ఘంటసాల -
సదా మదిలో మెదిలే సజీవరాగం!!
మూడవభాగం ఇక్కడ
'ఆ మనసులోనా'
ఆ మనసులోన, ఆ చూపులోన
పరుగులెత్తే మృదుల భావనామాలికల
అర్ధమేమిటో తెల్పుమా, ఆశ ఏమిటో చెప్పుమా !
ఆ నడతలోన, ఆ నడకలోన
దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై మొగ్గు
అంతరార్ధము తెల్పుమా, ఆశయము వివరింపుమా !
ఆ కులుకులోన, ఆ పలుకులోన
పెనవేసికొని యున్న, వెలికి రాలేకున్న
తలపులేవో తెల్పుమా, వలపులేవో చెప్పుమా !
ఆ సొగసులోన , ఆ నగవులోన;
తొగరు వాతెరగప్పి చిగురించు కోరికల :
మరుగదేమిటో తెల్పుమా , తెరగదేమిటో చెప్పుమా !
ఆ హృదిలో, ఈ మదిలో
పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని
పరిమళించునె తెల్పుమా !
ఫలితమిచ్చునె చెప్పుమా !!
🌷🔔🌷
నా చిన్నప్పుడు నేను విజయనగరంలో ఉన్నప్పుడు ఈ పాట గ్రామఫోన్లు ఉన్న ప్రతీ ఇంట్లో, కాఫీ హోటల్స్ లో, పబ్లిక్ పార్క్ రేడియో లో ఉదయాస్తమానం తెగ వినిపించేది. సంగీతాభిమానులంతా కూడా మనసారా ఈ పాటను పాడుకునేవారు. ఈ పాట విన్నప్పుడల్లా నాకు మాత్రం గుర్తుకు వచ్చే మాటలు రెండే రెండు - ఒకటి - చెప్పు, మరొకటి ఉప్మా (చెప్పుమా). ఆ వయసులో నాకున్న లోకజ్ఞానం అంతే.
ఘంటసాలవారి అసలైన గాత్రధర్మం , సంగీత ప్రతిభ 1950 ల నుండి 1965 మధ్య వచ్చిన సినీమాలలోనే ద్యోతకమవుతుంది. అలాటి పాటలలో ప్రముఖ స్థానం వహించేది పల్లెటూరు సినీమా లోని పాటలు.
సుప్రసిద్ధ దర్శకుడు తాతినేని ప్రకాశరావుగారు తొలిసారిగా దర్శకత్వం వహించిన సామాజిక స్పృహ కలిగిన సాంఘిక చిత్రం 'పల్లెటూరు'. పీపుల్స్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ మీద నిర్మించిన పల్లెటూరు చిత్రం తాతినేని వారికి మాత్రమే కాక వి మధుసూదనరావు, అట్లూరి పుండరీకాక్షయ్య, అచ్చయ్యచౌదరీ వంటి యువ కళాకారులకు కూడా మొదటి చిత్రం. వారంతా తెరవెనుకే కాక తెరమీద కూడా అభ్యుదయ వాదియైన కధానాయకుడు ఎన్.టి.రామారావు మిత్రబృందంలో కనిపిస్తారు.
దేశభక్తి, సోషలిజం, సంఘ విద్రోహక చర్యలు, ప్రేమ వంటి వివిధ అంశాలతో ఈ సినీమాను రూపొందించారు.
నవసమాజోధ్ధరణలో భాగంగా కొన్ని దశాబ్దాలపాటు సామాజిక నాటక ప్రదర్శనలు నిర్వహించిన సుంకర సత్యనారాయణ- వాసిరెడ్డి భాస్కరరావు జంటకవులు ఈ సినీమాకు మాటలు, పాటలు వ్రాసారు.
పల్లెటూరు సినీమాలో వీరు వ్రాసిన పదకొండు పాటలతో పాటు, అంతకుముందే సినీమాలతో సంబంధం లేకుండా వ్రాయబడిన మహాకవి శ్రీశ్రీ గారి 'పొలాలనన్ని హలాల దున్ని' అనే విప్లవగీతం, వేములపల్లి శ్రీకృష్ణగారి 'చేయెత్తి జైకొట్టు తెలుగోడా' అనే ప్రబోధగీతం కూడా ఈ సినీమా ఔన్నత్యానికి దోహదం చేసాయి.
ఈ రెండు పాటల్లో ఘంటసాలవారితో పాటు బృందగానం చేసినవారిలో మా నాన్నగారు - సంగీతరావుగారు కూడా ఉన్నారు.
విప్లవధోరణికి అలవాటు పడిన కవులు కవిత్వ గుబాళింపులతో లాలిత్యమైన ప్రేమ భావగీతాలను జనరంజకంగా వ్రాయగలగడం చాలా ఆశ్చర్యకరం.
అలాటి మృదు మధురభావ ప్రేమ గీతమే "ఆ మనసులోన, ఆ చూపులోన" పాట.
పల్లెటూరు చిత్రానికి అత్యద్భుతమైన, సందర్భోచితమైన సంగీతాన్ని ఘంటసాలవారు సమకూర్చారు. వాటిలో మకుటాయమానంగా చెప్పదగినది ఈ ప్రేమగీతం.
'మృదుల భావనామాలిక
నడత, నడక
నునుసిగ్గు దొంతరలు, మొగ్గు
కులుకు, పలుకు
తలపులు, వలపులు
తొగరు, వాతెరగప్పి
మరుగు, తెరగు
పొటమరింపు,
దిటవుగా పాదుకొని
పరిమళింపు
అనే పదాలు వాసిరెడ్డి - సుంకరిగార్ల కవితా ప్రతిభను చాటి చెపుతాయి.
'తొగరు వాతెరగప్పి' వంటి పదాలకు సరైన అర్ధం తెలియాలంటే తెలుగుభాషతో అంతో ఇంతో ప్రవేశం ఉండకతప్పదు.
1960లకు ముందు ఘంటసాలవారు అనేక పాటలను కళ్యాణి రాగంలో స్వరపర్చి పాడారు. కళ్యాణి ఘంటసాల అభిమాన రాగం అనే ఖ్యాతిని కూడా పొందారు.
సంపూర్ణరాగమైన "కళ్యాణి " మనసుకు హాయిని , ఆహ్లాదాన్ని కలిగించే రాగం. ఈ ప్రేమ భావగీతానికి కూడా ఘంటసాలగారు కళ్యాణి రాగాన్నే ఎన్నుకొని తన సంగీత ప్రతిభను చాటారు.
"ఆ మనసులోన, ఆ చూపులోనా" అంటూ పల్లవి కి ముందు మంద్రస్థాయిలో సాకీ లా మొదలెట్టిన విధం సైగల్ ను గుర్తుకు తెస్తుంది.
పల్లవిలో "భావనా మాలిక" అనే చోట ఘంటసాలవారు ఇచ్చిన గమకస్ఫూర్తి, స్థాయికి ఒకరకమైన పరవశం కలుగుతుంది. అలాగే 'తెల్పుమా ' అనే చోట కనపర్చిన వైవిధ్యం అనన్య సామాన్యం.
చరణంలో 'కులుకు', 'పలుకు' అన్న మాటలకు మాస్టారు ఇచ్చిన భావప్రకటన శ్రోతలలో చెప్పలేని పెనవేసుకుపోయిన తలపులను, వలపులను, మరెన్నో మధురభావాలను రేకెత్తిస్తాయి.
"చిగురించు కోరికల" తర్వాత వచ్చే ఆలాపన ఘంటసాల బ్రాండ్ కళ్యాణి కి దర్పణం. ఆ రాగమాధుర్యమంతా ఆ చిన్ని ఆలాపనలోనే వ్యక్తీకరించారు.
ఇక ఆఖరి చరణంలో 'ఆ హృదిలో , 'ఈ మదిలో' అనే చోట ఘంటసాలవారు పాడిన విధానం మనం ఊయలలో మెల్లగా పైకీ, క్రిందికి ఊగుతున్న భావన కలిగిస్తుంది.
ఇక ఆఖరున 'ఆ.. మనసులోన'అంటూ ముగించిన తీరుకు శ్రోతల మనసులు ఎక్కడో విహరిస్తాయి.
ఈ పాటలో ఎక్కడా వాద్యాల హోరు మచ్చుకైనా కనపడదు. గాయకుడి గాత్రానికి వాద్యాలు సున్నితంగా సహకరించాలే తప్ప గాయకుడి పాటను - డామినేట్ - అధిగమించకూడదు.
ఇదే ఘంటసాలవారు చివరి వరకు అనుసరించిన వాద్యగోష్టి నిర్వహణా విధానం. ఈ పాటలో కేవలం ఫ్లూట్, వీణ, వైలిన్స్, తబలా, రిథిమ్స్ మాత్రమే పాట ఔచిత్యాన్ని ఇనుమడింపజేస్తూ వినిపిస్తాయి.
ఈ పాట చిత్రీకరణ కూడా చాలా సహజ వాతావరణం లో ఎన్.టి.రామారావు, సావిత్రిల సున్నిత హావభావాలతో ఏ హంగు ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది.
ఈ విధమైనటువంటి భావ సౌందర్యం గల అచ్చ తెనుగు పాటలకు, గాయకులకు ఈనాడు మనము దూరమయ్యాము.
సంగీత, సాహిత్యాలలో తగిన ప్రవేశం లేని కారణంగా నేను ఈ పాట ఔన్నత్యాన్ని తగు రీతిలో ఇంకా బాగా విశ్లేషించలేకపోయానని భావిస్తున్నాను.
మదిలో సదా మెదిలే మరో ఘంటసాల సజీవరాగం తో మళ్ళీ వచ్చే ఆదివారం ..
అంతవరకు ఈ శీర్షిక నుండి శెలవు.
-ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment