Saturday 4 November 2023

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" 2వ భాగం - పలుక రాదటే చిలుకా - షావుకారు

                                                                         


"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

  మొదటిభాగం ఇక్కడ 

 






                                                                      

నాకు ఊహ తెలుస్తున్న తొలిరోజులలో నేను విన్నట్లుగా గుర్తుండిపోయిన మొదటి పాట "పలుకు రాదటే చిలకా".

నాగావళీ ఏటి తరంగాలపై నుండి తేలియాడుతూ వచ్చి నా చెవులకు సోకిన పాట. ఆ పాట ఎవరు పాడారో, ఎక్కడినుండి వినిపిస్తోందో నాకు తెలిసే వయసుకాదు. అంత చిన్న వయసులో ఆ పాట నాకు గుర్తుండి పోవడానికి కారణం మేమున్న ఇంటికి బయట చుట్టుపక్కల బోలెడన్ని బాదంచెట్లు. చెట్లనిండా పచ్చని, ఎర్రని బాదంకాయలు, పళ్ళతో వాటిని తినడానికి వచ్చే ఆకుపచ్చని ఎర్రముక్కుల  రామచిలకల కలకలారావాలతో ఆ చెట్లు పచ్చగా కళకళలాడుతూ చూడడానికి చాలా సంతోషంగా ఉండేది. చిలకలు ఎప్పుడూ ఏ కాయను, పండును పూర్తిగా తినవు. సగం సగం కొరికి పోస్తాయి . అలా ఆ బాదంకాయలు కొరికి పారేయడం చూసి ఆ చిలకలకు   పాపం బాదం పలుకులు ఒల్చుకు తినడం రావట్లేదని నాకు విచారంగా ఉండేది.  అటువంటి వాతావరణంలో అశరీరవాణిగా  తరచూ వినిపించే ' పలుకరాదటే చిలకా' పాట 'పలుకు రాదటే చిలకా' గా నా కోసమే పాడుతున్న భావన కలిగేది.

ఎన్నో మధుర భావాలతో మనసుకు హత్తుకుపోయేలా ఆకర్షించి సదా మదిలో మెదిలే పాట "పలుకరాదటే చిలుకా".  ఆ పాట పాడినవారి పేరుఘంటసాల అని ఆ పాట "షావుకారు"అనే సినిమాలో వినిపిస్తుందని నాకు తెలియడానికి చాలా ఏళ్ళే పట్టింది. అదే పాటను మరికొన్నేళ్ళ తర్వాత అదే ఘంటసాలవారింట్లోని గ్రామఫోన్ లోనూ, ఓ పాతకాలపు రేడియోలోను రోజూ వినడం జరిగేది. 

అయితే, శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఈ పాటలో విశ్లేషించడానికి ఎన్నో విషయాలు దాగివున్నాయనే సంగతి అర్ధమవడానికి చాలా కాలమే పట్టింది.

నాగిరెడ్డి-చక్రపాణి ల విజయావారి మొదటి చిత్రం షావుకారు. హీరోగా ఎన్.టి.రామారావు కు మొదటి సినిమా షావుకారు. హీరోయిన్ గా శంకరమంచి జానకికి మొదటి సినీమా షావుకారు. విజయావారి ఆస్థాన సంగీత దర్శకునిగా ఘంటసాలవారికి మొదటి సినీమా షావుకారు. షావుకారు సినీమాలో కధానాయక పాత్రధారి నోటమ్మట వినిపించే మొదటి పాట 'పలుకరాదటే చిలుకా'. ఈ పాటతోనే ఎన్.టి.రామారావు, ఘంటసాలల సినీజీవిత ప్రస్థానం ప్రారంభమై రెండు దశాబ్దాలపాటు నిరాటంకంగా విరాజిల్లింది. షావుకారు సినీమాలో ఆ చిన్నారి రామచిలక (జానకి)  చెప్పడానికి మొహమాట పడిన ఆ తేట తెనుగు మాటలను చూద్దాము.

విజయావారి సినీమాలకు పాటల రచయితగా సముద్రాల సీనియర్ గారు పనిచేసిన ఏకైక చిత్రం షావుకారు. ఈ సినీమాలో వచ్చే వైవిధ్యభరితమైన పాటలన్నీ వారి కలం నుండి వెలువడినవే. 'పలుకరాదటే చిలుకా' పాటలోని మాటలన్నీ చాలా సరళంగా రామచిలుక పలుకుల్లాగే ముద్దులొలుకుతూంటాయి.

సన్నివేశపరంగా యౌవ్వనంలోకి వచ్చాక తొలిసారిగా కథానాయిక, కథానాయకుని ఇంటికి వస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు బాగా తెలిసినవాళ్ళే. పక్కపక్క ఇళ్ళవారే. సమయం కలిసొస్తే ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలు కావాలని పెద్దలంతా నిర్ణయించుకున్నదే. అయినా పట్నంలో చదువుతున్న ఆ యువకుడిని చూసి ధైర్యంగా, ముఖాముఖిని మాట్లాడేందుకు ఆ గ్రామీణ యువతి సంకోచపడుతుంది. అది ఆ కాలపు పెద్దల పెంపకపు తీరు. పక్కనున్న పనివాడిని అడ్డుపెట్టుకొని తను చెప్పదల్చుకున్నది మొగమాటంతో ఆ యువకుడికి తెలియజేస్తుంది. పట్నంలోని నాగరికతకు అలవాటు పడిన కధానాయకుడు ధైర్యంగా మాట్లాడమంటునే తన మనసులోని భావాలను పంజరంలో ఉన్న చిలుకను ఉద్దేశించి చెపుతున్నట్లుగా తన పక్కింటి పిల్లకు పాట రూపంలో చెపుతాడు.

పాట పల్లవిలో "సముఖములో రాయబార మెందులకే పలుకరాదటే చిలుకా" అంటాడు.
ఎదురెదురుగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకోకుండా ఇతరుల ప్రమేయమెందుకు? 

చరణంలో - ఎరుగని వాళ్ళము కాదు, మొగమెరుగని వాళ్ళం అంతకన్నా కాదు. అలాటప్పడు ధైర్యంగా సరదాగా మాట్లాడుకుంటే తప్పేమిటి ? ఇక్కడ ఆచార్యులవారు 'పలికిన నేరమటే?
పలుకాడగ నేరవటే' అని రెండు మాటలు ఉపయోగించారు 'నేరమటే', 'నేరవటే' అని. నేరమటే అంటే తప్పా? ద్రోహమా అనే అర్ధంలో. ' నేరవటే' అంటే నేర్చుకోలేదా, తెలియదా అని. ఈ రెండు మాటలు చాలా సింపిల్ గా వుంటాయి. 'ఇరుగుపొరుగు వారలకీ అరమరికలు తగునటనే' అని మరో మాట. పక్కపక్క ఇళ్ళలో స్నేహంగా, సన్నిహితంగా  ఉంటూ  అక్కరలేని అడ్డుగోడలు అవసరమా అని ప్రశ్నిస్తాడు.

రెండో చరణంలో - మనసులో తొణికే మమకారాన్ని , కళ్ళలో మెరిసే నయగారాన్ని, ప్రేమను  సూటిగా, ఏ అడ్డులు లేకుండా సహజంగా పలుకమంటాడు.

గొప్ప కవితాధోరణి, సమాసభూయిష్టమైన పదజాలమేదీ లేకుండా స్పష్టమైన, సున్నితమైన చిన్న చిన్న మాటలతోనే అందరికీ అర్ధమయే భాషలో ఈ పాటను సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసారు.

ఇక షావుకారు సినీమా కు సంగీత దర్శకత్వం చేపట్టిన ఘంటసాలవారు 'పలుకరాదటే చిలుకా' పాటను స్వరపర్చడానికి కళ్యాణి రాగాన్ని ఎన్నుకున్నారు. కళ్యాణి సంపూర్ణరాగం.  అంటే ఆరోహణ, అవరోహణలలో  'సరిగమపదని' ఏడు స్వరాలు పలుకుతాయి.  కర్ణాటక సంగీతంలో కళ్యాణి 65వ మేళకర్త మేచకల్యాణి జన్యం. దీనినే హిందుస్థానీ సంగీత శైలిలో 'యమన్' అంటారు. ఈ కళ్యాణి, యమన్ రాగాలలో లెఖ్ఖలేనన్ని సినీమా గీతాలు రూపొందించబడ్డాయి.

ఘంటసాల మాస్టారికి కళ్యాణి రాగం చాలా ఇష్టమైన రాగమని సంగీతాభిమానులు అనుకోవడం కద్దు. అయితే ఆ విధంగా ఘంటసాలవారు ఎప్పుడూ ఎక్కడా ప్రకటించలేదు. భీంప్లాస్, సింధుభైరవి, దేశ్  వంటి రాగాలలో కూడా అధిక సంఖ్యాకమైన పాటలు స్వరపర్చారు. కళ్యాణిలో తాను స్వరపర్చిన పాటలతోపాటు ఇతరులు స్వరపర్చిన కళ్యాణి రాగ గీతాలను  తన సొంతం చేసుకొని ఘంటసాలవారు అద్భుతంగా గానం చేయడం వలన సంగీతాభిమానుల దృష్టిలో ఘంటసాలవారికి, కళ్యాణి రాగానికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.

"పలుకరాదటే చిలుకా" పాటలో ఘంటసాలవారు కనపర్చిన రాగ, హావభావాలు, గంభీరమైన తన కంఠస్వరంలో పలికించిన గమకాలు, హాయిగొలిపే ఆలాపనలు అనితరసాధ్యం అంటే అది అతిశయోక్తి కానేకాదు. ఈ పాటలో పియోనా , హేమండ్ ఆర్గన్ , ట్రంపెట్స్ , వైలిన్స్ , ఫ్లూట్ ,క్లారినెట్ వంటి వాద్యాలు చాలా సౌమ్యంగా వినిపిస్తాయి. 

ఇదే పాటను ఈ సినిమా లో మరోసారి 'తెలుపవేలనే చిలుకా తెలుపవేలనే' అని రావు బాలసరస్వతి ముగ్ధమనోహరంగా ఆలపిస్తారు. ఈ రెండు పాటల మధ్య వాద్యగోష్టిలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. రెండో పాటలో జలతరంగ్ వంటి వాద్యాలు కూడా వినిపిస్తాయి.

ఈ పాటలో పది పన్నెండుసార్లు 'ట' కారాక్షరంతో కూడిన మాటల ప్రయోగం జరిగింది. అలాగే మరో దశాబ్దంన్నర తర్వాత వచ్చిన 'రేపంటి రూపం కంటి' పాటలో దాదాపు 55 'ట' కారపు పదాలు వినిపిస్తాయి.

"పలుకరాదటే చిలుకా"  పాటనాటికి ఎన్టీఆర్, జానకి ఇద్దరూ కొత్తవారే. ఇద్దరూ ఏ భేషజము ప్రదర్శించకుండా చాలా సహజంగా నటించారు. జానకి అయితే ఆనాటి గ్రామీణ యువతులలో ఉండే అమాయకత్వాన్ని, వేషభాషలను చక్కగా కనపర్చారు.  కధానాయకుడు ఎన్ టి రామారావు ఎంతో అందంగా, ఏ కృత్రిమత్వం లేకుండా సహజంగా ముఖంలోని హావభావాలను ప్రకటించారు.

ఘంటసాలవారి సంగీత ప్రతిభకు మచ్చుతునక 'పలుకరాదటే చిలుకా' పాట.

మదిలో మెదిలే మరో సజీవ రాగంతో
మళ్ళీ వచ్చే ఆదివారం...

🌺🙏ప్రణవ స్వరాట్🙏🌺






No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...