Saturday, 13 January 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 12వ భాగం - అన్నానా! భామినీ!!

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ

 

ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదకొండవ భాగం ఇక్కడ

12వ సజీవరాగం - 

" అన్నానా భామిని " - సారంగధర 1957 - రాగం - రాగేశ్వరి
సాహిత్యం : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల , పి.లీల

ఘంటసాల మాస్టారికి చాలా ఇష్టమైన రాగాలలో రాగేశ్వరి ఒకటి. ఇది ఒక హిందుస్థానీ రాగం. ఖమాస్ థాట్ కు చెందినది. దీనికి దగ్గరలో వుండే కర్నాటక సంగీతంలోని రాగం నాటకురంజి. ఘంటసాలగారు ఈ రాగేశ్వరి రాగంలో అద్భుతమైన , శ్రవణపేయమైన గీతాలెన్నింటినో స్వరపర్చారు. అందులో ఆణిముత్యంలాటి పాట "అన్నానా... భామిని... ఏమని ఎపుడైనా..."

ఈ పాట 1957 లో వచ్చిన "సారంగధర" సినీమా లోనిది. సముద్రాల రాఘవాచార్యులవారు సాహిత్యం సమకూర్చారు. స్వీయసంగీత దర్శకత్వంలో ఈ పాటను పి.లీలతో కలసి పాడారు ఘంటసాల. సముద్రాలవారు పాతకాలపు గీత రచయిత. తన యవ్వన దశలో ఎన్నో సార్ధకమైన వేదాంతపరమైన పాటలెన్నింటినో రచించారు. అలాగే అనుభవం పండి వార్ధక్యం మీద పడిన తర్వాత కూడా యువతరాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ యుగళగీతాలను వ్రాసారు.

"అన్నానా భామిని" పాట ఒక విశిష్టమైన, విభిన్నమైన ప్రేమగీతం. ఈ పాట పాటలా కాకుండా ఇద్దరు ప్రేయసీ ప్రియులు ఏకాంతంలో సంభాషించుకుంటున్నట్లుంటుంది. అందుకు తగిన వాద్యాలనే ఎన్నుకొని క్లుప్తమైన  సున్నితమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను స్వరపర్చి తన అనన్య సంగీత ప్రజ్ఞను చూపారు ఘంటసాల.

ఈ పాటలో వినవచ్చే "భామిని, ఏమని, ఆదమరచి, మాటవరసకెపుడైనా" వంటి మాటలు ఈ పాటకు ఎంతో లాలిత్యాన్ని అందజేశాయి.  ఆయా మాటల మీద ఘంటసాలగారు ఉపయోగించిన సంగతులు, గమకాలు శ్రోతల మనసుకు పరవశత్వాన్ని కలిగించి సమ్మోహనపరుస్తాయి. పాట మధ్యలో వచ్చే "ఆహా"లు, ముగ్ధమనోహరమైన మందహాసాలు ఘంటసాలవారి సొంతం. అనితరసాధ్యం.

రాగేశ్వరి రాగ స్వరూపమంతా విస్తరింపజేస్తూ పియోనా, ఫ్లూట్, క్లారినెట్, వీణ, గిటార్, వయొలిన్స్ సమ్మేళనంతో రూపొందించిన బిజిఎమ్స్, పాటమధ్యలో వినిపించే ఇంటర్లూడ్స్ ఘంటసాలవారి సంగీతప్రతిభకు నిదర్శనం. పాట అనేది లలితంగా, ఏ గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఓ చల్లటి నదీ తరంగంలా సాగిపోతూ మనసుకు హాయిని, ఆహ్లాదాన్ని చేకూర్చడమేలా అని తెలుసుకోవలాంటే " అన్నానా భామిని" పాటను వినవలసిందే. ఘంటసాల మాస్టారు, పి.లీలగారు ఈ పాటను ఎంతో అపురూపంగా, అపూర్వంగా గానం చేసారు.  అంత సుందరంగానూ శృంగారాన్ని తెరమీద ఎన్.టి.రామారావు , రాజసులోచన అభినయించి తమకు తామే సాటియని చాటిచెప్పారు.

ఇక సినిమా విషయానికి వస్త -  "సారంగధర" చరిత్ర 11 వ శతాబ్దం నాటిది. తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని కుమారుడైన సారంగధరుని ప్రేమకథ. ఇది జానపద బుర్రకధగా తెలుగునాట పామరజనాలలో బహుళ ప్రసిధ్ధిపొందిన కధ. ఈ ఇతివృత్తాన్ని శ్రీ గురజాడ అప్పారావు పంతులుగారు ఇంగ్లీషులో నాటకంగా వ్రాసి అనేకచోట్ల ప్రదర్శింపజేసారు. ఆ నాటకం ఆధారంగా మినర్వా పిక్చర్స్ వారు సౌందర్యరాజన్, 1957లో "సారంగధర" సినీమాను తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మించారు. వి.ఎస్.రాఘవన్, రామచంద్రరావులు దర్శకులు.

తెలుగులో ఎన్.టి.రామారావు, తమిళంలో శివాజీ గణేశన్ కథానాయకులు. తెలుగు, తమిళం రెండింటిలోనూ  ఎస్.వి.రంగారావు, భానుమతి, రాజసులోచన, శాంతకుమారి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ వెర్షన్ కు జి.రామనాధన్, తెలుగుకు ఘంటసాల సంగీత దర్శకులు. ఎవరి బాణీ వారిదే. తెలుగు, తమిళ పాటలకు సంబంధం లేదు.

ఈ సినీమా లో భానుమతి గారు ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో రెండు సోలోలు,  ఆయనతో కలసి కొన్నిసంవాద పద్యాలు ఆలపించడం ఒక విశేషం. ఏవో వ్యక్తిగతమైన అభిప్రాయభేదాలు భానుమతిగారు కల్పించుకున్నా, వాటన్నిటినీ పక్కనబెట్టి ఘంటసాలవారు సామరస్యంతో ఈ సినీమా లో ఆవిడతో కలసి పనిచేశారు. భానుమతిగారు పాడిన రెండు పాటలు, పద్యాలు బహుళ జనాదరణ పొందాయి.

సారంగధర సినీమా టైటిల్ మ్యూజిక్ గా ఘంటసాలవారు తమ గురుదేవులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి లలిత రాగంలోని కృతిని ఉపయోగించారు. ఈ విషయాన్ని గతంలో మన సమూహంలో ముచ్చటించడం జరిగింది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్





No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...