Saturday 30 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 10 వ భాగం - తెల్లవార వచ్చె తెలియక నా సామీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొమ్మిదవ భాగం ఇక్కడ 

ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం 10 వ పాట  

"తెల్లవార వచ్చె తెలియకనా సామీ"
రాగం -  మోహన 
చిత్రం :  'చిరంజీవులు'

తెల్లవార వచ్చె తెలియకనా స్వామి
మళ్ళి పరుండేవు లేరా
మళ్ళి పరుండేవు మసలుతు వుండేవు
మారాము చాలింక లేరా .. తెల్లవార వచ్చె...

కలకలమని పక్షిగణములు చెదిరేను
కళ్యాణ గుణధామ లేరా ..
తరుణులందరు దధి చిలికే వేళాయె
దైవరాయ నిదుర లేరా ...

నల్లనయ్య రార నను కన్నవాడ
బుల్లి తండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా, వెన్న తిందువుగాని రారా ....
తెల్లవార వచ్చె తెలియకనా స్వామి ...

సినీమా లో ఇదొక సుప్రభాత భక్తిగీతం. కధానాయిక ఒక దేవాలయంలో కృష్ణుని పరంగా పాడిన మేల్కొల్పు పాట. ఈ పాటలో మనకు ఒక రాధ, ఒక ఆండాళ్, ఒక యశోద గోచరిస్తారు. 

మొదటి పల్లవిలో ఒక ప్రియ సఖి యొక్క మందలింపుతో కూడిన అదలింపు; చరణంలోని 'కళ్యాణ గుణధామ', 'దైవరాయ నిదురలేరా' అనే చోట భక్తురాలి వేడుకోలు ; ఆఖరి చరణంలో 'నల్లనయ్య, 'బుల్లితండ్రి', 'బుజ్జాయి', 'వెన్న తిందువుగాని రారా' వంటి మాటలలో తల్లి మనసు తెలియజేస్తుంది.

కలకలారావాలతో చెదరిపోయే పక్షిగణాలు, ప్రాతఃకాలంలో స్త్రీలంతా మట్టికుండలలో కవ్వాలు పెట్టి పెరుగు చిలకడం వంటి ప్రాచీన సంస్కృతి, వాతావరణం మరల మనకు గుర్తు చేస్తుంది ఈ పాట. ఈనాటి కాంక్రీటు జంగిల్స్ లో వారికి కారు హారన్లు, కిచెన్లలోని మిక్సీ గ్రైండర్ రొదలు తప్ప ఇలాటి సహజ వాతావరణం ఏనాడైనా చూసుంటారా! సందేహమే. అర్ధరాత్రి దాటేవరకు బయట కాలంగడిపి వచ్చేవారికి ప్రాతఃకాలం, సూర్యోదయం, సుప్రభాతం వంటివి తమ అనుభవంలోనివి కావు. 

తేట తేట తెలుగు మాటలను సరళమైన రీతిలో  ఒక ప్రక్క పసిపిల్లలకు కూడా అర్ధమయ్యేలా, మరొకప్రక్క ఆధ్యాత్మిక భావాలను మనసుకు హత్తుకునేలా వ్రాసారు అసలు సిసలు తెలుగు కవి మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు.

ఇంతటి భావయుక్తమైన సుప్రభాత పూజాగీతిని స్వరపర్చడానికి ఘంటసాల మాస్టారు మోహన వంటి సమ్మోహన రాగాన్ని ఎన్నుకొని ఈ భక్తిగీతానికి చిరంజీవత్వం ప్రసాదించారు. మోహన రాగానికి హిందుస్థానీ సంగీతంలో సమాంతర రాగం ' భూప్'.  ఈ రెండు రాగాలను సమన్వయపరుస్తూ ఘంటసాలగారు రూపొందించిన అపూర్వగీతం 'తెల్లవార వచ్చె'. ఈ సినీమా వచ్చి 66 సంవత్సరాలైనా ఈ సినీమాలోని పాటలన్నీ నిత్యనూతనంగా సంగీతాభిమానులను అలరిస్తున్నాయి.

మోహన రాగం, 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగానికి జన్యం. ఈ రాగంలో ఐదు స్వరాలే పలకడం వలన దీనిని సంగీత సంప్రదాయం లో ఔఢవ రాగం అంటారు. 'సరిగమపదని' అనే సప్తస్వరాలలో 'మ' మధ్యమం, 'ని' నిషాదం అనే రెండు స్వరాలు ఈ రాగంలో వినిపించవు. కేవలం సరిగపద అనే ఐదు స్వరాలతో లాలిత్యంతో కూడిన ముగ్ధమనోహరమైన భక్తిగీతాన్ని స్వరపర్చి ,దానిని తాను పరిపూర్ణంగా అనుభవించి ఆ పాటను  నేపధ్యగాయని లీలకు నేర్పి అత్యద్భుతంగా ఆమె చేత పాడించారు.

లీల పాడిన అనేక గీతాలలో ఉత్తమోత్తమైనది , అజరామరత్వం పొందిన భక్తిగీతం  'తెల్లవారవచ్చె'. ఈ పాటలో లీల గళంలోని మార్దవం, ప్రేమ, భక్తి తత్త్వాలు శ్రోతలను పరవశులను చేస్తుంది. ఈ పాటలోని ప్రతీ పదంలో, భావప్రకటనలో ఘంటసాలగారే దర్శనమిస్తారు.

ఈ పాటలో ఘంటసాల మాస్టారు యూనివాక్స్, ట్యూబోఫోన్, బెల్స్, తబలా, వైలిన్స్ వంటి వాద్యాలను చాలా సమర్ధవంతంగా వీనులవిందుగా ఉపయోగించారు.

చిరంజీవులు చిత్రం లోని పాటలు, సంగీతం అన్నీ  తెలుగులోని సహజత్వాన్ని సంతరించుకున్నవే. వినోదా పిక్చర్స్ బ్యానర్ మీద డి ఎల్ నారాయణ 'దేవదాసు' , 'కన్యాశుల్కము' సినీమా ల తర్వాత ఎన్.టి.రామారావు, జమున, గుమ్మడిలతో తీసిన విషాదాంత ప్రేమకధా చిత్రం చిరంజీవులు.

వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన అపురూప చిత్రం 'చిరంజీవులు' . నటుడిగా ఎన్.టి.రామారావుకు , గాయక సంగీతదర్శకుడిగా ఘంటసాలకు చిరస్థాయి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన చిత్రం 'చిరంజీవులు'. ఈ చిత్రంలోని అన్ని పాటలు సందర్భోచితంగా, సహజత్వానికి దగ్గరగా తెలుగు వాతావరణం ప్రతిబింబిస్తూ రూపొందాయి.

1948 లో వాడియా ఫిలింస్ నర్గీస్, దిలీప్ కుమార్ లతో 'మేళా' అనే హిందీ సినీమా వచ్చింది. ఆ సినీమా కథ మాత్రమే ఆధారంగా తీసుకొని 1956 లో  'చిరంజీవులు' సినిమాను నిర్మించారు. 

చిరంజీవులు చిత్రం లో గుడ్డివాడిగా నటించడానికి ఎన్ టి రామారావు కృత్రిమ కనుగుడ్లు పెట్టుకొని రోజులతరబడి నటించడంతో నిజంగానే ఆయన దృష్టికి నిజంగానే సమస్య ఏర్పడి వైద్యచికిత్స పొందిన తర్వాత కాని సహజస్థితికి రాలేదు. రామారావుగారి కమిట్మెంట్ కు, మొండితనానికి ఒక నిదర్శనం ఈ చిరంజీవులు.







వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్



Saturday 23 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 9 వ భాగం - రాజా మహారాజా రవికోటి విభ్రాజ సురలోక పూజా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనిమిదవ భాగం ఇక్కడ 

ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం 9వ పాట  

" రాజా మహారాజా
రవికోటి విభ్రాజ సురలోక పూజా"
రాగం : హుసేనీ

రాజా మహరాజా - 2
రవికోటి విభ్రాజ సురలోక పూజా 
రాజా మహరాజా - 2

తేజోవికారా దివ్యమంగళహారా -2
శ్రీకర సదయా మానస నిలయా - 2
రాజా మహారాజా 

మానిష శుభగుణ సాధుజనావనా-2
భక్తజనాళి కనవే కరుణా -2
పావనభావా దేవనాయకదీవా
కావవె కరుణా దేవాధిదేవా

రాజా మహరాజా రవికోటి విభ్రాజ సురలోక పూజా - 2
తేజో వికారా ... స్వరకల్పనలు
తేజోవికారా దివ్యమంగళహారా.... "


1952 లో విడుదలైన 'టింగు రంగా'  అనే సినీమా లోనిది ఈ మధురగానం. నిర్మాత పి.ఎస్.శేషాచలం చెట్టియార్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన చిత్రం ఇది. తెలుగులో 'టింగు రంగా' పేరుతో తమిళంలో 'శ్యామల' అనే పేరుతో ఈ జానపద చిత్రాన్ని 1952 లో విడుదల చేశారు. 

తెలుగు వారందరికీ చిరపరిచితుడైన బి ఎ సుబ్బారావు రెండు భాషల్లోనూ దర్శకుడు.  అలాగే, ఎస్.వరలక్ష్మి తెలుగు తమిళాలలో హీరోయిన్. రేలంగి , కనకం, కూడా ఉన్నారు. తెలుగు వెర్షన్ హీరోగా మంత్రవాది శ్రీరామమూర్తి, తమిళ చిత్రంలో ఎమ్.కె.త్యాగరాజ భాగవతార్ హీరోలు. త్యాగరాజ భాగవతార్ నట గాయకుడు. ఆ కాలపు సూపర్ స్టార్.

ఈ శ్యామల టింగు రంగా చిత్రానికి జి.రామనాధన్, టి.వి.రాజు, ఎస్.బి.దినకర్ రావు సంగీత దర్శకులు.  ఆదినారాయణ రావుకు సహాయకుడైన టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'టింగు రంగా'. ఈ చిత్రంలోని పాటలన్నీ తాపీ ధర్మారావు నాయుడు వ్రాశారు.


జి రామనాధన్ తమిళంలో చేసిన పాటనే తెలుగులో కూడా ఉపయోగించారు.  ఈ శాస్త్రీయ గీతాన్ని హుసేనీ రాగంలో స్వరపర్చారు రామనాధన్.  హుసేనీ రాగం 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియ రాగ జన్యం.  ఈ హుసేనీరాగంలో సద్గురు త్యాగరాజస్వామి , ముత్తుస్వామి దీక్షితర్,స్వాతి తిరునాళ్ కొన్ని కీర్తనలు రచించారు. సద్గురు త్యాగరాజస్వామి వారి  దివ్యనామ కీర్తనలు కొన్ని హుస్సేనీ రాగంలో చేసినవే. 

టింగు రంగాలో ఈ పాటను  మొదట్లో ఎవరిచేత పాడించాలనే మీమాంస,తర్జనభర్జనలు జరిగాయట . ఎవరైనా  తమిళ శాస్త్రీయ సంగీత విద్వాంసుడి చేత  పాడించాలనే భావనలో కూడా ఉన్నారు. అప్పుడు, ఘంటసాల కర్ణాటక సంగీత నేపథ్యం తెలిసిన టి.వి.రాజు చొరవ తీసుకొని ఈ పాటను ఘంటసాలగారి చేత పాడిద్దామని పట్టుపట్టి నిర్మాతను ఒప్పించారు. పాట అనితరసాధ్యంగా రూపొందింది. ఈ గీతంలో ఘంటసాలవారి గళం శుధ్ధ శాస్త్రీయ పద్ధతిలోనే సాగింది. ఇందులోని సంగతులు, గమకాలు, స్వరకల్పనలు రాగ, భావ, తాళాల మీద  పూర్తి అవగాహన, తగినంత ఆధిపత్యం కలవారు మాత్రమే సంగీత రసజ్ఞుల ప్రశంసలు పొందే విధంగా గానం చేయగలుగుతారు. టి.వి.రాజుగారు తన మీద ఉంచిన నమ్మకానికి  నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చి టి.వి.రాజు  సంగీత భవిష్యత్ కు దోహదం చేశారు ఘంటసాల.

కధానాయిక వీణ వాయిస్తూండగా, ఎదురుగా కూర్చొని హీరో పాడే పాట ఇది. పూర్తి కర్ణాటక సంగీత బాణి. వీణ పాటలలో ఉత్తమ గీతంగా చెప్పుకోవచ్చు. రెండు చరణాల తరువాత వచ్చే స్వరకల్పనలే ఈ పాటకు జీవం. ఈ పాటలో పక్క వాద్యాలు గా వీణ, మృదంగం, ఘటం, మోర్సింగ్ లు సలక్షణంగా వినిపిస్తాయి.

ఘంటసాలవారు పూర్తి శాస్త్రీయ బాణీలో పాడిన ప్రప్రథమ గీతం " రాజా మహారాజా". దురదృష్టవశాత్తు ఈ సినిమా కానీ, ఇందులోని పాటలు కానీ యూట్యూబ్ లో లేవు.  కానీ తమిళంలో వచ్చిన "శ్యామల" సినీమా, కొన్ని పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి.

ఘంటసాలగారు ఈ పాట  పాడిన ఆరేళ్ళ తర్వాత  వచ్చినవే జయభేరిలోని 'రసికరాజా'  లేదా 'మదిశారదా దేవి మందిరమే', ఆ తరువాత వచ్చిన జగదేకవీరుని కథ లోని 'శివశంకరీ శివానంద లహరి' మొదలగు పాటలు.
 
సరియైన ప్రచారంలేకనో,  లేక సినీమా విజయవంతం కాకనో ఒక అద్భుతమైన గీతాన్ని సంగీతాభిమానులు నిర్లక్ష్యం చేశారు. ఘంటసాలవారి  కర్ణాటక సంగీత ప్రతిభకు,  గాన వైదుష్యానికి మచ్చుతునక ఈ పాట.

ఘంటసాలగారు  ఈ పాటను తనకంటే చాలా పట్టుగా, శాస్త్రబధ్ధంగా, ఉన్నతంగా పాడారని, తమిళంలో ఈ పాట పాడిన త్యాగరాజ భాగవతార్ ఘంటసాలవారిని మనఃపూర్వకంగా అభినందించారట.

కనీసం ఇప్పుడైనా మన గాయకులు ఈ పాటకు సరియైన గౌరవము, స్థానము కల్పించి తమ సంగీత కార్యక్రమాలలో గానం చేస్తారని ఆశిస్తాను.

ఇప్పుడు, ఘంటసాలవారి ఆలాపనలో 
" రాజా మహరాజా " విందాము.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

Saturday 16 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 8వ భాగం - దేవీ శ్రీదేవీ మొరలాలించి పాలించి నన్నేలినావే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏడవ భాగం ఇక్కడ 

ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం 8వ పాట  
'దేవీ శ్రీదేవీ మొరలాలించి పాలించి నన్నేలినావే'
చిత్రం : సంతానం - 1955.

అనిశెట్టి రచన 
సుసర్ల దక్షిణామూర్తి సంగీతం
                     

దేవీ శ్రీదేవీ ....
మొరలాలించి పాలించి నన్నేలినావే !! దేవీ !!

మదిలో నిన్నే మరువను దేవీ
నీ నామ సంకీర్తనే నే జేసెద !! దేవీ!!

నీ కనుసన్నల నిరతము నన్నే
హాయిగా ఓలలాడించరావే
ఇలదేవతగా వెలసితివీవే
ఈడేరె నా కోర్కెలీనాటికీ
దేవీ.... శ్రీదేవీ...

                 

భక్తిగీతంలా ఉండే ఈ పాట రక్తిని కలిగించేదే. కొంత స్వయంప్రతిభ, అంతకు మించిన మాటకారితనం, పాటకారితనంతో ఒక ధనవంతుని, ఆతని కుమార్తెల సానుభూతిని, ఆదరణను సంపాదించి వారింట్లో స్థానం సంపాదించుకున్న హీరో అక్కినేని, హీరోయిన్ సావిత్రి ని ఉద్దేశించి  పాడిన పాట "దేవీ శ్రీదేవీ". తలుపుకు ఒకవేపు వంటలవాడిగా హీరో, తలుపుకు మరొక ప్రక్క హీరోయిన్. వీరిరువురి మధ్య ఈ మనోరంజకమైన పాట. పాట పూర్తయేసరికి పొయ్యి మీది పాలు పొంగిపోయి ఉంటాయి. దృశ్యం చూడకుండా, కేవలం పాటను మాత్రమే వినేవారికి ఇదొక శాస్త్రీయ భక్తి గీతంలా తోస్తుంది.

అనిశెట్టిగారు వ్రాసిన గీతాన్ని సుసర్ల దక్షిణామూర్తిగారి సుసంపన్న స్వరాలతో ఘంటసాలగారు ఈ పాటను అత్యద్భుతంగా, మహా శాస్త్రోక్తంగా గానం చేసారు.  ఘంటసాల మాస్టారి 3-1/2 ఆక్టేవ్ ల గాత్ర పటిమ ఈ పాటలో అనితరసాధ్యంగా నిరూపితమయింది. ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత సాధన ఈ గీతాన్ని ఆలపించడంలో ఎంతో ఉపకరించింది.

పాట మధ్యలో వచ్చే ఆలాపనలు, సంగతులు, 'ఇలదేవతగా వెలసితివీవే' అనే పదాన్ని తారస్థాయిలో ఏమాత్రం గాంభీర్యం, స్థాయి తగ్గకుండా మాస్టారు పాడిన విధానం గగుర్పాటును, పరవశత్వాన్ని కలుగజేస్తాయి. ఈ పాటను వింటూంటే ఏదో సంగీత కచేరీ వింటున్న అనుభూతి కలుగుతుంది. దానికి తగినట్లుగా ఈ పాటకు వీణ, వైలిన్స్, మృదంగం, ఘటం, మోర్సింగ్  లను పక్క వాద్యాలుగా ఉపయోగించి దక్షిణామూర్తి ఈ పాటకు శుధ్ధ శాస్త్రీయతను ఆపాదించారు.

సుసర్ల దక్షిణామూర్తి గారు ఈ పాటను షణ్ముఖప్రియ రాగంలో స్వరపర్చారు. కర్ణాటక సంగీతానికి చెందిన ఈ రాగం 56వ మేళకర్త, సంపూర్ణరాగంగా ప్రసిధ్ధిపొందింది. పరమేశ్వరునికి, షణ్ముఖునికి సంబంధించిన అనేక భక్తి గీతాలు, కీర్తనలు ఈ షణ్ముఖప్రియ ప్రియ రాగంలో మలచబడ్డాయి.

సంతానం సినీమాలోని పాటలన్ని ఆపాతమధురాలే. లతామంగేష్కర్ పాడిన మొట్టమొదటి తెలుగు పాట ' నిదురపోరా తమ్ముడా', మాస్టారు పాడిన ' చల్లని వెన్నెలలో', పాండవోద్యోగవిజయాలులోని కొన్ని పద్యాలు  67 ఏళ్ళ తర్వాత కూడా ఈనాటికీ నిత్యనూతనంగా సంగీతప్రియులను అలరిస్తున్నాయంటే ఆ పాటలకు ఉన్న విలువ అర్ధమవుతుంది.

ఘంటసాలవారి గానమాధుర్యానికి మచ్చుతునక ' దేవీ శ్రీదేవీ'.

ఎస్.వి.రంగారావు, రేలంగి, శ్రీరంజని, చలం, అమర్నాథ్, కుసుమ, రమణారెడ్డి, మొదలగువారు నటించారు.

సాధనా ఫిలింస్ సి.వి.రంగనాధ దాస్ దర్శక, నిర్మాణంలో రూపొందిన అద్భుత కుటుంబ గాథా చిత్రం ' సంతానం'.

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్




Saturday 9 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 7వ భాగం - ఏడుకొండలవాడా వేంకటా రమణా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఆరవ భాగం ఇక్కడ 

 ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం7 వ పాట -
' ఏడుకొండలవాడా వేంకటా రమణా '

( ఘంటసాలవారి స్వరరచనలో పి.లీల పాడిన పాట)

ఏడుకొండలవాడా వెంకటా రమణా
సద్దు సేయక నువు నిద్దురపోవయ్యా

పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపులుగా
కనులనొలికె వలపు పన్నీటిజల్లుగా
అన్ని అమరించె నీ అలివేలుమంగా 
!!ఏడు కొండలవాడా!!

మా పాలి దైవమని నమ్ముకున్నామయ్యా
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్యా
చాటుచేసుకు ఎటులో చెంత చేరెదనయ్యా

ఏడు కొండలవాడా వెంకటా రమణా
సద్దు శాయక... దొంగా....
నిదురపోవయ్యా ....!!ఏడుకొండలవాడా!!

                   

"ఏడు కొండలవాడా
వెంకటా రమణా
సద్దు సాయక నీవు
నిదుర పోవయ్యా"

ఈ పాట వినగానే ఆలయాలలో భగవంతునికి సలిపే ఏకాంతసేవలో ఆలపించే భక్తిగీతమేమో అనే భావన మనలో కలుగుతుంది. 

కానీ ఈ పాట  ఫక్తు హాస్యరస ప్రధాన కుటుంబ గాధా చిత్రం 'పెళ్ళిచేసి చూడు' సినీమాలో భార్యభర్తల మధ్య నడిచే సున్నితమైన శృంగారానికి ప్రతీకగా ఉంటుంది.

పాట వినగానే ఇది ఏ రాగమో తెలిసిపోతుంది. భక్తి , కరుణరస ప్రధానమైన రాగం. అదే చక్రవాక రాగం. కర్ణాటక సంగీత మేళకర్త రాగాలలో  16వ మేళకర్త రాగం. ఈ రాగానికి జన్య రాగాలుగా  మలయమారుతం , వలజి మొదలైన రాగాలను చెప్పుకోవచ్చును. సంగీత ముమూర్తులలో ప్రముఖుడైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి సంప్రదాయంలో ఈ రాగాన్ని  తోయవేగవాహిని అని అంటారట. హిందుస్థానీలో చక్రవాకానికి సరిపోలిన రాగం అహిర్ భైరవి.

ఘంటసాలవారు పెళ్ళిచేసి చూడు సినిమాలో మొదటిసారిగా చక్రవాక రాగాన్ని లలిత సంగీత ప్రియులకు పరిచయం చేశారు. అంతకు పూర్వం దక్షిణాది సినీమాలలో చక్రవాక రాగాన్ని ఏ సంగీతదర్శకుడు ఉపయోగించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని సుప్రసిధ్ధ రచయిత, సంగీతప్రియుడు అయిన  శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు తమ వ్యాసాలలో ధృవీకరించారు.

పెళ్ళిచేసి చూడు సినీమాలో ఏకాంత సమయంలో రాత్రిపూట కధానాయిక, తన  మనోనాయకుని (రమణ) నిద్రపుచ్చే ప్రయత్నంగా ఏడుకొండలవాడి పరంగా ఈ పాటను ఎంతో మధురంగా, లలిత శృంగార భావాలు కురిపిస్తూ ఆలపిస్తుంది. శ్లేషార్ధాలు ధ్వనింపజేస్తూ పింగళివారు వ్రాసిన ఈ భక్తి, శృంగారగీతాన్ని ఘంటసాల మాస్టారు అత్యద్భుతంగా స్వరపర్చి పి.లీల చేత పాడించారు.

ఆరుబయట పండు వెన్నెల రాత్రిలో అల్లరిచేసే భర్తను నిద్రపుచ్చడానికి భార్య చేసే ప్రయత్నం లో ఈ గీతం ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది. నాయికని అలిమేలు మంగగాను, ఆమె భర్త రమణను ఏడుకొండల వెంకట రమణగానూ, మామగారిని బీబి నాంచారమ్మగానూ పోలుస్తూ గీత రచయిత పింగళి నాగేంద్రరావుగారు చేసిన రచనా చమత్కృతి ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది.

"పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపులుగా
కనులనొలికె వలపు పన్నీటిజల్లుగా
అన్ని అమరించె నీ అలివేలుమంగా"

ఎంతటి మధురమైన భావన. పింగళివారి లాలిత్యంతో కూడిన పదాలకు ఘంటసాలవారి అమృతతుల్యమైన స్వరరచన ఈ శృంగార భక్తిగీతానికి అజరామరత్వం కల్పించింది. పాట పాడింది పి. లీలే అయినా అణువణువునా ఘంటసాలవారే గోచరిస్తారు. తెలుగు భాషతో పరిచయంలేని మలయాళ గాయని పి.లీల చేత  ప్రతీ పదాన్ని అంత భావయుక్తంగా, సుస్పష్టంగా పలికించడంలో ఘంటసాలవారి కృషి, ప్రతిభ గోచరిస్తుంది. శాస్త్రీయ రాగాలను లలితగీతాలుగా మలచినప్పుడు ఏ మాటను ఎలా పలకాలో, గమకాలను ఎంతవరకు ఉపయోగించాలో, ఆ రాగభావాన్ని ఎంత సున్నితంగా, శ్రావ్యంగా ప్రయోగించాలనే విషయంలో ఘంటసాలవారిని మించిన సంగీత దర్శకుడు మరొకరు లేరంటే అది అతిశయోక్తి కాదు.

చక్రవాక రాగంలో చేసిన ఈ 'ఏడుకొండలవాడా వెంకట రమణ' పాటలో నేపధ్య సంగీతానికి వీణ, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను మాత్రమే ఘంటసాల మాస్టారు ఉపయోగించారు.


ఏడుకొండలవాడి సాక్షిగా ఈ పాట ఏనాటికీ ఆపాతమధురమే. అపురూప, అపూర్వగీతమే. దృశ్యపరంగా కాకుండా కేవలం  పాటగా విన్నప్పుడు ఇదొక భక్తి పరమైన ఏకాంతసేవ గీతంగా తోస్తుంది.

ముందు ఈ పాటను జిక్కితో పాడించారు. అది గ్రామఫోన్ రికార్డ్ గా కూడా వచ్చింది. తరువాత,  ఎందుకనో పాట అనుకున్నంత ఎఫెక్ట్ తో రాలేదన్న భావన స్వరకర్త, దర్శక నిర్మాతలకు కలిగి మరల ఆ పాటను లీలతో పాడించి షూటింగ్ ముగించారు. పాట గొప్ప హిట్టయింది. 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట నిత్యనూతనంగా సజీవరాగంగా సంగీతాభిమానులకు పరవశత్వం కలిగిస్తూనే ఉంది.

ఘంటసాలవారి  శాస్త్రీయ సంగీత ప్రతిభకు ఒక మచ్చు తునక ఈ సుశ్రావ్య గీతం.

సినీమా లో ఈ పాటను జి.వరలక్ష్మి, ఎన్.టి.రామారావు, డా.శివరామకృష్ణయ్య, బాలకృష్ణల మీద చిత్రీకరించారు. 

ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు, సావిత్రి, జోగారావు, సూర్యకాంతం, పుష్పలత, దొరస్వామి, డా.శివరామకృష్ణయ్య, మొదలగువారు నటించిన ఈ చిత్రం బాలలను, పెద్దలను కూడా అలరించిన చక్కని కుటుంబగాధా చిత్రం. డైరక్టర్ ఎల్.వి.ప్రసాద్. నాగిరెడ్డి- చక్రపాణి లు నిర్మాతలు. ఇది ఒక విజయావారి చిత్రం.

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్




Saturday 2 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 6వ భాగం - అందమె ఆనందం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!



మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఐదవ భాగం ఇక్కడ 


ఘంటసాల - మదిలో సదా మెదిలే సజీవరాగం

6 వ పాట - ' అందమె ఆనందం '

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం!! అందమె!!

పడమట సంధ్యారాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహన రాగం
జీవితమే  మధురానురాగం

పడిలేచే కడలి తరంగం
వడిలో జడిసిన సారంగం
సుడిగాలి లో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం !! అందమె!!

              
హీరోయిన్ పాడినది :

" చల్లని సాగర తీరం 
మదిజిల్లను మలయ సమీరం
మదిలో కదిలే సరాగం
జీవితమే అనురాగ యోగం !!
అందమె ఆనందం !!

                 
"బ్రతుకు  తెరువు" సినీమా వచ్చింది , నాకు బ్రతుకు తెరువు నిచ్చింది " అని సదా చెప్పుకున్న సముద్రాల రామానుజాచార్యులు వ్రాసిన తొలి సినీ గీతం ఇది. 

ఈ పాట విన్నాక ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనుషుల మనసులు , ప్రేమలు , ద్వేషాలు ఒకేలా ఉంటాయనిపిస్తుంది. 

 సుప్రసిద్ధ ఆంగ్లకవి జాన్ కీట్స్  'ఎండిమియన్"  అనే పద్య కావ్యాన్ని
 "A thing of beauty is a joy forever" 
అనే మాటలతో ప్రారంభిస్తాడు.
ఈ పద్యంలోని ఈ వాక్యాన్ని,
 విలియం షేక్స్పియర్ మాటలు ( "జీవితమే ఒక నాటకరంగం") ను స్ఫూర్తిగా తీసుకొని తన తొలి సినీ గీతాన్ని వ్రాసారు జూనియర్ సముద్రాల.

పాటలో ఒక దగ్గర "సుర నందనవనం మాకందం" అనే మాటను కవి ప్రయోగించగా ఆ మాటకు బదులుగా వేరొక పదం చెప్పమన్నారట సంగీత దర్శకుడు ఘంటసాల. అప్పుడు రామానుజంగారు " జీవితమే ఒక నాటక రంగం" అనే పాదం వ్రాసిచ్చారట".

ఘంటసాలవారు ముందుగా ట్యూన్ కంపోజ్ చేసి తర్వాత దానికి మాటలు వ్రాయగా తయారైన అద్భుతమైన పాట " అందమె ఆనందం ".

ఈ పాటను ఘంటసాలవారు భీంప్లాస్ స్వరాలతో ట్యూన్ కట్టారు. హిందుస్థానీ రాగమైన భీంప్లాస్ కు సమాంతరమైన కర్ణాటక రాగం దేవగాంధారి. ఇదే ముత్తుస్వామి దీక్షితర్ సంప్రదాయం లో అభేరి గా పేరు పొందింది.
అభేరి 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియ యొక్క జన్యరాగం. 

ఈ భీంప్లాస్ రాగంలో అసంఖ్యకమైన పాటలు వచ్చాయి. అయిన " అందమె ఆనందం" పాట అందమే వేరు. ఈ పాటలోని  మెలడి , రిథిమ్ ఆబాలగోపాలంలో హుషారును , ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి.

 పాట నిర్మాత, దర్శకులకు నచ్చింది.
 సంగీత దర్శకుడి రైమ్ కు రిథిమ్ కు సరిపోయింది.  ఈ పాట రికార్డింగ్ ను అతి తక్కువ కాలంలో అంటే ఏడు గంటల కాలంలో ముగించవలసిన పాటను కేవలం రెండు గంటల లోపుగానే  తాను పాడి ,  లీల చేత పాడించి ముగించారట.

బ్రతుకు తెరువులోని ఈ పాట ఆ కాలపు యువతను ఉర్రూతలూగించింది. అక్షర జ్ఞానం లేని పశులకాపర్ల దగ్గర నుండి కాలేజి ప్రొఫెసర్ల వరకూ అందరూ ఈ పాటనే పాడుకున్నారు.

"అందమె ఆనందం" తన మనసుకు నచ్చిన పాటగా ఈ బ్రతుకు తెరువు కధానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు పలుసార్లు చెప్పడం జరిగింది.

అంతకు మించి ఈ పాట పుట్టి   ఏడు దశాబ్దాలైనా ఇంకా తెలుగు హృదయాలలో పదిలంగా నిత్యనూతనంగా మెదులుతూనే వుంది.

మొదట ఈ సినీమా కు  సి ఆర్ సుబ్బరామన్  సంగీత దర్శకుడు. ఆయన ఒకే ఒక పాట స్వరపర్చారు. కానీ , ఆ తర్వాత ఆయన ఆకస్మికంగా మరణించడంతో ఆయనకు సహాయకుడిగా వున్న ఘంటసాలవారు మిగిలిన పాటలు స్వరపర్చి ముగించారు.

ఈ సినీమా లో ఘంటసాలవారు పాడిన ఏకైక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఈ అందమె ఆనందం. ఘంటసాలవారి ప్రతి కచేరీలో  ఆఖరున  విధిగా "అందమె ఆనందం"  పాటే పాడి అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య తన కచేరీ ముగించేవారు. 

ఘంటసాలవారి విదేశీ పర్యటనలోకూడా ప్రతీ కచేరీలో ఈ పాట పాడారంటే అందమె ఆనందం ఆయనకు ఎంతిష్టమో అర్ధమవుతుంది.

సినీమాలో ఈ పాట రెండుసార్లు ఘంటసాల , పి.లీల గళాలలో విన వస్తుంది.  పియానో వాయిస్తూ మొదట హీరో అక్కినేని , తర్వాత హీరోయిన్ సావిత్రి ఈ పాటను ఆలపిస్తారు.

ఈ పాటకోసం పియోనా , ఫ్లూట్ , క్లారినెట్ ,వైలిన్స్,  స్పానిష్ గిటార్ , తబల , డోలక్ వంటి వాద్యాలు ఉపయోగించారు. ఈ పాట ఘంటసాలవారి గళంలో ఎంతో శ్రావ్యంగా తేలియాడింది. ముఖ్యంగా ఈ పాటలోని హమ్మింగ్స్ మనసుకు హాయిని , పరవశత్వాన్ని కలుగజేస్తాయి.

 ఈ సినీమా ను తమిళంలో డబ్ చేసినప్పుడు కూడా ఈ పాట చాలా హిట్టయింది.

బ్రతుకు తెరువు కు దర్శకుడు భరణీ రామకృష్ణ గారు. నిర్మాత - కోవెలమూడి భాస్కరరావుగారు.  భాస్కరరావు గారు , ఘంటసాలవారు మంచి మిత్రులు.

ఈ సినీమా తర్వాత భాస్కరరావు గారు వరసగా తీసిన ఐదారు చిత్రాలకు ఘంటసాలవారే సంగీత దర్శకుడు.

 1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు'  కధ హిందీలో  జితేంద్ర ,తనూజ , సంజీవ్ కుమార్  లతో 
" జీనే కి రాహ్ "గా,  తమిళంలో ఎమ్జియార్ , కె ఆర్ విజయ , కాంచన లతో 'నాన్ ఏన్  పిరన్దేన్'  గా వచ్చి విజయం పొందింది.

ఇదే కధను  మళ్ళీ పి ఎ పి సుబ్బారావు మరల 1972 లో తెలుగులో ' భార్యాబిడ్డలు' గా నిర్మించగా అక్కినేని , జయలలిత , కృష్ణకుమారి నటించారు.

కెవిమహాదేవన్ సంగీతదర్శకత్వంలో వచ్చిన ఈ సినీమా లో ఘంటసాల మాస్టారు సోలోలు , డ్యూయెట్లు కలిపి ఆరు పాటలు పాడారు.

కథాకథనం బాగుంటే ఆ సినీమా , ఆ సినీమా లోని పాటలు కలకాలం గుర్తుండిపోతాయనడానికి 'బ్రతుకు తెరువు' ఒక నిదర్శనం. 

మదిలో సదా మెదిలే ఘంటసాలవారి మరో సజీవ రాగంతో మళ్ళీ వచ్చే ఆదివారం ...

💐🙏ప్రణవ స్వరాట్🙏💐

అందమె ఆనందం - ఘంటసాల


అందమె ఆనందం - పి. లీల ఆలాపన


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...