ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం 8వ పాట
'దేవీ శ్రీదేవీ మొరలాలించి పాలించి నన్నేలినావే'
చిత్రం : సంతానం - 1955.
అనిశెట్టి రచన
సుసర్ల దక్షిణామూర్తి సంగీతం
దేవీ శ్రీదేవీ ....
మొరలాలించి పాలించి నన్నేలినావే !! దేవీ !!
మదిలో నిన్నే మరువను దేవీ
నీ నామ సంకీర్తనే నే జేసెద !! దేవీ!!
నీ కనుసన్నల నిరతము నన్నే
హాయిగా ఓలలాడించరావే
ఇలదేవతగా వెలసితివీవే
ఈడేరె నా కోర్కెలీనాటికీ
దేవీ.... శ్రీదేవీ...
భక్తిగీతంలా ఉండే ఈ పాట రక్తిని కలిగించేదే. కొంత స్వయంప్రతిభ, అంతకు మించిన మాటకారితనం, పాటకారితనంతో ఒక ధనవంతుని, ఆతని కుమార్తెల సానుభూతిని, ఆదరణను సంపాదించి వారింట్లో స్థానం సంపాదించుకున్న హీరో అక్కినేని, హీరోయిన్ సావిత్రి ని ఉద్దేశించి పాడిన పాట "దేవీ శ్రీదేవీ". తలుపుకు ఒకవేపు వంటలవాడిగా హీరో, తలుపుకు మరొక ప్రక్క హీరోయిన్. వీరిరువురి మధ్య ఈ మనోరంజకమైన పాట. పాట పూర్తయేసరికి పొయ్యి మీది పాలు పొంగిపోయి ఉంటాయి. దృశ్యం చూడకుండా, కేవలం పాటను మాత్రమే వినేవారికి ఇదొక శాస్త్రీయ భక్తి గీతంలా తోస్తుంది.
అనిశెట్టిగారు వ్రాసిన గీతాన్ని సుసర్ల దక్షిణామూర్తిగారి సుసంపన్న స్వరాలతో ఘంటసాలగారు ఈ పాటను అత్యద్భుతంగా, మహా శాస్త్రోక్తంగా గానం చేసారు. ఘంటసాల మాస్టారి 3-1/2 ఆక్టేవ్ ల గాత్ర పటిమ ఈ పాటలో అనితరసాధ్యంగా నిరూపితమయింది. ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత సాధన ఈ గీతాన్ని ఆలపించడంలో ఎంతో ఉపకరించింది.
పాట మధ్యలో వచ్చే ఆలాపనలు, సంగతులు, 'ఇలదేవతగా వెలసితివీవే' అనే పదాన్ని తారస్థాయిలో ఏమాత్రం గాంభీర్యం, స్థాయి తగ్గకుండా మాస్టారు పాడిన విధానం గగుర్పాటును, పరవశత్వాన్ని కలుగజేస్తాయి. ఈ పాటను వింటూంటే ఏదో సంగీత కచేరీ వింటున్న అనుభూతి కలుగుతుంది. దానికి తగినట్లుగా ఈ పాటకు వీణ, వైలిన్స్, మృదంగం, ఘటం, మోర్సింగ్ లను పక్క వాద్యాలుగా ఉపయోగించి దక్షిణామూర్తి ఈ పాటకు శుధ్ధ శాస్త్రీయతను ఆపాదించారు.
సుసర్ల దక్షిణామూర్తి గారు ఈ పాటను షణ్ముఖప్రియ రాగంలో స్వరపర్చారు. కర్ణాటక సంగీతానికి చెందిన ఈ రాగం 56వ మేళకర్త, సంపూర్ణరాగంగా ప్రసిధ్ధిపొందింది. పరమేశ్వరునికి, షణ్ముఖునికి సంబంధించిన అనేక భక్తి గీతాలు, కీర్తనలు ఈ షణ్ముఖప్రియ ప్రియ రాగంలో మలచబడ్డాయి.
సంతానం సినీమాలోని పాటలన్ని ఆపాతమధురాలే. లతామంగేష్కర్ పాడిన మొట్టమొదటి తెలుగు పాట ' నిదురపోరా తమ్ముడా', మాస్టారు పాడిన ' చల్లని వెన్నెలలో', పాండవోద్యోగవిజయాలులోని కొన్ని పద్యాలు 67 ఏళ్ళ తర్వాత కూడా ఈనాటికీ నిత్యనూతనంగా సంగీతప్రియులను అలరిస్తున్నాయంటే ఆ పాటలకు ఉన్న విలువ అర్ధమవుతుంది.
ఘంటసాలవారి గానమాధుర్యానికి మచ్చుతునక ' దేవీ శ్రీదేవీ'.
ఎస్.వి.రంగారావు, రేలంగి, శ్రీరంజని, చలం, అమర్నాథ్, కుసుమ, రమణారెడ్డి, మొదలగువారు నటించారు.
సాధనా ఫిలింస్ సి.వి.రంగనాధ దాస్ దర్శక, నిర్మాణంలో రూపొందిన అద్భుత కుటుంబ గాథా చిత్రం ' సంతానం'.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
అద్భుత వివరణ , విశ్లేషణ . అద్భుతమైన శ్రీ ఘంటసాల మాస్టారి కంఠం . చాలా బాగుంది .
ReplyDeleteఅందచేసిన శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ గారికి ధన్యవాదాలు .