Saturday 27 January 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 14వ భాగం - హృదయమా సాగిపొమ్మా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదమూడవ భాగం ఇక్కడ

14వ సజీవరాగం - 
హృదయమా సాగిపొమ్మా

కళ్యాణి రాగం -      రచన : ఆరుద్ర
సంగీతం, గానం : ఘంటసాల
చిత్రం : పరోపకారం, 1953.

హృదయమా సాగిపొమ్మా
భావ వేగాన సాగిపొమ్మా
హృదయమా!

కొసరి వీచేను గడుసరి గాలి
ఆదమరిచేవు సుఖముల తేలి
చాలు చాలించు సోమరినడక
సాగిపోవాలి తడబడక ! హృదయమా

మురళినూదేడు కోనారి కూన
ముదము కురిసేను జగములోన
ఆలమందలు ఇలు చేరబోయె
వేగమెచ్చించు కడుజాలమాయె -
హృదయమా !

మన ప్రాచీన కవులు వాయువేగ, మనోవేగాల గురించి వర్ణించారు. అతివేగంగా పరిగెత్తే అశ్వాన్ని లక్ష్యంగా యాంత్రిక వాహనాల వేగాన్ని హార్స్ పవర్ తో తూచారు. వీటన్నిటితో పాటు భావవేగాన్ని కూడా ఈ పాటలో చేర్చారు కవి. గమ్యాన్ని చేరుకోవడంలో మనోవేగాన్ని, భావవేగాన్ని మించినదేదీ లేదు.

ఈ పాటలో సోమరిపోతులా నడిచే రైలుబండిని, రైలు పెట్టెలోని ఓ ప్రయాణీకుని హృదయవేగాన్ని సమన్వయపరుస్తూ కవి ఈ పాటను చాలా భావోద్దీపనతో వ్రాసారు. రైలు పెట్టిలోకి చొరవగా గడుసుతనంగా చొరబడి వీస్తున్న చల్లగాలికి సుఖంగా ఆద మరచి నిద్రపోతున్నావు, లే.. లేచి సోమరినడకలు చాలించి ఏ తడబాటు లేకుండా ముందుకు సాగిపొమ్మని హృదయాన్ని, రైలుబండిని హెచ్చరిస్తున్నాడు రైలు ప్రయాణీకుడు.

రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు కళ్ళబడుతూంటాయి. రైలు పట్టాల పక్కన సువిశాలమైన  పచ్చని మైదానాలు, చెట్లుచేమలు, గేదెల మీదనెక్కి లొల్లాయి పాటలు పాడుతూ పిల్లాంగోరి ఊదే పిల్లగాళ్ళు రైల్లో కూచొని ఆపసోపాలు పడేవారికి వినోదం కల్పిస్తారు. ఈ సందర్భంగా కవి ఒక అద్భుత పద ప్రయోగం చేసారు -
"మురళి నూదేడు కోనారి కూన
ముదము కురిసేను జగములోన"
"కోనారి కూన" అంటే ఏమిటో ఈనాటి తెలుగువారికి తెలిసే మాట కాదు. ఉత్తరాంధ్రదేశంలో పశువులను కాచుకునేవాళ్ళను "కోనారులు" అనే పేరుతో పిలవడం ఉంది. "కూన" అంటే చిన్న పిల్లవాడు, పిల్ల అని అర్ధం. వెన్నెలకూన , పిల్లికూన అని అనడం మనకు తెలిసినదే. జగమంతటికీ సంతోషం కలిగేలా కోనారి కూన మురళిని ఊదేడు, పశువులన్నీ ఇళ్ళు చేరే వేళయింది, మనకు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, వేగం హెచ్చించమని హృదయాన్ని,  రైలు బండిని కోరుతున్నాడు.

ఈ పాటను ఆరుద్రగారు వ్రాసారు. "పరోపకారం" ఆరుద్రగారి తొలి స్ట్రైట్ సినీమా. ఈ సినీమాకు మాటలు, పాటలు పూర్తిగా ఆరుద్రగారే రాసారు. సాహితీపరంగా , సంగీతపరంగా పరోపకారంలో మంచి పాటలే ఉన్నాయి. ఈ సినీమాకు సంగీత దర్శకుడు , ఆపధ్ధర్మ నిర్మాత ఘంటసాలగారే.


పరోపకారంలో సెకెండ్ హీరోయిన్ గా సావిత్రిది  ఒక ప్రముఖమైన పాత్ర. సావిత్రి నటించిన మొదటి మూడు నాలుగు సినీమాలలో "పరోపకారం" ఒకటి.

ఈ "హృదయమా సాగిపొమ్మా" పాటను ఘంటసాలగారు కళ్యాణి రాగంలో ఎంతో భావయుక్తంగా స్వరపర్చి, మనోజనరంజకంగా ఆలపించారు. "తడబడక" , "కడుజాలమాయే" అనే చోట ఘంటసాలవారి టిపికల్ సంగతులు వినిపిస్తాయి.  అలాగే "కోనారికూన" అనే పదంమీద ఇచ్చిన expression ఘంటసాలగారికే చెల్లు.

సినీమాలో ఈ పాట మరో గాయక సంగీత దర్శకుడైన బి. గోపాలంగారి మీద చిత్రీకరింపబడినా ఈ పాటలోని మనోభావాలన్నీ  రైలు పెట్టెలో మరో ప్రక్క కూర్చున్న కధానాయకుడు ముక్కామల గారివే. ఒక గాయకుడి పాట మరో గాయకుడిమీద చిత్రీకరించడం ఇదే ప్రధమమేమో? 

తన సొంత చిత్రంలో ఘంటసాలగారు మరో ప్రముఖ గాయకుడు ఎ.ఎమ్.రాజాగారి చేత ఒక పాట పాడించడం విశేషం. ఈ సినీమాలోని ఇతర పాటలను పి.లీల, ఎ.పి.కోమల, మాధవపెద్ది, పిఠాపురం ఆలపించారు.

ఈ చిత్రంలో జి.వరలక్ష్మి, ముక్కామల, రేలంగి, సి.ఎస్.ఆర్., రామశర్మ, సావిత్రి, ఆర్.నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారులు.

దేవకీబోస్ కధ ఆధారంగా "పరోపకారం"  సినీమా తెలుగు , తమిళ భాషలలో ఒకేసారి నిర్మించడం జరిగింది. ఈ చిత్ర దర్శకత్వాన్ని, ఛాయాగ్రహణాన్ని కమల్ ఘోష్ నిర్వహించారు. 

"అల్లుడినోట్లో శని", " కర్ణుడి చావు" వంటి సామెతలు ఈ సినీమా విషయంలో, నిర్మాత ఘంటసాలగారి విషయంలో అక్షరాలా నిజమయ్యాయి. చిత్ర నిర్మాణ భాగస్వాముల మోసానికి బలియై అప్పులను నెత్తికేసుకున్న నిర్మాతగా ఘంటసాల మిగిలిపోయారు. ఈ పరోపకారం సినీమా విడుదలైన మరో వారంలోనే అక్కినేని "దేవదాసు" కూడా విడుదలయి మిగిలిన సినిమా లన్నిటినీ చావుదెబ్బ కొట్టింది.

గాయకుడిగా దేవదాసు ఘన విజయానికి సంతోషించనా, నిర్మాతగా పరోపకారం అపజయానికి చింతించనా? అనే వైరాగ్యస్థితిని అనుభవించారు ఘంటసాల. 

ఈ రోజున "పరోపకారం" తెలుగు సినీమా పూర్తిగా అలభ్యం. నెగెటివ్ ప్రింట్ కూడా లేదు.  తమిళ సోదరుల శ్రధ్ధాసక్తుల వలన తమిళ 'పరోపకారం' సినీమా, పాటలు యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి.

చిత్ర జయాపజయాలు సినీ ప్రేక్షకుల ఆధీనాలు. ఏ చిత్రం ఎందుకు విజయం పొందుతుందో, ఎందుకు పరాజయం పొందుతుందో  ప్రేక్షకులే చెప్పలేరన్న మాట మాత్రం పరమ సత్యం. పరోపకారం జయాపజయాల విషయం ఎలావున్నా అందులోని పాటలన్నీ , ముఖ్యంగా " హృదయమా సాగిపొమ్మా" మాత్రం ఆపాతమధురమే.




ఈ చిత్రం ద్వారా ఒక నూతన నృత్య దర్శకుడిని ఘంటసాలగారు పరిచయం చేసారు, ఆయనే  తర్వాతి కాలంలో జగద్విఖ్యాతి పొందిన లెజెండ్ , కూచిపూడి నాట్యాచార్యుడు పద్మభూషణ్, డా. వెంపటి చిన సత్యం గారు. ఈ చిత్రంలో ఒక నృత్య సన్నివేశంలో ఘంటసాలవారు పాడిన "వలపుల కథకిది తొలిపలుకు" పాటకు హార్మోనియం వాయిస్తూ  వీధిగాయకుడి పాత్ర లో ఆయన కనిపిస్తారు. 
వలపుల కథకిది తొలిపలుకు  ఈ లింక్ లో ఆ గీతాన్ని చూడవచ్చు. https://youtu.be/SQeJRZQbxuw?si=NojK5pelMEhPamXs



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్


Saturday 20 January 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 13వ భాగం - చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పన్నెండవ భాగం ఇక్కడ

13వ సజీవరాగం - 

"చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో"

రాగం : కళ్యాణి - చిత్రం : సంతానం
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గానం : ఘంటసాల

చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమె నాలో
లీనమాయెనే ఆనందమె నా గానమాయెనే

తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి
తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో

కలకలలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలం నీ కమ్మని రూపం
కలవరింతువులే నా మదిలో 
చల్లని వెన్నెలలో....

ఘంటసాలవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రాగం కళ్యాణి అనే మాట బహుళ ప్రచారంలో వుంది. అందుకు కారణం కళ్యాణి రాగ ప్రధానంగా రూపొంది, ఘంటసాల మాస్టారు పాడిన అసంఖ్యాకమైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇక్కడొక చిన్న విషయం చెప్పక తప్పదు. తాను సంగీత దర్శకత్వం వహించి కళ్యాణి రాగంలో స్వరపర్చి పాడిన గీతాలకన్నా ఇతర సంగీత దర్శకులు ఆ రాగంలో స్వరపర్చి ఘంటసాలవారిచేత పాడించిన పాటలే అధికం. ఆ పాటలన్నీ ఘంటసాలవారి గాత్ర మాధుర్యం వలన అపాతమధురాలైనాయి.

 ఘంటసాలవారి గళం నుండి జాలువారిన అలాటి సుశ్రావ్య కళ్యాణి గీతమే ఈనాటి మన సజీవరాగం.

1954లో సి.వి.రంగనాథ దాస్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ' సంతానం' చిత్రం లోని పాట "చల్లని వెన్నెలలో".  నా చిన్నతనంలో కొన్నేళ్ళపాటు చిన్నా పెద్దా , ఆడ మగ అనే తేడాలేకుండా ఎవరినోట విన్నా ఈ పాటే వినిపించేది. ఈనాటికీ గాయకులందరి నోటా వినిపిస్తూనే ఉంది. ఈపాటలోని కవి భావుకత మనసును పరవశింపజేస్తుంది.

చల్లని వెన్నెల, చక్కని కన్నె పక్కన వుంటే ముగ్ధమనోహరమైన భావావేశం పుట్టుకు వస్తుందని  అప్పుడు కలిగిన ఆనందమే గానమవుతుందని  ఈ పాటలో నిరూపించారు అనిశెట్టి గారు. 'గాలి పెదవులే మెల్లగ సోకిన పూలు నవ్వెనే నిద్దురలో'' - ఎంతటి మధుర భావన. కవి కలాలకు ఎటుపక్కైనా పదునే అని ఋజువు చేసారు అనిశెట్టిగారు. విప్లవ భావ రచయితలుగా తీవ్ర పదజాలంతో కవితలల్లిన అనిశెట్టి-పినిశెట్టి జంటకవులలో అనిశెట్టిగారు తన ఆగ్రహావేశాలను పక్కకు నెట్టి ప్రశాంతంగా సున్నితమైన భావాలతో వ్రాసిన పాట ' చల్లని వెన్నెలలో'.

శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం పరిపుష్టిగా వున్న సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి. రెండవ తరం సంగీత దర్శకులలో పేరెన్నిక పొందినవారు. సంతానం సినీమా సంగీత దర్శకుడిగా అత్యద్భుతమైన పాటలెన్నింటినో స్వరపర్చారు.  అంతేకాదు, ఈ చిత్రంద్వారా  దక్షిణామూర్తి గారు సుప్రసిధ్ధ హిందీ నేపథ్యగాయని లతా మంగేష్కర్ ను తెలుగువారికి పరిచయం చేసారు. 

దక్షిణామూర్తి " చల్లని వెన్నెలలో "
పాటను కళ్యాణి రాగంలో స్వరపర్చారు. కళ్యాణి  కర్నాటక సంగీత శైలిలో ఒక సుప్రసిధ్ధ రాగం.  72 మేళకర్త రాగాలలో 65వ రాగం. కళ్యాణి సంపూర్ణరాగం. ఆరోహణా, అవరోహణా క్రమంలో ఈ రాగంలో సప్తస్వరాలు వినిపిస్తాయి. కళ్యాణి రాగం మేళకర్తగా మేచకళ్యాణి అని వ్యవహరిస్తారు. హిందుస్థానీ సంగీత శైలిలో కళ్యాణికి సమాంతరమైన రాగం 'యమన్'. కొన్ని వేల సినీమాపాటలు వివిధభాషలలో, వివిధ గాయకులచే ఈ కళ్యాణి, యమన్ రాగాలలో స్వరపర్చబడిన పాటలు గానంచేయబడ్డాయి. వాటన్నింటిలో ఘంటసాల మాస్టారు పాడిన కళ్యాణి రాగ ప్రధాన గీతాలకు ఒక ప్రత్యేకత, ఒక సమున్నత స్థానం ఉందంటే అది అతిశయోక్తి కానేరదు. 

ఘంటసాల మాస్టారు 1950 దశకంలో పాడిన పాటల్లో ఈ ' చల్లని వెన్నెలలో' పాట అగ్రగణ్యమైనది. ఈ పాటలో ఘంటసాలవారి కంఠంలోని వైవిధ్యం , మాట స్పష్టత , భావప్రకటన శ్రోతలకు మైమరపును , హాయిని కలిగిస్తుంది.

సినీమా లో ఇదొక పియోనా పాట. ఆనాటి సినీమాలలో సూటు, బూట్లతో హీరో పియోనా పాటలు పాడడమనేది ఒక స్టాటస్ సింబల్. హీరో ఎ.నాగేశ్వరరావు, హీరోయిన్ సావిత్రి ల మీద ఈ పాట చిత్రీకరణ. పాట ఘంటసాలవారి నోట అన్ని స్థాయిలలో కళ్యాణి రాగ ఆలాపనతో ప్రారంభమవుతుంది. వాల్జ్ టైప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు తగినట్లుగా సావిత్రి చెసిన నాట్య భంగిమలు చాలా ముచ్చటగొలుపుతాయి.

చల్లని వెన్నెలలో అనే చోట, గానమాయెనే అనే చోట మాస్టారి గళంలోని గమకాలు , 'తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి.. తేలియాడనే ముద్దులలో' అనే దగ్గర భావస్ఫూర్తి శ్రోతల మనసుకు ఆహ్లాదాన్ని , పరవశత్వాన్ని కలిగిస్తుంది. 'పూలు నవ్వెనే.. నిద్దురలో' అనే చోట మంద్రస్థాయిలో మాస్టారి గళ మాధుర్యం ఈ పాటను అజరామరం చేసింది. ఇక ఆఖరి చరణం 'కలకలలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో' అనే చోట వారి భావ ప్రకటన ఆ తరువాతి ఆలాపన ఎంతో అలవోకగా అది వారికే సొంతం అనే రీతిలో ఘంటసాల ఆలపించారు.

ఘంటసాలవారి నోట మూడు స్థాయిలలోనూ వినపడే ఈ  ' చల్లని వెన్నెలలో' ' పాట ఎన్నటికీ ఓ సజీవరాగమే.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్






Saturday 13 January 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 12వ భాగం - అన్నానా! భామినీ!!

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ

 

ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదకొండవ భాగం ఇక్కడ

12వ సజీవరాగం - 

" అన్నానా భామిని " - సారంగధర 1957 - రాగం - రాగేశ్వరి
సాహిత్యం : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల , పి.లీల

ఘంటసాల మాస్టారికి చాలా ఇష్టమైన రాగాలలో రాగేశ్వరి ఒకటి. ఇది ఒక హిందుస్థానీ రాగం. ఖమాస్ థాట్ కు చెందినది. దీనికి దగ్గరలో వుండే కర్నాటక సంగీతంలోని రాగం నాటకురంజి. ఘంటసాలగారు ఈ రాగేశ్వరి రాగంలో అద్భుతమైన , శ్రవణపేయమైన గీతాలెన్నింటినో స్వరపర్చారు. అందులో ఆణిముత్యంలాటి పాట "అన్నానా... భామిని... ఏమని ఎపుడైనా..."

ఈ పాట 1957 లో వచ్చిన "సారంగధర" సినీమా లోనిది. సముద్రాల రాఘవాచార్యులవారు సాహిత్యం సమకూర్చారు. స్వీయసంగీత దర్శకత్వంలో ఈ పాటను పి.లీలతో కలసి పాడారు ఘంటసాల. సముద్రాలవారు పాతకాలపు గీత రచయిత. తన యవ్వన దశలో ఎన్నో సార్ధకమైన వేదాంతపరమైన పాటలెన్నింటినో రచించారు. అలాగే అనుభవం పండి వార్ధక్యం మీద పడిన తర్వాత కూడా యువతరాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ యుగళగీతాలను వ్రాసారు.

"అన్నానా భామిని" పాట ఒక విశిష్టమైన, విభిన్నమైన ప్రేమగీతం. ఈ పాట పాటలా కాకుండా ఇద్దరు ప్రేయసీ ప్రియులు ఏకాంతంలో సంభాషించుకుంటున్నట్లుంటుంది. అందుకు తగిన వాద్యాలనే ఎన్నుకొని క్లుప్తమైన  సున్నితమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను స్వరపర్చి తన అనన్య సంగీత ప్రజ్ఞను చూపారు ఘంటసాల.

ఈ పాటలో వినవచ్చే "భామిని, ఏమని, ఆదమరచి, మాటవరసకెపుడైనా" వంటి మాటలు ఈ పాటకు ఎంతో లాలిత్యాన్ని అందజేశాయి.  ఆయా మాటల మీద ఘంటసాలగారు ఉపయోగించిన సంగతులు, గమకాలు శ్రోతల మనసుకు పరవశత్వాన్ని కలిగించి సమ్మోహనపరుస్తాయి. పాట మధ్యలో వచ్చే "ఆహా"లు, ముగ్ధమనోహరమైన మందహాసాలు ఘంటసాలవారి సొంతం. అనితరసాధ్యం.

రాగేశ్వరి రాగ స్వరూపమంతా విస్తరింపజేస్తూ పియోనా, ఫ్లూట్, క్లారినెట్, వీణ, గిటార్, వయొలిన్స్ సమ్మేళనంతో రూపొందించిన బిజిఎమ్స్, పాటమధ్యలో వినిపించే ఇంటర్లూడ్స్ ఘంటసాలవారి సంగీతప్రతిభకు నిదర్శనం. పాట అనేది లలితంగా, ఏ గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఓ చల్లటి నదీ తరంగంలా సాగిపోతూ మనసుకు హాయిని, ఆహ్లాదాన్ని చేకూర్చడమేలా అని తెలుసుకోవలాంటే " అన్నానా భామిని" పాటను వినవలసిందే. ఘంటసాల మాస్టారు, పి.లీలగారు ఈ పాటను ఎంతో అపురూపంగా, అపూర్వంగా గానం చేసారు.  అంత సుందరంగానూ శృంగారాన్ని తెరమీద ఎన్.టి.రామారావు , రాజసులోచన అభినయించి తమకు తామే సాటియని చాటిచెప్పారు.

ఇక సినిమా విషయానికి వస్త -  "సారంగధర" చరిత్ర 11 వ శతాబ్దం నాటిది. తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని కుమారుడైన సారంగధరుని ప్రేమకథ. ఇది జానపద బుర్రకధగా తెలుగునాట పామరజనాలలో బహుళ ప్రసిధ్ధిపొందిన కధ. ఈ ఇతివృత్తాన్ని శ్రీ గురజాడ అప్పారావు పంతులుగారు ఇంగ్లీషులో నాటకంగా వ్రాసి అనేకచోట్ల ప్రదర్శింపజేసారు. ఆ నాటకం ఆధారంగా మినర్వా పిక్చర్స్ వారు సౌందర్యరాజన్, 1957లో "సారంగధర" సినీమాను తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మించారు. వి.ఎస్.రాఘవన్, రామచంద్రరావులు దర్శకులు.

తెలుగులో ఎన్.టి.రామారావు, తమిళంలో శివాజీ గణేశన్ కథానాయకులు. తెలుగు, తమిళం రెండింటిలోనూ  ఎస్.వి.రంగారావు, భానుమతి, రాజసులోచన, శాంతకుమారి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ వెర్షన్ కు జి.రామనాధన్, తెలుగుకు ఘంటసాల సంగీత దర్శకులు. ఎవరి బాణీ వారిదే. తెలుగు, తమిళ పాటలకు సంబంధం లేదు.

ఈ సినీమా లో భానుమతి గారు ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో రెండు సోలోలు,  ఆయనతో కలసి కొన్నిసంవాద పద్యాలు ఆలపించడం ఒక విశేషం. ఏవో వ్యక్తిగతమైన అభిప్రాయభేదాలు భానుమతిగారు కల్పించుకున్నా, వాటన్నిటినీ పక్కనబెట్టి ఘంటసాలవారు సామరస్యంతో ఈ సినీమా లో ఆవిడతో కలసి పనిచేశారు. భానుమతిగారు పాడిన రెండు పాటలు, పద్యాలు బహుళ జనాదరణ పొందాయి.

సారంగధర సినీమా టైటిల్ మ్యూజిక్ గా ఘంటసాలవారు తమ గురుదేవులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి లలిత రాగంలోని కృతిని ఉపయోగించారు. ఈ విషయాన్ని గతంలో మన సమూహంలో ముచ్చటించడం జరిగింది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్





Saturday 6 January 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 11 వ భాగం - అవునా నిజమేనా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదవ భాగం ఇక్కడ

ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం 11 వ గీతం

"అవునా నిజమేనా"
చిత్రం - మల్లీశ్వరి
సాహిత్యం - దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం - ఎస్ రాజేశ్వరరావు
గానం - ఘంటసాల , భానుమతి

Art is for art sake అనే నానుడిని తూ.చ తప్పక పాటించిన సినీ మేధావి, కళాత్మక హృదయుడు శ్రీ బి.ఎన్.రెడ్డి. రాశిలో తక్కువే అయినా వాసిలో అన్నింటా మిన్నగా శ్రీ బి ఎన్ చిత్రాలు చెపుతాయి.  అలాటివాటిలో కళాఖండ చిత్రంగా పేర్కొనవలసిన చిత్రం మల్లీశ్వరి. ఇంతవరకు వేలాది తెలుగు సినిమాలలో ఉత్తమ పది చిత్రాల పేర్లు చెప్పమంటే  ముందుగా స్ఫురించేది 'మల్లీశ్వరి'. ఖండాంతరాలలో చలనచిత్రోత్సవాలలో ప్రదర్శింపబడిన చిత్రం మల్లీశ్వరి.

ప్రముఖ రచయిత శ్రీ బుచ్చిబాబు వ్రాసిన "రాయలవారి కరుణాకృత్యము",  దేవన్ షరార్ అనే రచయిత వ్రాసిన "ది ఎంపరర్ ఎండ్ ది స్లేవ్ గర్ల్" కథానిక,  విజయనగర రాజుల కాలంనాటి హంపీ శిల్పకళా వైభవం ఇచ్చిన స్ఫూర్తి, ఆధారంతో శ్రీ బి.ఎన్.రెడ్డి ఈ అద్భుత చిత్రాన్ని నిర్మించారు.

ఎ.కె.శేఖర్ కళా దర్శకత్వం, ఆది మల్లి ఇరాని ఛాయాగ్రహణం, భానుమతి, ఎన్.టి.రామారావు ల అపూర్వ నటనా వైదుష్యం, భానుమతి, ఘంటసాల ల సుమధుర గానం మల్లీశ్వరి మరపురాని దృశ్యకావ్యం కావడానికి దోహదపడ్డాయి.

కేవలం సాహితీలోకంలో కవులకు మాత్రమే సుపరిచితుడైన కవికుల తిలకం శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అలాటి ఉత్తమ భావకవిని సామాన్య ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత శ్రీ బి.ఎన్.రెడ్డిగారిదే. మల్లీశ్వరి అజరామరత్వానికి మూలకారణం శ్రీ కృష్ణశాస్త్రి గారి మాటలు పాటలే. మల్లీశ్వరి సినీమాలోని ఇరవై పాటలను కృష్ణశాస్త్రిగారే వ్రాసారు.

మల్లీశ్వరి సినీమాకు మణిమకుటం శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం. మల్లీశ్వరి సంగీతభరిత చిత్రంగా తీర్చిదిద్ది అపూర్వమైన అపురూపమైన గీతాలతో వీనులవిందు చేసారు రసాలూరించు రాజేశ్వరరావు గారు. మల్లీశ్వరిలోని 21 పాటలు వివిధ రకములైన సన్నివేశాలకు తగినట్లుగా రాజేశ్వరరావు గారు స్వరపర్చారు. ఈ సినీమాలో ఎక్కువగా దాదాపు 10 పాటలు పాడి గాయకులలో అగ్రతాంబూలం అందుకున్నవారు ఈ చిత్ర కథానాయిక, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి పి. భానుమతి. ఈ చిత్రంలో మిగిలిన పాటలను ఘంటసాల, మాధవపెద్ది, టి.జి.కమలాదేవి, మాస్టర్ జి.రామకృష్ణ, శకుంతల మొదలైనవారు పాడారు.

ఈ సినీమాలో ఘంటసాలగారు మూడు పాటలను మాత్రమే పాడారు. ఆ మూడు పాటలూ భానుమతిగారితో యుగళగీతాలే. అవి - 'పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి', ' ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు', 'ఔనా! నిజమేనా మరతునన్న మరువలేని' అనే పాటలు. పదహారణాల తెలుగుదనం ఉట్టిపడే శ్రవణపేయమైన సంగీతానికి మల్లీశ్వరి లాటి సినీమా లు ఒకటి చాలు.

ఈనాటి మన ' ఘంటసాల - సదా మదిలే మెదిలే సజీవరాగం' శీర్షికలోని మరపురాని మధుర గీతం "అవునా నిజమేనా". ఈ పాట రెండు భాగాలు. మొదటి భాగం ఘంటసాలగారు పాడగా , రెండవ భాగాన్ని భానుమతి పాడారు.

ఈ పాట ఖచ్చితంగా ఫలానా రాగమని చెప్పడానికి లేకుండా వివిధ రాగఛాయలతో స్వరపర్చారు రాజేశ్వరరావు. మోహన, శంకరాభరణ రాగ స్వరాల ఆధారంతో ఈ పాటను చేసినట్లు కొందరి సంగీతజ్ఞుల అభిప్రాయం. ప్రముఖ కథారచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారి కుమారుడు, వైజ్ఞానిక శాస్త్రవేత్త, సితార్ విద్వాంసుడు శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ఈ పాటను విశ్లేషిస్తూ ఈ పాటలో హిందుస్థానీ పహాడి రాగ పోకడలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది.

"అవునా! నిజమేనా" పాటను ఘంటసాలవారు మంద్రస్థాయిలో  అత్యద్భుతంగా ఆలపించారు. నాభిస్థానం నుండి నాదాన్ని పూరించాలనే సిధ్ధాంతాన్ని ఘంటసాల నూరుపాళ్ళు పాటించారని అనిపిస్తుంది. ఈపాటలో ఘంటసాలవారి గళంలోని విరహం , వైరాగ్యంతో కూడిన నవ్వులు, భావప్రకటన ఇవన్నీ ఆయనకు ముందు తరం గాయకులు కె ఎల్ సైగల్ , పంకజ్ మల్లిక్ వంటి వారు స్ఫురణకు వస్తారు. గాయకుడిగా ఘంటసాలవారి కి ఎంతో ఖ్యాతిని ఆర్జించిపెట్టిన సినీమా మల్లీశ్వరి.

మల్లీశ్వరి పాటల వలన కలిగిన పోటీ ప్రభావంతో కొన్నేళ్ళపాటు ఘంటసాలవారి తో కలసి పాడడానికి భానుమతిగారు సుముఖత చూపలేదు. అందుకు  భానుమతిగారి చక్రపాణి, విప్రనారాయణ  సినీమాలు సాక్ష్యం.  తర్వాతి కాలంలో రామకృష్ణగారి బలవంతం మీద భానుమతి రాజీపడ్డారు, అది వేరే విషయం.

శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారికి ఎంతో తృప్తిని కలిగించిన చిత్రం మల్లీశ్వరి. మా మద్రాస్ తెలుగు అకాడెమీ నిర్వహించిన ఉగాది పురస్కారోత్సవ్ వేదిక మీద  మల్లీశ్వరి లోని పాటలను శ్రీ రాజేశ్వరరావు గారి సమక్షంలో ప్రముఖ కర్నాటక సంగీత విదూషిమణులు 'ప్రియా సిస్టర్స్' గానం చేసేరు. ఆ సందర్భంలో శ్రీ సాలూరివారు ఈ పాటలను గురించి ముచ్చటిస్తూ హార్మోనియం వాయిస్తూ పాడడం పాడారు.  వృధ్ధాప్యం కారణంగా ఆయనకు బాలుగారు సహకరించారు.

మల్లీశ్వరి సినీమా వచ్చి 72 సంవత్సరాలైనా ఆ సినిమా ఇంకా మనందరికీ గుర్తుండిపోవడానికి కారణం ఆపాతమధురమైన సంగీతమే.







వచ్చే ఆదివారం "ఘంటసాల - మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...