చిత్రం - ఆనందనిలయం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - పెండ్యాల
పదిమందిలో పాట
పాడినా
అది అంకితమెవరో
ఒకరికే
విరితోటలో పూలెన్ని
పూచినా
గుడికి చేరేది
నూటికి ఒకటే
!పదిమందిలో!
చరణం 1:
గోపాలునికెంతమంది
గోపికలున్నా
గుండెలోన నెలకొన్న
రాధ ఒక్కతే...
ఆకాశవీధిలో
తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కడే
!పదిమందిలో!చరణం 2:
ఎడాదిలో ఎన్ని
ఋతువులున్ననూ
వేడుక చెసే
వసంతమొక్కటే - 2
నా కన్నులందు ఎన్ని
వేల కాంతులున్ననూ -2
ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే...
!పదిమందిలో!మన కర్ణాటక సంగీత రాగాలలో అతి ప్రాచీనమైన రాగం దేవగాంధారి. ముత్తుస్వామి దీక్షితర్ సంగీత సంప్రదాయం లో అభేరిగా బహుళ ప్రచారం చెందింది. అభేరి 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యరాగం. అరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతూండడంవలన అభేరిని ఔఢవ-సంపూర్ణ రాగంగా పరిగణిస్తారు. ఈ అభేరి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం భీమ్ పలాస్.
మన సినిమా సంగీత దర్శకుల పుణ్యమా అని అభేరి - భీమ్ పలాస్ రాగాలు సినీమా సంగీతాభిమానులందరికీ అత్యంత ప్రియతమ రాగాలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ రెండు రాగాలలో అసంఖ్యాకమైన తెలుగు సినిమా పాటలు రూపొందించబడి బహుళ జనాదరణ పొందాయి. ఘంటసాలగారి మృదుమధుర కంఠస్వరం నుండి అలవోకగా జాలువారిన ఒక ఆజరామర సినీ గీతమే ' పదిమందిలో పాట పాడినా' అనే గీతం. అదే ఈనాటి మన సజీవరాగం.
1971 లో వచ్చిన 'ఆనంద నిలయం' అనే ఒక సినిమా కోసం ఆరుద్ర, పెండ్యాల, ఘంటసాల, కాంతారావు, బి.ఎస్.నారాయణ, మొదలగువారు చేసిన సమిష్టి కృషి ఫలితమే ' పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే' అనే శ్రవణానందకరమైన గీతం.
ఈ పాటలో కథానాయకుడు తన మనసులోని భావాలను చాలా సున్నితంగా, సుస్పష్టంగా ఎవరి మనసులు నొచ్చుకోకుండా ఒక స్టేట్ మెంట్ లా బహిరంగపరుస్తాడు. అందుకుగాను గుడికి చేరే విరితోటలోని పూలను; గోపికాలోలుడైన గోపాలుని గుండెల్లో గూడుకట్టుకున్న రాధను; ఆకశాన వెలిగే అందాల జాబిల్లి ; మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వసంత ఋతువును ఉదాహరణగా తీసుకుంటాడు. చివరగా, తన కన్నుల్లోని అన్ని వేల కాంతులకు కారణం, ఆ భాగ్యాన్ని కల్పించిన తన ప్రేయసి ప్రేమ ఒక్కటే అని చాలా నిర్దిష్టంగా కథానాయకుడు తన మనోగతాన్ని వెల్లడిస్తాడు. ఆరుద్రగారి కలం ఈ పాటకు జీవం పోసింది.
'ఆనంద నిలయంలో' ఎన్ని పాటలున్ననూ శ్రోతలనందరినీ రంజింపజేసినదీ గీతమొక్కటే' అనే రీతిలో అభేరి రాగంలో ఈ పాటను స్వరపర్చారు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాలగారి ప్రతిభను, అభేరి రాగ మాధుర్యాన్ని పది రెట్లు ఇనుమడింపజేస్తూ అద్భుతంగా గానం చేసారు ఘంటసాల మాస్టారు.
పుట్టినరోజు వేడుకల సమయంలో వచ్చిన అతిథులందరినీ ఆనందపరుస్తూ కథానాయకుడు పియోనా వాయిస్తూ పాడే పాట ఇది. ఇలాటి శుభ సందర్భాలలోని పాటలకు వీణ, సితార్, పియోనా వాద్యాలనే ఆలంబనగా చేసుకోవడం మన సంగీత దర్శకులందరికీ పరిపాటి. అందులోనూ పుట్టినరోజు చేసుకునేవారి దర్జా, దర్పం, అంతస్తు హైలెట్ చేస్తూ చూపించడానికి పియోనాను మించిన వాద్యం కనపడదు. అలాటి పియోనా పాటలలో తలమానికంగా భాసిల్లిన గీతం ఘంటసాలగారు గానం చేసిన 'పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే'. భావయుక్తమైన మాస్టారి గానం తెరమీద కథానాయకుడు కాంతారావు గారి హావభావాలకు రాణింపునిచ్చింది. అలాగే సూర్యకాంతం, ఉషాకుమారి, కృష్ణకుమారి కూడా ఈ పాట రాణింపుకు ఇతోధికంగా తోడ్పడ్డారు.
ఈ పాటలోని ప్రధాన వాద్యమైన పియోనా కోసం పెండ్యాలగారిచే స్వరపరచబడిన సంగీతం ఆద్యంతం శ్రోతలను మైమరపిస్తాయి. ఈ పాటలో పియోనాతో పాటు వైలిన్స్, తబలా, డోలక్ వంటి వాద్యాలు ప్రధానంగా వినిపిస్తాయి. మొత్తం మీద ఏదో ఒక శాస్త్రీయ రాగాన్ని ఆధారంగా చేసుకొని స్వరపర్చిన గీతాలనే సామాన్య శ్రోతలు కూడా ఆదరించి అభిమానిస్తారని చెప్పడానికి ఇలాటి పాటలే చాలు.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment