Saturday, 25 November 2023

సదా మదిలో మెదిలే సజీవరాగం - 5వ భాగం - కుడియెడమైతే - దేవదాసు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నాలుగవ భాగం ఇక్కడ 

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదక, మునకే సుఖమనుకోవోయ్

మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ
కొండలే రగిలే వడగాలి.... నీ సిగలో పూవేలోయ్?

చందమామ మసకేసి పోయె
ముందుగా కబురేలోయ్?
లాహిరి నడి సంద్రములోన 
లంగరుతో పనిలేదోయ్  


గాయకుడిగా ఘంటసాలవారికి అజరామరమైన కీర్తిని సంపాదించి పెట్టిన  ఈ పాట అర్ధం గురించి పలువురు పలు రకాలుగా విమర్శించడం జరిగింది, విశ్లేషించడమూ జరిగింది.

"త్రాగుబోతు వాడి మాటకీ పాటకి అర్ధమేముంటుంది" అని అన్నవారే,  ఆలోచించే జిజ్ఞాసాపరులకు తగిన వేదాంతార్ధం ఈ పాటలో లభిస్తుందని కూడా శెలవిచ్చారు.

మనిషి జన్మ దుఃఖం, మనిషి మరణం దుఃఖం ......అనే వేదాంత సూక్తిని గుర్తు చేసే పాట 'కుడి ఎడమైతే'.

సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసిన ఈ పాట గురించి ఆయనే తర్వాత ఎప్పుడో ఎవరికో చెప్పినట్లు ఆయన కుమారుడు,  సినీగీత రచయిత సముద్రాల రామానుజాచార్యులు (సముద్రాల జూ.) చెప్పిన అర్ధం యొక్క సారాంశం ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

" కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది. అది జీవితంలో  సహజం. అంతమాత్రాన ఓడిపోయాననుకోకు.

పార్వతి తనదే అనుకున్నాడు దేవదాసు. కానీ, ఆమె అతనికి దక్కలేదు. ఆ బాధను మర్చిపోవడానికి త్రాగుడు ప్రారంభించాడు.  ఇది ఒక సుడిగుండం. అలవాటు పడితే బయటపడడం కష్టం అని తెలిసికూడా ఈ త్రాగుడనే సుడిగుండంలో దూకాడు. ఇప్పుడింక ఎందురీత తెలివితక్కువ. 
ములిగిపోవడమే సుఖం. ఇలా తప్పతాగుతూనే జీవితం ముగించుకో. 

పార్వతి మేడపైనున్న బంగారు బొమ్మ.  నీ చేతికి చిక్కదు. నీవంటే ప్రాణాలిచ్చే చంద్రముఖి నీ నీడలోనే వుంది. కానీ నీ స్థితి ఏమిటి ? కొండల్నే రగిల్చే వడగాలి వీస్తోంది. నీ గుండెలో సుకుమారమైన ప్రాణాలు ఎంతకాలం నిలుస్తాయి. ఎందుకీ ప్రాణాలు ? తప్పతాగి జీవితం చాలించు. చావడానికి నిర్ణయించుకున్నాక ఎవరికీ కబురు చెప్పవలసిన పనిలేదు.

చందమామ లాటి నీ బ్రతుకు మసకేసిపోయింది. నడి సముద్రాన వున్న నావలా వుంది నీ బ్రతుకు, ములిగిపోవడానికి సిధ్ధంగా. ఒడ్డున వుండేవాడికి లంగరు గానీ, నడి సముద్రంలో నీరుపట్టిన నావకు లంగరు ఎందుకు ?

ఇది దేవదాసు మానసిక పరిస్థితి.

దేవదాసు మానసిక స్థితిని ఇంత సింబాలిజంతో పాటను వ్రాసి కవిగా తన సుపీరియారిటిని, సీనియార్టీని నిరూపించుకున్నారు కవివరేణ్యులు సీనియర్ సముద్రాల. కవి ఆవేశాన్ని అర్ధం చేసుకొని పాటను స్వరపర్చారు సి.ఆర్.సుబ్బురామన్ దగ్గర సహాయకులుగా పనిచేసిన విశ్వనాథన్ - రామమూర్తిలు. (సి.ఆర్.సుబ్బురామన్ ఆకస్మిక మరణంతో దేవదాసు రెండు పాటలు - 'జగమేమాయ', 'కుడిఎడమైతే'  పాటలను విశ్వనాథన్ - రామమూర్తిల చేత చేయించారట. ఈ రెండు పాటలను మరింత ఆ‌ర్తితో, భావోద్వేగంతో  అనుభవించి  పాడారు ఘంటసాల.

దేవదాసు లోని ' కుడి ఎడమైతే' పాట,  గత వారం ఈ శీర్షిక లోని ' ఆ మనసులోనా'  పాట  రెండు కూడా కళ్యాణి రాగంలో మలచబడినవే. రాగం ఒకటే అయినా ఈ రెండుపాటల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఆ వైవిధ్యానికి కారణం ఘంటసాలవారి గాన ప్రతిభే. తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మించబడిన దేవదాసు లోని పాటలన్నీ ఘంటసాలవారే పాడారు. ఈ ఒక్క సినిమా లోని పాటలతోనే కోట్లాది తమిళులు ఈనాటికీ ఘంటసాలవారి ని గుర్తుపెట్టుకొని ఆ పాటలను నిరంతరం మననం చేసుకుంటూనే ఉన్నారు.

1917 లో శరత్ బాబు (శరత్చంద్ర ఛటర్జీ) వ్రాసిన దేవదాసు బెంగాలీ నవల ఆధారంగా ఇప్పటికీ వివిధ భాషలలో 14 సార్లు దేవదాసు ను సినీమాగా తీసారు. ఇన్నిసార్లు ఇన్ని భాషలుగా రూపొందినా 1953లో అక్కినేని నటించిన తెలుగు దేవదాసే ఉత్తమమైనదని ఆ పాత్రలో తన కంటే అక్కినేని నాగేశ్వరరావు నటనే పరాకాష్ట కు చేరుకున్నదని హిందీ దేవదాసు కధానాయకుడు, సుప్రసిధ్ధ నటుడు దిలీప్ కుమార్ అక్కినేని ని ప్రశంసలతో ముంచెత్తారు.

దేవదాసు చిత్రనిర్మాణ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అహర్నిశలు కష్టపడి పనిచేసారు. ముఖ్యంగా అక్కినేని తాగుబోతుగా నటించడానికి కావలసిన మూడ్ రావడానికి ఆ సీన్లు అర్ధరాత్రి సమయంలో నిద్రకు కళ్ళు బరువెక్కి మూతలు పడుతూండగా ఆ నిద్రమత్తు కళ్ళతోనే షూటింగ్ జరిపేవాళ్ళమని అందుకే ఆ సీన్లలో  తన ముఖంలో ఆ త్రాగుబోతు లక్షణాలు కనపడడానికి దోహదపడ్డాయని అక్కినేని తరచూ తన ఇంటర్వ్యూలలో చెప్పేవారు.

తెలుగునాట 'దేవదాసు' ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ సినీమా వచ్చిన కొత్తల్లో ఊరూవాడా ఎక్కడ చూసినా ఘంటసాల దేవదాసు పాటలే. ప్రేమలో విఫలమైన ప్రతీ భగ్నప్రేమికుడు అక్కినేని లాగే పైజమా జుబ్బాలతో, చింపిరిజుట్టు, మాసిన గెడ్డం, చేతిలో సిగరెట్ తో వీధికి ఒకరు చొప్పున లైట్ స్థంభాలక్రింద ఈ పాటలు పాడుతూ దర్శనమిచ్చేవారు.

కళ్యాణి రాగంలో చేయబడిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' పాటలో చాలా తక్కువ వాద్యగోష్టి వినిపిస్తుంది. తబలా, క్లారినెట్, వైలిన్స్ మాత్రమే ప్రధానంగా వినపడే వాద్యాలు. ఈ పాటలో  వినవచ్చే పదాలు ఓడిపోలేదోయ్,  సుఖమనుకోవోయ్, చిలకమ్మా, పూలేలోయ్, లంగరుతో పనిలేదోయ్ అనేచోట  వచ్చే సంగతులు, గమకాలు, ఎదురీదకా, కబురేలో  తర్వాత వచ్చే ఆలాపనలు కళ్యాణి రాగ మాధుర్యానికి మచ్చుతునకలు. ఆ రాగ స్వరూపాన్ని అంత నిర్దిష్టంగా రసభావానికి తగినట్లుగా ఆలపించడం ఒక్క ఘంటసాలవారికే సాధ్యం. అలాగే ఈ పాటను సంగీతపరంగా విశ్లేషించాలన్నా సంగీతం బాగా తెలిసినవారికే సాధ్యం. నాలాటి వాళ్ళు ఆయా గమకాలను, సంగతులను విని ఆనందించగలరే తప్ప వివరణాత్మక విశ్లేష చేయలేరు.

ఒక గాయకుడి ప్రతిభను మరో గాయకుడు లేదా గాయని మాత్రమే చక్కగా చెప్పగలరు. దేవదాసు సినీమాలోని 'కుడిఎడమైతే' పాట విన్నాక ఘంటసాలవారి తీవ్ర అభిమానిగా మారిపోయానని , అలాటి  గొప్ప గాయకుడు మరల పుట్టడని ,అలాటి గాయకునితో కలసి అనేక పాటలు పాడే భాగ్యం తనకు కలిగిందని గాయని ఎల్.ఆర్.ఈశ్వరి ఎంతో భావోద్వేగాలతో మాట్లాడడం నేను విన్నాను.

ఎన్ని యుగాలైనా  'కుడిఎడమైతే పొరపాటు లేదోయ్'  పాట, 'దేవదాసు' లోని ఇతర పాటలు, వాటి ఆవిర్భావానికి కారణభూతులైన సీనియర్ సముద్రాల, సి.ఆర్.సుబ్బురామన్,  విశ్వనాధన్ రామమూర్తి, ఘంటసాల, అక్కినేని, సావిత్రి,  వేదాంతం రాఘవయ్య, డి.ఎల్.నారాయణలు తెలుగువారి గుండెలలో సజీవంగా నిల్చిపోయేవుంటారు. 

మదిలో సదా మెదిలే ఘంటసాలవారి మరో సజీవ రాగంతో మళ్ళీ వచ్చే ఆదివారం ...


💐🙏💐ప్రణవ స్వరాట్💐🙏💐



No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...