Saturday, 27 January 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 14వ భాగం - హృదయమా సాగిపొమ్మా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదమూడవ భాగం ఇక్కడ

14వ సజీవరాగం - 
హృదయమా సాగిపొమ్మా

కళ్యాణి రాగం -      రచన : ఆరుద్ర
సంగీతం, గానం : ఘంటసాల
చిత్రం : పరోపకారం, 1953.

హృదయమా సాగిపొమ్మా
భావ వేగాన సాగిపొమ్మా
హృదయమా!

కొసరి వీచేను గడుసరి గాలి
ఆదమరిచేవు సుఖముల తేలి
చాలు చాలించు సోమరినడక
సాగిపోవాలి తడబడక ! హృదయమా

మురళినూదేడు కోనారి కూన
ముదము కురిసేను జగములోన
ఆలమందలు ఇలు చేరబోయె
వేగమెచ్చించు కడుజాలమాయె -
హృదయమా !

మన ప్రాచీన కవులు వాయువేగ, మనోవేగాల గురించి వర్ణించారు. అతివేగంగా పరిగెత్తే అశ్వాన్ని లక్ష్యంగా యాంత్రిక వాహనాల వేగాన్ని హార్స్ పవర్ తో తూచారు. వీటన్నిటితో పాటు భావవేగాన్ని కూడా ఈ పాటలో చేర్చారు కవి. గమ్యాన్ని చేరుకోవడంలో మనోవేగాన్ని, భావవేగాన్ని మించినదేదీ లేదు.

ఈ పాటలో సోమరిపోతులా నడిచే రైలుబండిని, రైలు పెట్టెలోని ఓ ప్రయాణీకుని హృదయవేగాన్ని సమన్వయపరుస్తూ కవి ఈ పాటను చాలా భావోద్దీపనతో వ్రాసారు. రైలు పెట్టిలోకి చొరవగా గడుసుతనంగా చొరబడి వీస్తున్న చల్లగాలికి సుఖంగా ఆద మరచి నిద్రపోతున్నావు, లే.. లేచి సోమరినడకలు చాలించి ఏ తడబాటు లేకుండా ముందుకు సాగిపొమ్మని హృదయాన్ని, రైలుబండిని హెచ్చరిస్తున్నాడు రైలు ప్రయాణీకుడు.

రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు కళ్ళబడుతూంటాయి. రైలు పట్టాల పక్కన సువిశాలమైన  పచ్చని మైదానాలు, చెట్లుచేమలు, గేదెల మీదనెక్కి లొల్లాయి పాటలు పాడుతూ పిల్లాంగోరి ఊదే పిల్లగాళ్ళు రైల్లో కూచొని ఆపసోపాలు పడేవారికి వినోదం కల్పిస్తారు. ఈ సందర్భంగా కవి ఒక అద్భుత పద ప్రయోగం చేసారు -
"మురళి నూదేడు కోనారి కూన
ముదము కురిసేను జగములోన"
"కోనారి కూన" అంటే ఏమిటో ఈనాటి తెలుగువారికి తెలిసే మాట కాదు. ఉత్తరాంధ్రదేశంలో పశువులను కాచుకునేవాళ్ళను "కోనారులు" అనే పేరుతో పిలవడం ఉంది. "కూన" అంటే చిన్న పిల్లవాడు, పిల్ల అని అర్ధం. వెన్నెలకూన , పిల్లికూన అని అనడం మనకు తెలిసినదే. జగమంతటికీ సంతోషం కలిగేలా కోనారి కూన మురళిని ఊదేడు, పశువులన్నీ ఇళ్ళు చేరే వేళయింది, మనకు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, వేగం హెచ్చించమని హృదయాన్ని,  రైలు బండిని కోరుతున్నాడు.

ఈ పాటను ఆరుద్రగారు వ్రాసారు. "పరోపకారం" ఆరుద్రగారి తొలి స్ట్రైట్ సినీమా. ఈ సినీమాకు మాటలు, పాటలు పూర్తిగా ఆరుద్రగారే రాసారు. సాహితీపరంగా , సంగీతపరంగా పరోపకారంలో మంచి పాటలే ఉన్నాయి. ఈ సినీమాకు సంగీత దర్శకుడు , ఆపధ్ధర్మ నిర్మాత ఘంటసాలగారే.


పరోపకారంలో సెకెండ్ హీరోయిన్ గా సావిత్రిది  ఒక ప్రముఖమైన పాత్ర. సావిత్రి నటించిన మొదటి మూడు నాలుగు సినీమాలలో "పరోపకారం" ఒకటి.

ఈ "హృదయమా సాగిపొమ్మా" పాటను ఘంటసాలగారు కళ్యాణి రాగంలో ఎంతో భావయుక్తంగా స్వరపర్చి, మనోజనరంజకంగా ఆలపించారు. "తడబడక" , "కడుజాలమాయే" అనే చోట ఘంటసాలవారి టిపికల్ సంగతులు వినిపిస్తాయి.  అలాగే "కోనారికూన" అనే పదంమీద ఇచ్చిన expression ఘంటసాలగారికే చెల్లు.

సినీమాలో ఈ పాట మరో గాయక సంగీత దర్శకుడైన బి. గోపాలంగారి మీద చిత్రీకరింపబడినా ఈ పాటలోని మనోభావాలన్నీ  రైలు పెట్టెలో మరో ప్రక్క కూర్చున్న కధానాయకుడు ముక్కామల గారివే. ఒక గాయకుడి పాట మరో గాయకుడిమీద చిత్రీకరించడం ఇదే ప్రధమమేమో? 

తన సొంత చిత్రంలో ఘంటసాలగారు మరో ప్రముఖ గాయకుడు ఎ.ఎమ్.రాజాగారి చేత ఒక పాట పాడించడం విశేషం. ఈ సినీమాలోని ఇతర పాటలను పి.లీల, ఎ.పి.కోమల, మాధవపెద్ది, పిఠాపురం ఆలపించారు.

ఈ చిత్రంలో జి.వరలక్ష్మి, ముక్కామల, రేలంగి, సి.ఎస్.ఆర్., రామశర్మ, సావిత్రి, ఆర్.నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారులు.

దేవకీబోస్ కధ ఆధారంగా "పరోపకారం"  సినీమా తెలుగు , తమిళ భాషలలో ఒకేసారి నిర్మించడం జరిగింది. ఈ చిత్ర దర్శకత్వాన్ని, ఛాయాగ్రహణాన్ని కమల్ ఘోష్ నిర్వహించారు. 

"అల్లుడినోట్లో శని", " కర్ణుడి చావు" వంటి సామెతలు ఈ సినీమా విషయంలో, నిర్మాత ఘంటసాలగారి విషయంలో అక్షరాలా నిజమయ్యాయి. చిత్ర నిర్మాణ భాగస్వాముల మోసానికి బలియై అప్పులను నెత్తికేసుకున్న నిర్మాతగా ఘంటసాల మిగిలిపోయారు. ఈ పరోపకారం సినీమా విడుదలైన మరో వారంలోనే అక్కినేని "దేవదాసు" కూడా విడుదలయి మిగిలిన సినిమా లన్నిటినీ చావుదెబ్బ కొట్టింది.

గాయకుడిగా దేవదాసు ఘన విజయానికి సంతోషించనా, నిర్మాతగా పరోపకారం అపజయానికి చింతించనా? అనే వైరాగ్యస్థితిని అనుభవించారు ఘంటసాల. 

ఈ రోజున "పరోపకారం" తెలుగు సినీమా పూర్తిగా అలభ్యం. నెగెటివ్ ప్రింట్ కూడా లేదు.  తమిళ సోదరుల శ్రధ్ధాసక్తుల వలన తమిళ 'పరోపకారం' సినీమా, పాటలు యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి.

చిత్ర జయాపజయాలు సినీ ప్రేక్షకుల ఆధీనాలు. ఏ చిత్రం ఎందుకు విజయం పొందుతుందో, ఎందుకు పరాజయం పొందుతుందో  ప్రేక్షకులే చెప్పలేరన్న మాట మాత్రం పరమ సత్యం. పరోపకారం జయాపజయాల విషయం ఎలావున్నా అందులోని పాటలన్నీ , ముఖ్యంగా " హృదయమా సాగిపొమ్మా" మాత్రం ఆపాతమధురమే.




ఈ చిత్రం ద్వారా ఒక నూతన నృత్య దర్శకుడిని ఘంటసాలగారు పరిచయం చేసారు, ఆయనే  తర్వాతి కాలంలో జగద్విఖ్యాతి పొందిన లెజెండ్ , కూచిపూడి నాట్యాచార్యుడు పద్మభూషణ్, డా. వెంపటి చిన సత్యం గారు. ఈ చిత్రంలో ఒక నృత్య సన్నివేశంలో ఘంటసాలవారు పాడిన "వలపుల కథకిది తొలిపలుకు" పాటకు హార్మోనియం వాయిస్తూ  వీధిగాయకుడి పాత్ర లో ఆయన కనిపిస్తారు. 
వలపుల కథకిది తొలిపలుకు  ఈ లింక్ లో ఆ గీతాన్ని చూడవచ్చు. https://youtu.be/SQeJRZQbxuw?si=NojK5pelMEhPamXs



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...