చిత్రం - చెంచులక్ష్మి
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - ఎస్.రాజేశ్వరరావు
పల్లవి :
కరుణాలవాలా ఇదు నీదు
లీలా
అంతయును వింత పొగడగ
నేనెంత -2
నీ మాయ కానంగలేరూ
వేయి నేత్రాలు
ఉన్నను ఎవరూ -2
పరసతులను చెరపట్టే
అంధుడు
అతడా సురలోకము
పాలించే ఇంద్రుడూ
పదవిమీద ఆశచేత
ప్రభువాయెను-2
పశువూ పాపము తననేమి చేసె
కడుపులోని శిశువు !
కరుణాలవాలా!
బ్రహ్మ ఇచ్చిన
వరములు తెచ్చెను
ఖర్మ - ఈ కర్మ
దుష్కర్మనాపుట బ్రహ్మ విష్ణులా తరమా తరమా-2
నీపైన పాడగ చాలదొక
నాలుకా-2 తాను తీసిన గోతి లోపల పడునే
తానే
తపోశక్తిని
జయించలేరు దైవమైనా పరదైవమైననూ - కరుణాలవాలా!
ఏడేడు లోకాల ఏలికా
నీవు తలచిన చాలు మేరువే అణువు
నీ చేతిలో గలదు
అందరి పరువు
ఆ..........
మహిమన్నది నీదేనులే
ఏమైన దైవమన నీవేనులే
శ్రీహరియే
నటనసూత్రధారీ
కాని ప్రవేశించు
కొత్త పాత్రధారి-2
ఇది నీవాడించుచున్న
నాటకము
ఇక నుండదు వింతలకే
కాటకము -2
!కరుణాలవాలా!
అధినాధుని పత్ని కూడ
విధికి బానిసే-2
జీవపథము
మారిపోవునపుడు చిత్రహింసయే
పాలకడలిలోన పుట్టి
వైకుంఠము మెట్టి..
ఆ... ఆ... ఆ..
-!పాలకడలి!
నేలపాలు అయినావా
నేటికి
మహలక్ష్మీ నేటికి మహలక్ష్మీ
!కరుణాలవాలా!మహాశక్తివంతులైనా
నిజం తెలియలేరయ్యో నిజం తెలియలేరే
నీ మాయలరయలేరే
నరహరి రూప నారాయణ
జయ నారాయణ హరి
నారాయణ
నీరు పల్లమెరుగు
ఎపుడు
నిజం తెలుసు నీకే !
నీరు!
నరహరి రూప నారాయణ జయ
నారాయణ హరి నారాయణ-2
కాంత చేతిలోపల ఏ మంత్రమున్నదో-2
ఎంత భీకరుండైన
శాంతమొంది తీరునే
ఇంతికంటి చూపుకి ఇనుమైనా కరగునని
అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా
!కరుణాలవాలా!గతంలో ఒకటి రెండుసార్లు మనవి చేశాను, ఈ గీత విశ్లేషణ ద్వారా ఏదో ఒక విశిష్ట శైలిని, ఉన్నత భావజాలాన్ని, భాషా పటిమని, రచనా చమత్కృతిని ఎక్కువగా ఆశించవద్దని. ఘంటసాల గానమాధుర్యం, ఘంటసాల సంగీతం పట్ల గల భక్తి, ఆరాధనలతో ఈ శీర్షికను ప్రారంభించడం జరిగింది. తెలుగు భాష మీద సాధికారం, భావప్రకటనలో కావలసినంత వైశాల్యం లేకపోవడం వలన నా యీ వ్యాసాలలోని పదజాలం, భావాలు పునరావృతం అవుతూంటాయి. చెప్పింది చెప్పకుండా చెప్పుకు రావడం (ఇదీ భావ చౌర్యమే) నా శక్తికి మించిన కార్యంగా అనిపిస్తోంది. క్షంతవ్యుడిని.
మన తెలుగు భాష అతి ప్రాచీనమైనది, బహు సుందరమైనది, అంతకంటే అత్యంత ఉన్నతమైనది కూడా. తెలుగు భాష సౌందర్యాన్ని భాసిల్లజేసే అనేక అంశాలలో ప్రధానమైనది అలంకార శాస్త్రమనే చెప్పాలి. కవుల భావప్రకటనకు, రచనా చమత్కృతికి దోహదం చేసే ప్రాస ప్రయోగ విశేషాలు ఈ అలంకార శాస్త్రం నేర్పుతుంది. వీటిలో 'అంత్యప్రాసాలంకారము' బహుళ ప్రచారంలో వుంది. 18 వ శతాబ్దానికి చెందిన కూచిమంచి జగ్గకవి అంత్యప్రాసలతో కవితలల్లడంలో నిష్ణాతుడని ఆయన వ్రాసిన 'భక్తమందార శతకం' లోని పద్యాలు విశదీకరిస్తాయి. ఆధునికాంధ్ర కవులెందరో అంత్యప్రాసలతో రసస్ఫూర్తిని కలిగిస్తూ అర్ధవంతమైన కవిత్వాన్ని వెలువరించి సాహితీలోకంలో మన్ననలు పొందుతున్నారు. పులిని చూసి వాతలు పెట్టుకునే నక్కల్లాటి కుహానా కవులెందరో ప్రాస కవిత్వం పేరిట తెలుగుభాషను ధ్వంసం చేస్తున్నారు. డబ్బాలో గులకరాళ్ళలా రసవిహీనమైన తమ ఊకదంపుడు మాటలతో పామరులను ఆకర్షించి కవులుగా చెలామణి అవుతున్నారు. అయినా ఎప్పటికి అసలు అసలే, నకిలి నకిలీయే.
గత తరం కవులలో విభిన్న ప్రక్రియలలో ఉత్తమ సాహిత్యాన్ని వెలువరించిన లబ్దప్రతిష్టుడు ఆరుద్రగారు. అంత్యప్రాసలతో కవితలల్లడంలో బహు నిష్ణాతుడు. ముందుగా సాహితీలోకంలో కవిగా ప్రసిధ్ధుడై తర్వాత సినీ గీత రచయిత గా తనదైన ప్రత్యేక ముద్రతో సినీ శ్రోతలను అమితంగా ఆకర్షించారు. ఆరుద్ర అంత్యప్రాసల తో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన 'కరుణాలవాలా ఇది నీదు లీల
అంతయును వింత పొగడగ నేనెంత' అనే 'చెంచులక్ష్మి' సినిమాలోని ఘంటసాల మధురగీతమే నేటి మన సజీవరాగం.
బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు మహాజ్ఞాని, సదా హరినామ స్మరణంతో లోక సంచారం చేస్తూ ముల్లోకాలలో జరిగే సమాచారాన్నంతా చేర్చవలసిన చోట చేర్చవలసిన విధంగా చేరుస్తూ కలహాలకు కయ్యాలకు కారకుడవుతూంటాడు. కలహభోజుడిగా పేరుపొందిన నారదుడు సృష్టించే తగవులు, తంటాలు లోకకళ్యాణంతో ముగుస్తాయి. అటువంటి నారదుడు మహారాక్షసులు, లోకకంటకులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిప సోదరులకు సంబంధించి ఆది నుండి అంతం వరకు వివిధ సందర్భాలలో జరిగిన అనేక ఘట్టాల ప్రత్యక్ష వ్యాఖ్యానమే నేటి మన సజీవరాగం. బ్రహ్మ, రుద్రుల వర ప్రభావంతో ముల్లోకాలను అగ్గగ్గలాడించే అసురులను మట్టుబెట్టి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే ప్రధాన సూత్రధారి శ్రీమహావిష్ణువు లీలలను చక్కటి సాహితీ విలువలతో చాలా రసవత్తరంగా ఓ రెండు గీతాలలో వర్ణించారు కవి ఆరుద్ర. అవే 'నీల గగన ఘనశ్యామా', మరియు,'కరుణాలవాలా ఇదు నీదు లీల అనే సుదీర్ఘ గీతాలు. ఈ రెండు గీతాలను నారద పాత్రధారి రేలంగి కోసం ఘంటసాల మధురాతి మధురంగా ఆలపించారు. సినీమా పొడుగునా అక్కడక్కడ వివిధ సందర్భాలలో నారద పాత్ర ద్వారా వినపడే అతి పెద్ద గీతం. ఈ పాటలో ఆరుద్రగారు మహదానందంగా అంత్యప్రాసలతో ఆటలాడుకున్నారనిపిస్తుంది.
'వాలా - లీలా'; 'వింత -'ఎంత'; 'కానంగలేరూ-ఎవరూ'; 'అంధుడు-ఇంద్రుడు'; 'పశువు-శిశువు'; 'ఏలికా-నాలుకా'; 'సూత్రధారి-పాత్రధారి; 'నాటకము-కాటకము'; 'పుట్టి-మెట్టి' వంటి పదాలను చాలా అర్ధవంతంగా
మరింత సమర్ధవంతంగా ప్రయోగించారు ఆరుద్రకవి. అలాగే, బ్రహ్మ ఇచ్చిన వరములు చరణంలో ఖర్మ- కర్మ- దుష్కర్మ అనే పదప్రయోగంలో ; ' ఏడేడు లోకాల ఏలికా నీపైన పాడగ చాలదొక నాలుకా';
అధినాధుని పత్ని కూడ విధికి బానిసే'; 'పాలకడలిలో పుట్టి వైకుంఠము మెట్టి నేలపాలు అయినావా' 'ఇంతికంటి చూపుకి ఇనుమైనా కరుగునే' వంటి పద ప్రయోగాలు ఆరుద్రగారి విజ్ఞతకు, భాష మీద గల పట్టుకు మచ్చుతునకలు.
సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు చెంచులక్ష్మి చిత్రాన్ని తన సుశ్రావ్య సంగీతంతో సుసంపన్నం చేశారు. ఈ సినిమా లోని దాదాపు ముఫ్ఫై పాటలు పద్యాల గానంలో సింహభాగం ఘంటసాలవారిదే ఓ పదిహేను పద్యాలు పాటలవరకు ఘంటసాలగారు పాడినవే. మహావిష్ణువు/చెంచు యువకుడుగా నటించిన అక్కినేని వారి పాటలకు, నారద పాత్రధారి రేలంగి పాటలు, పద్యాలకు మధ్య గల వైవిధ్యాన్ని అనితరసాధ్యంగా పోషించారు గంధర్వగాయక ఘంటసాల. నారద పాత్రధారి గానం చేసిన రెండు గీతాలలో మొదటిదైన 'నీలగగన ఘనశ్యామా' పాటను బెహాగ్ రాగంలో, రెండవ పాటయైన 'కరుణాలవాలా' పాటను మోహన-కళ్యాణి రాగంలోనూ రాజేశ్వరరావుగారు స్వరపర్చారు. పాట వినగానే ఇది బిలహరి రాగమే అని అనిపించినా బిలహరి రాగంలో లేని ప్రతిమధ్యమం ఈ పాటలో అస్పష్టంగా వినవస్తున్నందున ఈ పాట మోహన-కళ్యాణి రాగంలోనే స్వరపర్చారనుకోవడం సముచితమే. సంప్రదాయరీత్యా అది ఏ రాగమైనా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా సజీవరాగం గా నిలిచి సంగీతాభిమానుల వీనులకు విందు చేస్తూనే వుంది.
చెంచులక్ష్మి లోని పాటలను ఆరుద్ర, సదాశివ బ్రహ్మం, కొసరాజు వ్రాయగా పద్యాలను మాత్రం బమ్మెర పోతనామాత్యుల మహాభాగవతం నుండి తీసుకున్నారు. ఈ పాటలను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది (ఎస్.వి.రంగారావు-హిరణ్యకశిపుడు), పి.సుశీల, జిక్కి, కోమల పాడారు. చెంచులక్ష్మి సినిమా కోసం పి.బి.శ్రీనివాస్, పి.సుశీల పాడిన రెండు యుగళగీతాలు గ్రామఫోన్ రికార్డ్ లలో తప్ప సినిమాలో ఉపయోగించలేదు. సినిమాలో ఘంటసాల జిక్కి పాడినవి మాత్రమే ప్రచారంలోకి వచ్చాయి.
అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు, రేలంగి, పుష్పవల్లి, మాస్టర్ బాబ్జి నటించిన ఈ పౌరాణిక చిత్రరాజం ఆనాడు తెలుగునాట విజయదుందుభులు మ్రోగించి పెద్ద సంచలనమే సృష్టించడానికి ప్రధాన కారణం సాలూరు రాజేశ్వరరావుగారి సుమధుర సంగీతం, ఘంటసాలవారి సుశ్రావ్య గానమేనని చెప్పక తప్పదు.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment