చిత్రం - పవిత్రబంధం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - ఎస్.రాజేశ్వరరావు
గాంధి పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా
ఇది
సామ్యవాదం రామరాజ్యం
సంభవించే కాలమా
!గాంధి..!
సస్యశ్యామల దేశం అయినా
నిత్యం క్షామం -2
ఉప్పొంగే నదుల
జీవజలాలు
ఉప్పు సముద్రం పాలు
యువకుల శక్తికి
భవితవ్యానికి
ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకు ఓటు బ్రతుకుతెరువే లోటు
!గాంధి..!
సమ్మె ఘెరావు దొమ్మి
బస్సుల దహనం లూటీ
శాంతి సహనం
సమధర్మంపై విరిగెను గుండా లాఠీ
అధికారంకై
పెనుగులాటలో అన్నదమ్ముల పోటీ
హెచ్చెను
హింసాద్వేషం
ఏమౌతుందీ దేశం
!గాంధి..!
వ్యాపారాలకు పర్మిట్
వ్యవహారాలకు
లైసెన్స్
అర్హతలేని ఉద్యోగాలు
లంచం ఇస్తే ఓ యెస్
సిఫార్సు లేనిదే
శ్మశానమందు
దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది
రాజ్యం
పెత్తందార్లది భోజ్యం
!గాంధి..!
మూడు వందల సంవత్సరాల తెల్లదొరల పరిపాలనానంతరం 1947లో మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. ప్రముఖ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల రాజ్యాంగ విధానాలలోని మంచి సిధ్ధాంతాలన్ని క్రోడీకరించి ప్రజాస్వామ్య పధ్ధతిలో నూతన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్ వంటి ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులు. ఎంతో ఆదర్శవంతంగా రూపొందించబడిన మన దేశ సామ్యవాద సిధ్ధాంతం ఆచరణలోకి వచ్చేప్పటికి ఘోరంగా విఫలమయింది. స్వార్ధపరులైన పెత్తందారులదే పైచేయి అయింది. కుల, మత, ప్రాంత, భాషా తత్త్వాల ప్రాతిపదికను తమకు అనుకూలంగా మలచుకొని స్వార్ధ రాజకీయ నాయకులు దేశాన్ని విఛ్ఛిన్నం చేస్తున్నారు. పేదరిక నిర్మూలనం కాగితాలమీదే తప్ప వాస్తవంలో కనపడదు. అర్హులైన లక్షలాది యువకులు నిరుద్యోగులుగా అణగారిపోతున్నారు. ఏ పూటకా పూట దినం గడవడమే గగనమై జీవించే లక్షలాది నిరుద్యోగులలో ఒక నిరుద్యోగి ఆక్రోశ గీతమే 'గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది' .ఇదే నేటి మన ఘంటసాల సజీవరాగం.
ఒకప్పుడు హిందూ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన అశోకుడి పేరు పెట్టుకున్న ఈ చిత్ర కథానాయకుడు అన్ని అర్హతలు గల ఒక పేదవాడు. ఉత్తర, దక్షిణలకే ప్రాముఖ్యత నిచ్చే ఈ దారిద్ర్య వ్యవస్థలో అతనికి ఉద్యోగం ఇచ్చే నాథుడే కరువయ్యాడు. అవమానాలతో, ఆకలితో అలమటించే ఈ అశోక్ చేతనున్న అర్ధరూపాయితో వేరుశనగలతో కడుపునింపుకోవాలనుకుంటున్న తరుణంలో చేతనున్న శనగల పొట్లాన్ని ముష్టెత్తుకునే ఓ నలుగురు అనాథ పిల్లలు కాకుల్లా మీదపడి ఎగరేసుకుపోయారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని శిలాసదృశంగా గాంధి తాత చూస్తూనే వున్నాడు. అశోక్ లో ఆవేశం, ఆక్రోశం పెల్లుబికింది... 'గాంధి పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా' అని ప్రస్తుత వ్యవస్థలోని అవకతవకలమీద ఆవేదనతో ఆలపించడం మొదలెట్టాడు.
ఈ పాట 1971 లో వచ్చిన 'పవిత్రబంధం' అనే సినిమాలోనిది. అంటే దాదాపు ఏభైమూడు సంవత్సరాలయింది. మన దేశంలోని పేదరిక నిర్మూలన అన్న ఆశయం ఆనాడు ఎలాగున్నదో ఈనాడు అలాగే ఆశయంగానే మిగిలి వుండడం మనకు తెలియనిది కాదు. శ్రీ శ్రీయో, ఆత్రేయో, కొసరాజో వ్రాయవలసిన ఈ పాటను ఆరుద్ర వ్రాసారు. అరసం, విరసం వంటి ఉద్యమ సంస్థలతో ఎంతో కొంత సంబంధముండిన ఆరుద్ర --- 'సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం'; 'యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు': ' ఉన్నది మనకు ఓటు కానీ బ్రతుకుతెరువే లోటు'; 'శాంతి సహనం సమధర్మంపై గుండాల లాఠీ'; వంటి పదునైన పదాలనే ఉపయోగించారు. పేరుకే ప్రజల రాజ్యం కానీ భోజ్యం పెత్తందారులదే అని చెపుతూ చివరలో 'సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు' అని అంటారు. అదే ఈ పాటకు హైలైట్.
'పవిత్రబంధం' సినిమా సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు సన్నివేశానికి పరిపుష్టి కలిగేలా ఒక అద్భుతమైన వరసతో ఈ పాటను సమకూర్చారు. అందుకోసం ఆయన ఈ పాటకు 'భైరవి' రాగ స్వరాలను తీసుకున్నారు. భైరవి ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణరాగమైనా మేళకర్త రాగంకాదు. రెండు రకములైన ధైవతాలు( ద) ఉండడం వలన ఈ భైరవిని భాషాంగరాగంగా పరిగణిస్తారు. ఇది 20వ మేళకర్త రాగమైన నఠభైరవి జన్యం. ఈ భైరవి రాగాన్ని హిందుస్థానీ బాణీలో 'తోడి' అంటారు. ఇటువంటి సంప్రదాయ రాగ లక్షణాలన్నింటిని పూర్తిగా జీర్ణించుకొని పరిపూర్ణ అవగాహన తో గానం చేసే అపురూప గాయకుడు మన ఘంటసాల మాస్టారు. సన్నివేశాన్ని, సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని భావగాంభీర్యంతో ఆలపించడం ఘంటసాలవారికి వెన్నతో పెట్టిన విద్య.
ఘంటసాల పాడిన పాటకు నటించడమంటే తెరమీది నటులకు నల్లేరు మీద బండి ప్రయాణమే. అందులోనూ ఎ.ఎన్.ఆర్.కైతే చెప్పనే అక్కరలేదు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఆ రకంగా 'గాంధి పుట్టిన దేశమా' పాట ఎప్పటికీ సజీవ రాగమే.
రాజేశ్వరరావు గారు ఈ పాటలోని ప్రధాన వాద్యంగా ఎకార్డియన్ ను ఉపయోగించారు. ఎకార్డియన్ అనగానే మనకు చటక్కున జ్ఞాపకం వచ్చేది రాజ్ కపూర్, శంకర్-జైకిషన్లే. ఆనాడు మన సౌత్ సినిమాలలో వచ్చే ఎకార్డియన్ పాటలన్నింటిని ఎక్కువగా మంగళమూర్తి అనే ఆయన వాయించేవాడు. ఘంటసాలగారి ఆర్కెష్ట్రా లో కూడా తరుచూ కనిపించేవాడు. రాజేశ్వరరావుగారు ఎకార్డియన్ తో పాటు ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, పియోనా, తబలా, డోలక్, బాంగోస్ వంటి వాద్యాలను వినిపించారు.
ఈ పవిత్రబంధం సినిమాలోని ఎనిమిది పాటల్లో ఘంటసాల మాస్టారు రెండు డ్యూయెట్ లను, ఈ సోలో సాంగ్ ను ఆలపించారు. ఈ మూడు పాటలు ఈనాటికీ
ఇంకా వినిపిస్తూనేవున్నాయి.
ఎ.ఎన్.ఆర్., హీరోయిన్ లు గా కాంచన, వాణిశ్రీ నటించిన పవిత్రబంధం సినిమాను వి.మధుసూదనరావు దర్శకత్వం వహించగా అశోక్ మూవీస్ టి.గోవిందరాజన్ నిర్మించారు.
మన దేశంలో రామరాజ్యం వచ్చి సామ్యవాదం కలకాలం నిలుస్తుందో లేదో తెలియదు కానీ ఘంటసాలగారి భావార్ద్ర కంఠం నుండి జాలువారిన ఇలాటి ఉద్వేగభరిత గీతాలు మాత్రం సదా తెలుగు హృదయాల తలుపులను తడుతూ చైతన్యవంతం చేస్తూనే వుంటాయి.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment