Saturday, 5 July 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 89వ భాగం - చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయెనిమిదవ భాగం ఇక్కడ

89వ సజీవరాగం - చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి

చిత్రం - పెళ్ళినాటి ప్రమాణాలు
గానం - ఘంటసాల
రచన - పింగళి నాగేంద్రరావు

సంగీతం - ఘంటసాల

సాకీ - కావనగానే సరియా ఈ పూవులు నీవేగా దేవీ...

పల్లవి : 

చల్లగ చూడాలీ పూలను

అందుకు పోవాలి... దేవి 

                                    !చల్లగ!

 

చరణం 1: 

మల్లె సుగంధం మనసున జల్లి 

మళ్ళీ అల్లరి తగునా

                                    !చల్లగ!

 

చరణం 2: 

మలయానిలముల లాలనవలెనే

వలపులు హాయిగ కురిసీ -2

కలికి చూపులను చెలిమిని విరిసి

చిలిపిగ దాగుట న్యాయమా

                                    !చల్లగ!

చరణం 3:

తెలిమబ్బులలో జాబిలివలెనే

కళకళలాడుచు నిలిచి-2

జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి

పలుకక పోవుట న్యాయమా

                                    !చల్లగ!

సింప్లిసిటి - నిరాండబరత్వానికి మారుపేరు ఘంటసాల. గాయకుడిగా ఎంతో  ధనాన్ని కీర్తి ప్రతిష్టలను సంపాదించినా నిజజీవితంలో ఎటువంటి ఆడంబరం, దర్పం లేకుండా సగటు మనిషిలాగే చివరివరకు జీవించారు. తన విదేశ పర్యటనలలో కూడా తన సహజ కట్టు బొట్టు వేష భాషలను వదలని వ్యక్తి ఘంటసాల. ఘంటసాల మాట, నడతలాగే ఆయన స్వరకల్పనలలో రూపొందిన పాటలు కూడా చాలా సింపిల్ గానే ఉంటాయి. ఆయన చేసే పాట పల్లవులు, స్వరాలలోని సంగతులు, గమకాలు, వాద్యగోష్టి అన్నీ చాలా సింపిల్ గా సామాన్యశ్రోతకు అందుబాటులో వుంటాయి (సన్నివేశపరంగా మరీ అవసరమైతే తప్ప). పాట వరసలలో కాని, ఆర్కెస్ట్రేషన్ లో కానీ గందరగోళంగోలగజిబిజి ఉండవు. ఘంటసాల సంగీతంలో సౌలభ్యం ఎక్కువ అనేది జగమెరిగిన సత్యం. ఆయన చేసే పాటలలో  రెండు వందల శాతం మెలొడీ గ్యారంటీ గా వుంటుంది. 

గత వారాల సజీవరాగాలకు భిన్నంగా ఘంటసాలవారి ఈ వారపు  సజీవరాగం మన మనసులను గిలిగింతలు పెట్టే సలలితమైన సరదా ప్రేమగీతం. పాటలోని సాహిత్యం, సంగీతం, వాద్యగోష్టి అన్నీ పదికాలాలపాటు శ్రోతల హృదయాలలో నిలిచిపోయేలా రూపొందించబడిన గీతం. అదే - కె.వి.రెడ్డిగారి దర్శక నిర్మాణంలో అక్కినేని , జమున హీరో హీరోయిన్ లుగా నటించిన 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమా కోసం పింగళి నాగేంద్రరావుగారు రచించగా, స్వీయసంగీతంలో ఘంటసాలగారు ఎంతో మనోరంజకంగా ఆలపించిన 'చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి' ప్రేమగీతం.

ఓ మతిమరుపు పెద్దమనిషి సిఫార్సు లేఖ సృష్టించిన గందరగోళం మూలంగా పెళ్ళికొడుకు కావలసిన ఓ యువకుడు  ధనవంతులింటి వంటమనిషిగా మారి ఆ యింటి ఆడపడుచు అందానికి ఆకర్షితుడవుతాడు. ఆ యువతికి ఏదోవిధంగా చేరువకావాలని ఆశిస్తూంటాడు.  ఆ సుందరి జడలోనుండి జారిపడిన పూలమాలను ఆమెకే తిరిగి ఇస్తూ . 'చల్లగ చూడాలీ పూలను అందుకుపోవాలి' అంటూ సుశ్రావ్యంగా గీతాలాపన మొదలెడతాడు. అందమైన స్త్రీలను కవులు కుసుమకోమలులుగా వర్ణిస్తారు. పువ్వులంత సున్నితమైన మనస్సుగల కథానాయిక ఒక పరాయి మగవాడి ఎదుట ఎలాటి భావాలు ప్రదర్శిస్తుందో పింగళివారు ఈ పాటలో చాలా మనోజ్ఞంగా చూపించారు. ఆ అమ్మాయిలోని చిలిపితనం గురించి వర్ణిస్తూ 'మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళి అల్లరి తగునా' అంటారు. అలాగే మరో చరణంలో 'కలికి చూపులను చెలిమిని విరిసి చిలిపిగ దాగుట న్యాయమా' అని ప్రశ్నిస్తారు.  కథానాయికను తెలిమబ్బులలో దోబూచులాడే జాబిల్లితో పోలుస్తారు. 

పౌరాణిక, భక్తి, జానపద చిత్రాల మేటిగా ఖ్యాతి పొందిన కె.వి.రెడ్డిగారు సరస శృంగార సాంఘిక చిత్రాల నిర్మాణం లో కూడా అసమాన్యుడేనని 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమా నిరూపించింది. కె..విరెడ్డిగారికి చాలా ఇష్టమైన రాగం 'భీమ్ పలాస్' . అలాగే ఘంటసాల అంటే కూడా ఆయనకు అంత ఇష్టం.ఘంటసాల శక్తి సామర్ధ్యాలమీద అంత నమ్మకం. అందుకే తన సొంత చిత్రమైన ' పెళ్ళినాటి ప్రమాణాలు' సినీమా సంగీత దర్శకత్వ భాధ్యతలను ఘంటసాలగారికి అప్పగించారు కె.వి.రెడ్డిగారు. (వీరిద్దరి ఇళ్ళూ ఉస్మాన్ రోడ్ లోనే ఎదురెదురుగా ఉన్నా ఈ ఇద్దరు ఎప్పుడూ ఇళ్ళ దగ్గర కలుసుకోవడం నేను చూడలేదు. కె.వి.రెడ్డిగారు పోయినప్పుడు మాత్రం ఆయన మృతదేహానికి శ్రధ్ధాంజలి ఘటించడానికి ఘంటసాల మాస్టారుతోనేను వారింటికి వెళ్ళేను.)

కె.వి.గారి సినిమా అంటే అది పౌరాణికమైనాజానపదమైనాసాంఘికమైనా పాటలు మాత్రం ఆయన ఆస్థాన కవి పింగళి వ్రాయవలసిందే. కె.వి.రెడ్డి, పింగళిగార్ల అభిరుచులు,వ్యవహార సరళి క్షుణంగా ఎరిగిన ఘంటసాల 'పెళ్ళినాటి ప్రమాణాలు' లోని పద్యాలతోపాటు పది పాటలను చాలా రసరమ్యంగా స్వరపర్చారు. ఈ చిత్రంలోని చాలా పాటలను ఈనాటికీ అందరూ పాడుకుంటూనే వున్నారు. పింగళి రాసిన ఈ పాటలను ఘంటసాల, పి.లీలపి.సుశీల, మాధవపెద్ది ఆలపించారు.

ఈ నాటి మన సజీవరాగాన్ని కెవిరెడ్డి గారికి ఎంతో ప్రీతిపాత్రమైన 'అభేరీ/భీమ్ పలాస్' రాగంలోనే స్వరపర్చి అత్యంత మనోహరంగా ఆలపించారు ఘంటసాల. అభేరీ రాగం ఔఢవ సంపూర్ణరాగం. ఆరోహణలో ఐదు స్వరాలతోఅవరోహణంలో ఏడు స్వరాలతో నిండిన రాగం. కర్ణాటక సంగీత శైలిలో 22వ మేళకర్త  ఖరహరప్రియకు జన్యరాగం ఈ అభేరి. ఈ అభేరి అనే పేరును ముత్తుస్వామి దీక్షితులవారు పెట్టిన పేరు. ఈ రాగాన్నే దేవగాంధారి అని కూడా అంటారు. ఈ అభేరి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగాలు రెండు - ఒకటి భీమ్ పలాస్మరొకటి ధనశ్రీ. పాడే పధ్ధతిని, శైలి నుడికారాన్ని బట్టి ఒక పాట అభేరి లో వున్నదా లేక భీమ్ పలాస్ లో వున్నదా అనేది నిర్ణయం జరుగుతుంది.

'చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి' పాటను ఘంటసాల మాస్టారు అభేరి రాగ పధ్ధతిలోనే స్వరపర్చి గానం చేశారు. పాట ప్రారంభమే ' కావనగానే సరియా ఈ పూవులు నీవేగా దేవీ...' అనే సంబోధనతో సాకీగా మొదలవుతుంది. సాకీలోనే అభేరి రాగ స్వరూపాన్ని మనకు కొంతవరకు వినిపించారు మాస్టారు. పాట సన్నివేశానికి తగిన స్వర గమకాలతో ఘంటసాలగారి గళం శ్రావ్యంగాసుమధురంగా సాగింది. పియానోవీణసితార్, ఫ్లూట్, క్లారినెట్, తబలాడోలక్, వంటి వాద్యాలను ఉపయోగించారు. తెరమీద నాయకనాయికలుగా అక్కినేని , జమున ఈ పాటను చాలా ముగ్ధమనోహరంగా అభినయించారు.

విలన్ పాత్ర అనేదే లేకుండా,  వినోదప్రధానంగా, సందేశాత్మకమైన చక్కటి కుటుంబగాధా చిత్రంగా 'పెళ్ళినాటి ప్రమాణాలు'  సినిమాను  తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించారు దర్శక నిర్మాత కె.వి.రెడ్డి. ఈ చిత్ర విజయానికి ఘంటసాలగారి సంగీతం ఎంతో దోహదం చేసింది.

సంగీతం వచ్చినవారు, రానివారు అందరూ సులభంగా పాడుకునే రీతిలో స్వరపర్చబడిన ఈ గీతం అప్పుడు, ఇప్పుడూ,ఎప్పుడూ సజీవరాగమై మన మనసులకు హాయిని కలిగిస్తూనేవుంటుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...