Saturday, 9 December 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 7వ భాగం - ఏడుకొండలవాడా వేంకటా రమణా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఆరవ భాగం ఇక్కడ 

 ఘంటసాల 
మదిలో సదా మెదిలే సజీవరాగం7 వ పాట -
' ఏడుకొండలవాడా వేంకటా రమణా '

( ఘంటసాలవారి స్వరరచనలో పి.లీల పాడిన పాట)

ఏడుకొండలవాడా వెంకటా రమణా
సద్దు సేయక నువు నిద్దురపోవయ్యా

పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపులుగా
కనులనొలికె వలపు పన్నీటిజల్లుగా
అన్ని అమరించె నీ అలివేలుమంగా 
!!ఏడు కొండలవాడా!!

మా పాలి దైవమని నమ్ముకున్నామయ్యా
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్యా
చాటుచేసుకు ఎటులో చెంత చేరెదనయ్యా

ఏడు కొండలవాడా వెంకటా రమణా
సద్దు శాయక... దొంగా....
నిదురపోవయ్యా ....!!ఏడుకొండలవాడా!!

                   

"ఏడు కొండలవాడా
వెంకటా రమణా
సద్దు సాయక నీవు
నిదుర పోవయ్యా"

ఈ పాట వినగానే ఆలయాలలో భగవంతునికి సలిపే ఏకాంతసేవలో ఆలపించే భక్తిగీతమేమో అనే భావన మనలో కలుగుతుంది. 

కానీ ఈ పాట  ఫక్తు హాస్యరస ప్రధాన కుటుంబ గాధా చిత్రం 'పెళ్ళిచేసి చూడు' సినీమాలో భార్యభర్తల మధ్య నడిచే సున్నితమైన శృంగారానికి ప్రతీకగా ఉంటుంది.

పాట వినగానే ఇది ఏ రాగమో తెలిసిపోతుంది. భక్తి , కరుణరస ప్రధానమైన రాగం. అదే చక్రవాక రాగం. కర్ణాటక సంగీత మేళకర్త రాగాలలో  16వ మేళకర్త రాగం. ఈ రాగానికి జన్య రాగాలుగా  మలయమారుతం , వలజి మొదలైన రాగాలను చెప్పుకోవచ్చును. సంగీత ముమూర్తులలో ప్రముఖుడైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి సంప్రదాయంలో ఈ రాగాన్ని  తోయవేగవాహిని అని అంటారట. హిందుస్థానీలో చక్రవాకానికి సరిపోలిన రాగం అహిర్ భైరవి.

ఘంటసాలవారు పెళ్ళిచేసి చూడు సినిమాలో మొదటిసారిగా చక్రవాక రాగాన్ని లలిత సంగీత ప్రియులకు పరిచయం చేశారు. అంతకు పూర్వం దక్షిణాది సినీమాలలో చక్రవాక రాగాన్ని ఏ సంగీతదర్శకుడు ఉపయోగించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని సుప్రసిధ్ధ రచయిత, సంగీతప్రియుడు అయిన  శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు తమ వ్యాసాలలో ధృవీకరించారు.

పెళ్ళిచేసి చూడు సినీమాలో ఏకాంత సమయంలో రాత్రిపూట కధానాయిక, తన  మనోనాయకుని (రమణ) నిద్రపుచ్చే ప్రయత్నంగా ఏడుకొండలవాడి పరంగా ఈ పాటను ఎంతో మధురంగా, లలిత శృంగార భావాలు కురిపిస్తూ ఆలపిస్తుంది. శ్లేషార్ధాలు ధ్వనింపజేస్తూ పింగళివారు వ్రాసిన ఈ భక్తి, శృంగారగీతాన్ని ఘంటసాల మాస్టారు అత్యద్భుతంగా స్వరపర్చి పి.లీల చేత పాడించారు.

ఆరుబయట పండు వెన్నెల రాత్రిలో అల్లరిచేసే భర్తను నిద్రపుచ్చడానికి భార్య చేసే ప్రయత్నం లో ఈ గీతం ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది. నాయికని అలిమేలు మంగగాను, ఆమె భర్త రమణను ఏడుకొండల వెంకట రమణగానూ, మామగారిని బీబి నాంచారమ్మగానూ పోలుస్తూ గీత రచయిత పింగళి నాగేంద్రరావుగారు చేసిన రచనా చమత్కృతి ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది.

"పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపులుగా
కనులనొలికె వలపు పన్నీటిజల్లుగా
అన్ని అమరించె నీ అలివేలుమంగా"

ఎంతటి మధురమైన భావన. పింగళివారి లాలిత్యంతో కూడిన పదాలకు ఘంటసాలవారి అమృతతుల్యమైన స్వరరచన ఈ శృంగార భక్తిగీతానికి అజరామరత్వం కల్పించింది. పాట పాడింది పి. లీలే అయినా అణువణువునా ఘంటసాలవారే గోచరిస్తారు. తెలుగు భాషతో పరిచయంలేని మలయాళ గాయని పి.లీల చేత  ప్రతీ పదాన్ని అంత భావయుక్తంగా, సుస్పష్టంగా పలికించడంలో ఘంటసాలవారి కృషి, ప్రతిభ గోచరిస్తుంది. శాస్త్రీయ రాగాలను లలితగీతాలుగా మలచినప్పుడు ఏ మాటను ఎలా పలకాలో, గమకాలను ఎంతవరకు ఉపయోగించాలో, ఆ రాగభావాన్ని ఎంత సున్నితంగా, శ్రావ్యంగా ప్రయోగించాలనే విషయంలో ఘంటసాలవారిని మించిన సంగీత దర్శకుడు మరొకరు లేరంటే అది అతిశయోక్తి కాదు.

చక్రవాక రాగంలో చేసిన ఈ 'ఏడుకొండలవాడా వెంకట రమణ' పాటలో నేపధ్య సంగీతానికి వీణ, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, తబలా వంటి వాద్యాలను మాత్రమే ఘంటసాల మాస్టారు ఉపయోగించారు.


ఏడుకొండలవాడి సాక్షిగా ఈ పాట ఏనాటికీ ఆపాతమధురమే. అపురూప, అపూర్వగీతమే. దృశ్యపరంగా కాకుండా కేవలం  పాటగా విన్నప్పుడు ఇదొక భక్తి పరమైన ఏకాంతసేవ గీతంగా తోస్తుంది.

ముందు ఈ పాటను జిక్కితో పాడించారు. అది గ్రామఫోన్ రికార్డ్ గా కూడా వచ్చింది. తరువాత,  ఎందుకనో పాట అనుకున్నంత ఎఫెక్ట్ తో రాలేదన్న భావన స్వరకర్త, దర్శక నిర్మాతలకు కలిగి మరల ఆ పాటను లీలతో పాడించి షూటింగ్ ముగించారు. పాట గొప్ప హిట్టయింది. 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట నిత్యనూతనంగా సజీవరాగంగా సంగీతాభిమానులకు పరవశత్వం కలిగిస్తూనే ఉంది.

ఘంటసాలవారి  శాస్త్రీయ సంగీత ప్రతిభకు ఒక మచ్చు తునక ఈ సుశ్రావ్య గీతం.

సినీమా లో ఈ పాటను జి.వరలక్ష్మి, ఎన్.టి.రామారావు, డా.శివరామకృష్ణయ్య, బాలకృష్ణల మీద చిత్రీకరించారు. 

ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు, సావిత్రి, జోగారావు, సూర్యకాంతం, పుష్పలత, దొరస్వామి, డా.శివరామకృష్ణయ్య, మొదలగువారు నటించిన ఈ చిత్రం బాలలను, పెద్దలను కూడా అలరించిన చక్కని కుటుంబగాధా చిత్రం. డైరక్టర్ ఎల్.వి.ప్రసాద్. నాగిరెడ్డి- చక్రపాణి లు నిర్మాతలు. ఇది ఒక విజయావారి చిత్రం.

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" కార్యక్రమంలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్




No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...