Saturday 30 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 23వ భాగం - కలకానిది నిజమైనదీ బ్రతుకూ...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైరెండవ భాగం ఇక్కడ

23వ సజీవరాగం -   


"కలకానిది నిజమైనదీ బ్రతుకూ కన్నీటి
ధారలలోనే బలి చేయకూ..."

కాపి రాగం(కర్నాటక శైలి) 
పాట సాహిత్యం : శ్రీశ్రీ
సంగీతం : పెండ్యాల
గానం ఘంటసాల

" కలకానిది నిజమైనది బ్రతుకు
కన్నీటి ధారలలోనే బలిచేయకు

గాలివీచి పూవుల తీగ నేలవాలి పోగా
జాలివీడి యటులే దాని వదిలి వైతువా
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా

అలముకున్న చీకటిలోనే అలమటించనేల 
కలతలకే లొంగిపోయి కలవరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో

అగాధమౌ జలనిధిలోన అణిముత్యమున్నటులే శోకాల
మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే
ధీరగుణం !! కలకానిది !!

బ్రతుకంటే కొన్ని క్షణాలలో చెదరిపోయే కలకాదు. మనిషి జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితాన్ని మనోదౌర్బల్యంతో కృంగిపోతూ కన్నీళ్ళతో వృధాచేయకూడదు. కలతలకు లొంగిపోకూడదు. మన జీవితంలోని వెలుగునీడలను, కష్టాలను, దుఃఖాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.కష్టాల కడలిలో మునిగిపోతున్నవారికి చేయూతనివ్వాలి. మనిషికి ఏదీ దానంతట అది చిక్కదు. వెతికి, శోధించి, సాధించాలి అదే ధీరుల లక్షణం అని మహాకవి శ్రీశ్రీ గారు ఈ పాట ద్వారా జనాలకు సందేశమిచ్చారు.

"కలకానిది విలువైనది" పాట సన్నివేశ పరంగా శోకభరితమే. కానీ ఆ పాటలో ఆణిముత్యాల వంటి సందేశాలను పొదిగారు శ్రీశ్రీ గారు. వెలుగు నీడలు సినీమా కోసం వ్రాసిన ఈ పాటతో పాటు ఆ సినీమా లోని పాటలన్నీ శ్రీశ్రీ గారే వ్రాసారు. ఈ చిత్ర సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన ట్యూన్ కే శ్రీశ్రీ సాహిత్యం అందించినట్లు తెలుస్తున్నది. 

ఉదాత్త భావన, గాంభీర్యం, శోకం మిళితమైన ఈ పాటను  పెండ్యాల కర్నాటక కాపీ రాగంలో స్వరపర్చినట్లు తెలుస్తున్నది.. కాపి రాగం  22వ మేళకర్త ఖరహరప్రియకు  జన్యరాగం. కాపి ఔఢవ-సంపూర్ణ వక్ర సంచార రాగం. ఈ రాగం ఆరోహణలో ఐదు స్వరాలు , అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. అన్యస్వర ప్రయోగం కూడా ఉన్నందున కాపి భాషాంగరాగంగా కూడా చెపుతారు. ఈ కర్నాటక కాపి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం పీలు. 

సాహిత్య పరంగాను, సంగీతపరంగానూ మనసుకు పట్టిపోయే "కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు" అంటూ ఘంటసాల మాస్టారు అతి గంభీరంగా, గళంలో విషాదాన్ని ధ్వనింపజేస్తూ , ఎంతో భావయుక్తంగా గానం చేశారు. ఘంటసాలవారి తెరవెనుక గానానికి దీటుగా తెరపై కధానాయకుడు అక్కినేని అద్భుతమైన నటనను కనపర్చి ఆ గీతం అజరామరం కావడానికి ఎంతో దోహదం చేశారు.

"వెలుగునీడలు" సినీమాను అన్నపూర్ణ పిక్చర్స్ తమిళంలో "తూయ ఉళ్ళం" పేరుతో తీయగా "కలకానిది" పాట ఒక్కటి మాత్రం తమిళంలో కూడా అక్కినేనికి ఘంటసాలగారి చేతే పాడించారు. ఆ పాట తమిళంలో కూడా మంచి హిట్టయింది. ఈ పాట  రేడియోలోనుండి వినిపించేదవడంతో పాట చిత్రీకరణ నేపధ్యంలో రేడియో స్టేషన్ రికార్డింగ్ రూమ్, గాయకుడిగా హీరో అక్కినేని, వాద్యబృంద నిర్వాహకుడిగా సంగీత దర్శకుడు పెండ్యాల, మరికొంతమంది సినీ సంగీత వాద్యకళాకారులు ఈ పాటలో కనిపిస్తారు. పెండ్యాలగారు అంతకు ముందు ఏడాది వచ్చిన 'శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం' లోని 'శేషశైలావాసా శ్రీ వేంకటేశా" పాటలో కూడా కనిపిస్తారు. ఈ రెండు పాటలు పెండ్యాలగారే స్వరపర్చగా ఘంటసాలవారే ఆలపించడం ఒక విశేషం.

జీవితంమీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిన ఒక యువకుడు "కలకానిది విలువైనది" పాట  విని ఆ పాట ఇచ్చిన స్ఫూర్తితో తన ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నట్లు శ్రీశ్రీగారికి ఉత్తరం వ్రాసినట్లు శ్రీశ్రీగారు తన సినీగీతాల సంకలనంలో తెలియజేశారు. 

అక్కినేని, సావిత్రి, జగ్గయ్య,  ఎస్.వి.రంగారావు, రేలంగి, గిరిజ, సూర్యకాంతం, రాజసులోచన మొదలగువారు నటించారు.

ఆత్రేయ, శ్రీశ్రీల మాటల, పాటల బలంతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణం లో వచ్చిన అన్నపూర్ణా వారి "వెలుగునీడలు" ఘన విజయాన్నే సాధించింది. వెలుగునీడలలో మరెన్నో మంచి పాటలు, సందేశాత్మక గీతాలున్నాఘంటసాల మాస్టారు గళంలోనుండి వచ్చిన "కలకానిది" పాట సంగీతాభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...