ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం 11 వ గీతం
"అవునా నిజమేనా"
చిత్రం - మల్లీశ్వరి
సాహిత్యం - దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం - ఎస్ రాజేశ్వరరావు
గానం - ఘంటసాల , భానుమతి
Art is for art sake అనే నానుడిని తూ.చ తప్పక పాటించిన సినీ మేధావి, కళాత్మక హృదయుడు శ్రీ బి.ఎన్.రెడ్డి. రాశిలో తక్కువే అయినా వాసిలో అన్నింటా మిన్నగా శ్రీ బి ఎన్ చిత్రాలు చెపుతాయి. అలాటివాటిలో కళాఖండ చిత్రంగా పేర్కొనవలసిన చిత్రం మల్లీశ్వరి. ఇంతవరకు వేలాది తెలుగు సినిమాలలో ఉత్తమ పది చిత్రాల పేర్లు చెప్పమంటే ముందుగా స్ఫురించేది 'మల్లీశ్వరి'. ఖండాంతరాలలో చలనచిత్రోత్సవాలలో ప్రదర్శింపబడిన చిత్రం మల్లీశ్వరి.
ప్రముఖ రచయిత శ్రీ బుచ్చిబాబు వ్రాసిన "రాయలవారి కరుణాకృత్యము", దేవన్ షరార్ అనే రచయిత వ్రాసిన "ది ఎంపరర్ ఎండ్ ది స్లేవ్ గర్ల్" కథానిక, విజయనగర రాజుల కాలంనాటి హంపీ శిల్పకళా వైభవం ఇచ్చిన స్ఫూర్తి, ఆధారంతో శ్రీ బి.ఎన్.రెడ్డి ఈ అద్భుత చిత్రాన్ని నిర్మించారు.
ఎ.కె.శేఖర్ కళా దర్శకత్వం, ఆది మల్లి ఇరాని ఛాయాగ్రహణం, భానుమతి, ఎన్.టి.రామారావు ల అపూర్వ నటనా వైదుష్యం, భానుమతి, ఘంటసాల ల సుమధుర గానం మల్లీశ్వరి మరపురాని దృశ్యకావ్యం కావడానికి దోహదపడ్డాయి.
కేవలం సాహితీలోకంలో కవులకు మాత్రమే సుపరిచితుడైన కవికుల తిలకం శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అలాటి ఉత్తమ భావకవిని సామాన్య ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత శ్రీ బి.ఎన్.రెడ్డిగారిదే. మల్లీశ్వరి అజరామరత్వానికి మూలకారణం శ్రీ కృష్ణశాస్త్రి గారి మాటలు పాటలే. మల్లీశ్వరి సినీమాలోని ఇరవై పాటలను కృష్ణశాస్త్రిగారే వ్రాసారు.
మల్లీశ్వరి సినీమాకు మణిమకుటం శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం. మల్లీశ్వరి సంగీతభరిత చిత్రంగా తీర్చిదిద్ది అపూర్వమైన అపురూపమైన గీతాలతో వీనులవిందు చేసారు రసాలూరించు రాజేశ్వరరావు గారు. మల్లీశ్వరిలోని 21 పాటలు వివిధ రకములైన సన్నివేశాలకు తగినట్లుగా రాజేశ్వరరావు గారు స్వరపర్చారు. ఈ సినీమాలో ఎక్కువగా దాదాపు 10 పాటలు పాడి గాయకులలో అగ్రతాంబూలం అందుకున్నవారు ఈ చిత్ర కథానాయిక, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి పి. భానుమతి. ఈ చిత్రంలో మిగిలిన పాటలను ఘంటసాల, మాధవపెద్ది, టి.జి.కమలాదేవి, మాస్టర్ జి.రామకృష్ణ, శకుంతల మొదలైనవారు పాడారు.
ఈ సినీమాలో ఘంటసాలగారు మూడు పాటలను మాత్రమే పాడారు. ఆ మూడు పాటలూ భానుమతిగారితో యుగళగీతాలే. అవి - 'పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి', ' ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు', 'ఔనా! నిజమేనా మరతునన్న మరువలేని' అనే పాటలు. పదహారణాల తెలుగుదనం ఉట్టిపడే శ్రవణపేయమైన సంగీతానికి మల్లీశ్వరి లాటి సినీమా లు ఒకటి చాలు.
ఈనాటి మన ' ఘంటసాల - సదా మదిలే మెదిలే సజీవరాగం' శీర్షికలోని మరపురాని మధుర గీతం "అవునా నిజమేనా". ఈ పాట రెండు భాగాలు. మొదటి భాగం ఘంటసాలగారు పాడగా , రెండవ భాగాన్ని భానుమతి పాడారు.
ఈ పాట ఖచ్చితంగా ఫలానా రాగమని చెప్పడానికి లేకుండా వివిధ రాగఛాయలతో స్వరపర్చారు రాజేశ్వరరావు. మోహన, శంకరాభరణ రాగ స్వరాల ఆధారంతో ఈ పాటను చేసినట్లు కొందరి సంగీతజ్ఞుల అభిప్రాయం. ప్రముఖ కథారచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారి కుమారుడు, వైజ్ఞానిక శాస్త్రవేత్త, సితార్ విద్వాంసుడు శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ఈ పాటను విశ్లేషిస్తూ ఈ పాటలో హిందుస్థానీ పహాడి రాగ పోకడలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది.
"అవునా! నిజమేనా" పాటను ఘంటసాలవారు మంద్రస్థాయిలో అత్యద్భుతంగా ఆలపించారు. నాభిస్థానం నుండి నాదాన్ని పూరించాలనే సిధ్ధాంతాన్ని ఘంటసాల నూరుపాళ్ళు పాటించారని అనిపిస్తుంది. ఈపాటలో ఘంటసాలవారి గళంలోని విరహం , వైరాగ్యంతో కూడిన నవ్వులు, భావప్రకటన ఇవన్నీ ఆయనకు ముందు తరం గాయకులు కె ఎల్ సైగల్ , పంకజ్ మల్లిక్ వంటి వారు స్ఫురణకు వస్తారు. గాయకుడిగా ఘంటసాలవారి కి ఎంతో ఖ్యాతిని ఆర్జించిపెట్టిన సినీమా మల్లీశ్వరి.
మల్లీశ్వరి పాటల వలన కలిగిన పోటీ ప్రభావంతో కొన్నేళ్ళపాటు ఘంటసాలవారి తో కలసి పాడడానికి భానుమతిగారు సుముఖత చూపలేదు. అందుకు భానుమతిగారి చక్రపాణి, విప్రనారాయణ సినీమాలు సాక్ష్యం. తర్వాతి కాలంలో రామకృష్ణగారి బలవంతం మీద భానుమతి రాజీపడ్డారు, అది వేరే విషయం.
శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారికి ఎంతో తృప్తిని కలిగించిన చిత్రం మల్లీశ్వరి. మా మద్రాస్ తెలుగు అకాడెమీ నిర్వహించిన ఉగాది పురస్కారోత్సవ్ వేదిక మీద మల్లీశ్వరి లోని పాటలను శ్రీ రాజేశ్వరరావు గారి సమక్షంలో ప్రముఖ కర్నాటక సంగీత విదూషిమణులు 'ప్రియా సిస్టర్స్' గానం చేసేరు. ఆ సందర్భంలో శ్రీ సాలూరివారు ఈ పాటలను గురించి ముచ్చటిస్తూ హార్మోనియం వాయిస్తూ పాడడం పాడారు. వృధ్ధాప్యం కారణంగా ఆయనకు బాలుగారు సహకరించారు.
మల్లీశ్వరి సినీమా వచ్చి 72 సంవత్సరాలైనా ఆ సినిమా ఇంకా మనందరికీ గుర్తుండిపోవడానికి కారణం ఆపాతమధురమైన సంగీతమే.
వచ్చే ఆదివారం "ఘంటసాల - మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment