చిత్రం - గోవుల గోపన్న
గానం - ఘంటసాల
రచన - కొసరాజు
సంగీతం - ఘంటసాల
పల్లవి :
ఓ...ఓ...ఓ.... వినరా వినరా నరుడా
తెలుసుకోర పామరుడా !
- 2.
గోమాతను నేనేరా ! నాతో సరిపోలవురా
!వినరా!
కల్లాకపటం ఎరుగని గంగీగోవును నేను
ఏది చెప్పినా కాదని
ఎదురుచెప్పలేను
పారేసిన గడ్డితిని
బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను
కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని మీ
కడుపులు నిండిస్తున్నా
వయస్సుడిగిన నాడు
నన్ను
కటికవాని పాల్జేస్తే
- !వయస్సు!
ఉసురు గోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను
!వినరా!
నా బిడ్డలు భూమిచీల్చి దుక్కి దున్నుతున్నవోయి
నా ఎరువున పైరు
పెరిగి పంట పండుతున్నదోయి
నా చర్మమే మీ కాలికి
చెప్పులుగా మారునోయి - 2
నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయి
!వినరా!
సురాభయైచ నమో నమః
గవాంబీజ స్వరూపాయ
నమస్తే జగదంబికే
కుల వృధ్ధి, సత్సంతానం, ధనం, కీర్తి, సకల పుణ్యనదీ స్నాన సత్ఫలితాల కోసం ఆర్యులు కామధేను స్తోత్రాన్ని నిత్యం పఠించేవారు.యుగయుగాలుగా గోవు పరమ పవిత్రమైన దేవతా స్వరూపంగా సనాతన భారతీయులచే పూజించబడుతున్నది. కృతయుగంలో క్షీరసాగర మధన సమయాన ఆవిర్భావం చెందిన అనేక అమూల్య వస్తువులలో కామధేను అనే గోవు ఒకటి. కోరిన కోరికలు తీర్చగల అపూర్వ శక్తిగలది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సూర్యచంద్రాది దేవ ప్రముఖులు ఈ కామధేనులో వసించియుండడం వలన ఇది చాలా పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా పురాణాలలో వర్ణించబడింది. కామధేను పంచి యిచ్చిన అమృతం వంటి పాలను త్రాగి దేవతలంతా సకల సుభిక్షాలను, సుఖసంతోషాలను అనుభవించారు. ఈ కామధేను సంతతే సురభి, కపిల వంటి గోవులు. ఇవి వశిష్ఠ, కశ్యపాది మహర్షుల ఆశ్రమాలలో వుంటూ వారు చేసే యజ్ఞ, యాగాది క్రతువులకు కావలసిన సకల సామగ్రిని సమకూరుస్తూ లోక సంక్షేమానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ప్రపంచమంతా గో సంతతిని వృధ్ధిపర్చాయి. గోమాతను కులదైవంగా పూజించే ఆచారం కూడా మన దేశంలో వుంది. యుగాలు మారడంతో కాలధర్మం కూడా మారిపోతున్నది. ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల నడిచి ప్రపంచమంతా సుభిక్షంగా, సశ్యశ్యామలంగా వుండేది. ఈనాడు ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదాన కుంటి నడకలు నడుస్తోంది. మానవులలో జాలి,కరుణ,దయ అనే గుణాలు కనుమరుగై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తమ తమ స్వార్ధం కోసం జంతుజాలాన్ని తీవ్రంగా హింసిస్తున్నారు. దైవంగా, కన్నతల్లిగా భావిస్తూ వచ్చిన గోమాతను మనిషి క్రమక్రమంగా తన ధనార్జనను పెంచే ముడి సరుకుగా ఉపయోగించడం మొదలెట్టాడు. గోవు నుండి లభించే పాలు మొదలు పేడ వరకు ప్రతీది అత్యంత విలువలు కలిగి మనిషి ఆదాయానికి ఉపయోగపడుతున్నాయి.
యంత్ర సాంకేతిక పరిజ్ఞానం లేనంతకాలం పశువులే వ్యవసాయ, రవాణా సాధనాలుగా మనిషికి జీవనానికి ఆలంబన అయ్యాయి. వయసుడిగిన గోమాతను నిర్దాక్షిణ్యంగా కసాయివాడికి అమ్మగా వచ్చిన డబ్బును కూడా మనిషి ఆనందంగా అనుభవిస్తున్నాడు. చివరకు ప్రాణం పోయిన పశువుల చర్మం కూడా వివిధ తోలు వస్తువుల రూపేణా మనిషికి భోగభాగ్యాలను సమకూరుస్తున్నది.
రానురాను గోవు అంటే దైవస్వరూపం, పవిత్రమైనదనే భావన మనుషులలో క్షీణిస్తోంది. ప్రతీ ప్రాణి తన మనుగడను కాపాడుకోవడం కోసం తీవ్రంగా పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. తమ ఉనికిని ఔన్నత్యాన్ని తామే చాటిచెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడింది. మనిషి బుధ్ధి జీవి. నోరుంది. తన కష్టసుఖాలను ఇతరులకు చెప్పుకోగలడు. కానీ పశువులు తమ కష్టాలను ఎలా చెప్పుకుంటాయి. తమకు జరిగే అన్యాయాన్ని ఎలా ఎదుర్కోగలవు.
మనిషి స్వార్ధం వలన ఆవుల వంటి సాధు జంతువులు ఎంతగా హింసించబడుతున్నవో ఊహించుకుని చదువు సంధ్యలు లేని దయార్ద్ర హృదయంగల ఒక పశువుల కాపరి ఒక గోవు యొక్క స్వగతాన్ని మనసుకు హత్తుకునేలా వినిపిస్తున్నాడు. ఆ పాటే ఈనాటి మన సజీవరాగం.
తమ గుణగణాలను, కీర్తిప్రతిష్టలను, ఔన్నత్యాన్ని ఇతరులు పొగడాలే తప్ప ఎవరికి వారే చెప్పుకోవలసి రావడం చాలా బాధాకరం, దైన్యం. అటువంటి దుస్థితిని మనం ఈ గోవు పాటలో చూస్తాము. పాట ప్రారంభంలోనే ' వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా' అని అంటారు కవి కొసరాజు. పల్లెటూరిలో పశువులను కాచుకునే పామర గోపన్న పాడే గో స్వగతం ఈ పాట. ఎవరి కోసం ఈ పాట? ఇందులో పామరుడు ఎవరు? చదువు లేకపోయినా సాటి ప్రాణిగా గోవు కష్ట సుఖాలకు చలించిపోయే మంచి హృదయమున్నవాడు పామరుడా? లేక గొప్ప గొప్ప చదువులు చదివినా మానవత్వాన్ని మరచిపోయి సాధుజీవులను తన స్వార్ధం కోసం దయారహితంగా హింసించేవాడా? ఎవరు పామరుడు?
ఈ పాటలోని సాహిత్యం అత్యంత సరళం. ఐదారేళ్ళ పసిపాపలకు కూడా చాలా సులభంగా అర్ధమయే రీతిలో వ్రాసారు కొసరాజు. ఈ పాటను విని చలించనివాడే పామరుడు. అసలు నరుడే కాడు. సినిమా ఆరంభంలోనే టైటిల్స్ అయిన వెంటనే హీరో మనస్తత్త్వాన్ని పరిచయం చేసేలా వచ్చే ఈ పాట 'గోవుల గోపన్న' సినీమాలోనిది.
సున్నితంగా శ్రావ్యంగా వినవచ్చే ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు మోహన రాగ స్వరాలతో చేశారు. 28 వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగ జన్యమైన మోహన ఔడవరాగంగా జగత్ప్రసిధ్ధం. దీనికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'భూప్ ' అంటారు. అయితే పై పాటలో మోహనకు సంబంధించని అన్యస్వరాలు కూడా ప్రయోగించబడడం వలన దీనిని సినీమోహన రాగంగా చెప్పుకోవడమే సముచితం. ఫ్లూట్, క్లారినెట్, పియనో, యూనివాక్స్, అకార్డియన్, వైెయొలిన్స్, తబల, డోలక్, ఘటసింగారి వంటి వాద్యాలు ఈ పాటలో వినిపిస్తాయి.
హృదయధర్మానికి చెందిన సందేశపూర్వక గీతాలను పరిపూర్ణంగా తనలో జీర్ణింపజేసుకొని భావయుక్తంగా పాడే ఘంటసాల, దానికి తన నటన ద్వారా మెరుగులు దిద్దే అక్కినేని మధ్య గల పరస్పర అవగాహన వలన కొసరాజుగారి ఈ 'వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా' పాట కూడా ప్రజాబాహుళ్యంలోనికి చొచ్చుకుపోయి ఈనాటివరకు సజీవంగా నిల్చిపోయింది.
అమాయకుడైన పశులకాపరిగా, లా చదివిన జూనియర్ అడ్వొకేట్ గా ఎ.ఎన్.ఆర్. ద్విపాత్రాభినయం చేసిన సినిమా.
రాజ్యం పిక్చర్స్ శ్రీధరరావు& నటి లక్ష్మీరాజ్యం దంపతులు నిర్మించిన 'గోవుల గోపన్న' సినిమా కు రాజ్ కుమార్ నటించిన బి.ఆర్.పంతులు కన్నడ సినిమా 'ఎమ్మె తమ్మణ్ణ' మూలం. తర్వాత ఈ సినిమా హిందీలో జితేంద్ర తో ' జిగ్రిదోస్త్' గా , తమిళంలో ఎమ్.జి.ఆర్ తో 'మాట్టుకార వేలన్' గా వచ్చింది. ఇలా ఒకే కధ కన్నడ,తెలుగు,హిందీ, తమిళ భాషలలో సినిమాలుగా రూపొంది ఘనమైన ఆర్ధిక విజయాన్ని సాధించడం ఒక విశేషం.
కథతో ఏ సబంధం లేకపోయినా 'వినరా వినరా నరుడా' పాటలోని సందేశం సామాన్య ప్రజలందరినీ ఆకర్షించి ఈ పాట సజీవరాగంగా నిలిచేందుకు దోహదపడింది. సినిమా లో ఈ పాట రెండు సందర్భాలలో ఏకగళ గీతంగా, యుగళగీతంగా వస్తుంది.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment