చిత్రం - బందిపోటు దొంగలు
గానం - ఘంటసాల
రచన - దాశరధి
సంగీతం - పెండ్యాల
పల్లవి :
విరిసిన వెన్నెలవో
పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ
చెలీ నీవెవరో
!విరిసిన!
సిగలో గల జాబిల్లి
చిరునగవులు చిందగా ఆ... - 2
అడుగడుగున హంసలూ
వొయ్యారములొలుకగా
వెదికే పెదవులతో తొణికే మధువులతో - 2
పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ
!విరిసిన!కరుణలేని శిలనైనా
కరిగించే నవ్వుతో ఓ... - 2
ముల్లునైన మల్లియగా
మలచే కనుదోయితో ...
నడిచే తీవియవై పలికే దీపికవై -2
అవతరించి ఆవరించి అలరించే నా చెలీ
!విరిసిన!
దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వర ప్రసాదం అందం. ప్రకృతిలోని అందం, స్త్రీ పురుషులలోని అందం మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. 'A thing of beauty is a joy for ever' అని అంటాడు సుప్రసిద్ధ ఆంగ్ల కవి జాన్ కీట్స్. సౌందర్య శాస్త్రంలో ప్రధాన అంశం అందమే. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను కలిగించి వారిలో ప్రేమభావనలను ప్రేరేపించేది నిశ్చయంగా అందమే. ఏది అందం అన్నదానికి సరైన నిర్వచనం ఎవరూ చెప్పలేరు. అది మనిషి మనిషికి వారి వారి తత్త్వాన్ని బట్టి మారుతుందనే చెప్పాలి. ఆది కాలం నుండి కవులకు, గాయకులకు గొప్ప కవితా వస్తువు స్త్రీ అందమే. స్త్రీ సౌందర్యాన్ని వర్ణిస్తూ వెలువడిన కవితలు, వాటి ఆధారంగా రూపొందించబడిన గీతాలు అసంఖ్యాకం. అందమైన స్త్రీని చూడగానే ఆమెను ఆపాదమస్తకం ఉత్తమోత్తమ విశేషణాలతో వర్ణించాలనే ఆకాంక్ష ప్రతీ వ్యక్తిలో అంతో ఇంతో వుంటుంది.
'బందిపోటు దొంగలు' అనే సినిమాలో కథానాయిక అందానికి ముగ్ధుడైన కథానాయకుని మనోభావాలే ఘంటసాలవారి మధురస్వరంలో సజీవరాగమై 'విరిసే వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో' అనే పాటగా తెలుగు సినీ సంగీతాభిమానులను అలరిస్తూన్నది. కథానాయకునికి ఆ యువతి అపరిచిత కాదు. వారిలో ఏ భావనలు లేనప్పుడు పలు సందర్భాల్లో కలుసుకోవడం జరుగుతుంది. క్రమేపీ పరస్పర ప్రేమానురాగాలు పెరిగాక ఒక ఫంక్షన్ లో ఆ యువతిని చూసినప్పుడు ఆమెలోని కొత్త అందాలేవో అతని చేత 'ఓ చెలీ చెలీ నీవెవరో' అంటూ పాడిస్తాయి. శృంగార గీత రచనలో ఆరితేరిన మధురకవి దాశరధిగారు ఈ పాటలో ' విరిసిన వెన్నెల ', 'పిలిచిన కోయిల', ' తీయని కోరిక',' సిగలో జాబిల్లి', అడుగడుగున హంసల వయ్యారం', 'ముల్లునైన మల్లియగా మలచే కనుదోయి', 'పలికే దీపిక' నడిచే తీవె' అంటూ ఆ యువతి అందాన్ని మెచ్చుకోలుగా వర్ణిస్తారు. శ్రావ్యతకు మారుపేరైన ఘంటసాలగారు ఈ పాటను అత్యంత మృదుమధురంగా ఆలపించారు. ఇక ఇలాటి శృంగార గీతాలను అభినయించడంలో ఎ.ఎన్.ఆర్. ను మించినవారెవరు? సాత్వికంగా, సున్నితమైన హావభావాలతో అక్కినేని ఈ పియోనా పాటను చాలా సహజంగా రక్తి కట్టించారు. సినిమాలో ఇదొక కీలకమైన ఘట్టం కావడం వల్ల ఈ పార్టీ సన్నివేశంలో ఎ.ఎన్.ఆర్. తో పాటు కథానాయిక జమున, బందిపోటు దొంగల నాయకుడు జగ్గయ్య, కె.వి.చలం, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, రాజబాబు,నాగభూషణం ఇత్యాది ప్రముఖ తారాగణమంతా కనిపిస్తారు.
పల్లవి, చరణాల మధ్య వచ్చే ఆలాపనల మీది సంగతులు, గమకాలు తనకు మాత్రమే సాధ్యం, సొంతం అనే రీతిలో ప్రేక్షక హృదయాలను తాకుతూ అతి శ్రావ్యంగా ఘంటసాల మాస్టారు గానం చేశారు. పియోనా, వైయొలిన్స్, సెల్లో, తబలా, డోలక్ లు ప్రధాన వాద్యాలు గల ఈ మెలడీని కీరవాణి, సింధుభైరవి రాగ స్వరాల మిక్స్ తో మనోహరంగా మలచారు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు. కీరవాణి కర్నాటక సంగీతంలో 21వ మేళకర్త రాగం. వెస్ట్రన్ మ్యూజిక్ సిస్టమ్ లో దీనిని 'హార్మోనిక్ మైనర్ స్కేల్' అని అంటారు. అందువల్లనే ఈ స్వరాలు ఈ పియోనా పాటకు చాలా అనువుగా అమరి ఘంటసాలగారి గళం నుండి వీనులవిందు చేశాయి.
'బందిపోటు దొంగలు' వంటి ఏక్షన్ సినిమాలో ఇలాటి మంచి పాట చోటు చేసుకుందంటే అందుకు కారణం పెండ్యాల, ఘంటసాల,అక్కినేని, జమునల కాంబినేషన్ వల్లనేనని చెప్పకతప్పదు. 'పాండవ వనవాసం' వంటి భారీ పౌరాణిక చిత్రం నిర్మించిన ఏ.ఎస్.ఆర్ ఆంజనేయులు సమర్పణలో వచ్చిన ఈ సినిమాను కె.ఎస్.ప్రకాశరావు డైరక్ట్ చేశారు.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment