Saturday 9 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 20వ భాగం - శేషశైలావాస శ్రీ వేంకటేశా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పంధొమ్మిదవ భాగం ఇక్కడ

20వ సజీవరాగం - 

సాహిత్యం : "శేషశైలావాసా శ్రీ వేంకటేశా"
రాగం - రీతిగౌళ
చిత్రం - శ్రీ వెేంకటేశ్వర మహత్మ్యం
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు

పాట సాహిత్యం - 

పల్లవి : శేషశైలావాసా శ్రీ వేంకటేశా
శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా
శేషశైలావాసా శ్రీ వేంకటేశా...

చరణం : శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకూ..
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా చేర్చి
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి
శేషశైలావాసా శ్రీ వేంకటేశా....

చరణం 2 : 
పట్టుపానుపు పైన పవ్వళించర స్వామి-2
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ
!!పట్టు!
చిరునగవు లొలుకుచూ నిదురించు నీ మోము - 2
కరువుతీరా కాంచి తరియింతుము మేము !శేషశైలావాసా శ్రీ వేంకటేశా !
   
'మనసు కవి' గా తెలుగువారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆచార్య ఆత్రేయ చాలా ఎక్కువగా సాంఘిక సినీమాలకు, అతి తక్కువగా పౌరాణిక చిత్రాలకు పాటలు వ్రాసారు. అలా ఆత్రేయ  అతి తక్కువ పాటలు వ్రాసిన వాటిలో శాశ్వతత్వం సంతరించుకొని, ఆ సినీమా విడుదలైన 63 సంవత్సరాల తర్వాత కూడా అందులోని ఒక భక్తి గీతం తెలుగువారందరిలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి దోహదం చేస్తూనే వుంది. ఆ పాటే 1960లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా లోని " శేషశైలావాసా శ్రీ వేంకటేశా" అనే ఏకాంత సేవ గీతం. అదే నేడు  సదా మన మదిలో మెదిలే సజీవరాగం.

వాస్తవానికి  ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వరలక్ష్మి, గుమ్మడి నటించిన అత్యద్భుత పౌరాణిక చిత్రరాజం శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం. సినీమా కథకు ఈ ఏకాంత సేవ గీతానికి ఏ సంబంధము లేదు. తిరుమల స్వామివారి ఆలయంలో జరిగే వివిధ పూజలు, ఉత్సవాలు,  సేవా కార్యక్రమాలలో భాగంగా స్వామి వారి ఏకాంతసేవా గానంలో భాగంగా ఈ గీతాన్ని చూపించడం జరిగింది.

తెలుగునాట శ్రీవేంకటేశ్వర మహత్మ్యం సృష్టించిన సంచలన విజయం మనందరికీ బాగా తెలిసినదే. ఈ చిత్రం విడుదలైన ప్రతీ ఊరిలో  ఆయా థియేటర్ ప్రాంగణంలో ఒక మినీ వేంకటేశ్వరస్వామి ఆలయం వెలసి ఆ సినీమా ఆడినన్నాళ్ళు నిత్య దీప ధూప ఆరాధనలతో ఒక పవిత్ర వాతావరణమే ఏర్పడింది.  సినీమా చూచేందుకు కుటుంబ సమేతంగా వచ్చిన ప్రేక్షకులంతా అక్కడ ఏర్పాటు చేసిన హుండీలలో తమ కానుకలు సమర్పించుకొని కలియుగదైవమైన వేంకటేశ్వరునిపై తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా నటించిన ఎన్.టి.రామారావు  అపర వేంకటేశ్వరుడిగా తెలుగు ప్రజలందరిచేతా ఆరాధించబడ్డారు.

పెండ్యాల నాగేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమాలో పాటలన్నీ విపరీత జనాదరణ పొందాయి. వాటన్నిటిలో మకుటాయమానంగా, కలికి తురాయిగా ఎన్ని యుగాలకైనా శాశ్వతంగా నిలిచిపోయే భక్తిగీతం మాత్రం గంధర్వగాయకుడు ఘంటసాలవారు ఆలపించిన  " శేషశైలావాసా శ్రీ వేంకటేశా". ఘంటసాలవారి భక్తిరస ప్రధాన గీతాలలో ఈ పాట నిరంతరం మన హృదయాలలో మెదులుతూనే వుంటుంది.  ఘంటసాలగారే సినీమా లో కూడా  ఈ పాటను పాడుతూ తెరపై కనపడడం ఒక అపురూప విషయం. ఘంటసాల గాయకుడిగా గుర్తింపబడని రోజుల్లో సీతారామ జననం , త్యాగయ్య , యోగి వేమన వంటి సినీమాలలో చిన్న చిన్న వేషాలు వేసినా తర్వాతి కాలంలో గొప్ప గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఘంటసాలవారు పాట పాడుతూ తెరపై కనిపించింది శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా లో మాత్రమే. దర్శక నిర్మాత పి.పుల్లయ్యగారి బలవంతం మీద ఆ సినీమా లో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినీమా తర్వాత అనేకమంది నిర్మాతలు తమ చిత్రాలలో నటించమని ఎంతగానో ఒత్తిడి చేసినా ఘంటసాలగారు అంగీకరించలేదు. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా తనకు లభిస్తున్న ప్రజాభిమానమే చాలని, నటుడిగా ఇతర నటుల జీవనోపాధికి అడ్డంకిగా మారడం సుతారము ఇష్టంలేదని తనకు నటుడిగా వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించారు. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం లో తప్ప తర్వాత మరే ఇతర సినీమా లో నటించలేదు.

"శేషశైలావాసా" పాటను వాహినీ స్టూడియోలో వేసిన సెట్ మీద చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ కు ఘంటసాలవారి సతీమణి సావిత్రమ్మగారు , వారి పెద్దబ్బాయి విజయకుమార్ లతో పాటు నేనూ వెళ్ళేను. మధ్యాహ్నం రెండు గంటలనుండి అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పాట షూటింగ్ ను మేము సాయంత్రం ఏడు గంటల వరకు చూసి తిరిగి వచ్చేసాము. ఈ పాట చిత్రీకరణ లో ఘంటసాల మాస్టారితో పాటు సంగీత దర్శకుడు పెండ్యాలగారు, ఆయన సహాయకుడు బాబూరావు (తంబురాతో), వాహినీ సౌండ్ ఇంజనీర్ వల్లభజోస్యుల శివరాం (మృదంగంతో), ప్రముఖ ఫ్లూటిస్ట్ నంజుండప్ప (ఫ్లూట్ తో ) తెరపై కనపడడం ఒక విశేషం. (అనంతరకాలంలో నంజప్పగారు, ఘంటసాలగారి వాద్యబృందంలో సభ్యుడు కూడా విదేశ కచేరీ పర్యటనలో పాల్గొన్నారు).

ఈ సినీమా 1960 జనవరిలో విడుదలైనా ఈ పాట రికార్డింగ్, షూటింగ్ 1959 లో జరిగింది. ఈ సంఘటన జరిగిన మరో పదేళ్ళకు నిజంగానే తిరుమల-తిరుపతి దేవస్ధానం వారు ఘంటసాలవారిని తమ ఆస్థాన సంగీతవిద్వాంసుడిగా మూడేళ్ళపాటు నియమించడం ఒక అపూర్వ విషయం. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడి పదవి పొంది గౌరవింపబడిన మొట్టమొదటి చలన చిత్ర గాయకుడు, మన గానగంధర్వుడు ఘంటసాలవారు.

(శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం సినీమా కోసం తయారు చేయబడిన  వేంకటేశ్వరస్వామి వారి నిలువెత్తు (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాన్ని, స్వామివారి అలంకారాభరణాలను పి.పుల్లయ్యగారు 1981 లో మా భారత్ కల్చురల్ ఇంటగ్రేషన్ కమిటీ బాలాజీ సంగీత్ కళ్యాణోత్సవాలకు గాను తన కానుకగా మాకు అప్పజెప్పారు. అదంతా వేరే చరిత్ర).

"శేషశైలావాసా శ్రీ వేంకటేశా" పాటను పెండ్యాలగారు రీతిగౌళ రాగంలో అతి శ్రావ్యంగా స్వరపర్చారు. రీతిగౌళ రాగం కర్నాటక సంగీతంలో 22 వ మేళకర్త రాగమైన ఖరహరప్రియకు జన్యరాగము. ఈ రాగం ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు ఉండడం వలన దీనిని షాఢవ-సంపూర్ణ రాగమని, ఈ రాగ సంచారం వక్రగతులలో నడుస్తూండడం వలన రీతిగౌళను వక్ర -షాఢవ-సంపూర్ణ రాగమని కూడా అంటారు. ఈ రాగం అనురక్తిని, భక్తి భావాన్ని ప్రకటించడానికి చాలా అనువైన రాగం.

శేషశైలావాసా పాట ఒక రకమైన జోల పాట కావడం వలన ఆద్యంతం సుతిమెత్తగా చాలా ప్రశాంతంగా, సుశ్రావ్యంగా నడుస్తుంది. అందుకు తగినట్లుగానే ఈ పాటలో జలతరంగ్, ట్యూబోఫోన్, ఫ్లూట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను  మాత్రమే పెండ్యాలగారు ఉపయోగించారు. ఈ పాటను ఘంటసాల మాస్టారు చాలా లలితంగా ఆలపిస్తూనే,శుధ్ధ శాస్త్రీయతను తన గాత్రంలో ధ్వనింపజేసారు.

ఘంటసాలవారి అజరామర గీతాలలో "శేషశైలావాసా శ్రీ వేంకటేశా" ఎప్పటికీ నిస్సందేహంగా ప్రముఖంగా నిలిచే వుంటుంది.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...