చిత్రం - ధర్మదాత
గానం - ఘంటసాల
రచన - సి.నా.రె.
సంగీతం - టి.చలపతిరావు
పల్లవి :
జో లాలీ... జో లాలీ ...
లాలీ నా చిట్టి
తల్లీ
లాలీ ననుగన్న తల్లీ
లాలీ బంగారు తల్లీ
లాలీ నా కల్పవల్లీ
జో లాలీ.... జో
లాలీ...
చరణం 1:
చిరునవ్వు కిరణాలు
చిందించు మోము
కన్నీరు మున్నీరుగా
చూడలేను-2
నిను గన్న నీ తల్లి
కనుమూసె గానీ-2
నిను వీడి క్షణమైన
నేనుండగలనా-2
!జో లాలీ!
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాల లూగించలేను-2
కనుపాపలా నిన్ను కాపాడుకోనా-2
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా-2
తాతినేని చలపతిరావు గారి సంగీతనేతృత్వంలో వెలువడిన ఒక సంగీతాణిముత్యం ' జో లాలి.... జో లాలీ.. లాలీ నా చిట్టితల్లీ...' డా.సి.నారాయణ రెడ్డిగారి సాహిత్యం. హృదయాలకు హత్తుకునే సరళమైన మాటలు. తన గత జీవిత వైభవాన్ని, ప్రస్తుత దుర్భర పేదరికాన్ని ఊయలలోని పసిపాపకు మాతృత్వం ఉట్టిపడేలా లాలిత్యంతో వర్ణించిన తీరు హృద్యంగా వుంటుంది. చలపతిరావు గారు శ్రీరాగంలో చేసిన ఈ లాలిపాటకు ఘంటసాల జీవంపోసారు. లాలిత్యం, మాధుర్యం నింపిన గళంతో ఘంటసాల ఈ పాటలో ఒక అమృత మాతృమూర్తిగా మనకు దర్శనమిస్తారు.
ఈ పాట వినగానే మధ్యమావతి రాగమేమో అనే భావన కలిగే అవకాశం లేకపోలేదు. మధ్యమావతి, శ్రీరాగం రెండింటికి ఆరోహణా క్రమం స్వరాలు ఒక్కటే. కానీ , శ్రీరాగం అవరోహణలో 'రిగరిస' అనే స్వరాలు అదనంగా వుండి మధ్యమావతి తో గల తేడాను చూపిస్తుంది. శ్రీ రాగం, మధ్యమావతి రాగం - ఈ రెండూ ఖరహరప్రియ రాగ జన్యాలే కావడం వలన ఈ మూడు రాగాలలో చేసిన సినిమా పాటలు సాధారణ శ్రోతకు ఒకేలా వినిపించే అవకాశం ఉంది. శ్రీరాగ మాధుర్యమంతా మన హృదయాలలో నిండేలా ఘంటసాల ఈ పాటను పాడారు. జో...జో లాలీ అనే పదాలను ఘంటసాల ఎంతో వేరియేషన్ తో చాలా సరళంగా లాలిత్యంతో ఆలపించారు.
'ధర్మదాత' సినీమాలోని తొమ్మది పాటల్లో ఏడు పాటలను (ఒక శ్లోకంతో సహా) ఘంటసాలగారే ఆలపించారు. ఈ చిత్రంలో అక్కినేని తండ్రీ కొడుకుల వేషాలలో ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి పాత్ర సోలోలను, కొడుకు పాత్ర డ్యూయెట్లను ఘంటసాలగారే గానం చేసి అక్కినేనికి తనకు మధ్యగల రాగబంధాన్ని మరింత పటిష్టం చేశారు. ధర్మదాత చిత్రంలోని పాటలలో కొన్ని తమిళ వాసనలు కలిగివుండక తప్పలేదు. కారణం ఈ సినిమాకు మూలం శివాజీ గణేశన్ నటించిన తమిళ చిత్రం ' ఎంగ ఊరు రాజా' ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతంలోని ఆ పాటల వరసలే తెలుగులో కొన్ని పాటలకు ఉపయోగించడం జరిగింది. అయితే, ఈనాటి మన సజీవరాగం మాత్రం సంపూర్ణంగా తెలుగుగీతమే. ఈ గీతం తమిళంలో లేదు. చలపతిరావుగారు ఈ పాటను మనసుకు హత్తుకుపోయేలా స్వరపర్చారు. శ్రీరాగంలో చేసిన ఈ పాట కోసం ఫ్లూట్, క్లారినెట్, సితార్, పియోనా, వైయొలిన్స్, తబలా, డోలక్ వంటి వాద్యాలను ఉపయోగించారు.
తమిళంలో 'ఎంగ ఊరు రాజా' తెలుగులో ధర్మదాతై తర్వాత హిందీలో 'దిల్ కా రాజా' గా1972 లో దర్శనమిచ్చింది. రాజ్ కుమార్, వహీదారెహ్మాన్, లీనా చందవర్కర్ నటించిన ఈ చిత్రానికి ఆర్.డి.బర్మన్ సంగీతం నిర్వహించారు. మూడు భాషలలో విజయవంతంగా నడచిన సినిమా. ధర్మదాత తెలుగు వెర్షన్ అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకోవడమే కాక ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా సంపాదించుకున్నది. ఇందుకు చలపతిరావుగారి సంగీతం, ఘంటసాలగారి గానం, ఎ.ఎన్.ఆర్.గారి ద్విపాత్రాభినయం ఎంతో దోహదం చేశాయనే చెప్పాలి.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment