Saturday, 28 June 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 88వ భాగం - ఆవేశం రావాలి ఆవేదన కావాలి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయేడవ భాగం ఇక్కడ

88వ సజీవరాగం - ఆవేశం రావాలి ఆవేదన కావాలి 

చిత్రం - మనసు మాంగల్యం
గానం - ఘంటసాల
రచన - దాశరథి

సంగీతం - 
పెండ్యాల

పల్లవి : 

ఆవేశం రావాలి ఆవేదన కావాలి-2

చరణం 1:

గుండెలోని గాయాలు

మండించే గేయాలు

వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు

రగలాలి విప్లవాలు

                                !ఆవేశం!

చరణం 2:

నరజాతిని భవితవ్యానికి

నడిపేదే ఆవేశం

పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన

వేగంతో వేడిమితో 

సాగేదే జీవితం సాగేదే జీవితం 

                                !ఆవేశం!

చరణం 3

రణదాహం ధనమోహం కాలి

కూలిపోవాలి సమవాదం 

నవనాదం ప్రతియింటా పలకాలి

ప్రతి మనిషి క్రాంతి కొరకు

రుద్రమూర్తి కావాలి-2

                                !ఆవేశం!

 చరణం 4:

తరతరాల దోపిడీల ఉరితాళ్ళను

తెగతెంచీ నరనరాల అగ్నిధార

ఉప్పెనలా ఉరికించీ

మరో కొత్త ప్రపంచాన్ని 

మనిషి గెలుచుకోవాలి

                                !ఆవేశం!

చరణం 5

నిదురించిన  నా కవితకు

కదలించిన ఆవేశం

మరుగుపడిన నా మమతకు

చెరవిప్పిన ఆవేదన

కన్నుగప్పి వెళ్ళింది! 

నన్ను మరచిపోయిందీ - 2

                                !ఆవేశం!

హృదయాంతరాళాలలోనుండి తపనవేదనఆవేశం పెల్లుబికివచ్చినప్పుడే ఉత్తమమైన సాహిత్యం గానీసంగీతం గానీ ఆవిర్భవిస్తుంది. దేశ చరిత్రలను మార్చే విప్లవోద్యమాలుగానిశాంతియుత సమరాలుగానిమారణహోమాలుగాని సంభవించేది కూడా తీవ్రమైన ఆవేశంఆవేదనల నుండే. గొప్ప గొప్ప కవుల కవిత్వానికి, మహాగాయకుల సంగీతానికి ప్రేరణ ఆ ఆవేశమూఆవేదనలే. 

రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలనిసమవాదం నవనాదం ప్రతి యింటా పలకాలని, ప్రతి మనిషి క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలని తపించి ఆవేశం చెందే ఒక కవికి జరుగుతున్న సన్మాన సభ. ఆతని కవితలు వినాలని అభిలషించే అభిమానులెందరో కవిగానానికై ఎదురుచూస్తున్నారు. ప్రేమ వైఫల్యంతో త్రాగుడుకు బానిసైన ఆ కవి  ప్రేక్షకుల కోరికను కాదనలేక త్రాగుడు మైకంలోనే వేదికనెక్కి 'ఆవేశం రావాలి ఆవేదన కావాలిఅని అచ్చం  ఘంటసాలలా  ఆలపిస్తాడు. ఆ  ఉద్వేగ  ఆవేశభరిత గీతమే నేటి మన సజీవరాగం. 'మనసు-మాంగల్యం' అనే సినిమా కోసం 'తెలంగాణ కోటి రతనాల వీణ' గా భాసిల్లిన కవికోకిల దాశరథిగారి భావావేశాలనుండి ఉద్భవించిన సినీ గేయమిది. సినీగీత రచయితగా నవరసాలతో నిండిన పాటలెన్నింటినో సన్నివేశానుగుణంగా రచించారు. సామ్యవాదంతో నవప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలని ఈ గీతం ద్వారా పిలుపునిచ్చారు దాశరథి. చిత్రంలోని కథాపాత్ర త్రాగుడు మైకంలో వున్నందున అతని మనసు, ఆలోచనలకు తగినట్లుగానే దాశరథిగారి భావాలుపదజాలం కూడా కలగలుపుగా అనిపిస్తాయి.

'మనసు-మాంగల్యం' సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారు. తెలుగు సినిమా అత్యుత్తమ సంగీత దర్శకులలో ప్రముఖులు. చేసేది సాంఘికమైనాపౌరాణికమైనాజానపదమైనా పెండ్యాలగారి ముద్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. అక్కినేని కథానాయకుడిగాపెండ్యాల సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రాలెన్నింటిలోనో ఘంటసాలగారు అద్భుతమైన పాటలెన్నో పాడారు. అలాటివాటిలో ఈ 'ఆవేశం రావాలి ఆవేదన కావాలి' పాట కూడా మకుటాయమానంగా నిలుస్తుంది.

పెండ్యాలగారు ఈ పాటను సౌదామిని రాగ స్వరాలతోపాటు ఆ రాగంలో లేని రిషభాన్ని కూడా అన్య స్వరంగా చేర్చి మిశ్ర సౌదామినిగా మలచినట్లు భావించవచ్చును. అటు కర్నాటక సంగీతంలోగానిఇటు సినిమా సంగీతంలోగాని సౌదామిని రాగంలో వుండే కృతులుగాని, పాటలుగాని చాలా అరుదు. ఈ విషయంలో ఘంటసాలగారే ఆద్యుడని చెప్పాలి. 'బందిపోటు'లోని 'ఊహలు గుసగుసలాడే' పాట ద్వారా సౌదామిని రాగాన్ని తెలుగువారికి పరిచయం చేశారు.(అంతకుమించి ఎక్కువగా చర్చించడం ఇక్కడ సముచితం కాదు) సౌదామిని 57వ మేళకర్త రాగమైన సింహేంద్రమధ్యమ రాగానికి జన్యరాగం. పెండ్యాలగారు ఈ పాటను పూర్తిగా వైయొలిన్స్, సెల్లోట్రంపెట్స్, వైబ్రోఫోన్తబలాడోలక్ వంటి వాద్యాలతో స్వరపర్చారు.

తెరపైని అక్కినేని వారికి ఏ రకమైన మాడ్యులేషన్ తో ఏవిధమైన ఎక్స్పెషన్ తో పాడాలో  తెర వెనకని ఘంటసాల మాస్టారికి బాగా ఎరికే. సన్నివేశానికి కావలసిన ఆవేశాన్నంతా తన కంఠంలో పూరించి ఈ విప్లవ నినాదగీతాన్ని భావగాంభీర్యంతో ఆలపించి తెరమీది ఎ.ఎన్.ఆర్.కు దీటుగా నటించారు. చివరిలోని దగ్గు కూడా ఘంటసాలగారిదే.

ఘంటసాలగారు తన కచేరీలలో దేవదాసులోని జగమే మాయకు పరిచయ వాక్యాలు చెపుతూ 'చివరిలోని దగ్గు కూడా నాదే బాబూ! నాగేశ్వరరావు గారిది కాదు' అని చెప్పేవారు. అలాగే ఈ పాటలోని చివరి దగ్గు కూడా ఘంటసాలగారిదే ఎ.ఎన్.ఆర్.ది కాదు.

మనసు మాంగల్యం చిత్ర దర్శకుడు కె.ప్రత్యగాత్మ. ఎ.ఎన్.ఆర్. హీరోగా ప్రత్యగాత్మ అనేక విజయవంతమైన సినిమా లు అందించారు. నిర్మాత కోగంటి కుటుంబరావుగారు చిత్ర నిర్మాతగా కంటే మా పక్కింటాయనగా మాకు పరిచితులు. వారింటికి మా ఇంటికి మధ్య ఒక చిన్న పిట్టగోడ మాత్రమ అడ్డు. వారి అమ్మాయి ఆ గోడదూకి వచ్చి మా ఇంటి పిల్లలతో ఆటలాడుకునేది. నాకు తెలిసినంతవరకు కోగంటి కుటుంబరావు గారు  రెండే సినిమా లు తీసిన గుర్తు -  ఎ.ఎన్.ఆర్.తో 'మనసు మాంగల్యం', ఎన్,టి.ఆర్.తో 'దీక్ష'. ఘంటసాల మాస్టారు పాడిన ఆఖరి చిత్రాలలో దీక్ష కూడా ఒకటి. మనసు మాంగల్యం సినిమా లో  ఘంటసాలగారు  రెండు డ్యూయెట్ లు, రెండు సోలోలు పాడారు. వాటిల్లో దాశరథిగారు వ్రాసిన ' ఆవేశం రావాలి ఆవేదన కావాలి' పాట నేటికీ సజీవంగా నిలిచిపోయింది. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...