"చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో"
రాగం : కళ్యాణి - చిత్రం : సంతానం
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గానం : ఘంటసాల
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమె నాలో
లీనమాయెనే ఆనందమె నా గానమాయెనే
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి
తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో
కలకలలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలం నీ కమ్మని రూపం
కలవరింతువులే నా మదిలో
చల్లని వెన్నెలలో....
ఘంటసాలవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రాగం కళ్యాణి అనే మాట బహుళ ప్రచారంలో వుంది. అందుకు కారణం కళ్యాణి రాగ ప్రధానంగా రూపొంది, ఘంటసాల మాస్టారు పాడిన అసంఖ్యాకమైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇక్కడొక చిన్న విషయం చెప్పక తప్పదు. తాను సంగీత దర్శకత్వం వహించి కళ్యాణి రాగంలో స్వరపర్చి పాడిన గీతాలకన్నా ఇతర సంగీత దర్శకులు ఆ రాగంలో స్వరపర్చి ఘంటసాలవారిచేత పాడించిన పాటలే అధికం. ఆ పాటలన్నీ ఘంటసాలవారి గాత్ర మాధుర్యం వలన అపాతమధురాలైనాయి.
ఘంటసాలవారి గళం నుండి జాలువారిన అలాటి సుశ్రావ్య కళ్యాణి గీతమే ఈనాటి మన సజీవరాగం.
1954లో సి.వి.రంగనాథ దాస్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ' సంతానం' చిత్రం లోని పాట "చల్లని వెన్నెలలో". నా చిన్నతనంలో కొన్నేళ్ళపాటు చిన్నా పెద్దా , ఆడ మగ అనే తేడాలేకుండా ఎవరినోట విన్నా ఈ పాటే వినిపించేది. ఈనాటికీ గాయకులందరి నోటా వినిపిస్తూనే ఉంది. ఈపాటలోని కవి భావుకత మనసును పరవశింపజేస్తుంది.
చల్లని వెన్నెల, చక్కని కన్నె పక్కన వుంటే ముగ్ధమనోహరమైన భావావేశం పుట్టుకు వస్తుందని అప్పుడు కలిగిన ఆనందమే గానమవుతుందని ఈ పాటలో నిరూపించారు అనిశెట్టి గారు. 'గాలి పెదవులే మెల్లగ సోకిన పూలు నవ్వెనే నిద్దురలో'' - ఎంతటి మధుర భావన. కవి కలాలకు ఎటుపక్కైనా పదునే అని ఋజువు చేసారు అనిశెట్టిగారు. విప్లవ భావ రచయితలుగా తీవ్ర పదజాలంతో కవితలల్లిన అనిశెట్టి-పినిశెట్టి జంటకవులలో అనిశెట్టిగారు తన ఆగ్రహావేశాలను పక్కకు నెట్టి ప్రశాంతంగా సున్నితమైన భావాలతో వ్రాసిన పాట ' చల్లని వెన్నెలలో'.
శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం పరిపుష్టిగా వున్న సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి. రెండవ తరం సంగీత దర్శకులలో పేరెన్నిక పొందినవారు. సంతానం సినీమా సంగీత దర్శకుడిగా అత్యద్భుతమైన పాటలెన్నింటినో స్వరపర్చారు. అంతేకాదు, ఈ చిత్రంద్వారా దక్షిణామూర్తి గారు సుప్రసిధ్ధ హిందీ నేపథ్యగాయని లతా మంగేష్కర్ ను తెలుగువారికి పరిచయం చేసారు.
దక్షిణామూర్తి " చల్లని వెన్నెలలో "
పాటను కళ్యాణి రాగంలో స్వరపర్చారు. కళ్యాణి కర్నాటక సంగీత శైలిలో ఒక సుప్రసిధ్ధ రాగం. 72 మేళకర్త రాగాలలో 65వ రాగం. కళ్యాణి సంపూర్ణరాగం. ఆరోహణా, అవరోహణా క్రమంలో ఈ రాగంలో సప్తస్వరాలు వినిపిస్తాయి. కళ్యాణి రాగం మేళకర్తగా మేచకళ్యాణి అని వ్యవహరిస్తారు. హిందుస్థానీ సంగీత శైలిలో కళ్యాణికి సమాంతరమైన రాగం 'యమన్'. కొన్ని వేల సినీమాపాటలు వివిధభాషలలో, వివిధ గాయకులచే ఈ కళ్యాణి, యమన్ రాగాలలో స్వరపర్చబడిన పాటలు గానంచేయబడ్డాయి. వాటన్నింటిలో ఘంటసాల మాస్టారు పాడిన కళ్యాణి రాగ ప్రధాన గీతాలకు ఒక ప్రత్యేకత, ఒక సమున్నత స్థానం ఉందంటే అది అతిశయోక్తి కానేరదు.
ఘంటసాల మాస్టారు 1950 దశకంలో పాడిన పాటల్లో ఈ ' చల్లని వెన్నెలలో' పాట అగ్రగణ్యమైనది. ఈ పాటలో ఘంటసాలవారి కంఠంలోని వైవిధ్యం , మాట స్పష్టత , భావప్రకటన శ్రోతలకు మైమరపును , హాయిని కలిగిస్తుంది.
సినీమా లో ఇదొక పియోనా పాట. ఆనాటి సినీమాలలో సూటు, బూట్లతో హీరో పియోనా పాటలు పాడడమనేది ఒక స్టాటస్ సింబల్. హీరో ఎ.నాగేశ్వరరావు, హీరోయిన్ సావిత్రి ల మీద ఈ పాట చిత్రీకరణ. పాట ఘంటసాలవారి నోట అన్ని స్థాయిలలో కళ్యాణి రాగ ఆలాపనతో ప్రారంభమవుతుంది. వాల్జ్ టైప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు తగినట్లుగా సావిత్రి చెసిన నాట్య భంగిమలు చాలా ముచ్చటగొలుపుతాయి.
చల్లని వెన్నెలలో అనే చోట, గానమాయెనే అనే చోట మాస్టారి గళంలోని గమకాలు , 'తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి.. తేలియాడనే ముద్దులలో' అనే దగ్గర భావస్ఫూర్తి శ్రోతల మనసుకు ఆహ్లాదాన్ని , పరవశత్వాన్ని కలిగిస్తుంది. 'పూలు నవ్వెనే.. నిద్దురలో' అనే చోట మంద్రస్థాయిలో మాస్టారి గళ మాధుర్యం ఈ పాటను అజరామరం చేసింది. ఇక ఆఖరి చరణం 'కలకలలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో' అనే చోట వారి భావ ప్రకటన ఆ తరువాతి ఆలాపన ఎంతో అలవోకగా అది వారికే సొంతం అనే రీతిలో ఘంటసాల ఆలపించారు.
ఘంటసాలవారి నోట మూడు స్థాయిలలోనూ వినపడే ఈ ' చల్లని వెన్నెలలో' ' పాట ఎన్నటికీ ఓ సజీవరాగమే.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment