటవుగా పాదుకొని
పరిమళింపు
అనే పదాలు వాసిరెడ్డి - సుంకరిగార్ల కవితా ప్రతిభను చాటి చెపుతాయి.

'తొగరు వాతెరగప్పి' వంటి పదాలకు సరైన అర్ధం తెలియాలంటే తెలుగుభాషతో అంతో ఇంతో ప్రవేశం ఉండకతప్పదు.

1960లకు ముందు ఘంటసాలవారు అనేక పాటలను  కళ్యాణి రాగంలో స్వరపర్చి పాడారు.  కళ్యాణి ఘంటసాల అభిమాన రాగం అనే ఖ్యాతిని కూడా పొందారు.

సంపూర్ణరాగమైన "కళ్యాణి " మనసుకు హాయిని , ఆహ్లాదాన్ని కలిగించే రాగం. ఈ ప్రేమ భావగీతానికి కూడా ఘంటసాలగారు కళ్యాణి రాగాన్నే ఎన్నుకొని తన సంగీత ప్రతిభను చాటారు.

"ఆ మనసులోన, ఆ చూపులోనా"  అంటూ  పల్లవి కి ముందు మంద్రస్థాయిలో సాకీ లా మొదలెట్టిన విధం సైగల్ ను గుర్తుకు తెస్తుంది.

పల్లవిలో "భావనా మాలిక" అనే చోట ఘంటసాలవారు ఇచ్చిన గమకస్ఫూర్తి,  స్థాయికి ఒకరకమైన పరవశం కలుగుతుంది. అలాగే 'తెల్పుమా ' అనే చోట కనపర్చిన వైవిధ్యం అనన్య సామాన్యం. 

చరణంలో 'కులుకు', 'పలుకు' అన్న మాటలకు మాస్టారు ఇచ్చిన భావప్రకటన శ్రోతలలో చెప్పలేని పెనవేసుకుపోయిన తలపులను, వలపులను, మరెన్నో మధురభావాలను రేకెత్తిస్తాయి. 

"చిగురించు కోరికల" తర్వాత వచ్చే ఆలాపన ఘంటసాల  బ్రాండ్ కళ్యాణి కి దర్పణం. ఆ రాగమాధుర్యమంతా ఆ చిన్ని ఆలాపనలోనే వ్యక్తీకరించారు.

ఇక ఆఖరి చరణంలో  'ఆ హృదిలో ,  'ఈ మదిలో' అనే చోట ఘంటసాలవారు పాడిన విధానం మనం ఊయలలో మెల్లగా పైకీ, క్రిందికి ఊగుతున్న భావన కలిగిస్తుంది.

ఇక ఆఖరున 'ఆ.. మనసులోన'అంటూ ముగించిన తీరుకు శ్రోతల మనసులు ఎక్కడో విహరిస్తాయి.

ఈ పాటలో ఎక్కడా వాద్యాల హోరు మచ్చుకైనా కనపడదు. గాయకుడి గాత్రానికి వాద్యాలు సున్నితంగా సహకరించాలే తప్ప గాయకుడి పాటను - డామినేట్ - అధిగమించకూడదు.

ఇదే ఘంటసాలవారు చివరి వరకు అనుసరించిన వాద్యగోష్టి నిర్వహణా విధానం. ఈ పాటలో కేవలం ఫ్లూట్, వీణ, వైలిన్స్, తబలా, రిథిమ్స్ మాత్రమే పాట ఔచిత్యాన్ని ఇనుమడింపజేస్తూ వినిపిస్తాయి.

ఈ పాట చిత్రీకరణ కూడా చాలా సహజ వాతావరణం లో ఎన్.టి.రామారావు, సావిత్రిల సున్నిత హావభావాలతో ఏ హంగు ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది.

ఈ విధమైనటువంటి భావ సౌందర్యం గల అచ్చ తెనుగు పాటలకు, గాయకులకు ఈనాడు మనము దూరమయ్యాము.

సంగీత, సాహిత్యాలలో తగిన ప్రవేశం లేని కారణంగా నేను  ఈ పాట ఔన్నత్యాన్ని తగు రీతిలో ఇంకా బాగా విశ్లేషించలేకపోయానని భావిస్తున్నాను.

మదిలో సదా మెదిలే మరో ఘంటసాల సజీవరాగం తో మళ్ళీ వచ్చే ఆదివారం ..

అంతవరకు ఈ శీర్షిక నుండి శెలవు.

 -ప్రణవ స్వరాట్






Saturday 11 November 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" 3వ భాగం - ఎంత ఘాటు ప్రేమయో - పాతాళభైరవి




"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

రెండవభాగం ఇక్కడ
          
" ఎంత ఘాటు ప్రేమయో 
  ఇంత లేటు వయసులో "
వంటి పారడీ గీతాలకు అవకాశం కల్పించిన పాట.    "ఘాటు ప్రేమ" పద ప్రయోగం శ్రీశ్రీ వంటి మహాకవి చేత కూడా ఏదో సందర్భంలో ఆలోచింపజేసిందట.

పింగళి నాగేంద్రరావు గారు వ్రాసిన ఈ పాట విజయావారి   మొట్టమొదటి అత్యద్భుత మాయాజాల జానపద చిత్రమైన
 " పాతాళభైరవి " సినీమాలోనిది.

వివిధ రసాలతో కూడిన  ఎన్నోపాటలకు ఘంటసాలవారు మనోరంజకమైన, వైవిధ్యభరితమైన సంగీతాన్ని సమకూర్చారు. పి. లీల అనే మలయాళ గాయనికి పాతాళభైరవి పాటలు  తెలుగునాట సుస్థిరమైన స్థానాన్ని అనన్య సామాన్యమైన కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. 

💥  నాయిక : ఎంత ఘాటు ప్రేమయో
      ఎంత తీవ్ర వీక్షణమో...

కన్ను కాటు తిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే  - 2 !! ఎంత!!

నాయకుడు : ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో !
కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే - 2 !! ఎంత లేత!!

 నాయిక :
ఈ జాబిలి.. ఈ వెన్నెల.. ఈ మలయానిలము... -2
విరహములో వివరాలను విప్పి చెప్పెనే..
!! ఎంత ఘాటు!!


నాయకుడు : ఓ జాబిలి... ఓ వెన్నెల.. ఓ మలయానిలమా..! - 2
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే !! ఎంత లేత !! 💥

వాహినీ స్టూడియో లో రకరకాల పూలమొక్కలు , లతలు జెయింట్ ఫాన్ల గాలికి తలలూపుతూండగా , ఫౌంటెన్ల్ వెదజల్లే  చలచల్లనినీటి తుంపరలతో  , గగనతలంలో వెలిగిపోతున్న చందమామ తో   అంతా  నిజమని భ్రమింపజేసేలా బ్రహ్మాండమైన రాజభవనం సెట్ లో నాయికా నాయకులు మాలతి , ఎన్ టి రామారావు  ఎంతో అందంగా సహజంగా ఈ పాటను అభినయించారు.

పింగళి నాగేంద్రరావుగారు ఈ పాటలో ప్రయోగించిన ' కన్నుకాటు' పదం అప్పటికీ ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగా నే ఉంది. పింగళి వారు ఈ పాటలో నాయిక భావాలను లాలిత్యంతో కూడినవిగా , నాయకుని భావాలు సుస్పష్టంగా తెలిసేలాగును వ్రాసారు.
 
ఇక ఘంటసాలవారు పాతాళభైరవి సినీమా కు ఆపాతమధుర సంగీతాన్ని సమకూర్చారు.  ఈ యుగళగీతాన్ని ఘంటసాలవారు రాగేశ్వరి అనే హిందుస్థానీ రాగంలో మనసుకు హాయిగొలిపేలా సుశ్రావ్యంగా మలచి పి.లీలతో గానం చేసారు.

ఈ పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వైలిన్స్ తో, పియోనా వ్యాంపింగ్ తో , స్పానిష్ గిటార్ నోట్స్ తో ఎంతో మనోహరంగా ప్రారంభమవుతుంది. ప్రతి పదం చివరలో వచ్చే సంగతులను , గమకాలను లీల , ఘంటసాల గార్లు చాలా స్పష్టంగా మనసుకు హాయిగొలిపేలా ఆలపించారు. శాస్త్రీయ సంగీత నేపధ్యమో లేక అసమాన్య గ్రహణశక్తో ఉంటే తప్ప ఘంటసాలవారి పాటలలోని గమకాలను కఛ్ఛితంగా ఆలపించడం బహు కష్టం. 

రెండవ బ్యాక్ గ్రౌండ్ లో కూడా వెస్ట్రన్ వాద్యమైన  పియోనాతో పాటు ట్రంపెట్స్ ను కూడా సున్నితంగా మన వాతావరణానికి తగినట్లు సందర్భోచితంగా  ఉపయోగించారు ఘంటసాల.

చరణంలో వచ్చే 
 ' ఓ జాబిలి , ఓ వెన్నెల , ఓ మలయా నిలమా ' అనే మాటలను ఒక్కోదాన్ని ఒక్కో స్థాయిలో లీల , ఘంటసాలగారు ఎంతో నిర్దుష్టంగా ఆలపించిన తీరు అనితరసాధ్యం. 

ఈ పాట పుట్టి 72 ఏళ్ళు కావస్తున్నా ఈనాటికీ ఈ గీతం నిత్యనూతనంగాను , ఉత్తేజభరితంగానూ సంగీతప్రియులను అలరిస్తూనేవుంది.


" ఎంత ఘాటు ప్రేమయో " పాట వైశిష్ట్యం గురించి ప్రముఖ  బహుభాషా నేపధ్యగాయకుడు శ్రీ పి బి శ్రీనివాస్ గారు ఎంతగానో కొనియాడారు.

1985-86 ప్రాంతాలలోనే మా మద్రాస్ తెలుగు అకాడెమీ ఘంటసాలవారి సంస్మరణార్ధం  సకలగాయక సంగీతోత్సవాలను ఘనంగా చేయడం మొదలుపెట్టింది. అలాటి ఒక ఉత్సవంలో శ్రీ పిబి శ్రీనివాస్ గారు ఘంటసాలవారి గాన ప్రతిభను ప్రశంసిస్తూ  "ఎంత ఘాటు ప్రేమయో" పాటను ఆలపించారు. 
తానే గనక ఏ భోజరాజో లేక , శ్రీకృష్ణ దేవరాయలో అయినట్లతే  ' ఓ జాబిలి , ఓ వెన్నెల , ఓ మలయానిలమా' అనే పదాలను  ఒక్కో స్థాయిలో ఒక్కో రకంగా  ఆలపించిన తీరుకు లక్ష వరహాల చొప్పున మూడు లక్షల వరహాలను బహుమానంగా అందజేసి ఉండేవాడినని చాలా ఉద్వేగంతో ఘంటసాలవారిని ఎంతో ఘనంగా కీర్తించారు. పిబిశ్రీనివాస్ గారి ఆ మాటలకు  వేలాది ప్రేక్షకులు చేసిన కరతాళ ధ్వనులు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి.

వచ్చే వారం  సదా మదిలో మెదిలే మరో సజీవ రాగంతో మళ్ళీ కలుద్దాము.....

💐🙏  ప్రణవ స్వరాట్🙏💐














Saturday 4 November 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" 2వ భాగం - పలుక రాదటే చిలుకా - షావుకారు

                                                                         


"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

  మొదటిభాగం ఇక్కడ 

 






                                                                      

నాకు ఊహ తెలుస్తున్న తొలిరోజులలో నేను విన్నట్లుగా గుర్తుండిపోయిన మొదటి పాట "పలుకు రాదటే చిలకా".

నాగావళీ ఏటి తరంగాలపై నుండి తేలియాడుతూ వచ్చి నా చెవులకు సోకిన పాట. ఆ పాట ఎవరు పాడారో, ఎక్కడినుండి వినిపిస్తోందో నాకు తెలిసే వయసుకాదు. అంత చిన్న వయసులో ఆ పాట నాకు గుర్తుండి పోవడానికి కారణం మేమున్న ఇంటికి బయట చుట్టుపక్కల బోలెడన్ని బాదంచెట్లు. చెట్లనిండా పచ్చని, ఎర్రని బాదంకాయలు, పళ్ళతో వాటిని తినడానికి వచ్చే ఆకుపచ్చని ఎర్రముక్కుల  రామచిలకల కలకలారావాలతో ఆ చెట్లు పచ్చగా కళకళలాడుతూ చూడడానికి చాలా సంతోషంగా ఉండేది. చిలకలు ఎప్పుడూ ఏ కాయను, పండును పూర్తిగా తినవు. సగం సగం కొరికి పోస్తాయి . అలా ఆ బాదంకాయలు కొరికి పారేయడం చూసి ఆ చిలకలకు   పాపం బాదం పలుకులు ఒల్చుకు తినడం రావట్లేదని నాకు విచారంగా ఉండేది.  అటువంటి వాతావరణంలో అశరీరవాణిగా  తరచూ వినిపించే ' పలుకరాదటే చిలకా' పాట 'పలుకు రాదటే చిలకా' గా నా కోసమే పాడుతున్న భావన కలిగేది.

ఎన్నో మధుర భావాలతో మనసుకు హత్తుకుపోయేలా ఆకర్షించి సదా మదిలో మెదిలే పాట "పలుకరాదటే చిలుకా".  ఆ పాట పాడినవారి పేరుఘంటసాల అని ఆ పాట "షావుకారు"అనే సినిమాలో వినిపిస్తుందని నాకు తెలియడానికి చాలా ఏళ్ళే పట్టింది. అదే పాటను మరికొన్నేళ్ళ తర్వాత అదే ఘంటసాలవారింట్లోని గ్రామఫోన్ లోనూ, ఓ పాతకాలపు రేడియోలోను రోజూ వినడం జరిగేది. 

అయితే, శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఈ పాటలో విశ్లేషించడానికి ఎన్నో విషయాలు దాగివున్నాయనే సంగతి అర్ధమవడానికి చాలా కాలమే పట్టింది.

నాగిరెడ్డి-చక్రపాణి ల విజయావారి మొదటి చిత్రం షావుకారు. హీరోగా ఎన్.టి.రామారావు కు మొదటి సినిమా షావుకారు. హీరోయిన్ గా శంకరమంచి జానకికి మొదటి సినీమా షావుకారు. విజయావారి ఆస్థాన సంగీత దర్శకునిగా ఘంటసాలవారికి మొదటి సినీమా షావుకారు. షావుకారు సినీమాలో కధానాయక పాత్రధారి నోటమ్మట వినిపించే మొదటి పాట 'పలుకరాదటే చిలుకా'. ఈ పాటతోనే ఎన్.టి.రామారావు, ఘంటసాలల సినీజీవిత ప్రస్థానం ప్రారంభమై రెండు దశాబ్దాలపాటు నిరాటంకంగా విరాజిల్లింది. షావుకారు సినీమాలో ఆ చిన్నారి రామచిలక (జానకి)  చెప్పడానికి మొహమాట పడిన ఆ తేట తెనుగు మాటలను చూద్దాము.

విజయావారి సినీమాలకు పాటల రచయితగా సముద్రాల సీనియర్ గారు పనిచేసిన ఏకైక చిత్రం షావుకారు. ఈ సినీమాలో వచ్చే వైవిధ్యభరితమైన పాటలన్నీ వారి కలం నుండి వెలువడినవే. 'పలుకరాదటే చిలుకా' పాటలోని మాటలన్నీ చాలా సరళంగా రామచిలుక పలుకుల్లాగే ముద్దులొలుకుతూంటాయి.

సన్నివేశపరంగా యౌవ్వనంలోకి వచ్చాక తొలిసారిగా కథానాయిక, కథానాయకుని ఇంటికి వస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు బాగా తెలిసినవాళ్ళే. పక్కపక్క ఇళ్ళవారే. సమయం కలిసొస్తే ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలు కావాలని పెద్దలంతా నిర్ణయించుకున్నదే. అయినా పట్నంలో చదువుతున్న ఆ యువకుడిని చూసి ధైర్యంగా, ముఖాముఖిని మాట్లాడేందుకు ఆ గ్రామీణ యువతి సంకోచపడుతుంది. అది ఆ కాలపు పెద్దల పెంపకపు తీరు. పక్కనున్న పనివాడిని అడ్డుపెట్టుకొని తను చెప్పదల్చుకున్నది మొగమాటంతో ఆ యువకుడికి తెలియజేస్తుంది. పట్నంలోని నాగరికతకు అలవాటు పడిన కధానాయకుడు ధైర్యంగా మాట్లాడమంటునే తన మనసులోని భావాలను పంజరంలో ఉన్న చిలుకను ఉద్దేశించి చెపుతున్నట్లుగా తన పక్కింటి పిల్లకు పాట రూపంలో చెపుతాడు.

పాట పల్లవిలో "సముఖములో రాయబార మెందులకే పలుకరాదటే చిలుకా" అంటాడు.
ఎదురెదురుగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకోకుండా ఇతరుల ప్రమేయమెందుకు? 

చరణంలో - ఎరుగని వాళ్ళము కాదు, మొగమెరుగని వాళ్ళం అంతకన్నా కాదు. అలాటప్పడు ధైర్యంగా సరదాగా మాట్లాడుకుంటే తప్పేమిటి ? ఇక్కడ ఆచార్యులవారు 'పలికిన నేరమటే?
పలుకాడగ నేరవటే' అని రెండు మాటలు ఉపయోగించారు 'నేరమటే', 'నేరవటే' అని. నేరమటే అంటే తప్పా? ద్రోహమా అనే అర్ధంలో. ' నేరవటే' అంటే నేర్చుకోలేదా, తెలియదా అని. ఈ రెండు మాటలు చాలా సింపిల్ గా వుంటాయి. 'ఇరుగుపొరుగు వారలకీ అరమరికలు తగునటనే' అని మరో మాట. పక్కపక్క ఇళ్ళలో స్నేహంగా, సన్నిహితంగా  ఉంటూ  అక్కరలేని అడ్డుగోడలు అవసరమా అని ప్రశ్నిస్తాడు.

రెండో చరణంలో - మనసులో తొణికే మమకారాన్ని , కళ్ళలో మెరిసే నయగారాన్ని, ప్రేమను  సూటిగా, ఏ అడ్డులు లేకుండా సహజంగా పలుకమంటాడు.

గొప్ప కవితాధోరణి, సమాసభూయిష్టమైన పదజాలమేదీ లేకుండా స్పష్టమైన, సున్నితమైన చిన్న చిన్న మాటలతోనే అందరికీ అర్ధమయే భాషలో ఈ పాటను సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసారు.

ఇక షావుకారు సినీమా కు సంగీత దర్శకత్వం చేపట్టిన ఘంటసాలవారు 'పలుకరాదటే చిలుకా' పాటను స్వరపర్చడానికి కళ్యాణి రాగాన్ని ఎన్నుకున్నారు. కళ్యాణి సంపూర్ణరాగం.  అంటే ఆరోహణ, అవరోహణలలో  'సరిగమపదని' ఏడు స్వరాలు పలుకుతాయి.  కర్ణాటక సంగీతంలో కళ్యాణి 65వ మేళకర్త మేచకల్యాణి జన్యం. దీనినే హిందుస్థానీ సంగీత శైలిలో 'యమన్' అంటారు. ఈ కళ్యాణి, యమన్ రాగాలలో లెఖ్ఖలేనన్ని సినీమా గీతాలు రూపొందించబడ్డాయి.

ఘంటసాల మాస్టారికి కళ్యాణి రాగం చాలా ఇష్టమైన రాగమని సంగీతాభిమానులు అనుకోవడం కద్దు. అయితే ఆ విధంగా ఘంటసాలవారు ఎప్పుడూ ఎక్కడా ప్రకటించలేదు. భీంప్లాస్, సింధుభైరవి, దేశ్  వంటి రాగాలలో కూడా అధిక సంఖ్యాకమైన పాటలు స్వరపర్చారు. కళ్యాణిలో తాను స్వరపర్చిన పాటలతోపాటు ఇతరులు స్వరపర్చిన కళ్యాణి రాగ గీతాలను  తన సొంతం చేసుకొని ఘంటసాలవారు అద్భుతంగా గానం చేయడం వలన సంగీతాభిమానుల దృష్టిలో ఘంటసాలవారికి, కళ్యాణి రాగానికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.

"పలుకరాదటే చిలుకా" పాటలో ఘంటసాలవారు కనపర్చిన రాగ, హావభావాలు, గంభీరమైన తన కంఠస్వరంలో పలికించిన గమకాలు, హాయిగొలిపే ఆలాపనలు అనితరసాధ్యం అంటే అది అతిశయోక్తి కానేకాదు. ఈ పాటలో పియోనా , హేమండ్ ఆర్గన్ , ట్రంపెట్స్ , వైలిన్స్ , ఫ్లూట్ ,క్లారినెట్ వంటి వాద్యాలు చాలా సౌమ్యంగా వినిపిస్తాయి. 

ఇదే పాటను ఈ సినిమా లో మరోసారి 'తెలుపవేలనే చిలుకా తెలుపవేలనే' అని రావు బాలసరస్వతి ముగ్ధమనోహరంగా ఆలపిస్తారు. ఈ రెండు పాటల మధ్య వాద్యగోష్టిలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. రెండో పాటలో జలతరంగ్ వంటి వాద్యాలు కూడా వినిపిస్తాయి.

ఈ పాటలో పది పన్నెండుసార్లు 'ట' కారాక్షరంతో కూడిన మాటల ప్రయోగం జరిగింది. అలాగే మరో దశాబ్దంన్నర తర్వాత వచ్చిన 'రేపంటి రూపం కంటి' పాటలో దాదాపు 55 'ట' కారపు పదాలు వినిపిస్తాయి.

"పలుకరాదటే చిలుకా"  పాటనాటికి ఎన్టీఆర్, జానకి ఇద్దరూ కొత్తవారే. ఇద్దరూ ఏ భేషజము ప్రదర్శించకుండా చాలా సహజంగా నటించారు. జానకి అయితే ఆనాటి గ్రామీణ యువతులలో ఉండే అమాయకత్వాన్ని, వేషభాషలను చక్కగా కనపర్చారు.  కధానాయకుడు ఎన్ టి రామారావు ఎంతో అందంగా, ఏ కృత్రిమత్వం లేకుండా సహజంగా ముఖంలోని హావభావాలను ప్రకటించారు.

ఘంటసాలవారి సంగీత ప్రతిభకు మచ్చుతునక 'పలుకరాదటే చిలుకా' పాట.

మదిలో మెదిలే మరో సజీవ రాగంతో
మళ్ళీ వచ్చే ఆదివారం...

🌺🙏ప్రణవ స్వరాట్🙏🌺






ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...