Saturday 6 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 24వ భాగం - శ్రీ నగజా తనయం, సహృదయం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైమూడవ భాగం ఇక్కడ

24వ సజీవరాగం -   

"శ్రీ నగజా తనయం, సహృదయం!
చింతయామిసదయం
త్రిజగన్మహోదయం  - శ్రీ నగజా తనయం!

"శ్రీరామ భక్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కధ! నలభై రోజులనుంచి చెప్పిన కధ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తున్నది, నాయనా! కాస్తా పాలు,మిరియాలు ఏమైనా...!"

" చిత్తం, సిధ్ధం!"

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచి
విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ
ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి 
అతడెవరయ్యా అంటే ---

రఘురాముడు! రమణీయ, వినీల ఘనశ్యాముడు! - 2

వాడు, నెలరేడు, సరిజోడు, మొనగాడు!
వాని కనులు మగమీల నేలురా!
వాని నగవు రతనాలజాలురా! - 2
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు మరో మరుడు, మనోహరుడు! రఘురాముడు!

స్వరకల్పనలు, వైయొలిన్, మృదంగం 
తనీ ఆవర్తనాలు -- రఘురాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడూ....

శభాష్... శభాష్ !

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున శ్రీరామచంద్రమూర్తిని
అంతఃపురగవాక్షం నుండి సీతాదేవి
ఓరకంటజూచినదై చెంగటనున్న
చెలికత్తెతో ---

ఎంత సొగసుగాడే,  - 2
మనసింతలోనె
దోచినాడె!
మోము కలువరేడే - నా నోము ఫలము వీడే, శ్యామలాభిరాముని చూడగ
నా మది వివశమాయె నేడే - ఎంత సొగసుగాడే!

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా, అక్కడ స్వయంవర సభామండపంలో
జనకమహీపతి సభాసదులను జూచి

అనియెనిట్లు , ఓ యనఘులార!
నా అనుగుపుత్రి సీత వినయాధిక
సద్గుణ వ్రాత, ముఖ విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి
జోదును నేడు మక్కువ మీరగ వరించి
మల్లెల మాలవైచి పెండ్లాడు!

అని ఈ ప్రకారంబుగ జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడే చల్లబడిపోయారట! మహావీరుడైన రావణాసురుడు కూడా "హా! ఇది నా ఆరాధ్యదైవమగు శివుని చాపము , దీనిని స్పృజించుటయే మహా పాపము" అని అనుకొనినవాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున --

ఇనకుల తిలకుడు  నిలకడగల  క్రొక్కారు మెరుపు వలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని 
ఆశీర్వాదము తలదాల్చి 
సదమల మదగజ గమనముతోడ
స్వయంవర వేదిక చెంత
మదనవిరోధి శరాసనమును తన
కరమున బూనినయంత
ఫెళ్ళుమనె విల్లు , గంటలు ఘల్లుమనె
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము
ఒక నిమేషమ్మునందె నయము
జయమును ,భయము , విస్మయము
గదుర! ..శ్రీమద్రమారమణ గోవిందో...హరి
గోవిందో... హరి!

భక్తులందరూ చాలా నిద్రావస్థలో వున్నట్టుగావుంది,  మరొక్కసారి ..
జై! శ్రీమద్రమారమణ గోవిందో...హరి గోవిందో...హరి...

భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి  శివధనుర్భంగం
గావించాడు. అంతట

భూతలనాధుడు రాముడు
ప్రీతుండై  పెండ్లియాడె ఫృథుగుణమణి
సంఘాతన్ భాగ్యోపేతన్ , సీతన్ - 2

శ్రీమద్రమారమణ గోవిందో... హరి...

మన తెలుగువారి ప్రాచీన కళా ప్రక్రియలలో ముఖ్యమైనది హరికథ ఒకటి. సంగీత, సాహిత్య సమ్మిళితమైన హరికథను అనేక పాత సినీమాలలో సందర్భోచితంగా ప్రయోగించడం జరిగింది. అలాటివాటిలో తలమానికంగా నిలిచేది వాగ్దానం సినీమా కోసం ఘంటసాల భాగవతార్ గారు చెప్పిన సీతాకళ్యాణ సత్కధ.

హరికథ అని చెప్పగానే అందరికీ వెంటనే స్ఫురించే పేరు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. హరికథా పితామహుడు. ఆట పాటల మేటి.  బహుభాషాకోవిదుడు. ప్రవీణుడు. విజయనగరంలోని మహారాజా సంగీత కళాశాలకు ప్రప్రథమ ప్రిన్సిపాల్. వారి హయాంలో హరికథ మూడుపువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లింది. విజయనగర చుట్టుప్రక్కల ప్రాంతమంతా హరిదాసులకు నిలయమయింది. నారాయణదాసు గారి శిష్య, ప్రశిష్యులెందరో వందల, వేల సంఖ్యలో దేశమంతా వ్యాపించారు. దాసుగారి శిష్యులమని చెప్పుకోవడమే ఘనతగా భావించేవారు. నారాయణదాసుగారి కాలంలో పుట్టకపోయినా, వారిని చూడకపోయినా వారి శిష్యులమని, శిష్య ప్రశిష్యులమని  చెప్పుకుటూ చెలామణి అయే హరిదాసులు ఈనాటికీ ఉన్నారు. రాగస్ఫూర్తికి, రసస్ఫూర్తికి ప్రాధాన్యత నిస్తూ నారాయణదాసుగారు అనేక హరికథలు రచించి గానం చేశారు. 

విజయనగరం సాంస్కృతిక మట్టి వాసనను అనుభవించిన ఉద్దండులు - కవివరేణ్యుడు శ్రీశ్రీ, మహాగాయకుడు, స్వయంగా స్వరకర్త అయిన ఘంటసాల సహాయ సహకారాలతో పెండ్యాల నాగేశ్వరరావుగారి ఆపాతమధురమైన ఆరున్నర నిముషాల, అత్యద్భుత హరికథ వాగ్దానం చిత్రం ద్వారా తెలుగువారి సొంతమయింది. రోజుల తరబడి ఎన్నో గంటలసేపు జరిగే సీతాకళ్యాణ గాధను కేవలం ఆరున్నర నిముషాలలో చెప్పడమంటే సామాన్యమైన విషయం కాదు.  హరికథ ప్రక్రియ పట్ల మంచి అవగాహన, అందులోని సారాన్ని క్షుణంగా అర్ధం చేసుకున్నవారే  దానికి పరిపూర్ణంగా న్యాయం చేకూర్చగలరు. అందుకే వాగ్దానం నిర్మాత, దర్శకుడు, రచయిత అయిన ఆత్రేయ ఈ హరికథను రూపొందించే బాధ్యతను శ్రీశ్రీగారికి అప్పగించారు. సంప్రదాయ సంగీత రీతులలో నిష్ణాతుడైన పెండ్యాలగారి స్వర రచనలో ఈ హరికథ అజరామరమయింది. మరి అలాటి జనరంజకమైన హరికధను గానం చేయడానికి ఆనాడు ఘంటసాలవారు తప్ప మరో గాయకుడు లేరనేది నిర్వివాదాంశం. ఆ గురుతర బాధ్యతను ఘంటసాల అనితరసాధ్యంగా నిర్వహించారు. నారాయణదాసుగారి శిష్యులెందరినో ఎరిగి వారి ద్వారా ఎన్నో కథలను విని హరికథ మట్టులను క్షుణంగా ఆకళింపుజేసుకున్న ఘంటసాల ఈ సినీమాలోని హరికథకు ప్రాణప్రతిష్ట చేశారు. సంప్రదాయబధ్ధమైన గానం, మాటల విరుపులు, నడక, వివిధ రసాల పోషణ ఘంటసాలవారి ఈ హరికథాగానంలో ద్యోతకమవుతాయి.

ఈ హరికథ హాస్యరస ప్రధానంగా చిత్రీకరించబడింది. తెరవెనుక ఘంటసాలవారి గానానికి తెరమీద హరిదాసుగా  రేలంగి జీవంపోసారు. హరిదాసుగారి భార్య, పుత్రులే పక్కవాద్యగాళ్ళు. భార్యగా సూర్యకాంతం వైయొలిన్ తో, కొడుకు పద్మనాభం మృదంగంతో సన్నివేశానికి కావలసిన హాస్యాన్ని పుష్కలంగా పండించారు. ఈ హరికథలో వినవచ్చే వైలిన్ సోలోలు ప్రముఖ సినీ వైయొలినిస్ట్ శ్రీ హరి అచ్యుతరామశాస్త్రిగారు (ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీ హరి నాగభూషణంగారి తనయుడు) వాయించారు.

హరికథ పామరజనాలను ఆకర్షించే ప్రక్రియ. అందువల్ల సందర్భానుసారం అనేక పిట్టకధలను జోడించి శ్రోతలకు హుషారు కలిగిస్తూంటారు. ఈ కధ ప్రారంభంలో  "..... నలభైరోజుల నుంచి చెప్పిన కధ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను...." అని చెప్పించడం ద్వారా ఆ హరిదాసుగారి ప్రతిభ, కీర్తి శ్రోతలకు చెప్పక చెపుతూ దాసుగారి కీర్తికి భంగం కలగకుండా "మిరియాల పాలు" కోసం గుర్తు చేయడం.....  " చిత్తం! సిధ్ధం" (ఈ డైలాగ్ సంగీత దర్శకుడు పెండ్యాలగారిది) అంటూ పాల గ్లాసు అందించడం; "నిద్రావస్థలో ఉన్న శ్రోతలచేత గోవింద నామ స్మరణ చేయించడం వంటి డైలాగ్స్ చెప్పడంలో హరికథా సరళి, ఘంటసాలవారిలోని  రేలంగి (హాస్యనటుడు) మనకు కనిపిస్తాయి.

కథ మధ్యలో తనకూ సంగీతజ్ఞానం ఉందని నిరూపించేందుకు  దాసుగారు చేసిన స్వరకల్పనలు, వాద్యాల ముక్తాయింపులు, ఇవన్నీ హరికథాగానంలోని భాగాలే. అలాగే హరికథలోని నృత్యగమనం, నడక కూడా  "సదమల మదగజ గమనము తోడ..." అనేప్పుడు దాసుగారి నృత్యం మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. హాస్య, శృంగార, ఆశ్చర్యరసాలన్నింటినీ ఘంటసాలగారు  ఈ సంక్షిప్త సీతాకళ్యాణ సత్కథలో మేళవించి శ్రోతలను పరవశులను చేశారు.

ఘంటసాలవారిని మించిన మహాగాయకులెందరో వుండవచ్చుగాక! (sic) కానీ వారెవరిలోని లేని గాత్రమాధుర్యం సౌలభ్యం, భావ ప్రకటనలో సహజత్వం, మాట స్పష్టత మాత్రం ఒక్క ఘంటసాలగారిలో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఘంటసాలవారి ఈ హరికథ 63 సంవత్సరాల తర్వాత కూడా అంత నిత్యనూతనంగానే వుంది.

సినీమా లో జరిగే సన్నివేశానికి బలంచేకూరుస్తూ ఈ హరికథ సాగడం ఒక విశేషం. ఈ సన్నివేశంలో సినీమాలోని ప్రముఖ నటులంతా --- అక్కినేని, కృష్ణకుమారి, చలం, గుమ్మడి, రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం, మొదలగువారంతా కనిపిస్తారు.

సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ బాబు (శరత్చంద్ర ఛటర్జీ) వ్రాసిన "వాగ్దత్త" బెంగాలీ నవల ఆధారంగా మనసుకవి ఆత్రేయ సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం "వాగ్దానం".

సంగీత దర్శకుడు పెండ్యాల గారు ఈ హరికథను స్వరపర్చడానికి పూర్తిగా కర్నాటక రాగాలనే ఎన్నుకున్నారు . కానడ, శంకరాభరణం, మోహన, ధన్యాసి, కేదారగౌళ, కళ్యాణి రాగాలు ఈ హరికథలో రసస్ఫూర్తితో వినిపిస్తాయి.

 ఈ హరికథా గానంలోని విశిష్టత, రసాలు, సొగసులు అనుభవైకవేద్యం, మాటలకందనివి.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

2 comments:

  1. చాలా బాగుంది వ్యాసం. బాగా రాశావు పెద్దన్నయ్యా !!

    ReplyDelete
  2. చాలా అద్భుతంగా వ్రాశారు. అభినందనలు

    ReplyDelete

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...