చిత్రం - విజయం మనదే
గానం - ఘంటసాల
రచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం - ఘంటసాల
శ్రీరస్తు చిన్నారి
నా చెల్లికి
చిరాయురస్తు వరాల మా
తల్లికి....
కొంచెం కొంచెం
బిడియాలు
పొంచి పొంచి సరదాలు
మా మంచి
పెళ్ళికూతురికి
మగనింటికిపోయే
తొందరలు
!శ్రీరస్తు...!
కనుదోయి కాటుకతీర్చి కస్తూరి తిలకం దిద్ది - 2
కన్నీటి తెరలో నుంచే
కళ్యాణమూర్తిని
చూసి ఆ మూర్తి నాలో
దాచి
!కొంచెం కొంచెం బిడియాలు!
!శ్రీరస్తు...!
ఈ గుండె
చెదిరిపోకూడదు
ఈ జంట కలిసి
వెళ్ళేవరకు
నా చెల్లి వెంట
వుండాలని
వెంట వెంట వుండాలని
!కొంచెం కొంచెం బిడియాలు!
!శ్రీరస్తు...!
పుట్టినింట
మహరాణియని
మెట్టినింట యువరాణి
యని
ఒట్టువేసి చెయిలో
చెయివేసి
భర్త చేత వుంచాలని అతని వెంట పంపాలని.....
!కొంచెం కొంచెం బిడియాలు!!శ్రీరస్తు...!
ఘంటసాలగారు గొప్ప హృదయధర్మమున్న మనిషి అని మా నాన్నగారు అనేవారు. ఉన్నతమైన హృదయధర్మమున్న వ్యక్తి బంధుప్రీతితో, ఆదరాభిమానాలతో చాలా ఔదార్యంగా ఉంటాడు. తల్లితండ్రులమీద, తోబుట్టువుల మీద అపరిమితమైన ప్రేమానురాగాలు కలిగి జీవితాంతం వారి మంచిచెడ్డలు గమనిస్తూ వారి కష్టాలన్ని తన కష్టాలుగా అనుభవిస్తూ వారిని సంరక్షిస్తూంటాడు. అందులోనూ తల్లితండ్రులు లేని అక్కచెల్లెళ్ళుంటే వారి బాగోగులన్నీ అతనివే. కన్నతల్లి తండ్రి కంటే ఎక్కువగా సాకుతూ పెంచి, విద్యాబుధ్ధులు చెప్పించి వారి పెళ్ళిళ్ళు పేరంటాలు జరిపిస్తూ వారి ఆనందమే తన ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు.
ఈ రకమైన నేపథ్యంలో అన్నా చెల్లెళ్ళ అనురాగాలను, రక్తసంబంధాలను ప్రతిబింబించే తెలుగు సినిమాలెన్నో మనకు వున్నాయి. తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తూ తన తోబుట్టువుల సుఖసంతోషాలకోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేసే అన్నల కథలెన్నో మనకు వచ్చాయి. విభిన్నమైన కథాంశాలెన్నున్నా వాటితోపాటూ అన్నాచెల్లెళ్ళు, లేదా అక్కాతమ్ముళ్ళ సెంటిమెంటును కూడా మేళవించి రూపొందించిన నవరసభరితమైన సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ఆదరాభిమానాలకు నోచుకున్నాయి.
అలాటి చిత్రాలలో మంచి సాహిత్యంతో, వీనులవిందైన సంగీతంతో నిండిన ఆణిముత్యాలవంటి పాటలెన్నో మనకు లభించాయి. అలాటి అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించే ఒక సాగునంపు గీతమే ఈనాటి మన సజీవరాగం.
అదే... 'శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి...' అనే మకుటంతో ప్రారంభమయే 'విజయం మనదే' జానపద చిత్రంలోని దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గీతం.
ఇక్కడ అన్న ఎన్.టి.ఆర్., అతని గారాల ముద్దుల చెల్లెలు దేవిక. చెల్లెలికి వివాహం చేసి భర్తతో అత్తవారింటికి సాగనంపే సందర్భంలో చెల్లెలిపట్ల గల మమతానురాగాలవల్ల చెల్లెలిని విడచిపెట్టలేక భావోద్వేగాలతో కన్నీటితో హృదయవిదారకంగా స్వగతంగా పాడుకునే గీతం. ఇందుకు పెళ్ళికూతురు నెచ్చెలుల శోకభరిత గళాలు కూడా సన్నివేశానికి మరింత రసోద్దీపన కలిగించాయి.
విఠలాచార్య సినిమా అభిమానులకు సంబంధించినంతవరకు 'విజయం మనదే' నిరాశాజనకం. ఇది ఒక మిస్ క్యాస్ట్. సరోజాదేవి, దేవిక, ఘంటసాల,దేవులపల్లి వంటివారు విఠలాచార్య తరహా సినిమాలకు తగినవారు కారు. 'కనుదోయి కాటుకతీర్చి కస్తూరి తిలకం దిద్ది కన్నీటి తెరలో నుంచే కళ్యాణమూర్తిని చూసి ఆ మూర్తి నాలో దాచి'; 'పుట్టినింట మహరాణియని మెట్టినింట యువరాణియని ఒట్టువేసి చెయిలో చెయివేసి భర్త చేత వుంచాలని అతని వెంట పంపాలని' అనే మాటలలోని భావావేశం సామాన్య ప్రేక్షకుల స్థాయికి మించినది. ఈ తరహా కవిత్వ ధోరణి పద ప్రయోగం విఠలాచార్య మార్క్ సినిమా ప్రేక్షకులకు కొంత బరువైనవే. వారు ఆశించే పాటల తరహా అది కాదు. అందుకే ఈ చెల్లి పాట ఒక వర్గం వరకే చేరింది. అలాగే ఘంటసాల-విఠలాచార్య కాంబినేషన్ కూడా. వీరిద్దరి కలయికలో మూడు సినిమా లు వచ్చినా వీరి అభిరుచులు, ఆలోచనా సరళి పరస్పర విరుధ్ధమైనవి. ఇలాటివారిని కలుపుకొని నందమూరి సాంబశివరావు( ఎన్.టి.ఆర్ కజిన్) 'విజయం మనదే' సినిమా ను తీశారు.
అభిరుచులలో ఎటువంటి భేదాభిప్రాయాలు వున్నా ఘంటసాలవారి సంగీతం విషయంలో మాత్రం ఎప్పుడూ ఒక మినిమం గ్యారంటీ వుంటుంది. వారి సంగీత దర్శకత్వంలోని పాటలలో శ్రావ్యతకు, మార్దవతకు కొరతవుండదు. ఒక పాట హిట్, సూపర్‌హిట్ కావడమనేది అనేక అంశాలపై ఆధారపడివుంటుంది. ఆ విధంగా 'విజయం మనదే' చిత్రంలోని ఏడు పాటలు సందర్భోచితమైనవే, శ్రవణానందకరమైనవే. ఘంటసాల, సుశీల, జానకి పాడిన ఆ పాటలను సి నారాయణరెడ్డి, దేవులపల్లి, వీటూరి, కొసరాజు వ్రాశారు.
ఈ 'శ్రీరస్తు శుభమస్తు' పాట కంపోజి్గ్, రికార్డింగ్ లలో శ్రోతగా నేను కూడా పాల్గొన్నాను. ఈ పాట కంపోజింగ్ నిర్మాత నందమూరి సాంబశివరావుగారి (రాజేంద్రా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్) ఆఫీస్ (మద్రాస్ టి నగర్ సౌత్ ఉస్మాన్ రోడ్ చివర సిఐటి నగర్) లో జరిగింది. కృష్ణశాస్త్రిగారి నోటమ్మట మాట ఎలాగూ రాదు. కలం ద్వారా పాట కూడా అంత వేగంగా కాగితం మీద పడదు. ఆ విషయం లోకవిదితమే. ఆయన అక్కడున్న అందరి మొహాలు చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ కూర్చొనేవారు. సంగీతరావుగారు హార్మోనియం, జడ్సన్ గారు తబలా వాయిస్తూండగా పాట పల్లవి కోసం ఘంటసాల మాస్టారు 'తననా'లు ఆలపించడం జరిగింది. నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ సన్నివేశాన్ని కృష్ణశాస్త్రి గారికి వివరించి చెప్పారు. కవి గారు అందరి మాటలు వింటున్నారే తప్ప కాగితం మీద అక్షరం పడలేదు. గంటా, రెండు గంటలు గడిచాయి.అందరిలో కొంత చిరాకు గమనించి శాస్త్రిగారు కాగితం మీద వ్రాసారు ' భావం బుర్రలోకి వచ్చింది, చరణాలు ట్యూన్ రెడీ చేసుకోండి ఒకటి రెండురోజుల్లో పాట తయారైపోతుంది' అని. అనుకున్న ప్రకారమే, చెల్లెలిని అత్తవారింటికి పంపించే అన్నగారి మానసికస్థితికి దర్పణం పట్టేలా దేవులపల్లి వారి ఈ గీతం రూపొందింది. 'శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి 'అనే మాటలను సాకీగా పెట్టుకొని, 'కొంచెం కొంచెం బిడియాలు పొంచి పొంచి సరదాలను... పల్లవిగా చేసుకొని ఉద్వేగభరితమైన ఒక చక్కని పాటకు సజీవత్వాన్ని కల్పించారు ఘంటసాల. హార్ప్, సితార్, ఫ్లూట్, తబలా, బాంగోస్, టప్పా, ట్రంపెట్స్, వైయొలిన్స్, సెహనాయ్, వంటి వాద్యాలతో పెళ్ళి వాతావరణానికి మరింత నిండుదనం తీసుకువచ్చారు. ఘంటసాల మాస్టారినే అనుసరిస్తూ ఇతర గాయనీబృందం కూడా శ్రోతల హృదయాలకు హత్తుకునేలా ఈ పాటను అద్భుతంగా పాడారు. అన్నా చెల్లెళ్ళుగా ఎన్టీఆర్ , దేవికలు సందర్భోచితంగా నటించి సన్నివేశాన్ని రక్తికట్టించారు.
1921 లో ఇంగ్లీష్ లో 'స్కారమౌచ్' అనే నవల వెలువడి 1952లో హాలీవుడ్ సినిమాగా వచ్చింది. దానిని జూపిటర్ పిక్చర్స్ వారు తమ ఆఖరు చిత్రంగా తమిళంలో 'అరసిలన్ కుమారి' అనే పేరుతో 1961లో విడుదల చేశారు. ఎమ్.జి.ఆర్., పద్మిని, నంబియార్, రాజసులోచన నటించిన ఈ చిత్రం ఆర్ధికంగా పరాజయం పొందింది. దీనినే తెలుగులో 'కత్తి పట్టిన రైతు' గా డబ్ చేయగా అందులోని ఓ ఐదుపాటలను ఘంటసాలగారే పాడారు. అదే కథను విఠలాచార్య, ఎన్.టి.ఆర్ ల మీద భరోసాతో నందమూరి సాంబశివరావు 'విజయం మనదే' గా నిర్మించి 1970 లో విడుదల చేసారు. ఆ సంవత్సరంలోనే కేంద్రం ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు పురస్కారంతో సత్కరించింది .
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment