Saturday, 31 May 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 84వ భాగం - టా...టా... వీడుకోలు గుడ్ బై! ఇంక శెలవు...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైమూడవ భాగం ఇక్కడ

84వ సజీవరాగం - టా...టా... వీడుకోలు గుడ్ బై! ఇంక శెలవు...   

చిత్రం - బుద్ధిమంతుడు
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర

సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి : 

'టా..టా.. వీడుకోలు

గుడ్ బై ... ఇంక శెలవు...  2

తొలినాటి స్నేహితులారా!

చెలరేగే కోరికలారా! హోయ్ 

తొలినాటి... 

                                టా...టా...

 

చరణం 1:

ప్రియురాలి వలపులకన్నా

నునువెచ్చనిదేదీ లేదని - 2

నిన్నను నాకు తెలిసింది

ఒక చిన్నది నాకు తెలిపింది

ఆ ప్రేమ నగరుకే 

పోతాను...పోతాను... పోతాను...

పోతాను ఈ కామనగరుకు 

రాను ఇక రాను... 

                                    టా...టా...

చరణం 2:

ఇచ్చుటలో వున్న హాయి వేరెచ్చెటనూ లేనేలేదని  - 2

లేటుగ తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను

ఆ స్నేహ నగరుకే పోతాను.. పోతాను..

పోతాను ఈ మోహ నగరుకు రాను ఇక రాను...  

                                    టా...టా...

చరణం 3: 

మధుపాత్ర కెదలో యింక ఏ మాత్రం చోటు లేదని - 2

మనసైన పిల్లే చెప్పింది -2

నా మనసంతా తానై నిండింది -2

నే రాగ నగరుకే పోతాను

అనురాగ నగరుకే పోతాను

హు..హు..హు.. పోతాను ఊ..హ్హా !

ఏ మనిషి స్వతహగా చెడ్డవాడు కాదు. పరిసరాలు, కుటుంబవాతావరణం,యితర సావాసాల ప్రాబల్యంతో చెడు అలవాట్లకు బానిసౌతాడు. వాటిబారినుండి అతనిని కాపాడడానికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎంత ప్రయత్నించినా వారి హితవు అతనికి చేదుగానే వుంటుంది. రక్తసంబంధీకులుఆత్మీయులంతా విరోధులుగా కనిపిస్తారు. అటువంటి సమయాలలో ఏదో ఒక బలమైన ఆకర్షణతో అతను తన దురలవాట్లకు స్వస్తి పలికి సన్మార్గంలో పయనించాలని ఆశిస్తాడు, కానీ అది అంత సులభమా? కాదే! తనకు ఆనందాన్ని కలిగించే చెడు పరిసరాలు,మిత్రుల దుష్ప్రభావంతో మరింత బురదలో కూరుకుపోయి సమస్యల వలయంలో చిక్కుకుంటాడు.

ఒక అందమైన యువతి గుణగణాలకు ఆకర్షితుడై  చెడు సావాసాలకు దూరం కావాలని అశిస్తూ  మంచి హృదయం గల యువకుడు కడసారిగా మిత్రుల బలవంతం మీద మధుపానం చేస్తూ ఆ మత్తులో  తన మనోభావాలు వెల్లడిస్తూ పాడే పాటే నేటి మన సజీవరాగం. అదే ... 'టా...టా... వీడుకోలు గుడ్ బై... ఇంక శెలవు' ఘంటసాల మాస్టారి ఆపాతమధుర గీతం.

పరాయి భాషా పదాలతో ఆటలాడుకుంటూ కవితలల్లడం ఆరుద్రగారికి అలవాటే.  'టాటా , గుడ్ బై' అనే ఆంగ్ల పదాలతో పల్లవి మొదలెట్టి  చెడుమార్గం పట్టే నవతరం యువకులకు ఈ పాట ద్వారా మంచి స్ఫూర్తిని అందించారు. ఇంటనున్న తల్లిఅన్నగారు ఎంత మొత్తుకున్నా విననివాడు మనసైన పిల్ల చెప్పిందని మధుపాత్రకు, చెలరేగే కోరికల వంటి మిత్రులను శాశ్వతంగా వదలుకోవడానికి సిధ్ధపడ్డాడంటే ప్రేమెంత తీవ్రమైనదోబలమైనదో తెలుస్తుంది.

ఆరుద్రగారు ఈ పాటలో 'ప్రేమనగరు', 'స్నేహనగరు', 'రాగనగరు', 'అనురాగనగరువంటి మాటలను సద్భావాలకు'కామనగరు','మోహనగరు' వంటి పదాలను విరుధ్ధభావాలకు అన్వయిస్తూ వ్రాసారు. అలాగే, ఇంగ్లీష్  లోని  'లేటు'ను, తెలుగులోని 'లోటు'ను కలిపి 'లేటుగ తెలుసుకున్నాను' 'నా లోటును దిద్దుకున్నాను' అనే పద ప్రయోగం ఆరుద్రగారి రచనా శైలికి నిదర్శనంగా నిలబడుతుంది.

ఆరుద్రగారి ఈ మందు పాటను 'మామ' మహాదేవన్ భైరవి రాగ స్వరాలతో కంపోజ్ చేశారు. హిందుస్థానీ శైలిలోని భైరవి అంటే కర్ణాటక సంగీత సంప్రదాయంలో అది హనుమత్తోడి అనబడే తోడి రాగం.  స్వరాలు రెండు శైలులలో సమానమే అయినా  రాగ గమకాలలోని తేడాలవలన భైరవి, తోడి వేర్వేరు రాగాలనే భావన కలిగిస్తాయి. కె.వి.మహాదేవన్ వాద్య నిర్వహణ చాలా విలక్షణంగా వుంటుంది. అకార్డియన్, ఫ్లూట్సాక్సోఫోన్వైయొలిన్స్, బాంగోస్ వంటి వివిధ రకాల వాద్యాల సహకారంతో పాశ్చాత్య సంగీతం లో 'ఫ్రిజియన్ మోడ్' అనబడే హిందుస్థానీ భైరవి రాగ స్వరాల సమ్మిళితమైన  ఈ మందుపాటను  తెర వెనుక  ఘంటసాలగారు, తెరమీద అక్కినేని గారు పరిపూర్ణంగా అనుభవిస్తూ, అభినయిస్తూ రసికులకు పరమానందం కలిగిస్తూ సన్నివేశానికి జీవంపోసారు.

బుధ్ధిమంతుడు చిత్రంలో అన్నీ మంచి పాటలే. మొత్తం ఎనిమిది పాటల్లో ఆరు పాటలను ఘంటసాలగారే (ఐదు సోలోలు, ఒక డ్యూయెట్) పాడి అక్కినేని సినీ విజయాలలో తనకూ తగిన భాగస్వామ్యం వుందని నిరూపించారు. చెడు సావాసాలకు అలవాటు పడిన అక్కినేని ని తీర్చిదిద్దిన మనోహరిణిగా విజయనిర్మల, సదాచార సంపన్నుడైన పూజారి  మాధవాచారిగా, తమ్ముడు గోపిగా అక్కినేని (ద్విపాత్రాభినయం) సనాతనాపరుడైన మాధవాచార్య  భ్రమలలో కనిపించే శ్రీకృష్ణ పరమాత్మగా శోభన్ బాబు, గుమ్మడి, దుర్మార్గులకు ప్రతీకలుగా కృష్ణంరాజునాగభూషణం, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం మొదలగువారు 'బుధ్ధిమంతుడుచిత్ర విజయానికి   సంపూర్ణంగా దోహదం చేశారు.

మంచి చెడుల ఘర్షణ, ఆస్తికత, నాస్తికత ల మధ్య సంఘర్షణ ఈ 'బుధ్ధిమంతుడు' సినిమా ప్రధానాంశాలు. బాపురమణల మేధోమథన ఫలితం 'బుధ్ధిమంతుడుఅయితే ఇందులో బుధ్ధిమంతుడు ఎవరు? పరమ సనాతనాపరుడై చివరకు కాలమాన పరిస్థితులకు తలొగ్గిన మాధవాచారా? లేక అన్నగారి మీది గౌరవంతో విపత్కర పరిస్థితులు నుండి రక్షించ ప్రయత్నించిన గోపి బుధ్ధిమంతుడాక్లైమాక్స్ విషయంలో ఇదమిధ్ధమైన నిర్ణయం తీసుకోకుండా బాపు రమణలు కొంత సంకోచత్వాన్ని ప్రదర్శించినట్లు అనిపిస్తుంది.

'బుధ్ధిమంతుడు' చిత్రవిజయం తమిళహిందీభాషలలో ఈ చిత్ర పునర్నిర్మాణానికి కారణమయింది. 1975లో తమిళంలో 'మణిదనుం దైవమాగలాం' గా వచ్చింది. 1995లో బాపు దర్శకత్వంలోనే హిందీలో 'పరమాత్మ' గా రూపొందింది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...