ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం 9వ పాట
" రాజా మహారాజా
రవికోటి విభ్రాజ సురలోక పూజా"
రాగం : హుసేనీ
రాజా మహరాజా - 2
రవికోటి విభ్రాజ సురలోక పూజా
రాజా మహరాజా - 2
తేజోవికారా దివ్యమంగళహారా -2
శ్రీకర సదయా మానస నిలయా - 2
రాజా మహారాజా
మానిష శుభగుణ సాధుజనావనా-2
భక్తజనాళి కనవే కరుణా -2
పావనభావా దేవనాయకదీవా
కావవె కరుణా దేవాధిదేవా
రాజా మహరాజా రవికోటి విభ్రాజ సురలోక పూజా - 2
తేజో వికారా ... స్వరకల్పనలు
తేజోవికారా దివ్యమంగళహారా.... "
1952 లో విడుదలైన 'టింగు రంగా' అనే సినీమా లోనిది ఈ మధురగానం. నిర్మాత పి.ఎస్.శేషాచలం చెట్టియార్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన చిత్రం ఇది. తెలుగులో 'టింగు రంగా' పేరుతో తమిళంలో 'శ్యామల' అనే పేరుతో ఈ జానపద చిత్రాన్ని 1952 లో విడుదల చేశారు.
తెలుగు వారందరికీ చిరపరిచితుడైన బి ఎ సుబ్బారావు రెండు భాషల్లోనూ దర్శకుడు. అలాగే, ఎస్.వరలక్ష్మి తెలుగు తమిళాలలో హీరోయిన్. రేలంగి , కనకం, కూడా ఉన్నారు. తెలుగు వెర్షన్ హీరోగా మంత్రవాది శ్రీరామమూర్తి, తమిళ చిత్రంలో ఎమ్.కె.త్యాగరాజ భాగవతార్ హీరోలు. త్యాగరాజ భాగవతార్ నట గాయకుడు. ఆ కాలపు సూపర్ స్టార్.
ఈ శ్యామల టింగు రంగా చిత్రానికి జి.రామనాధన్, టి.వి.రాజు, ఎస్.బి.దినకర్ రావు సంగీత దర్శకులు. ఆదినారాయణ రావుకు సహాయకుడైన టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'టింగు రంగా'. ఈ చిత్రంలోని పాటలన్నీ తాపీ ధర్మారావు నాయుడు వ్రాశారు.
జి రామనాధన్ తమిళంలో చేసిన పాటనే తెలుగులో కూడా ఉపయోగించారు. ఈ శాస్త్రీయ గీతాన్ని హుసేనీ రాగంలో స్వరపర్చారు రామనాధన్. హుసేనీ రాగం 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియ రాగ జన్యం. ఈ హుసేనీరాగంలో సద్గురు త్యాగరాజస్వామి , ముత్తుస్వామి దీక్షితర్,స్వాతి తిరునాళ్ కొన్ని కీర్తనలు రచించారు. సద్గురు త్యాగరాజస్వామి వారి దివ్యనామ కీర్తనలు కొన్ని హుస్సేనీ రాగంలో చేసినవే.
టింగు రంగాలో ఈ పాటను మొదట్లో ఎవరిచేత పాడించాలనే మీమాంస,తర్జనభర్జనలు జరిగాయట . ఎవరైనా తమిళ శాస్త్రీయ సంగీత విద్వాంసుడి చేత పాడించాలనే భావనలో కూడా ఉన్నారు. అప్పుడు, ఘంటసాల కర్ణాటక సంగీత నేపథ్యం తెలిసిన టి.వి.రాజు చొరవ తీసుకొని ఈ పాటను ఘంటసాలగారి చేత పాడిద్దామని పట్టుపట్టి నిర్మాతను ఒప్పించారు. పాట అనితరసాధ్యంగా రూపొందింది. ఈ గీతంలో ఘంటసాలవారి గళం శుధ్ధ శాస్త్రీయ పద్ధతిలోనే సాగింది. ఇందులోని సంగతులు, గమకాలు, స్వరకల్పనలు రాగ, భావ, తాళాల మీద పూర్తి అవగాహన, తగినంత ఆధిపత్యం కలవారు మాత్రమే సంగీత రసజ్ఞుల ప్రశంసలు పొందే విధంగా గానం చేయగలుగుతారు. టి.వి.రాజుగారు తన మీద ఉంచిన నమ్మకానికి నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చి టి.వి.రాజు సంగీత భవిష్యత్ కు దోహదం చేశారు ఘంటసాల.
కధానాయిక వీణ వాయిస్తూండగా, ఎదురుగా కూర్చొని హీరో పాడే పాట ఇది. పూర్తి కర్ణాటక సంగీత బాణి. వీణ పాటలలో ఉత్తమ గీతంగా చెప్పుకోవచ్చు. రెండు చరణాల తరువాత వచ్చే స్వరకల్పనలే ఈ పాటకు జీవం. ఈ పాటలో పక్క వాద్యాలు గా వీణ, మృదంగం, ఘటం, మోర్సింగ్ లు సలక్షణంగా వినిపిస్తాయి.
ఘంటసాలవారు పూర్తి శాస్త్రీయ బాణీలో పాడిన ప్రప్రథమ గీతం " రాజా మహారాజా". దురదృష్టవశాత్తు ఈ సినిమా కానీ, ఇందులోని పాటలు కానీ యూట్యూబ్ లో లేవు. కానీ తమిళంలో వచ్చిన "శ్యామల" సినీమా, కొన్ని పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి.
ఘంటసాలగారు ఈ పాట పాడిన ఆరేళ్ళ తర్వాత వచ్చినవే జయభేరిలోని 'రసికరాజా' లేదా 'మదిశారదా దేవి మందిరమే', ఆ తరువాత వచ్చిన జగదేకవీరుని కథ లోని 'శివశంకరీ శివానంద లహరి' మొదలగు పాటలు.
సరియైన ప్రచారంలేకనో, లేక సినీమా విజయవంతం కాకనో ఒక అద్భుతమైన గీతాన్ని సంగీతాభిమానులు నిర్లక్ష్యం చేశారు. ఘంటసాలవారి కర్ణాటక సంగీత ప్రతిభకు, గాన వైదుష్యానికి మచ్చుతునక ఈ పాట.
ఘంటసాలగారు ఈ పాటను తనకంటే చాలా పట్టుగా, శాస్త్రబధ్ధంగా, ఉన్నతంగా పాడారని, తమిళంలో ఈ పాట పాడిన త్యాగరాజ భాగవతార్ ఘంటసాలవారిని మనఃపూర్వకంగా అభినందించారట.
కనీసం ఇప్పుడైనా మన గాయకులు ఈ పాటకు సరియైన గౌరవము, స్థానము కల్పించి తమ సంగీత కార్యక్రమాలలో గానం చేస్తారని ఆశిస్తాను.
ఇప్పుడు, ఘంటసాలవారి ఆలాపనలో
" రాజా మహరాజా " విందాము.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment