చిత్రం - పూలరంగడు
గానం - ఘంటసాల
రచన - కొసరాజు
సంగీతం - ఎస్.రాజేశ్వరరావు
పల్లవి :
ఓహో ! హెయ్య....
నీతికి నిలబడి నిజాయితీగా
పదరా ముందుకు పదరా
అహ ఛల్ రే బేటా ఛల్ రే !
నీతికి!
తాతల తండ్రుల ఆర్జన తింటూ
చరణం 1:
జలసాగా నువు తిరగకురా - 2
కండలు కరగగ కష్టం చేసి
తలవంచక జీవించుమురా
పూలరంగడిగా వెలుగుమురా
హెయ్య! నీతికి!
పెంచిన కుక్కకు రొట్టె
మేపుతూ
హుషారుగా ఒకడున్నాడూ
బల్ ఖుషీ ఖుషీగా వున్నాడూ
కన్నబిడ్డకు గంజి దొరకక
ఉసూరుమని ఒకడున్నాడూ.....
ఛల్ ఛల్ రే...
!నీతికి!
చరణం 3:
ఉన్నవాడికి అరగని జబ్బు
లేనివాడికీ ఆకలి జబ్బు
ఉండీ లేని మధ్య రకానికి
చాలీచాలని జబ్బురా
ఒకటే అప్పుల జబ్బురా!
కష్టాలెన్నో ముంచుకు వచ్చినా
కన్నీరును ఒలికించకురా
కష్టజీవుల కలలు ఫలించే
కమ్మనిరోజులు వచ్చునురా
చివరకు నీదే విజయమురా
!నీతికి నిలబడి నిజాయితీగా
పదరా ముందుకు పదరా.....!
ఉన్నవాడు- లేనివాడు... ఈ ఆర్ధిక అసమానత్వం మన సమాజంలో ఏనాడు ఉద్భవించిందో గానీ ఈనాటికీ మనలను పట్టి పీడిస్తూనేవుంది. ఈ ఊబిలోంచి బయటపడే మార్గం కానరాక కొట్టుమిట్టాడుతూనేవున్నాము. ఏనాడో ఐదున్నర దశాబ్దాల క్రితం కొసరాజుగారు రాశారు 'పూలరంగడు'
సినిమా కోసం, ఏమని, ... 'ఉన్నవాడికి అరగని జబ్బు లేనివాడికి ఆకలి జబ్బు ఉండీ లేని మధ్య రకానికి అప్పుల జబ్బు' అని. కన్నబిడ్డలకు గుక్కెడు గంజి కోసం ఒకడు అలమటిస్తూంటే, తన డాబును దర్జాను చాటుకునేలా పెంపుడు కుక్కలపై వేలకు వేలు ఖర్చు పెట్టే అమీర్లు ఒక వైపు. ఈ పరిస్థితిలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేమీ రాలేదు. ఆనాడు ఎలా ఉన్నామో, ఈనాడూ అలానే ఉన్నాము. ఈ అంతరాన్ని గుర్తు చేస్తూ ఘంటసాలగారు ఆలపించిన 'నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా' అనే గీతమే ఈనాటి మన సజీవరాగం.
ఈ పాటలో కొసరాజుగారు ' పూలరంగడు' అంటే ఎవరో మనకు తేటతెల్లం చేశారు. పెద్దలు సంపాదించిన ఆస్తులను దుర్వ్యసనాల కోసం దూబరాగా ఖర్చు చేస్తూ జల్సాగా కులాసాగా తిరిగేవాడు పూలరంగడనిపించుకోడు. పూలరంగడంటే కండలు కరిగేలా కాయకష్టం చేసి ఆ వచ్చిన సంపాదనతో ఎవరికీ తలవంచక నీతి నిజాయితీ లతో ఇతరులకు సహాయపడుతూ తాను సంతోషంగా వుంటూ ధైర్యంగా ముందుకు సాగేవాడే అసలు సిసలు 'పూలరంగడు' అంటారు.
ఎ జె క్రానిన్ అని స్కాట్లెండ్ లో ఒక ఆంగ్ల రచయిత. 1953లో ఆయన వ్రాసిన 'బియాండ్ దిస్ ప్లేస్' అనే నవల ఆధారంగా బెంగాలీలో ఉత్తమకుమార్ తో ఒక సినిమా వస్తే దానిని హిందీలో 'కాలాపానీ' గా దేవానంద్ తో తీశారు. 1959 లో వచ్చిన ఆ సినీమాలోని మూలకథను మాత్రమే తీసుకొని దుక్కిపాటి మధుసూదనరావుగారు ఆదుర్తి నిర్దేశకత్వంలో 'పూలరంగడు' సినిమాను అక్కినేని నాగేశ్వరరావు కధానాయకుని గా నిర్మించారు.
జమున, నాగయ్య, గుమ్మడి, శోభన్ బాబు, విజయనిర్మల, మొదలగువారు నటించారు. చేయని నేరం కోసం యావజ్జీవ జైలు శిక్షను అనుభవించే ఒక వ్యక్తిని అతని కొడుకే అసలు నేరస్తుడిని కనిపెట్టి తండ్రిని నిరపరాధిగా నిరూపించి బయటకు తీసుకురావడం ఈ సినిమా కథ సారాంశం.
ఈ ఫార్ములా ఇండియాలో బాగా క్లిక్ అయింది. బెంగాలీ, హిందీ, తెలుగు భాషలలో సూపర్హిట్ కావడంతో 1970లో ఎమ్.జి.ఆర్. జయలలిత తమిళంలో 'ఎంగ అణ్ణన్' గా తమిళనాట కూడా ఘనవిజయం సాధించింది. ఈ కథ మీది వ్యామోహంతో ఆదుర్తి సుబ్బారావు గారే స్వయంగా 1972 లో మళ్ళా హిందీలో 'జీత్' గా రణధీర్ కపూర్, బబితలతో తీసారు. ముడి పదార్ధంలో సత్తా వుంటే అది సత్ఫలితాలనే ఇస్తుంది.
'పూలరంగడు' సినిమా టైటిల్స్ మీద వచ్చే ఈ పాటను ఘంటసాలగారు బల్ హుషారుగా ఆలపిస్తే భాగ్యనగర్ రోడ్లమీద, పబ్లిక్ గార్డెన్స్ లో జట్కాబండిని తోలుతూ ఎ.ఎన్.ఆర్. మరింత ఖుషీ ఖుషీగా నటించారు.
(1960 ల నాటికే మా బొబ్బిలి లాంటి చిన్న చిన్న టౌన్లలోనే గుర్రపు జట్కాల హవా అంతరించి సైకిల్ రిక్షాల కాలం ప్రారంభమయింది. మరి 1967లో కూడా హైదరాబాద్ వంటి మహా నగరంలో హీరో జట్కాబండి తోలడాన్ని చూపించారంటే అతనెంత కాయకష్టం చేసి, నిజాయితీగా బ్రతికాడో ప్రేక్షకులం మనమే అర్ధం చేసుకోవాలి.
కథానాయకుని లక్ష్య లక్షణాలు తెలియజేసే కొసరాజుగారి పాటకు రసరాజేశ్వరరావుగారు ఇచ్చిన టెంపో పాట ఆద్యంతం శ్రోతలను ఆనందపరుస్తుంది. రాజేశ్వరరావు ఈ పాటను తనదైన స్టైల్ లో లోనియన్ మోడ్ స్వరాలతో కూర్చారు. వెస్ట్రన్ మ్యూజిక్ లో మేజర్ స్కేల్ . ప్రపంచంలోని అన్ని సంగీత శైలులలో వినపడే సర్వ గమక సంపూర్ణం రాగం. దీనిని హిందుస్థానీ వారు బిలావల్ అంటే దాక్షిణాత్య సంగీత శైలిలో ధీరశంకరాభరణం(శంకరాభరణం) అంటారు.29 వ మేళకర్త రాగం ఎంతో శ్రావ్యంగా, సున్నితంగా వుంటూ శ్రోతల మనసులను రంజింపజేస్తుంది. ఈ మేళకర్త రాగానికి ఉన్న జన్యరాగాలు కూడా జనరంజకమైనవే. అలాటి శంకరాభరణం రాగ స్వరాలతో రాజేశ్వరరావుగారు చేసిన ఈ జట్కాబండి పాట వెర్సటైల్ సింగర్ అయిన ఘంటసాల మాస్టారికి నల్లేరు మీద బండి నడకే. అందుకే ఎన్ని దశాబ్దాలైనా నీతికి నిలబడి నిజాయితీగా ఘంటసాల గానాభిమానులంతా వారి పాటలను అనుక్షణం మననం చేసుకుంటూ తమ స్వరప్రస్థానంలో ముందుకు సాగిపోతూనే వున్నారు.
సాలూరివారి సంగీత
దర్శకత్వంలో ని పాటలంటే అమృతగుళికలే.
మాస్టారు పాడిన ఈ పాటే కాక ఇతర పాటలు కూడా బహుళ జనాదరణ పొందాయి. కొసరాజుగారే రాసిన ఘంటసాల మాస్టారు, నాగయ్యగారు కలసి పాడిన
"చిల్లర రాళ్ళకు మ్రొక్కుతు వుంటే చెడిపోదువురా ఒరే ఒరే' పాట, అలాగే, ఆనాటి దేశకాలమాన
పరిస్థితులకు దర్పణం పట్టే విధంగా మాస్టారు, సుశీల, జమున కలసి ఆలపించిన బుర్రకథ అన్నపూర్ణా వారి బ్యానర్ ఖ్యాతిని మరింత
ఇనుమడింపజేసి అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకోవడానికి దోహదపడాయి.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment