Saturday, 18 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై తొమ్మిదవ భాగం ఇక్కడ  

30వ సజీవరాగం - రసికరాజ తగువారము కామా
చిత్రం - జయభేరి
సంగీతం - పెండ్యాల

ముందుగా చిన్న ఆలాపన...
తర్వాత పాట పల్లవి -

రసికరాజ తగువారము కామా - 3

అగడు సేయ తగవా
ఏలు దొరవు అరమరికలు లేక 
ఏలవేల సరసాల సురసాల - ఏలు !! - 2
చరణం :

నిన్ను తలచి గుణగానము చేసి - 3
దివ్యనామ మధుపానము చేసీ !! నిన్ను!!

స్వరకల్పనలు - వివిధ స్థాయీ భేదంతో

నిన్ను దలచి గుణగానము చేసి
దివ్యనామ మధుపానము చేసి
సారసాక్ష మనసా వచసా
నీ సరస చేరగనే సదా వేదనా
ఏలు దొరవు అరమరికలు ఏల
ఏలవేల సరసాల సురసాల ఏలు దొరా......

గతవారం ఘంటసాలవారి సజీవరాగంగా 'దర్బారీకానడ' రాగంలో ' శివశంకరి శివానందలహరి' ని గుర్తు చేసుకున్నాం. ఈ వారం 'చక్రవాక, కానడ రాగాల మిశ్రమం అయిన "రసికరాజ తగువారము కామా" అనే ఆపాతమధురాన్ని మరోసారి ఆస్వాదిద్దాము.

శాస్త్రీయ సంగీత బాణీలో ఘంటసాల వారు అద్వితీయంగా ఆలపించి ఆ గీతానికి శాశ్వతత్వం కల్పించారు. నిజం చెప్పాలంటే 'శివశంకరి' పాటకు
ముందే ' రసికరాజ' తెలుగువారి హృదాయాలలో సుస్థిరపీఠం వేసుకు కూర్చుంది. అక్కినేని నాగేశ్వరరావుగారికి 'రసికరాజా', ఎన్.టి.రామారావుగారికి 'శివశంకరి' గీతాలను ఆలపించడం ద్వారా  ఘంటసాల ఆ ఇద్దరు మహా నటుల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసారు.

ఈనాటి సజీవరాగం 'జయభేరి'  సంగీత రసభరిత చిత్రంలోనిది. ఇటీవలే 'మదిశారదాదేవి' పాటను గురించి చెప్పుకున్నప్పుడు 'జయభేరి' సినిమా పూర్వాపరాలు ముచ్చటించడం జరిగింది.

శివశంకరి, రసికరాజ  -  ఈ రెండు పాటలకు  మూలాధార రాగం 'కానడ'
కర్నాటక సంగీత 'కానడ' రాగం నుండే హిందుస్తానీ 'దర్బారీకానడ' ఆవిర్భావం జరిగిందని చెపుతారు.

"రసికరాజ తగువారము కామా" పాటకు కథాపరంగా కవి మల్లాది రామకృష్ణశాస్త్రిగారు పెట్టిన పేరు 'విజయానందచంద్రిక'. ఈ
పాటలో చక్రవాక, కానడ రాగాలు రెండూ వున్నాయి. 
చక్రవాకం కర్నాటక సంగీతంలో 16 వ మేళకర్త రాగం. దీనికి దగ్గరలో వుండే హిందుస్థానీ రాగం అహిర్ భైరవ్. కానడ రాగం  20వ మేళకర్త రాగమైన నఠభైరవి జన్యం. 72 మేళకర్తల స్వరాల సమ్మేళనతో అనగా ఆయా స్వరాల permutations and combinations తో సుమారు ముప్ఫైవేల రాగాల రూపకల్పనకి సావకాశం ఉంది. అందులో నామకరణం జరిగిన 2044 రాగాల పేర్లు 1914 లో ముద్రితమైన 'సంగీతప్రస్తారసాగరం' అన్న గ్రంథంలో గ్రంథస్థమై ఉన్నాయి. అటువంటి గ్రంథాలలో మరికొన్ని రాగాల పేర్లు ఉండవచ్చు.   కానీ ఆ పేరు పెట్టబడిన రాగాలలో చక్రవాక-కానడ రాగస్వరమిశ్రమానికి ఏ పేరూ ఉన్నట్టు కనిపించదు. సంగీత గ్రంథాలలో నామకరణం జరగని ఆ స్వర మిశ్రమానికి  'విజయానందచంద్రిక' అన్న పేరు పెట్టిన సాహితీవేత్త మల్లాదివారి సంగీతజ్ఞానం ఈ పాట ద్వారా తెలుసుకోగలం. అంతేకాదు నేను ఓ కొత్త రాగం కనిపెట్టేను అని మల్లాదివారు జబ్బలు చఱచుకోలేదన్నదీ గమనించాల్సిన విషయమే. 

పెళ్ళిచేసి చూడు చిత్రం ద్వారా 'చక్రవాక' రాగాన్ని  తొలిసారిగా సినీ సంగీతలోకానికి పరిచయం చేసిన ఘనత ఘంటసాలవారిదే.

రసికరాజ, శివశంకరి పాటలకు సృష్టికర్త పెండ్యాలగారైతే, రసపుష్టికర్త శతాబ్ది గాయకుడు ఘంటసాలగారు. వీరిద్దరు ఈ రెండుపాటల ద్వారా తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసారు. ఈ రెండు పాటలు వెలువడి ఆరు దశాబ్దాలు దాటినా ఈ పాటలను తలచుకోని, మననం చేయని తెలుగువారు వుండరంటే అది అతిశయోక్తికానేకాదు. 

ఘంటసాలవారి పరిపూర్ణ సంగీత ప్రతిభ 'రసికరాజ' పాటలో దర్శనమిస్తుంది. 
ఒక గాయకుడికి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం, ప్రవేశం, అవగాహన ఎంత ముఖ్యమో ఈ రెండు పాటలు పాడేవారికి తెలుస్తుంది. సంగీతాభ్యాసం ప్రారంభదశలో గురువులు సంగీత విద్యార్ధుల చేత నిరంతరం అకార సాధన చేయిస్తారు. అందులో కఠోరసాధన చేసిన పరిపూర్ణత పొందగలిగినవారు మాత్రమే "రసికరాజ తగువారము కామా" వంటి పాటలు పాడడానికి సాహసం చేయగలుగుతారు. ఈ గీతంలో సాహిత్యం కంటే స్వరకల్పనలకే ప్రాధాన్యత నిచ్చారు. అవి సమస్థాయిలో, మంద్రస్థాయిలో ఒకేసారి సాగుతాయి.  ఇందుకు నాదశుధ్ధి ఎంతో అవసరం. సంప్రదాయబధ్ధంగా శాస్త్రీయ సంగీతంలో విశేష కృషి చేసినవారే ఈ తరహాపాటలను శ్రుతిశుధ్ధంగాఅత్యంత శ్రావ్యంగా అలపించగలుగుతారు. ఈ విషయంలో ఘంటసాలవారి ఆరేళ్ళ అసుర సాధన
తర్వాతి కాలంలో సినీమా రంగంలో ఆయనకు ఎంతగానో ఉపయోగించింది.

జయభేరి చిత్రంలో ' రసికరాజ తగువారము కామా' అంటూ మహారాజు సమక్షంలో ఒక సంగీత కళాకారుడు కచేరీ పధ్ధతిలో ఆలాపన మొదలెడతాడు. స్వరకర్త పెండ్యాల , గాయకుడు ఘంటసాల ఇద్దరకు ఇద్దరే. Perfection విషయంలో ఒకరికొకరు పోటీ. శాస్త్రీయ సంగీతకచేరీ బాణీ స్ఫురించేలా  పెండ్యాలగారు ఈ పాటలో వీణ, వైలిన్స్,  మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్  వంటి భారతీయ వాద్యాలనే ఉపయోగించి మెట్టు కట్టారు. కచేరీ పధ్ధతిలోలాగే వాద్యకారుల తనీ ఆవర్తనాలు ఈ గీతంలో వినిపిస్తాయి. చక్రవాక- కానడ రాగ లక్షణాలు,  రాగభావం, రసపోషణ ఘంటసాలవారి గాత్రంలో నూటికి నూరుపాళ్ళు గోచరిస్తాయి.

మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు వ్రాసిన 'రసికరాజ తగువారము కామా' పాట సాహిత్యపరంగా కూడా ' ఎంతో ఉన్నతమైనది.  

అగడు సేయు ( అవమానించు); సురసాల (కల్పతరువు);
ఏల, ఏలు మాటలతో వివిధార్ధాలు ధ్వనింపజేసారు; దివ్యనామ మధుపానము;
సారసాక్ష ( కమలాక్షుడు); మనసా, వచసా - వంటి పదప్రయోగాలతో మల్లాదివారు ఎంతటి ఉన్నతస్థాయి కవివరేణ్యుడో మనకు అవగతమవుతుంది.

మహారాజులు ఆగ్రహానుగ్రహ సమర్ధులు. రాజుల ఆదరణ పొందాలంటే వారిని రకరకాల స్తోత్రాలతో సంతృప్తిపరచి  ఆనందపర్చాలి. వారి మెప్పులు పొందాలి. 
అందుకు తగిన విధంగా గీతం ఆరంభంలోనే మహారాజుకు ప్రీతిపాత్రమైన చక్రవాక, కానడ రాగాలు మిళితంచేసి 'విజయానందచంద్రిక' పేరుతో మహారాజును, సభలోని పండితులను మెప్పింపజేయాలని ఆశిస్తున్నట్లు  జనపద కళాకారుడుగా పేరు పొందిన ఆ గాయకుడు ప్రకటించి తన దేవగానాన్ని ప్రభువుల ముందు వినిపిస్తాడు. అందుకు తగిన ఆణిముత్యాలవంటి మాటలను పొదిగారు మల్లాదివారు. 

ఎంతో ఉదాత్తము, గంభీరము అయిన ఆ సన్నివేశంలో మహారాజుగా ఎస్.వి.రంగారావు, ఆ జనపద గాయకుడంటే విముఖత కలిగిన రాజనర్తకిగా రాజసులోచన, వీరందరి మెప్పులు పొందడానికి పోటీ పరిక్షకు సిధ్ధపడిన గాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు అతని భార్యగా అంజలీ దేవి అద్యంతం
అద్భుతంగా నటించారు.

ముఖ్యంగా కథానాయకుడు అక్కినేనివారికి ఈ పాత్ర చాలా క్లిష్టతరమైన పాత్ర. మామూలు లలితగీతాలకు నటించడం వేరు, ఈలాటి శాస్త్రబధ్ధమైన గీతాలకు నటించడానికి సంగీత విద్వాంసుల ఆహార్యం, హావభావల పట్ల అవగాహన చాలా ముఖ్యం.

ఈ పాట సందర్భంలోని విషయాన్ని, పాటకి ముందు పాత్రల సంభాషణ చూస్తే ఈరోజు  అటువంటి సందర్భాన్ని, కథని ఊహించి అంతటి ఔచిత్యంతో సంభాషణలు రాయగలిగే రచయితలు, దాన్ని అంత అద్భుతంగానూ దృశ్యీకరించగల దర్శకులు, ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగల నటులూ లేరనే అనిపిస్తుంది.

ఘంటసాలవారి గానంలోని సంగతులు, గమకాలు, స్వరకల్పనలు వాటన్నికి తగినట్లు పెదవులను, కంఠనాళాలను కదల్చడం, అందుకు తగిన హావభావాలను తన ముఖంలో ప్రదర్శించడం విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు చూపిన టైమింగ్, ప్రతిభ అమోఘమైనది. కేవలం గాయక నటులు మాత్రమే అంత నిర్దుష్టంగా నటించగలుగుతారు. ఈ విషయంలో అక్కినేనిని మించిన నటులు బహు అరుదు.

చిత్ర జయాపజయాల విషయం పక్కనపెడితే పి.పుల్లయ్యగారి దర్శకత్వంలోని  'జయభేరి' ఒక గొప్ప సంగీత దృశ్యకావ్యం. తెలుగు సినిమా కీర్తి కిరీటంలో పొదగబడిన అమూల్య రత్నం.

ఒక కళాకారుడి ప్రతిభని అంచనావేసే విషయాలు ఆ కళాపరమైనవిగానే ఉండాలి తప్ప అతని కులం, మతం, ప్రాంతం, భాషా, వ్యక్తిగత అభిప్రాయాల ప్రాతిపదికనగాదు అన్నది సినిమాలో ఈ పాట సందర్భంలోని విషయం. కానీ ఈ సినిమా విడుదలైన అరవై అయిదేళ్ళ తరవాత కూడా కొందరి ఆలోచనాధోరణి అంతలోనే, ఆ గిరిలోనే  కొట్టుకుంటూండడం ఆశ్చర్యం. జయభేరి సినిమాలోని కాశీనాథశాస్త్రి  వ్యక్తిత్వం, ఈ సంవత్సరం మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వారి "సంగీత కళానిధి" పురస్కార వివాదంలోని కేంద్రబిందువు శ్రీ T M కృష్ణ వ్యక్తిత్వాలలోని సారూప్యం గమనించకుండా ఉండలేము. ఆ విషయం గ్రహించడానికే ఈ పాట సందర్భంలోని ముందు మాటలతో ఈరోజు వీడియో సమర్పిస్తున్నాను. 








వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...