Saturday 4 May 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 28వ భాగం - నా హృదయంలో నిదురించే చెలీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఏడవ భాగం ఇక్కడ

28వ సజీవరాగం -   

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోన కవ్వించే సఖీ మయూరివై
వయారివై నేడే నటనమాడి నీవే నన్ను
దోచినావే - నా హృదయంలో !!

నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానే - నా హృదయంలో !!

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే 
పల్లవిగా పలుకరించ రావే, నీ వెచ్చని నీడా వెలసెను నా
వలపుల మేడా నివాళితో చేయిచాచి
ఎదురు చూచినానే నిదుర కాచినానే
- నా హృదయంలో నిదురించే చెలీ...!!
                
శంకరాభరణం చాలా విశిష్టత కలిగిన రాగం. 29 వ మేళకర్త ధీరశంకరాభరణం జన్యం. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతున్నందువలన ఇది సంపూర్ణ రాగంగా పరిగణించబడుతున్నది. గమక ప్రాధాన్యత గల రాగం. ఈ ధీరశంకరాభరణం రాగానికి ప్రసిధ్ధి పొందిన అనేక జన్యరాగాలు వున్నాయి. బిలహరి, దేవగాంధారి, ఆరభి, అఠాణా, కురింజి, కదనకుతూహలం, శుధ్ధ సావేరి, కేదారం, ఇలా ఎన్నోరాగాలు ధీరశంకరాభరణ  జన్యాలే. ఈ రాగాలన్నింటిలో బహుళ జనాదరణ పొందిన  సినిమా పాటలు అసంఖ్యాకంగా వున్నాయి. శంకరాభరణం రాగాన్ని హిందుస్తానీ సంగీతశైలిలో బిలావల్ అంటారు. (కానీ  స్వరాల మూర్చన  బిలహరికి దగ్గరగా వుంటుందని అంటారు). ఈ  శంకరాభరణం రాగం మన భారతీయ సంగీతంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల సంగీతంలో కూడా వినిపిస్తుంది. వెస్టర్న్ మ్యూజిక్ సిస్టమ్ లో శంకరాభరణాన్ని లోనియన్ మోడ్ లేదా మేజర్ స్కేల్ అంటారు. శ్రావ్యమైన, మృదుమధుర భావాలను వెల్లడించడానికి శంకరాభరణం రాగం చాలా అనువైన రాగంగా సంగీతజ్ఞులు భావిస్తారు.

ఈ శంకరాభరణ రాగ స్వరాలతో వచ్చిన పాటలెన్నింటినో అమరగాయకుడు ఘంటసాలవారు ఆలపించి వాటికి అజరామరత్వం కల్పించారు. సీతారామ కళ్యాణంలో  రామారావు గారికి పాడిన "కానరార కైలాసనివాస", భార్యాభర్తలులో అక్కినేని వారికి పాడిన "జోరుగా హుషారు షికారు పోదమా", శాంతినివాసం లోని "కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే", అభిమానం సినిమాలోని "లపు తేనె పాట"(అన్య స్వరాలతో)... చెప్పుకుంటూపోతే  ఇలాఎన్నో మనోరంజకమైన పాటలున్నాయి.

ఆ కోవలోకి చెందినదే నేటి మన ఘంటసాల మాస్టారి సజీవరాగం
"నా హృదయంలో నిదురించే చెలీ"
శంకరాభరణం రాగంలో స్వరపర్చబడింది.

ఈ పాట అక్కినేని, సావిత్రి , రాజశ్రీ, గిరిజ, జగ్గయ్య, రేలంగి మొదలగువారు నటించిన 1962లో విడుదలైన "ఆరాధన" సినీమాలోనిది. ఇదొక ట్రైయాంగిల్ లౌవ్ స్టోరీ. 

జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద విబి రాజేంద్రప్రసాద్ నిర్మించిన రెండవ సినీమా " ఆరాధన". అమోఘమైన విజయం సాధించింది. అందుకు కారణం ఈ సినీమా సంగీతం , ముఖ్యంగా, "నా హృదయంలో నిదురించే చెలీ" పాట.

ఈ సినీమాకు సంగీతదర్శకుడు సుస్వరాల రసాలూరు రాజేశ్వరరావుగారు. వివిధ వాద్యాలు వాయించడంలో, విభిన్న సంగీత బాణీలు సృష్టించడంలో నిష్ణాతుడు.

"నా హృదయంలో నిదురించ చెలీ" పాటను శ్రీ శ్రీ వ్రాసారు. "మనసు కవి" కితాబును మనవాళ్ళు ఆత్రేయగారికి ఇచ్చారు కానీ అలాటి హృద్యమైన , మనసులో చిరస్థాయిగా నిలచిపోయే పాటలెన్నింటినో శ్రీశ్రీ గారు వ్రాసారు.

ఈ ఆరాధన చిత్రానికి  మాతృక 'సాగరిక' అనే  బెంగాలీ సినీమా, 1956లో వచ్చింది. ఉత్తమ్ కుమార్, సుచిత్రాసేన్ ప్రధాన పాత్రలు ధరించారు. రాబిన్ ఛటర్జీ సంగీతంలో శ్యామల్ మిత్ర అనే గాయకుడు పాడిన పాట వరసనే  తెలుగులో "నా హృదయంలో నిదురించే చెలి " గా మలిచారు రాజేశ్వరరావు గారు.

పాట మూలం బెంగాలీయే అయినా దానికి పూర్తి తెలుగుదనాన్ని ఆపాదించినవారు మాత్రం సాలూరు రాజేశ్వరరావుగారు, ఘంటసాలగారు మాత్రమే. గమకప్రాధాన్యంగల సుశాస్త్రీయ శంకరాభరణ రాగాన్ని లలితమైన గమకాలతో అత్యంత శ్రావ్యంగా, మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ అమోఘంగా గానం చేసారు ఘంటసాల.

మన పాత సినిమాలలో హీరో, హీరోయిన్లు లేదా వ్యాంప్ పాత్రధారులు చేత పియోనా వాయిస్తూ పాటలు పాడించడమనేది అనవాయితీగా వచ్చిన బాక్సాఫీస్ ఫార్ములా.  రాజేశ్వరరావుగారు చాలా బాగా పియోనా వాయిస్తారు. కానీ, తన సినిమా లలో పియోనా పాటలన్నీ తన పెద్ద కుమారుడు రామలింగేశ్వరావు చేతే వాయింపజేసేవారు. ఈ పాట చిత్రీకరణ లో పియోనా వాయిస్తూ  క్లోజప్ లో కనిపించే చేతులు రామలింగంవే అని చెప్పుకోవడం నేను విన్నాను.

పియోనా, ఫ్లూట్, తబలా ప్రధానంగా సాగే ఈ పాటలో ఘంటసాలవారి కంఠస్వరం  ప్రతీ నోట్ ను చాలా ఖణీగా, సుస్పష్టంగా శ్రోతల హృదయాలను తాకేలా పలికింది.

ఈ సినీమా లో ఏడు పాటలుండగా హీరో అక్కినేనికి ఒకే ఒక్క పాట ఈ సూపర్ హిట్ సాంగ్. మాస్టారు పాడారు. ఆనాటి సినీమాలలో హీరోల కంటే రేలంగికే ఎక్కువ పాటలుండేవి. ఆరాధనలో  రేలంగికి ఉన్న రెండు డ్యూయెట్ లను ఘంటసాల మాస్టారే పాడారు. ఆ పాటలలో ఘంటసాలవారి గాత్ర వైవిధ్యం విన్నవారికే ఎరుక.

అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు బెంగాలీ సాగరికలోని పాటకన్నా అరాధన చిత్రంలోని "నా హృదయంలో నిదురించే చెలీ" పాటే మిన్నగా భావిస్తాను. అందువల్లే ఈ పాట గత అరవై సంవత్సరాలుగా తెలుగు హృదయాలను దోచుకుంటూనే వుంది, గాయకులందరి నోటా వినవస్తూనే వుంది.

ఈ శీర్షిక విషయంగా చిన్న మాట.
ఘంటసాల పాట మీద ఉన్న ఆరాధనతో ఈ 'సజీవరాగం' సమీక్ష మొదలుపెట్టానే కానీ, ఆ యా పాటలలో గల సంగీత సాహిత్య వైశిష్ట్యాన్ని సోదోహరణంగా చెప్పడానికి  నాకు భాషలోగానీ, సంగీతంలో గానీ ఏమాత్రం ప్రవేశం లేదు. అందుచేత నా యీ వ్యాసాలు vague గా , shallow గా వుండే అవకాశం వుంది. 
అందరూ సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తాను.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 27 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 27వ భాగం - దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై ఆరవ భాగం ఇక్కడ

27వ సజీవరాగం -   

"దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో..."
              
 పల్లవి :
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో !

చరణం :
పాలిత కింకర భవ నాశంకర శంకర
పురహర నమో నమో
హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో !

చరణం: 
దురిత విమోచన ఫాలవిలోచన 
పరమదయాకర నమో నమో
కరిచర్మాబర , చంద్రకళాధర 
సాంబ దిగంబర నమో నమో !

చరణం :
నారాయణ హరి నమో నమో
నారద హృదయవిహారీ నమో నమో
పంకజనయనా పన్నగశయనా
శంకరవినుత నమో నమో 
నారాయణ హరి నమో నమో !

శివకేశవులకు అభేదం అని మన ప్రాచీన పురాణాలెన్నో చెపుతున్నా శైవమతం , వైష్ణవమతమంటూ మానవులు భేదాలతో వైషమ్యాలతో కలహించుకుంటూ శాంతికి భంగం కలిగించడం మనకు తెలిసినదే. శివుడు, విష్ణువ  పేరిట ఆ విధమైన విద్వేషాలు తగవని  1958 లో వచ్చిన భూకైలాస్ సినీమాలోని కొన్ని సన్నివేశాలు మనకు ప్రబోధించడం గమనించవచ్చును.

అందులోని  "దేవ దేవ ధవళాచల మందిర" నేటి మన సజీవరాగం. ఈ పాటలో హరి హరుల ఇద్దరి ప్రస్తావనను అతి సమర్ధంగా తీసుకువచ్చారు గేయ రచయిత సముద్రాల రాఘవాచార్యులవారు. ఒకే సన్నివేశంలో  శివనామ స్మరణంతో రావణాసురుడు,  హరినామ స్మరణతో నారదుడు వస్తూ దారిలో కలుసుకుంటారు.   

పాత్రపరంగా హరి అవతారమైన రాముడు పేరుగల రామారావుగారు పరమేశ్వరుని; ఈశ్వర నామం గల అక్కినేని నాగేశ్వరరావు గారు నారాయణుని స్తుతిస్తూ  నటించడం శివకేశవులు ఒకటేనని చెప్పకచెప్పడం ఓ విశేషం.

భూకైలాస్ సినీమా పేరు చెప్పగానే వెంటనే మనం తల్చుకునేది ఆ సినీమాలోని ఘంటసాలవారి పాటలను, పద్యాలనే. భూకైలాస్ చిత్రం లో ఘంటసాలవారి  శాస్త్రీయ,/ లలిత గాన ప్రతిభ అణువణువునా ద్యోతకమౌతుంది. రావణాసురుడిగా రామారావుగారు, నారదుడిగా అక్కినేని వారు మన మనస్సుల్లో చిరస్థాయిగా నిల్చిపోవడానికి కారణం ఘంటసాల మాస్టారి అద్వితీయ దేవగానమే.

ఈ పాటలో శంకరుడికి సంబంధించిన పల్లవి, చరణాలను జంఝూటి రాగంలో, విష్ణువుకు సంబంధించిన చరణాన్ని కాపీ రాగంలో స్వరపర్చి  తగు మాత్రపు వాద్యాలు - ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, తబలాలు వంటివి మాత్రమే సున్నితంగా ఉపయోగించి గాత్రానికే ప్రాధాన్యతనిచ్చారు సంగీత దర్శకులు. ఈ పాటలో ఘంటసాలవారి గాత్రంలోని భక్తి తత్పరతలు, పరవశత్వం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది.

జంఝూటి రాగం హిందుస్తానీ సంప్రదాయ సంగీతపు రాగం. ఆరోహణలో ఆరు స్వరాలు , అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతూ, వక్ర సంచారం చేయడంవలన ఈ రాగాన్ని షాఢవ-సంపూర్ణ వక్ర రాగంగా పరిగణిస్తారు.

కర్నాటక సంగీత కాపి రాగం ఖరహరప్రియ జన్యరాగం. ఇది కూడా షాఢవ-సంపూర్ణ వక్రరాగమే. దీనికి సమాంతరమైన హిందుస్తానీ రాగం పీలు.

ఇంతటి చక్కటి పాటలను స్వరపర్చిన సుదర్శనం - గోవర్ధనం సోదరులు చిరస్మరణీయులు. ఏవిఎమ్ స్టూడియో వాద్యబృంద నిర్వాహకులుగా , ఎమ్మెస్ విశ్వనాధన్ కు సహాయకులుగా యీ సోదరులు చిరపరిచితులు.  ఏవిఎమ్ తీసిన అనేక చిత్రాలకు సుదర్శనం - గోవర్ధనం సోదరులు సంగీత దర్శకత్వం వహించారు.

భూకైలాస్ లో పాటలన్నీ సంప్రదాయబధ్ధంగా, రాగాలకు కట్టుబడే స్వరపర్చబడ్డాయి. ఈచిత్రంలో పాటలను ఘంటసాల, ఎమ్.ఎల్.వసంతకుమారి, కోమల, టి.ఎస్.భగవతి, సుశీల వంటి హేమాహేమీలు ఆలపించారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. 

ఘంటసాలవారి కంచుకంఠాన వెలువడిన యీ చిత్రంలోని ప్రతి పాట , పద్యం యీనాటికీ సంగీతాభిమానులందరికీ షడ్రసోపేత విందుభోజనమే. భూకైలాస్ లో మాస్టారు పాడిన - దేవ దేవ ధవళాచల మందిర, (జంఝూటి, కాపి) నీలకంధరా దేవా (తిలాంగ్ రాగం), తగునా వరమీయ ( మాయమాళవగౌళ, పీలు రాగాల మిశ్రమం) రాముని అవతారం రఘుకుల సొముని అవతారం, సుందరాంగ అందుకోరా - (సుశీలగారు పాడిన యీ పాట  నేపధ్యంలో ఘంటసాలవారు వివిధస్థాయిలలో ఆలపించిన ' ఓం నమశ్శివాయ ' నామం ఒక అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది.), వంటి పాటలతోపాటూ యితర పాటలు పద్యాలు కూడా  శాస్త్రీయ సంగీతాభిమానులందరినీ ఎంతగానో అలరించాయంటే అందుకు ప్రధాన కారణం ఘంటసాలవారి సంగీత విద్వత్తే అంటే అతిశయోక్తి కాదనే నా భావన.

అగ్రనటులు అక్కినేని, నందమూరి పోటాపోటిగా నటించి తమ నటనా వైదుష్యాన్ని కనపర్చిన చిత్రం భూకైలాస్. నందమూరి వారు రావణబ్రహ్మగా విశ్వరూపం దాల్చడానికి బీజం  యీ భూకైలాస్ లోనే పడిందని చెప్పవచ్చును.

సముద్రాల రాఘవాచార్యులవారు శుధ్ధశ్రోత్రీయ శ్రీవైష్ణవుడైనా, దేవదేవ ధవళాచల మందిర పాటలో శివ కేశవులిద్దరినీ సమానంగా తరతమ భేదం పాటించకుండా  స్తుతించి కవితా మర్యాదలను పాటించారు. 

దేవదేవ ధవళాచల మందిర పాటలో ఎన్.టి.ఆర్ , ఏ.ఎన్.ఆర్ యిద్దరికీ ఒకే సమయంలో  గాత్రదానం చేసి ఎంతో వైవిధ్యాన్ని చూపి శ్రోతలను మెప్పించిన ఘనత ఘంటసాలవారిదే. అక్కినేనే  పాడుతున్నారు , లేదు రామారావే పాడుతున్నారనే భ్రమలో పెట్టి పాడే సామర్ధ్యం ఒక్క ఘంటసాలవారి కే వుంది. వారిరువురి గాత్రధర్మాలకు తగినట్లు నామమాత్రపు శృతిభేధంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు వేలాది మనోజ్ఞగీతాలను ఆలపించిన ఘంటసాలవారు తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయులైనారు.

భూకైలాస్ కు ముందు మరే సినీమాలోనూ ఈ ఇద్దరు నటులకు ఒకేసారి ఒకే గాయకుడు పాడిన దాఖలాలు లేవు. ఆనాటికి ఇదొక అద్భుత గాత్ర ప్రయోగమేనని చెప్పాలి.

నిర్మాత  ఎ.వి.మెయ్యప్పన్, దర్శకుడు కె.శంకర్, సంగీతదర్శకులు  సుదర్శనం - గోవర్ధనం సోదరులు తెలుగువారు కానప్పటికి భూకైలాస్ వంటి అజరామరమైన పౌరాణిక చిత్ర కళాఖండాన్ని తెలుగువారి స్వంతం చేసినందుకు మనం చాలా ఋణపడివున్నామనే చెప్పాలి.

ఒక్క ఘంటసాలవారి కే కాక ఎన్.టి.రామారావు , అక్కినేని నాగేశ్వరరావుగార్లకు కూడా అజరామరత్వాన్ని కల్పించిన చిత్రరాజం భూకైలాస్.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 20 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 26వ భాగం - నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణీ ఆ చిన్నదీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైమూడవ భాగం ఇక్కడ

26వ సజీవరాగం -   

నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణీ ఆ చిన్నది...

ఆమె చిరునవ్వులోనే హాయున్నది
మనసు పులకించగా  మధురభావాలు నాలోన కలిగించింది... నిన్న!!

మరచిపోలేను ఆ చూపు ఏనాటికీ
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటీ
తలచుకొనగానే ఏదో ఆనందము
వలపు జనియించగా ప్రణయగీతాలు
నాచేత పాడించింది..... నిన్న!!

సొగసు కనులారా చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగురించే ఇంపారగా
నడచిపోయింది ఎంతో నాజూకుగా
విడచి మనజాలను విరహతాపాలు
మోహాలు రగిలించింది...  నిన్న !!

ప్రేమ అనే రెండక్షరాలు కలిగించే మత్తు,  మహిమ అంతా ఇంతాకాదు. తొలిసారిగా ప్రేమలో పడినవాడికి ఎటువంటి మధురానుభూతులు కలిగిస్తాయో ఈ పాట చెపుతుంది. ప్రేమ మైకంలో ఉన్నవాడికి కనిపించే ప్రతీ మగాడు తన ప్రేయసిలాగే కనిపిస్తాడు. ఆ పరవశత్వంలో తానేంజేసేది తనకే తెలియనంత మోహంలో మునిగిపోతాడు. సాలూరి వారు ,ఘంటసాలవారు కలసి ఆపాతమధురాలెన్నో సృష్టించారు. అలాగే ఆరుద్ర , ఘంటసాల కాంబినేషన్లో కూడా ఆణిముత్యాలవంటి పాటలు అనేకం మనలను రంజింపజేసాయి.
పదకర్త ఆరుద్రగారికి, స్వరకర్త సాలూరి రాజేశ్వరరావుగారికి, గాత్ర ప్రదాత ఘంటసాలవారికి  మైలురాయిలా, కలికితురాయిలా నిలిచిపోయే మధుర విరహగీతం, 'రాణీ రత్నప్రభ' చిత్రంలోని "నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణీ ఆ చిన్నది... " 

ఏపాటనైనా  మృదువుగా, భావయుక్తంగా హృదయాలను తాకి మైమరపించేలా స్వరపర్చడంలో సిధ్ధహస్తుడు రసాలూరించే రాజేశ్వరరావు గారు. భీంప్లాస్, ఖరహరప్రియ ఈ రెండు చాలా సుప్రసిద్ధ రాగాలు కర్ణాటక సంగీతంలోని అభేరి హిందుస్తానీ సంగీతంలో భీంప్లాస్. అలాగే, హిందుస్తానీ కాపి రాగం కర్నాటక సంగీతంలో ఖరహరప్రియ.  ఈ రాగాలు రెండింటిని  మిళితం చేసి రాజేశ్వరరావుగారు రూపొందించిన ఈ అద్భుతమైన ఏకగళ గీతానికి ఘంటసాలవారి గాత్రంలోని గమకాల మాధుర్యం, మాటల విరుపులు, భావ గాంభీర్యం మరింత నిండుదనాన్ని, హుందాతనాన్ని  చేకూరిస్తే తెరమీద ఎన్.టి.రామారావుగారి అద్భుత హావభావాలు ఈ పాటకు శాశ్వతత్వాన్ని చేకూర్చింది. 

పాట పల్లవి మొదలు, చరణాలంతం వరకు ఆరుద్రగారు అల్లిన సొంపైన , ఇంపైన సుమాక్షరాలు  శ్రోతల హృదయాలలో మల్లెలు పూయిస్తుంది. మూగకోరికలేవేవో రేకెత్తిస్తుంది. పాట ఆద్యంతమూ రాజేశ్వరరావుగారి బాణీ మనలను పరవశింపజేస్తుంది. ఈ పాటలో పియోనా, ఫ్లూట్, క్లారినెట్ వంటి మరెన్నో వాద్యాలున్నా వాటన్నింటికీ మిన్నగా పిఠాపురం సత్యం (షెహనాయ్ సత్యం) గారి షెహనాయ్ వాద్యమే సంగీతాభిమానులకు పులకరింతలు కలిగిస్తుంది.

మహారాజు స్వగతంలా సాగే ఈ విరహగీతంలో హీరో ఎన్.టి.రామారావు , హీరోయిన్ అంజలీ దేవి, విదూషకులు రేలంగి, సీతారాం, మంత్రి సి.ఎస్.ఆర్.,లు కూడా కనిపించి ప్రేక్షకులంతా మనసారా హాయిగా నవ్వుకునేలా   ఒక్కింత హాస్యాన్ని కూడా జోడించారు. బి ఎ సుబ్బారావు నిర్మాణ, దర్శకత్వంలో 1960 మే నెలలో విడుదలైన 'రాణి రత్నప్రభ' మంచి విజయాన్నే సాధించింది.
ఈ సినీమా లో హీరో ఎన్.టి.ఆర్ కు ఘంటసాలగారు పాడింది ఈ ఒక్క పాటే. కానీ రేలంగి పాత్రకు మూడు పాటలు పాడి తన గాత్ర వైవిధ్యాన్ని నిరూపించారు ఘంటసాల.

కలకాలం గుర్తుండిపోయే ఘంటసాలవారి ఆహ్లాదకరమైన గీతం "నిన్న కనిపించింది నన్ను మురిపించింది" పాట.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 13 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 25వ భాగం - పయనించే మన వలపుల బంగరు నావ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై నాలుగవ భాగం ఇక్కడ

25వ సజీవరాగం -   

పయనించె మన వలపుల బంగరునావ
శయనించవె హాయిగ జీవనతారా 

నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో చెలరేగే అలల మీద ఊయలలూగే.. పయనించె...

వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు , రవళించె వేణుగీతి
రమ్మని పిలువ ---
పయనించె మన వలపుల ...

చాలా చిన్న పాట, కానీ, చిరకాలం మదిలో మెదిలే మధురాతి మధురమైన పాట. ఈ సినీమా ఎవరికీ తెలియదు. చూసిన గుర్తు చాలామందికి లేదు. అయినా ఈ సినీమా లోని మొత్తం పది పాటల్లో నాలుగు పాటలు - 'నీలి మేఘాలలో‌, ' పయనించె మన వలపుల', ' ముక్కోటి దేవతలు', 'హృదయమా ఓ బేల హృదయమా', ఎప్పుడు, ఎక్కడ విన్నా సరే, వెంటనే ఈ పాటలు "బావామరదళ్ళు' సినీమాలోవి కదా అని ఈనాటికి గుర్తుపట్టి మనసారా, హాయిగా హమ్ చేసుకుంటున్నారు.

'మామా, అల్లుళ్ళు' - మహా ప్రస్థాన కవి శ్రీశ్రీగారు, సమగ్రాంధ్ర సాహిత్య గ్రంథకర్త ఆరుద్రగారు ఈ పాటలకు నిత్యనూతనత్వం, చిరంజీవత్వం కల్పించారు. ఇందులో స్వరకర్త పెండ్యాల, గాయకులు ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకిగార్ల పాత్ర తక్కువేమీ కాదు.

ఈనాడు ఈ పాట సన్నివేశం ఏమిటో నాకు గుర్తులేదు కానీ సినీమాలో రెండుసార్లు వస్తుంది - ఒకటి సంతోషంగా, మరొకటి విషాదంగా. మృదుమధురమైన ఘంటసాల, సుశీల గాత్రాలలో ఈ పాటలోని సంతోషం, దుఃఖం మధ్య గల వైవిధ్యం అనితరసాధ్యం గా వినిపిస్తుంది. ఈ రెండు పాటలూ వెనువెంటనే వినడానికి అందుబాటులో లేవు, ఒక్క విషాద గీతం తప్ప. రెండు పాటల సాహిత్యం, వరస ఒకటే అయినా రసపోషణ, భావ ప్రకటన వేరే వేరే.

నెలబాలుని చిరునవ్వులు, తెలివెన్నెల సోనలు, చెలరేగే అలల మీద ఊగిసలాటలు ... వికసించె విరజాజులు, వెదజల్లుతున్న పరిమళాలు , రవళించె వేణుగీతాలు మనలను రారమ్మని ఆహ్వానిస్తున్నా సన్నివేశపరమైన విషాదాన్ని హృదయం నిండా నింపుకొని శ్రోతల హృదయాలను బరువెక్కించి కంటతడి పెట్టించారు ఘంటసాల, సుశీల.

ఈ సినీమాకు పెండ్యాలగారు అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు.   పెండ్యాలగారు ఈ పాటను ఖరహరప్రియ రాగంలో స్వరపర్చి ఆ రాగ మాధుర్యాన్నంతా పిండి  ఘంటసాలవారి గళం ద్వారా మనకు అందించారు. 

కర్నాటక సంగీతంలోని 72 మేళకర్తలలో ఖరహరప్రియ 22వ మేళకర్త. సప్తస్వరాలు కలిగిన సంపూర్ణరాగం. అత్యంత కరుణారస ప్రధానమైనది.  హిందుస్థానీ సంగీతంలో ఈ రాగానికి సమాంతర రాగం కాపి. పయనించె మన వలపుల పాటకు ఖరహరప్రియ రాగాన్ని ఎన్నుకొని ఆ పాటకు ఎంతో సార్ధకతను చేకూర్చారు పెండ్యాల.  పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఫ్లూట్ , వైలిన్స్ కాంబినేషన్ ఎంతో హృద్యంగా ఉంటుంది. శ్రీశ్రీగారి కవిత్వంలోని సున్నితత్వమంతా పెండ్యాలగారి స్వరకల్పనలో, ఘంటసాల, సుశీల అమృతగానంలో ద్యోతకమవుతుంది.

"బావ మరదళ్ళు" లో బావ రమణమూర్తి అయితే ఒక మరదలు (భార్య కూడా) మాలిని , మరో మరదలు కృష్ణకుమారి. ఈ ముగ్గురి మధ్య సాగే మానసిక సంఘర్షణలు, సమస్యలే ఈ సినీమా ఇతివృత్తం.

ఈ పాట విన్నప్పుడల్లా మరొక మరపురాని సంఘటన కూడా గుర్తుకు వచ్చి  ఆనందంతో పాటు మనసు బరువెక్కుతూంటుంది. 

అది 1985 - 90 ల మధ్య జరిగినది. మా మద్రాస్ తెలుగు అకాడెమీ ఒక ఉగాది సందర్భంగా ఘంటసాలవారికి నివాళిగా సకల గాయక సంగీతోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపింది. ఆనాడు తెలుగు సినిమా రంగంలో ప్రసిధ్ధులైన గాయనీగాయకులంతా పాల్గొని ఘంటసాలవారి పాటలు తలా ఒక పాట పాడారు. వేదిక మద్రాస్ మ్యూజిక్ ఎకాడమీ మెయిన్ ఆడిటోరియం.  ఆడిటోరియం కెపాసిటికి మించి ప్రేక్షకులు రావడంతో ఎసి యూనిట్లు పనిచేయని పరిస్థితి. అంతటి వేడిలో కూడా దాదాపు పది పన్నెండు గంటల భారీ కార్యక్రమాలు ప్రతీ ఏటా నిర్వహించడం మాకు, క్రమం తప్పక వేల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి ఈ ఉగాది ఉత్సవాలు చూసి ఆనందించడం, ఆనవాయితీగా జరిగేదే.

ఘంటసాలవారి నిలువెత్తు కటౌట్ వేదిక మీద కనిపిస్తుండగా ప్రతీ గాయనీ గాయకుడు తమ స్వరార్చనతో ఆ గాన గంధర్వునికి నివాళులు అర్పించారు. ఆ కార్యక్రమంలో ఆఖరు పాటగా ఘంటసాలవారు పాడిన " పయనించే మన వలపుల బంగరునావ"  పాటను ప్రముఖ బహుభాషా గాయకుడు, మా జంట సంస్థల గౌరవ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయిన శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ఘంటసాలవారి గురించి వినయపూర్వకంగా ప్రస్తుతిస్తూ, మాస్టారి పాటలు పాడడంలో తనకు గల సాధకబాధకాలను వివరించి పాట ప్రారంభించారు. పాటలో లీనమైపోయి అద్భుతంగా ఆలపిస్తున్నారు. పాట చివరకు వచ్చేప్పటికి స్టేజ్ మీద ఉన్న ఘంటసాలవారి నిలువెత్తు కటౌట్ క్రమక్రమంగా నీలిమేఘాలలోకి మాయమైపోయింది( సురభి నాటక సంస్థ సాంకేతిక కళాకారుల సౌజన్యంతో).  ఒక్కసారిగా ఆడిటోరియం లోని వేలాది  ప్రేక్షకులంతా బరువెక్కిన హృదయాలతో తమ సీట్లలోంచి లేచి నిలబడి నాన్ స్టాప్ గా కరతాళ ధ్వనులు చేయడం మొదలెట్టారు. బాలుగారికి బ్యాక్ గ్రౌండ్ లో జరిగిన విషయమే తెలియదు. విషయం తెలిసి ఆయన కూడా కన్నీటిపర్యంతమై మౌనంగా నిలబడిపోయారు. 

 మధురమైన ఈ అపురూప సంఘటన నాకెన్నటికీ మరపురాని విషయం.









వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.


ప్రణవ స్వరాట్

Saturday 6 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 24వ భాగం - శ్రీ నగజా తనయం, సహృదయం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైమూడవ భాగం ఇక్కడ

24వ సజీవరాగం -   

"శ్రీ నగజా తనయం, సహృదయం!
చింతయామిసదయం
త్రిజగన్మహోదయం  - శ్రీ నగజా తనయం!

"శ్రీరామ భక్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కధ! నలభై రోజులనుంచి చెప్పిన కధ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తున్నది, నాయనా! కాస్తా పాలు,మిరియాలు ఏమైనా...!"

" చిత్తం, సిధ్ధం!"

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచి
విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ
ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి 
అతడెవరయ్యా అంటే ---

రఘురాముడు! రమణీయ, వినీల ఘనశ్యాముడు! - 2

వాడు, నెలరేడు, సరిజోడు, మొనగాడు!
వాని కనులు మగమీల నేలురా!
వాని నగవు రతనాలజాలురా! - 2
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు మరో మరుడు, మనోహరుడు! రఘురాముడు!

స్వరకల్పనలు, వైయొలిన్, మృదంగం 
తనీ ఆవర్తనాలు -- రఘురాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడూ....

శభాష్... శభాష్ !

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున శ్రీరామచంద్రమూర్తిని
అంతఃపురగవాక్షం నుండి సీతాదేవి
ఓరకంటజూచినదై చెంగటనున్న
చెలికత్తెతో ---

ఎంత సొగసుగాడే,  - 2
మనసింతలోనె
దోచినాడె!
మోము కలువరేడే - నా నోము ఫలము వీడే, శ్యామలాభిరాముని చూడగ
నా మది వివశమాయె నేడే - ఎంత సొగసుగాడే!

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా, అక్కడ స్వయంవర సభామండపంలో
జనకమహీపతి సభాసదులను జూచి

అనియెనిట్లు , ఓ యనఘులార!
నా అనుగుపుత్రి సీత వినయాధిక
సద్గుణ వ్రాత, ముఖ విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి
జోదును నేడు మక్కువ మీరగ వరించి
మల్లెల మాలవైచి పెండ్లాడు!

అని ఈ ప్రకారంబుగ జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడే చల్లబడిపోయారట! మహావీరుడైన రావణాసురుడు కూడా "హా! ఇది నా ఆరాధ్యదైవమగు శివుని చాపము , దీనిని స్పృజించుటయే మహా పాపము" అని అనుకొనినవాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున --

ఇనకుల తిలకుడు  నిలకడగల  క్రొక్కారు మెరుపు వలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని 
ఆశీర్వాదము తలదాల్చి 
సదమల మదగజ గమనముతోడ
స్వయంవర వేదిక చెంత
మదనవిరోధి శరాసనమును తన
కరమున బూనినయంత
ఫెళ్ళుమనె విల్లు , గంటలు ఘల్లుమనె
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము
ఒక నిమేషమ్మునందె నయము
జయమును ,భయము , విస్మయము
గదుర! ..శ్రీమద్రమారమణ గోవిందో...హరి
గోవిందో... హరి!

భక్తులందరూ చాలా నిద్రావస్థలో వున్నట్టుగావుంది,  మరొక్కసారి ..
జై! శ్రీమద్రమారమణ గోవిందో...హరి గోవిందో...హరి...

భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి  శివధనుర్భంగం
గావించాడు. అంతట

భూతలనాధుడు రాముడు
ప్రీతుండై  పెండ్లియాడె ఫృథుగుణమణి
సంఘాతన్ భాగ్యోపేతన్ , సీతన్ - 2

శ్రీమద్రమారమణ గోవిందో... హరి...

మన తెలుగువారి ప్రాచీన కళా ప్రక్రియలలో ముఖ్యమైనది హరికథ ఒకటి. సంగీత, సాహిత్య సమ్మిళితమైన హరికథను అనేక పాత సినీమాలలో సందర్భోచితంగా ప్రయోగించడం జరిగింది. అలాటివాటిలో తలమానికంగా నిలిచేది వాగ్దానం సినీమా కోసం ఘంటసాల భాగవతార్ గారు చెప్పిన సీతాకళ్యాణ సత్కధ.

హరికథ అని చెప్పగానే అందరికీ వెంటనే స్ఫురించే పేరు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. హరికథా పితామహుడు. ఆట పాటల మేటి.  బహుభాషాకోవిదుడు. ప్రవీణుడు. విజయనగరంలోని మహారాజా సంగీత కళాశాలకు ప్రప్రథమ ప్రిన్సిపాల్. వారి హయాంలో హరికథ మూడుపువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లింది. విజయనగర చుట్టుప్రక్కల ప్రాంతమంతా హరిదాసులకు నిలయమయింది. నారాయణదాసు గారి శిష్య, ప్రశిష్యులెందరో వందల, వేల సంఖ్యలో దేశమంతా వ్యాపించారు. దాసుగారి శిష్యులమని చెప్పుకోవడమే ఘనతగా భావించేవారు. నారాయణదాసుగారి కాలంలో పుట్టకపోయినా, వారిని చూడకపోయినా వారి శిష్యులమని, శిష్య ప్రశిష్యులమని  చెప్పుకుటూ చెలామణి అయే హరిదాసులు ఈనాటికీ ఉన్నారు. రాగస్ఫూర్తికి, రసస్ఫూర్తికి ప్రాధాన్యత నిస్తూ నారాయణదాసుగారు అనేక హరికథలు రచించి గానం చేశారు. 

విజయనగరం సాంస్కృతిక మట్టి వాసనను అనుభవించిన ఉద్దండులు - కవివరేణ్యుడు శ్రీశ్రీ, మహాగాయకుడు, స్వయంగా స్వరకర్త అయిన ఘంటసాల సహాయ సహకారాలతో పెండ్యాల నాగేశ్వరరావుగారి ఆపాతమధురమైన ఆరున్నర నిముషాల, అత్యద్భుత హరికథ వాగ్దానం చిత్రం ద్వారా తెలుగువారి సొంతమయింది. రోజుల తరబడి ఎన్నో గంటలసేపు జరిగే సీతాకళ్యాణ గాధను కేవలం ఆరున్నర నిముషాలలో చెప్పడమంటే సామాన్యమైన విషయం కాదు.  హరికథ ప్రక్రియ పట్ల మంచి అవగాహన, అందులోని సారాన్ని క్షుణంగా అర్ధం చేసుకున్నవారే  దానికి పరిపూర్ణంగా న్యాయం చేకూర్చగలరు. అందుకే వాగ్దానం నిర్మాత, దర్శకుడు, రచయిత అయిన ఆత్రేయ ఈ హరికథను రూపొందించే బాధ్యతను శ్రీశ్రీగారికి అప్పగించారు. సంప్రదాయ సంగీత రీతులలో నిష్ణాతుడైన పెండ్యాలగారి స్వర రచనలో ఈ హరికథ అజరామరమయింది. మరి అలాటి జనరంజకమైన హరికధను గానం చేయడానికి ఆనాడు ఘంటసాలవారు తప్ప మరో గాయకుడు లేరనేది నిర్వివాదాంశం. ఆ గురుతర బాధ్యతను ఘంటసాల అనితరసాధ్యంగా నిర్వహించారు. నారాయణదాసుగారి శిష్యులెందరినో ఎరిగి వారి ద్వారా ఎన్నో కథలను విని హరికథ మట్టులను క్షుణంగా ఆకళింపుజేసుకున్న ఘంటసాల ఈ సినీమాలోని హరికథకు ప్రాణప్రతిష్ట చేశారు. సంప్రదాయబధ్ధమైన గానం, మాటల విరుపులు, నడక, వివిధ రసాల పోషణ ఘంటసాలవారి ఈ హరికథాగానంలో ద్యోతకమవుతాయి.

ఈ హరికథ హాస్యరస ప్రధానంగా చిత్రీకరించబడింది. తెరవెనుక ఘంటసాలవారి గానానికి తెరమీద హరిదాసుగా  రేలంగి జీవంపోసారు. హరిదాసుగారి భార్య, పుత్రులే పక్కవాద్యగాళ్ళు. భార్యగా సూర్యకాంతం వైయొలిన్ తో, కొడుకు పద్మనాభం మృదంగంతో సన్నివేశానికి కావలసిన హాస్యాన్ని పుష్కలంగా పండించారు. ఈ హరికథలో వినవచ్చే వైలిన్ సోలోలు ప్రముఖ సినీ వైయొలినిస్ట్ శ్రీ హరి అచ్యుతరామశాస్త్రిగారు (ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీ హరి నాగభూషణంగారి తనయుడు) వాయించారు.

హరికథ పామరజనాలను ఆకర్షించే ప్రక్రియ. అందువల్ల సందర్భానుసారం అనేక పిట్టకధలను జోడించి శ్రోతలకు హుషారు కలిగిస్తూంటారు. ఈ కధ ప్రారంభంలో  "..... నలభైరోజుల నుంచి చెప్పిన కధ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను...." అని చెప్పించడం ద్వారా ఆ హరిదాసుగారి ప్రతిభ, కీర్తి శ్రోతలకు చెప్పక చెపుతూ దాసుగారి కీర్తికి భంగం కలగకుండా "మిరియాల పాలు" కోసం గుర్తు చేయడం.....  " చిత్తం! సిధ్ధం" (ఈ డైలాగ్ సంగీత దర్శకుడు పెండ్యాలగారిది) అంటూ పాల గ్లాసు అందించడం; "నిద్రావస్థలో ఉన్న శ్రోతలచేత గోవింద నామ స్మరణ చేయించడం వంటి డైలాగ్స్ చెప్పడంలో హరికథా సరళి, ఘంటసాలవారిలోని  రేలంగి (హాస్యనటుడు) మనకు కనిపిస్తాయి.

కథ మధ్యలో తనకూ సంగీతజ్ఞానం ఉందని నిరూపించేందుకు  దాసుగారు చేసిన స్వరకల్పనలు, వాద్యాల ముక్తాయింపులు, ఇవన్నీ హరికథాగానంలోని భాగాలే. అలాగే హరికథలోని నృత్యగమనం, నడక కూడా  "సదమల మదగజ గమనము తోడ..." అనేప్పుడు దాసుగారి నృత్యం మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. హాస్య, శృంగార, ఆశ్చర్యరసాలన్నింటినీ ఘంటసాలగారు  ఈ సంక్షిప్త సీతాకళ్యాణ సత్కథలో మేళవించి శ్రోతలను పరవశులను చేశారు.

ఘంటసాలవారిని మించిన మహాగాయకులెందరో వుండవచ్చుగాక! (sic) కానీ వారెవరిలోని లేని గాత్రమాధుర్యం సౌలభ్యం, భావ ప్రకటనలో సహజత్వం, మాట స్పష్టత మాత్రం ఒక్క ఘంటసాలగారిలో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఘంటసాలవారి ఈ హరికథ 63 సంవత్సరాల తర్వాత కూడా అంత నిత్యనూతనంగానే వుంది.

సినీమా లో జరిగే సన్నివేశానికి బలంచేకూరుస్తూ ఈ హరికథ సాగడం ఒక విశేషం. ఈ సన్నివేశంలో సినీమాలోని ప్రముఖ నటులంతా --- అక్కినేని, కృష్ణకుమారి, చలం, గుమ్మడి, రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం, మొదలగువారంతా కనిపిస్తారు.

సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ బాబు (శరత్చంద్ర ఛటర్జీ) వ్రాసిన "వాగ్దత్త" బెంగాలీ నవల ఆధారంగా మనసుకవి ఆత్రేయ సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం "వాగ్దానం".

సంగీత దర్శకుడు పెండ్యాల గారు ఈ హరికథను స్వరపర్చడానికి పూర్తిగా కర్నాటక రాగాలనే ఎన్నుకున్నారు . కానడ, శంకరాభరణం, మోహన, ధన్యాసి, కేదారగౌళ, కళ్యాణి రాగాలు ఈ హరికథలో రసస్ఫూర్తితో వినిపిస్తాయి.

 ఈ హరికథా గానంలోని విశిష్టత, రసాలు, సొగసులు అనుభవైకవేద్యం, మాటలకందనివి.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 30 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 23వ భాగం - కలకానిది నిజమైనదీ బ్రతుకూ...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైరెండవ భాగం ఇక్కడ

23వ సజీవరాగం -   


"కలకానిది నిజమైనదీ బ్రతుకూ కన్నీటి
ధారలలోనే బలి చేయకూ..."

కాపి రాగం(కర్నాటక శైలి) 
పాట సాహిత్యం : శ్రీశ్రీ
సంగీతం : పెండ్యాల
గానం ఘంటసాల

" కలకానిది నిజమైనది బ్రతుకు
కన్నీటి ధారలలోనే బలిచేయకు

గాలివీచి పూవుల తీగ నేలవాలి పోగా
జాలివీడి యటులే దాని వదిలి వైతువా
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా

అలముకున్న చీకటిలోనే అలమటించనేల 
కలతలకే లొంగిపోయి కలవరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో

అగాధమౌ జలనిధిలోన అణిముత్యమున్నటులే శోకాల
మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే
ధీరగుణం !! కలకానిది !!

బ్రతుకంటే కొన్ని క్షణాలలో చెదరిపోయే కలకాదు. మనిషి జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితాన్ని మనోదౌర్బల్యంతో కృంగిపోతూ కన్నీళ్ళతో వృధాచేయకూడదు. కలతలకు లొంగిపోకూడదు. మన జీవితంలోని వెలుగునీడలను, కష్టాలను, దుఃఖాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.కష్టాల కడలిలో మునిగిపోతున్నవారికి చేయూతనివ్వాలి. మనిషికి ఏదీ దానంతట అది చిక్కదు. వెతికి, శోధించి, సాధించాలి అదే ధీరుల లక్షణం అని మహాకవి శ్రీశ్రీ గారు ఈ పాట ద్వారా జనాలకు సందేశమిచ్చారు.

"కలకానిది విలువైనది" పాట సన్నివేశ పరంగా శోకభరితమే. కానీ ఆ పాటలో ఆణిముత్యాల వంటి సందేశాలను పొదిగారు శ్రీశ్రీ గారు. వెలుగు నీడలు సినీమా కోసం వ్రాసిన ఈ పాటతో పాటు ఆ సినీమా లోని పాటలన్నీ శ్రీశ్రీ గారే వ్రాసారు. ఈ చిత్ర సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన ట్యూన్ కే శ్రీశ్రీ సాహిత్యం అందించినట్లు తెలుస్తున్నది. 

ఉదాత్త భావన, గాంభీర్యం, శోకం మిళితమైన ఈ పాటను  పెండ్యాల కర్నాటక కాపీ రాగంలో స్వరపర్చినట్లు తెలుస్తున్నది.. కాపి రాగం  22వ మేళకర్త ఖరహరప్రియకు  జన్యరాగం. కాపి ఔఢవ-సంపూర్ణ వక్ర సంచార రాగం. ఈ రాగం ఆరోహణలో ఐదు స్వరాలు , అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. అన్యస్వర ప్రయోగం కూడా ఉన్నందున కాపి భాషాంగరాగంగా కూడా చెపుతారు. ఈ కర్నాటక కాపి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం పీలు. 

సాహిత్య పరంగాను, సంగీతపరంగానూ మనసుకు పట్టిపోయే "కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు" అంటూ ఘంటసాల మాస్టారు అతి గంభీరంగా, గళంలో విషాదాన్ని ధ్వనింపజేస్తూ , ఎంతో భావయుక్తంగా గానం చేశారు. ఘంటసాలవారి తెరవెనుక గానానికి దీటుగా తెరపై కధానాయకుడు అక్కినేని అద్భుతమైన నటనను కనపర్చి ఆ గీతం అజరామరం కావడానికి ఎంతో దోహదం చేశారు.

"వెలుగునీడలు" సినీమాను అన్నపూర్ణ పిక్చర్స్ తమిళంలో "తూయ ఉళ్ళం" పేరుతో తీయగా "కలకానిది" పాట ఒక్కటి మాత్రం తమిళంలో కూడా అక్కినేనికి ఘంటసాలగారి చేతే పాడించారు. ఆ పాట తమిళంలో కూడా మంచి హిట్టయింది. ఈ పాట  రేడియోలోనుండి వినిపించేదవడంతో పాట చిత్రీకరణ నేపధ్యంలో రేడియో స్టేషన్ రికార్డింగ్ రూమ్, గాయకుడిగా హీరో అక్కినేని, వాద్యబృంద నిర్వాహకుడిగా సంగీత దర్శకుడు పెండ్యాల, మరికొంతమంది సినీ సంగీత వాద్యకళాకారులు ఈ పాటలో కనిపిస్తారు. పెండ్యాలగారు అంతకు ముందు ఏడాది వచ్చిన 'శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం' లోని 'శేషశైలావాసా శ్రీ వేంకటేశా" పాటలో కూడా కనిపిస్తారు. ఈ రెండు పాటలు పెండ్యాలగారే స్వరపర్చగా ఘంటసాలవారే ఆలపించడం ఒక విశేషం.

జీవితంమీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిన ఒక యువకుడు "కలకానిది విలువైనది" పాట  విని ఆ పాట ఇచ్చిన స్ఫూర్తితో తన ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నట్లు శ్రీశ్రీగారికి ఉత్తరం వ్రాసినట్లు శ్రీశ్రీగారు తన సినీగీతాల సంకలనంలో తెలియజేశారు. 

అక్కినేని, సావిత్రి, జగ్గయ్య,  ఎస్.వి.రంగారావు, రేలంగి, గిరిజ, సూర్యకాంతం, రాజసులోచన మొదలగువారు నటించారు.

ఆత్రేయ, శ్రీశ్రీల మాటల, పాటల బలంతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణం లో వచ్చిన అన్నపూర్ణా వారి "వెలుగునీడలు" ఘన విజయాన్నే సాధించింది. వెలుగునీడలలో మరెన్నో మంచి పాటలు, సందేశాత్మక గీతాలున్నాఘంటసాల మాస్టారు గళంలోనుండి వచ్చిన "కలకానిది" పాట సంగీతాభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 23 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 22వ భాగం - జయత్వదభ్ర విభ్రమధ్భ్రమద్భుజంగ మస్ఫురాత్

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైయొకటవ భాగం ఇక్కడ

22వ సజీవరాగం -   
"జయత్వదభ్ర విభ్రమధ్భ్రమద్భుజంగ మస్ఫురాత్"
చిత్రం : సీతారామ కల్యాణం

కార్యసాధకుడు సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదేని ఒక దానిని తన ఆయుధంగా ఉపయోగించి తన కార్యాన్ని సాధించుకుంటాడు. ఇక్కడ అసుర లక్షణాలు కలిగిన రావణుడు  తన దర్పంతో, అహంకారంతో నందిని ఎదిరించి పరమేశ్వరుని దర్శించాలనుకుంటాడు. అది సానుకూలపడదని తెలుసుకొని, శివుడున్న కైలాస పర్వతాన్నే పెకిలించి లంకానగరానికి తీసుకుపోవాలనుకుంటాడు. అక్కడ కూడా భంగపాటుకు గురై భక్తిపూర్వకంగా వేడుకుంటాడు. అప్పటికి ఈశ్వరకటాక్షం లభించకపోవడంతో ఆత్మార్పణానికి సిధ్ధపడి తన కడుపును చీల్చుకుని, ప్రేవులను వీణాతంత్రులుగా మార్చి తన వీణా వాదనంతో శివుని మెప్పిస్తాడు. ఈనాటి సజీవరాగం లోని సూక్ష్మ సారాంశం.

భక్తితో, శక్తితో, జ్ఞానంతో ముల్లోకాలను జయించినా, తనలోని అహంకారాన్ని, రాజస లక్షణాలను జయించలేకపోవడంతో రావణబ్రహ్మ రావణాసురుడై తన నాశనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. 

ఈ పరిచయ వాక్యాలు చదివిన తర్వాత ఈ నాటి సజీవరాగం  'సీతారామ కళ్యాణం' అనే అద్భుత కళాఖండంలోనిదనే విషయం మీకు అర్ధమయేవుంటుంది. దాదాపు పదమూడు నిముషాలపాటు ఏకబిగిన ఉత్కంఠతతో సాగే దృశ్యం. ఈ దృశ్యంలో ఒక పాట, ఒక దండకం, ఒక పద్యం, అంతిమంగా హృదయవిదారకమైన వీణావాదనం వినిపిస్తాయి.  ఈ దృశ్యం ఆద్యంతం నందమూరి తారక రామారావు, ఘంటసాల వేంకటేశ్వరరావు అనే  ఇద్దరే ఇద్దరు కళాకారులు  కళ్ళెదుట నిల్చి మనలను దిగ్భ్రాంతులను చేస్తారు. ఇక్కడ  ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం, ఘంటసాల అసమాన్య గానవిద్యా కౌశలం ఈ సినీమాకు, ఈ దృశ్యఖండికలోని సంగీతానికి అజరామరత్వాన్ని చేకూర్చాయి. వీరిరువురితో పాటు ఈ మిని దృశ్య కావ్యానికి ప్రాణప్రతిష్ట చేసినవారు. చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గాలి పెంచలనరసింహారావు, సుప్రసిధ్ధ వైణిక విద్వాంసుడు శ్రీ ఈమని శంకరశాస్త్రి.

ఈ సినీమా సంగీతం గురించి చెప్పుకునే ముందు, సాలూరు రాజేశ్వరరావుగారి గురించి కూడా చెప్పకతప్పదు. ఈ దృశ్యంలో వినవచ్చే పాటలను, మండోదరి కోసం, తర్వాత దృశ్యాలలో వచ్చే  'పాడవే రాగమయీ వీణా' అనే పి.సుశీల పాడిన వీణ పాటను సాలూరివారు స్వరపర్చినట్లు చెప్పుకుంటారు. తర్వాత,  ఆయన అలవాటు ప్రకారం నందమూరి సోదరులతో వచ్చిన విభేదాల వలన  మధ్యలో ఈ చిత్రం నుండి తొలగిపోతే, అంతవరకూ అజ్ఞాతవాసంలో వున్న మొదటి తరం సంగీత దర్శకుడు గాలి పెంచలనరసింహారావుగారిని రప్పించి వారికి అవకాశం కల్పించి మిగిలిన సినిమా సంగీతం పూర్తి చేయించారు.

అధికారదర్పంతో మహేశ్వరుని దర్శించవచ్చిన రావణాసురుని(ఎన్టీఆర్) లోనికి వెళ్ళకుండా నంది (రాజారెడ్డి) అడ్డగించడంతో  కలహానికి దిగిన రావణుడు బలప్రయోగం మంచిదికాదన్న నారదుని (కాంతారావు) సలహాతో "కానరార కైలాసనివాస" అని భక్తి మార్గంలో శివుని ప్రార్ధిస్తాడు. శంకరాభరణం (29వ మేళకర్త - ధీరశంకరాభరణం జన్యం) రాగంలోని శుధ్ధశాస్త్రీయతను పాటిస్తూ స్వరపర్చబడిన ఈ  శివభక్తి గీతాన్ని పరమ శ్రీవైష్ణవాచార్యుడైన సముద్రాల రాఘవాచార్యులు గారు అత్యద్భుతంగా వ్రాయగా ఆ పాటను భక్తిప్రపత్తులతో  పరమ శాంతంగా ఘంటసాల ఆలపించారు. పాట, పాట మధ్యలో వినవచ్చే నేపధ్య సంగీతం మీద కైలాసంలోని శివపార్వతుల (వెంపటి పెద సత్యం) శృంగారలాస్యం మనలను ఆనంద పరవశులనుజేస్తుంది. తన భక్తి పార్వతీపతిని మెప్పించకపోవడంతో రావణుడు క్రోధంతో, ఆవేశపూరితుడై, అహంకారంతో "జయత్వద భ్రవిభ్రమత్ భ్రమద్భుజంగ మస్ఫుర" అనే దండకంతో శివుని స్తుతిస్తూ శివపార్వతుల లాస్యానికి భంగపాటు కలిగిస్తూ రావణుడు కైలాసపర్వతాన్నే పెకలించబోతాడు. ఈ దండకానికి కూర్చిన వరస , దానిని ఘంటసాలగారు  ఆలపించిన విధానం అనితరసాధ్యం, అనన్యసామాన్యం. ఈ దండకం పాడేప్పుడు ఘంటసాలవారి స్పష్టమైన ఉచ్ఛారణ, భావప్రకటన, రసస్ఫూర్తి మాటలకు అతీతం. ఆయన గాన గంధర్వుడని చెప్పడానికి, గాన వైదుష్యానికి ఈ దండకం ఒక్కటే చాలు.

(నిజం చెప్పొద్దూ - నా 78 ఏళ్ళ కాలంలో ఒక్కసారి కూడా నేను ఈ దండకాన్ని తడబడకుండా, స్పష్టంగా పలకలేకపోయాను. నడకే ప్రధానమైన ఈ దండకంలోని భావార్ధం తెలిసిన వారెందరో మరి?)

ఈ సన్నివేశంలో ఎన్.టి.ఆర్ ప్రతీ కదలిక, హావభావాలు, ఆ పాత్ర పట్ల గల పరిపూర్ణ అవగాహన నటుడిగా ఆయనను శిఖరాగ్రాలకు చేర్చాయి.

కైలాస పర్వతం పెకలించేప్పుడు పది తలలతో రావణుడు కనిపించే ఆ ఒక్క సీన్ మాత్రం షూట్ చేయడానికి కెమేరామన్ రవికాంత్ నగాయిచ్ కు దాదాపు ఐదారు గంటల సమయం పట్టిందట.  షూటింగ్ మధ్యలోలంచ్ బ్రేక్ సమయంలో టెక్నీషియన్స్ అందరూ బయటకు వెళ్ళిపోయినా రామారావుగారు మాత్రం అదే పొజిషన్లో ఆ పది తలలతో నిశ్చలంగా అలాగే కూర్చొని ఆ సీన్  షూటింగ్ పూర్తయి కెమేరామన్ ఓకే చెప్పిన తర్వాతగాని ఆ చోటునుండి కదలలేదని, మేకప్  తీయలేదని రవికాంత్ నగాయిచ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఎన్.టి.రామారావుగారికి తన వృత్తిపట్ల గల కమిట్మెంట్, డివోషన్.

రావణవిరచితంగా చెప్పబడే ఈ దండకం తర్వాత ఒక పద్యం. ఈ సందర్భానికి హంసధ్వని, మలయమారుతం, మోహన, సింధుభైరవి రాగాలను సందర్భోచితంగా ప్రయోగించారు.

రావణుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఖిన్నుడై ఆత్మత్యాగానికి సిధ్ధమైన తన పొట్టను చీల్చి అందులోని ప్రేవులను తంత్రులుగాజేసి తన వీణావాదనంతో శివుని మెప్పించాలని ఆశిస్తాడు. ఈ దృశ్యానికిదే పరాకాష్ట. ఈ సన్నివేశ చిత్రీకరణలో డైరెక్టర్ గా ఎన్.టి.రామారావు చూపిన ప్రతిభ, అభిరుచి ఎంతైనా కొనియాడదగ్గది. ఈ సందర్భంలో వీణను వాయించడానికి ఈమని శంకరశాస్తి వంటి సుప్రసిధ్ధ సంగీత విద్వాంసుడిని ఎన్నుకోవడంలో రామారావుగారి ప్రజ్ఞ, విజ్ఞత గోచరమవుతాయి. ఈ రావణ వీణావాదనానికి వేద మంత్రాలు పఠించడానికి ఉపయోగించే స్వరాలనే ప్రయోగించారు. వేద మంత్రాలు ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే మూడు మాత్రమే కాక కింద పంచమం కూడా కలిపి నాలుగు స్వరాలలో గానం చేస్తారని దానికి ప్రత్యేకించి రాగం పేరు ఉండదని గతంలో చెప్పడం జరిగింది. తర్వాత వచ్చే తానాన్ని ముఖారి రాగంలో స్వరపర్చగా ఈమనివారు అమోఘంగా తన వీణా గాన వైదుష్యాన్ని చూపించారు.  ముఖారి రాగం శోకరస ప్రధాన రాగం. ఇది 22వ మేళకర్త ఖరహరప్రియ జన్యరాగం. ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి.

రావణబ్రహ్మ ఆత్మత్యాగం చేసి పరమేశ్వరుని కరుణాకటాక్షాలతో అమోఘ వరాలు పొందడంతో ఈ దృశ్యం పూర్తి అవుతుంది. 

ఈ సినీమాలో ఎన్.టి.రామారావుగారు కానీ, ఘంటసాలగారు కానీ, ప్రశంసలకు, బిరుదులకు అతీతమైన కళా ప్రతిభను కనపర్చి చలనచిత్రసీమలో  లక్షలాది ప్రజల హృదయాలలో సుస్థిరమైన, శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 

శ్రీమద్రామాయణ, మహాభారత, భాగవత కావ్యాలలాగే ఎన్.టి.రామారావుగారి సీతారామకల్యాణం, అందులోని ఘంటసాలవారి పాటలు, పద్యాలు తెలుగువారికి చిరస్మరణీయంగా వుంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చును.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 16 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 21వ భాగం - తకిట తకిటథిమి తబలా డగ్గ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైయవ భాగం ఇక్కడ

21వ సజీవరాగం - 

తకిట తకిటథిమి తబలా డగ్గ
అణిగిందిర తిక్క... భౌమని మొరిగిందిర కుక్కా...

"అలవాటు లేని ఔపాసన " అని మనకు ఒక సామెత వుంది. అది అక్షరాల నిర్మాత, దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి పట్ల నిజమయింది. వారి అభిరుచికి , భావాలకు విరుధ్ధంగా "రాజమకుటం" అనే  జానపద సినిమాను తీశారు. ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినీమా ను కొంతవరకు ఆదరించినా , కేవలం వినోదాన్ని మాత్రమే ఆశించి జానపద సినీమా లు చూసే పామరజనాలను ఈ సినీమా  ఎక్కువగా ఆకర్షించలేకపోయింది. 

ఎన్.టి.ఆర్.,  గుమ్మడి, కన్నాంబ, రాజసులోచన, రాజనాల వంటివారు తమ తమ పాత్రలకు జీవంపోసినా, మంచి కధాంశంతో బి.ఎన్ రెడ్డిగారు గొప్పగా స్క్రీన ప్లే రూపొందించి  ఈ సినీమా ను తీసినా ఆర్ధికంగా విజయం పొందలేకపోయింది.

మాస్టర్ వేణు సంగీతంలో దేవులపల్లి, బాలాంత్రపు, కొసరాజుగార్లు వ్రాసిన పాటలు బి.ఎన్.గారి అభిరుచి మేరకు చాలా మనోజ్ఞంగా చిత్రీకరించబడ్డాయి. "సడిసేయకోగాలి ", " ఊరేది పేరేది ఓ చందమామా", "చూడచక్కని చుక్కల రేడు", "ఏటి ఒడ్డునా మా ఊరు", "తకిట తకిటథిమి తబలా డక్క" వంటి పాటలు ఈ సినిమా రిలీజైన 63 సంవత్సరాల తర్వాత కూడా శ్రోతల మనసులలో పదిలంగా వున్నాయి.

ఆ విధంగా నేటి మన "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" లోని గీతం "తకిట తకిటథిమి తబలా డక్క" అనే పాట ఘంటసాల మాస్టారు పాడినది. ఇదొక situational song. కుట్రలు , కుతంత్రాలతో దుష్టుడైన పినతండ్రి చేసిన విషప్రయోగం నుండి తెలివిగా తప్పించుకొని మహారాజు మతిస్థిమితం లేనివాడిలా నటిస్తూ పాడిన పాట ఇది.  ఈ పాటలో ఘంటసాలవారి లోని నటుడు ఆద్యంతం కనిపిస్తాడు. మతిభ్రమణం చెందినవారు ఒక మాటకు మరొక మాటకు పొంతన లేకుండా మాట్లాడతారు. వారి చేష్టలు కూడా క్షణానికొక రకంగా మారిపోతూంటాయి. ఈ భావాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొసరాజు గారు రకరకాల అంశాలను జొప్పించి ఈ పాటను అద్భుతంగా రాసారు. ఈ పాటను ఘంటసాలగారు కాకుండా వేరెవరైనా పాడివుంటే ఈ పాట గురించి పనికట్టుకొని ఈ రోజు తల్చుకోవలసిన అవసరమే ఉండేదికాదు. మాస్టర్ వేణుగారి స్వరరచనకు ఘంటసాల మాస్టారు రెండువందల శాతం న్యాయం చేకూర్చి జీవంపోసారు. ఈ పాటలో కోపం, ఉద్రేకం, విషాదం, వైరాగ్యం, వేదాంతం వంటి భావోద్వేగాలన్నింటిని మాస్టారు నాలుగు నిముషాల పాటలో చూపించి శ్రోతలను దిగ్భ్రాంతికి గురిచేశారు. తెరవెనుక ఘంటసాలవారి లోని నటుడికి తెరమీది నటుడు ఎన్.టి.రామారావు తన హావభావాలతో పరిపూర్ణ న్యాయం చేకూర్చారు.

ఈ పాటలో ఎన్.టి.ఆర్. తో పాటు పద్మనాభం, గుమ్మడి, సురభి కమలాబాయి, తదితరులు పాల్గొని సన్నివేశాన్ని రక్తి కట్టించారు.

పాట ప్రారంభంలో  వినపడే మృదంగ గతుల మీద మాస్టారి జతి, తర్వాత వచ్చే క్లారినెట్ బిట్ కు ఆయన స్వరాలు, వికటాట్టహాసం, ఎన్.టి.ఆర్. వాయిస్ కు మ్యాచ్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ ఎంత నిర్దుష్టంగా, ఖచ్ఛితంగా వుంటాయో ఈ పాట విన్నవారికే తెలుస్తుంది. ఒకేసారి అన్ని రసాలను తన గళం ద్వారా వినిపించి ఘంటసాల మాస్టారు శ్రోతలను సంభ్రమానికి గురి చేశారు.  ఈ పాటలో మాస్టర్ వేణుగారు మృదంగం, క్లారినెట్,  తాళాలు, ఫక్వాజ్,  ఛండ, టముకు, తాషామర్ఫా, వంటి వాద్యాలను అతి సమర్ధంగా ఉపయోగించారు.  ఈ పాటలో ఉపయోగించిన  వాద్యాలు కొన్ని  దేవాలయాలలో, రాజుల కోటల్లో వినపడేవి  నేను నా చిన్నతనం నుండి ఈ నాటి వరకు ఈ పాటను  తరచూ వింటూనే వున్నాను. ఈ పాట విన్నప్పుడల్లా నాలో ఏదో ఒకరకమైన గగుర్పాటును కలుగజేస్తుంది. ఏకకాలంలో ఘంటసాలగారు, ఎన్.టి.రామారావుగారు కళ్ళలో, మనసులో మెదులుతారు.








వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 9 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 20వ భాగం - శేషశైలావాస శ్రీ వేంకటేశా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పంధొమ్మిదవ భాగం ఇక్కడ

20వ సజీవరాగం - 

సాహిత్యం : "శేషశైలావాసా శ్రీ వేంకటేశా"
రాగం - రీతిగౌళ
చిత్రం - శ్రీ వెేంకటేశ్వర మహత్మ్యం
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు

పాట సాహిత్యం - 

పల్లవి : శేషశైలావాసా శ్రీ వేంకటేశా
శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా
శేషశైలావాసా శ్రీ వేంకటేశా...

చరణం : శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకూ..
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా చేర్చి
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి
శేషశైలావాసా శ్రీ వేంకటేశా....

చరణం 2 : 
పట్టుపానుపు పైన పవ్వళించర స్వామి-2
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ
!!పట్టు!
చిరునగవు లొలుకుచూ నిదురించు నీ మోము - 2
కరువుతీరా కాంచి తరియింతుము మేము !శేషశైలావాసా శ్రీ వేంకటేశా !
   
'మనసు కవి' గా తెలుగువారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆచార్య ఆత్రేయ చాలా ఎక్కువగా సాంఘిక సినీమాలకు, అతి తక్కువగా పౌరాణిక చిత్రాలకు పాటలు వ్రాసారు. అలా ఆత్రేయ  అతి తక్కువ పాటలు వ్రాసిన వాటిలో శాశ్వతత్వం సంతరించుకొని, ఆ సినీమా విడుదలైన 63 సంవత్సరాల తర్వాత కూడా అందులోని ఒక భక్తి గీతం తెలుగువారందరిలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి దోహదం చేస్తూనే వుంది. ఆ పాటే 1960లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా లోని " శేషశైలావాసా శ్రీ వేంకటేశా" అనే ఏకాంత సేవ గీతం. అదే నేడు  సదా మన మదిలో మెదిలే సజీవరాగం.

వాస్తవానికి  ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వరలక్ష్మి, గుమ్మడి నటించిన అత్యద్భుత పౌరాణిక చిత్రరాజం శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం. సినీమా కథకు ఈ ఏకాంత సేవ గీతానికి ఏ సంబంధము లేదు. తిరుమల స్వామివారి ఆలయంలో జరిగే వివిధ పూజలు, ఉత్సవాలు,  సేవా కార్యక్రమాలలో భాగంగా స్వామి వారి ఏకాంతసేవా గానంలో భాగంగా ఈ గీతాన్ని చూపించడం జరిగింది.

తెలుగునాట శ్రీవేంకటేశ్వర మహత్మ్యం సృష్టించిన సంచలన విజయం మనందరికీ బాగా తెలిసినదే. ఈ చిత్రం విడుదలైన ప్రతీ ఊరిలో  ఆయా థియేటర్ ప్రాంగణంలో ఒక మినీ వేంకటేశ్వరస్వామి ఆలయం వెలసి ఆ సినీమా ఆడినన్నాళ్ళు నిత్య దీప ధూప ఆరాధనలతో ఒక పవిత్ర వాతావరణమే ఏర్పడింది.  సినీమా చూచేందుకు కుటుంబ సమేతంగా వచ్చిన ప్రేక్షకులంతా అక్కడ ఏర్పాటు చేసిన హుండీలలో తమ కానుకలు సమర్పించుకొని కలియుగదైవమైన వేంకటేశ్వరునిపై తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా నటించిన ఎన్.టి.రామారావు  అపర వేంకటేశ్వరుడిగా తెలుగు ప్రజలందరిచేతా ఆరాధించబడ్డారు.

పెండ్యాల నాగేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమాలో పాటలన్నీ విపరీత జనాదరణ పొందాయి. వాటన్నిటిలో మకుటాయమానంగా, కలికి తురాయిగా ఎన్ని యుగాలకైనా శాశ్వతంగా నిలిచిపోయే భక్తిగీతం మాత్రం గంధర్వగాయకుడు ఘంటసాలవారు ఆలపించిన  " శేషశైలావాసా శ్రీ వేంకటేశా". ఘంటసాలవారి భక్తిరస ప్రధాన గీతాలలో ఈ పాట నిరంతరం మన హృదయాలలో మెదులుతూనే వుంటుంది.  ఘంటసాలగారే సినీమా లో కూడా  ఈ పాటను పాడుతూ తెరపై కనపడడం ఒక అపురూప విషయం. ఘంటసాల గాయకుడిగా గుర్తింపబడని రోజుల్లో సీతారామ జననం , త్యాగయ్య , యోగి వేమన వంటి సినీమాలలో చిన్న చిన్న వేషాలు వేసినా తర్వాతి కాలంలో గొప్ప గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఘంటసాలవారు పాట పాడుతూ తెరపై కనిపించింది శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా లో మాత్రమే. దర్శక నిర్మాత పి.పుల్లయ్యగారి బలవంతం మీద ఆ సినీమా లో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినీమా తర్వాత అనేకమంది నిర్మాతలు తమ చిత్రాలలో నటించమని ఎంతగానో ఒత్తిడి చేసినా ఘంటసాలగారు అంగీకరించలేదు. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా తనకు లభిస్తున్న ప్రజాభిమానమే చాలని, నటుడిగా ఇతర నటుల జీవనోపాధికి అడ్డంకిగా మారడం సుతారము ఇష్టంలేదని తనకు నటుడిగా వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించారు. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం లో తప్ప తర్వాత మరే ఇతర సినీమా లో నటించలేదు.

"శేషశైలావాసా" పాటను వాహినీ స్టూడియోలో వేసిన సెట్ మీద చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ కు ఘంటసాలవారి సతీమణి సావిత్రమ్మగారు , వారి పెద్దబ్బాయి విజయకుమార్ లతో పాటు నేనూ వెళ్ళేను. మధ్యాహ్నం రెండు గంటలనుండి అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పాట షూటింగ్ ను మేము సాయంత్రం ఏడు గంటల వరకు చూసి తిరిగి వచ్చేసాము. ఈ పాట చిత్రీకరణ లో ఘంటసాల మాస్టారితో పాటు సంగీత దర్శకుడు పెండ్యాలగారు, ఆయన సహాయకుడు బాబూరావు (తంబురాతో), వాహినీ సౌండ్ ఇంజనీర్ వల్లభజోస్యుల శివరాం (మృదంగంతో), ప్రముఖ ఫ్లూటిస్ట్ నంజుండప్ప (ఫ్లూట్ తో ) తెరపై కనపడడం ఒక విశేషం. (అనంతరకాలంలో నంజప్పగారు, ఘంటసాలగారి వాద్యబృందంలో సభ్యుడు కూడా విదేశ కచేరీ పర్యటనలో పాల్గొన్నారు).

ఈ సినీమా 1960 జనవరిలో విడుదలైనా ఈ పాట రికార్డింగ్, షూటింగ్ 1959 లో జరిగింది. ఈ సంఘటన జరిగిన మరో పదేళ్ళకు నిజంగానే తిరుమల-తిరుపతి దేవస్ధానం వారు ఘంటసాలవారిని తమ ఆస్థాన సంగీతవిద్వాంసుడిగా మూడేళ్ళపాటు నియమించడం ఒక అపూర్వ విషయం. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడి పదవి పొంది గౌరవింపబడిన మొట్టమొదటి చలన చిత్ర గాయకుడు, మన గానగంధర్వుడు ఘంటసాలవారు.

(శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా కోసం తయారు చేయబడిన  వేంకటేశ్వరస్వామి వారి నిలువెత్తు (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాన్ని, స్వామివారి అలంకారాభరణాలను పి.పుల్లయ్యగారు 1981 లో మా భారత్ కల్చురల్ ఇంటగ్రేషన్ కమిటీ బాలాజీ సంగీత్ కళ్యాణోత్సవాలకు గాను తన కానుకగా మాకు అప్పజెప్పారు. అదంతా వేరే చరిత్ర).

"శేషశైలావాసా శ్రీ వేంకటేశా" పాటను పెండ్యాలగారు రీతిగౌళ రాగంలో అతి శ్రావ్యంగా స్వరపర్చారు. రీతిగౌళ రాగం కర్నాటక సంగీతంలో 22 వ మేళకర్త రాగమైన ఖరహరప్రియకు జన్యరాగము. ఈ రాగం ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు ఉండడం వలన దీనిని షాఢవ-సంపూర్ణ రాగమని, ఈ రాగ సంచారం వక్రగతులలో నడుస్తూండడం వలన రీతిగౌళను వక్ర -షాఢవ-సంపూర్ణ రాగమని కూడా అంటారు. ఈ రాగం అనురక్తిని, భక్తి భావాన్ని ప్రకటించడానికి చాలా అనువైన రాగం.

శేషశైలావాసా పాట ఒక రకమైన జోల పాట కావడం వలన ఆద్యంతం సుతిమెత్తగా చాలా ప్రశాంతంగా, సుశ్రావ్యంగా నడుస్తుంది. అందుకు తగినట్లుగానే ఈ పాటలో జలతరంగ్, ట్యూబోఫోన్, ఫ్లూట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను  మాత్రమే పెండ్యాలగారు ఉపయోగించారు. ఈ పాటను ఘంటసాల మాస్టారు చాలా లలితంగా ఆలపిస్తూనే,శుధ్ధ శాస్త్రీయతను తన గాత్రంలో ధ్వనింపజేసారు.

ఘంటసాలవారి అజరామర గీతాలలో "శేషశైలావాసా శ్రీ వేంకటేశా" ఎప్పటికీ నిస్సందేహంగా ప్రముఖంగా నిలిచే వుంటుంది.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 2 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 19వ భాగం - మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పద్ధెనిమిదవ భాగం ఇక్కడ

19వ సజీవరాగం - 
"మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ"

సాహిత్యం : సముద్రాల జూనియర్
రాగం - 
చిత్రం - రేచుక్క పగటిచుక్క
సంగీతం - టి.వి.రాజు

పాట సాహిత్యం - 

మనవి సేయవే... మనసార చెలికి నాదు ప్రేమ .. మనవి సేయవే

సందెవేళ సుందరాంగి చిందు వేయు వెన్నెలలో సందు చేసుకొని నీవు ,
చందమామ, చల్లగా ! మనవి సేయవే!

ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ
మారుతమా !
చెలియ మనసు తీరు తెలిసి , చెవిలోన 
మెల్లగ ! మనవి సేయవే !

1959 లో వచ్చిన " రేచుక్క పగటిచుక్క" అనే జానపద చిత్రంలోని పాట యిది. ఎన్.ఎ.టి.  సంస్థ, మరియు, విజయా ప్రొడక్షన్స్ కలసి స్వస్తిశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన భారీ జానపద చిత్రం. ఎన్..టి.ఆర్, జానకి, ఎస్.వి.రంగారావు, కన్నాంబ మొదలగు వారు నటించారు. ఈ సినిమాలో కొన్ని చాలా మంచి పాటలున్నా, సినీమా అపజయం పొందిన కారణంగా పాటలన్నీ కొన్ని దశాబ్దాల పాటు మరుగున పడిపోయాయి. ఈ పాటలకు పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ ఘంటసాల మాస్టారు పాడిన కొన్ని వందల ఏక గళ గీతాలలో ఈ పాటకు నిశ్చయంగా సముచిత స్థానం ఉంటుంది. ఈ సినీమా లోని పాటలన్ని సముద్రాల రామానుజంగారు రాసారు. టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించారు. కమలాకర కామేశ్వరరావు డైరెక్టర్. టి.వి.రాజుగారు, సముద్రాల జూనియర్ గారు ఎన్.టి.రామారావుగారికి ఆప్తమిత్రులు. రామారావుగారు హీరోగా నటించిన అనేక చిత్రాలకు ఈ ఇద్దరూ కలసి పని చేసేరు.

"మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవిసేయవే" - పాటలో ఆహా, ఓహో అని మెచ్చుకునే సాహిత్యమో, సంగీతమో కనపడదు. పాట మాటలలో సమాసభూయిష్ట పదాడంబరం లేదు. అయినా ఈ పాట శ్రోతల చెవులకు ఇంపుగానే వుంటుంది. అందుకు కారణం కేవలం మృదుమధురమైన, లాలిత్యంతో కూడిన ఘంటసాలవారి ప్రశాంతమైన గానం , సున్నితమైన వాద్యగోష్టి మాత్రమే ఈ పాటను ఆపాతమధురం చేసాయి. 

చల్లని వెన్నెల రాత్రిలో ప్రశాంతమైన ఏకాంత వాతావరణం లో కథానాయకుడు తన మనోభావాలను తన ప్రియురాలికి తెలియజెప్పమని చంద్రుడిని, చల్లని పిల్లతెమ్మెరలను అర్ధిస్తూ పాడిన పాట. ఈ అడగడంలో అధికారమో, దర్పమో కనపడదు. సందెవేళ సుందరాంగి వెన్నెట్లో విహరించే సమయంలో "సందు చేసుకొని" అవకాశం చూసుకొని మాత్రమే మనవి చేయమని  చందమామను కోరుతున్నాడు. అలాగే, మరో చరణంలో మలయమారుతంతో "ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ, మారుతమా! చెలియ మనసు తీరు తెలిసి, చెవిలోన మెల్లగా మనవి సేయవే అని అడుగుతున్నాడు. మొత్తం మీద ప్రియురాలి మనఃస్థితిని కనిపెట్టి సున్నితంగా ప్రేమ రాయబారం నెరపమని కధానాయకుడు విన్నపం చేస్తున్నాడు. *ఈ విషయాలను ప్రియురాలి సముఖంలో తానెంత సరళంగా, మృదువుగా చెప్పాలని భావిస్తున్నాడో అంత లాలిత్యంగా తన భావాలను వెల్లడిస్తున్నాడు*. 

టి.వి.రాజుగారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టారు  హీరో ఎన్.టి.ఆర్ లో పరకాయ ప్రవేశం చేసి ఈ పాటను అత్యంత మనోహరంగా గానం చేసి ఈ పాటను అజరామరత్వం కల్పించారు. ఈ పాట చివరలో వచ్చే ఆలాపన మనలను చల్లని వెన్నెట్లో హాయిగా ఊయలలూపుతున్న భావన కలిగిస్తుంది. ఈ పాటలో టి.వి.రాజుగారు వైబ్రోఫోన్, ట్యూబోఫోన్, స్పానిష్ గిటార్, వయొలిన్స్, ఫ్లూట్ వంటి వాద్యాలను సముచితమైన రీతిలో ఉపయోగించారు. తెరమీద కధానాయకుని పాత్రలో ఎన్ టి రామారావు నిజంగానే ఓ రాజకుమారిడిలా ఎంతో అందంగా, హుందాగా తన హావభావాలను అలవోకగా ప్రదర్శించారు.

ఈ ఏకగళ ప్రేమగీతాన్ని ప్రత్యేకించి ఏ ఒక్క రాగంలోనో కాక పలు రాగాల ఛాయలు ధ్వనించేలా స్వరపర్చినట్లు తెలుస్తున్నది. 

"రేచుక్క పగటిచుక్క" సినీమా ను తెలుగుతో పాటు  తమిళంలో కూడా "రాజసేవై" అనే పేరుతో నిర్మించారు. తమిళ వెర్షన్ లో ఈ పాటను సోలోగా కాక ఒక డ్యూయెట్ గా  ఎన్.టి.ఆర్, షావుకారు జానకిల మీద చిత్రీకరించారు. తమిళంలో కూడా ఈ పాటను ఘంటసాలగారే పి.సుశీలగారితో కలసి పాడారు. 

లలితసంగీత వేదికల మీద ఈ పాట ఈనాటికి పలువురు గాయకుల కంఠస్వరాన వినిపిస్తూ శ్రోతల హర్షధ్వానాలు అందుకుంటునేవుంది. మనసుకు హాయిని, మంచి మూడ్ ను కలిగించే పాట " మనవి సేయవే". ఘంటసాల మాస్టారి కంఠంలో ఇటువంటి ఆణిముత్యాలెన్నో సరియైన ప్రచారం లభించక కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ పాటలన్నింటినీ ఘంటసాలవారి శత జయంతీ ఉత్సవాలలో భాగంగా వెలుగులోకి తీసుకురావలసిన భాధ్యత సంగీతాభిమానులందరి మీద ఉన్నదని భావిస్తున్నాను.







వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 28వ భాగం - నా హృదయంలో నిదురించే చెలీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...