Saturday 28 October 2023

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవ రాగం - మొదటి భాగం - మొదటిభాగం-జయ జననీ - మన దేశం


"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

 "నీ గుణ గానము

 నీ పద ధ్యానము

 అమృత పానము రాధేశ్యామ్..." 

ఘంటసాలవారు ఆలపించిన ఈ భక్తిగీతంలోని పలుకులు అక్షరాల వారిపట్ల సార్ధకమయినవి. ఘంటసాలవారి గుణగణాలను తలచుకుంటూ, వారి పాటలను మననం చేసుకోవడం అమృతపానము వంటిది. ఆ అదృష్టం రసజ్ఞత తెలిసినవారికి తప్ప అన్యులకు లభ్యము కాని మహద్భాగ్యం. 

సంగీత కుటుంబం లో జన్మించడంవలన రాగ, తాళ, శృతిబధ్ధమైన సుశ్రావ్య సంగీతాన్ని ఆస్వాదించే రసజ్ఞత సహజంగానే నాలో ఏర్పడింది. 

నా చిన్నతనంలో అంటే ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతున్న రోజులనుండి ఒక పాటను మా మాస్టర్లు పాడగలిగిన పిల్లలతో ప్రార్ధనాగీతంగా రోజూ స్కూల్లో పాడించేవారు. మిగతా పిల్లలంతా కూడా పెదవులు కదిపేవారు. రిపబ్లిక్ డే అయినా, ఆగస్ట్ 15 అయినా, గాంధీజయంతి అయినా ఆ పాట తప్పక వినిపించేది. వినడానికి, పాడడానికి చాలా ఉత్సాహంగా, హాయిని కలిగించేదిగా ఆ గీతం ఉండేది. 

 ఆ పాటే "జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ" అనే ప్రబోధగీతం. 

స్కూల్ ఫంక్షన్స్ లోనూ, లౌడ్ స్పీకర్లలోనూ ఈ పాట వినిపించేది. చాలాకాలం వరకు ఆ పాట జాతీయగీతమనే అనుకునేవాడిని. టెలివిజన్ లలో సినీమాలు వేయడం ప్రారంభించేక ఒకసారి 'మన దేశం' అనే అతిపాత సినీమా ను చూడడం తటస్థించింది. ఆ సినీమా ప్రారంభంలో టైటిల్స్ మీద " జయ జననీ పరమ పావని" అనే ఈ ప్రబోధగీతం వినవచ్చింది. అప్పుడే తెలిసింది ఇదొక సినీమా గీతమని. 

పాఠశాల విద్యార్ధులను ఎంతో ప్రభావితం చేసిన ఈ ప్రబోధగీతాన్ని శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసారు. ఘంటసాల, సి.కృష్ణవేణి, బృందం కలసి ఈ పాట పాడారు. క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంగా తీసుకొని నటి, గాయని, మీర్జాపురం రాజావారి సతీమణి శ్రీమతి సి కృష్ణవేణి నిర్మించిన చిత్రం 'మనదేశం'.

 బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్.టి.రామారావును తెలుగువారికి పరిచయం చేసిన చిత్రం 'మనదేశం'.


                                                           


"జయ జననీ పరమ పావని" పాట ద్వారా తెలుగు ప్రజలందరిలో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, దేశభక్తిని పురిగొల్పారు రచయిత శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు. ఈ పాటలో ఆసేతు హిమాచల పర్యంతం గల సస్యశ్యామలమైన మన భారతదేశం గురించి, భౌగోళిక వైశిష్ట్యాన్ని గురించి ఔన్నత్యం గురించి ఆచార్యులవారు వర్ణించి చెప్పారు. నైసర్గికంగా అమరిన పర్వతశ్రేణులను అద్భుతంగా వర్ణించారు.  "శీతశైల మణి శృంగ కీరీటా ..... వింధ్య మహీధర మహా మేఖలా విమల కాశ్మీర కస్తూరి రేఖా... అంటూ సముద్రాలవారు ప్రయోగించిన పదజాలం వీనులకు విందు చేకూరుస్తుంది.

అలాగే మరో చరణంలో భారత దేశంలో ప్రవహిస్తున్న జీవ నదుల గురించి వర్ణిస్తూ ... "గంగా సింధూ మహానది గౌతమి, కృష్ణ, కావేరీ జీవసార పరిపూజిత కోమల సస్య విశాలా శ్యామలా..." అంటూ భరతమాత ఔన్నత్యాన్ని కీర్తిస్తూ అటువంటి ఉత్కృష్ట దేశంలో జన్మించడం మన అదృష్టమని ప్రజల హృదయాలలో చైతన్యం రేకెత్తించారు శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు.

ముత్యాలసరాల వంటి సరళ పదజాలానికి లాలిత్యంతో కూడిన సంగీతం సమకూర్చి శ్రీమతి సి.కృష్ణవేణి బృందంతో గానం చేసిన శ్రీ ఘంటసాలవారి గళంలోని మార్దవం, శ్రోతలను పరవశులను చేస్తుంది. ఆయన గురించి ఎందరు ఎన్ని నోళ్ళ పొగిడినా తక్కువే. తెలుగు భాషలోని సౌందర్యమంతా ఘంటసాలవారి సుస్పష్టమైన ఉచ్ఛారణలో, అనన్యసాధ్యమైన గాత్రధర్మంలో, భావ ప్రకటనలో, సుశ్రావ్యమైన గానంలో ప్రకటితమయింది. 

ఈ గీతం ఘంటసాలవారి తొలి మూడు చిత్రాలలో ఒoకటైన "మన దేశం" లోనిది. "కీలుగుఱ్ఱం", "మనదేశం", "లక్ష్మమ్మ" సినీమాలతో ఘంటసాల పేరు యావదాంధ్ర దేశమంతా మార్మోగింది. ఇంతితై వటుడింతై అనే రీతిలో ఘంటసాలవారి సంగీత విశ్వరూపం అనతి కాలంలోనే దిగంతాలకు ప్రాకింది. 

"జయ జననీ పరమ పావనీ" అనే ఈ గీతాన్ని ఘంటసాలవారు 'శుధ్ధ సావేరీ' రాగంలో స్వరపర్చారు. 'శుధ్ధ సావేరి' కర్ణాటక మేళకర్త రాగమైన "ధీరశంకరాభరణం" యొక్క జన్య రాగం. ఈ రాగంలో కేవలం ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి. శుద్థ సావేరీ రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'దుర్గ' అంటారు. ఘంటసాలవారు ఈ పాటకు వైలిన్స్, ట్యూబోఫోన్, జలతరంగ్, సాక్సోఫోన్, తబలా మొదలగు వాద్యాలను నేపథ్యంలో ఉపయోగించినట్లు గమనించగలం.

తెనుగు భాషలో, తెలుగువారిచే రూపొందించబడిన గీతమనే కొరత తప్ప (ప్రాంతీయ దురభిమానులకు) అన్యధా ఈ గీతం సర్వ విధాలా ఇతర జాతీయగీతాల జాబితాలో చేర్చదగ్గ ఉత్తమ జాతీయగీతం. పెద్దలంతా ఈ తరం పిల్లలందరికీ తప్పక నేర్పవలసిన ఉత్తేజభరిత గీతం. మదిలో మెదిలే ఘంటసాలవారి మరో మధురగీతంతో మళ్ళీ వచ్చేవారం..... 

 

🌺🙏ప్రణవ స్వరాట్🙏🌺

 జయజననీ పరమ పావనీ గీతం  ఇక్కడ  వినండి.


 


                                               



ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...