Saturday 23 March 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 22వ భాగం - జయత్వదభ్ర విభ్రమధ్భ్రమద్భుజంగ మస్ఫురాత్

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవైయొకటవ భాగం ఇక్కడ

22వ సజీవరాగం -   
"జయత్వదభ్ర విభ్రమధ్భ్రమద్భుజంగ మస్ఫురాత్"
చిత్రం : సీతారామ కల్యాణం

కార్యసాధకుడు సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదేని ఒక దానిని తన ఆయుధంగా ఉపయోగించి తన కార్యాన్ని సాధించుకుంటాడు. ఇక్కడ అసుర లక్షణాలు కలిగిన రావణుడు  తన దర్పంతో, అహంకారంతో నందిని ఎదిరించి పరమేశ్వరుని దర్శించాలనుకుంటాడు. అది సానుకూలపడదని తెలుసుకొని, శివుడున్న కైలాస పర్వతాన్నే పెకిలించి లంకానగరానికి తీసుకుపోవాలనుకుంటాడు. అక్కడ కూడా భంగపాటుకు గురై భక్తిపూర్వకంగా వేడుకుంటాడు. అప్పటికి ఈశ్వరకటాక్షం లభించకపోవడంతో ఆత్మార్పణానికి సిధ్ధపడి తన కడుపును చీల్చుకుని, ప్రేవులను వీణాతంత్రులుగా మార్చి తన వీణా వాదనంతో శివుని మెప్పిస్తాడు. ఈనాటి సజీవరాగం లోని సూక్ష్మ సారాంశం.

భక్తితో, శక్తితో, జ్ఞానంతో ముల్లోకాలను జయించినా, తనలోని అహంకారాన్ని, రాజస లక్షణాలను జయించలేకపోవడంతో రావణబ్రహ్మ రావణాసురుడై తన నాశనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. 

ఈ పరిచయ వాక్యాలు చదివిన తర్వాత ఈ నాటి సజీవరాగం  'సీతారామ కళ్యాణం' అనే అద్భుత కళాఖండంలోనిదనే విషయం మీకు అర్ధమయేవుంటుంది. దాదాపు పదమూడు నిముషాలపాటు ఏకబిగిన ఉత్కంఠతతో సాగే దృశ్యం. ఈ దృశ్యంలో ఒక పాట, ఒక దండకం, ఒక పద్యం, అంతిమంగా హృదయవిదారకమైన వీణావాదనం వినిపిస్తాయి.  ఈ దృశ్యం ఆద్యంతం నందమూరి తారక రామారావు, ఘంటసాల వేంకటేశ్వరరావు అనే  ఇద్దరే ఇద్దరు కళాకారులు  కళ్ళెదుట నిల్చి మనలను దిగ్భ్రాంతులను చేస్తారు. ఇక్కడ  ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం, ఘంటసాల అసమాన్య గానవిద్యా కౌశలం ఈ సినీమాకు, ఈ దృశ్యఖండికలోని సంగీతానికి అజరామరత్వాన్ని చేకూర్చాయి. వీరిరువురితో పాటు ఈ మిని దృశ్య కావ్యానికి ప్రాణప్రతిష్ట చేసినవారు. చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గాలి పెంచలనరసింహారావు, సుప్రసిధ్ధ వైణిక విద్వాంసుడు శ్రీ ఈమని శంకరశాస్త్రి.

ఈ సినీమా సంగీతం గురించి చెప్పుకునే ముందు, సాలూరు రాజేశ్వరరావుగారి గురించి కూడా చెప్పకతప్పదు. ఈ దృశ్యంలో వినవచ్చే పాటలను, మండోదరి కోసం, తర్వాత దృశ్యాలలో వచ్చే  'పాడవే రాగమయీ వీణా' అనే పి.సుశీల పాడిన వీణ పాటను సాలూరివారు స్వరపర్చినట్లు చెప్పుకుంటారు. తర్వాత,  ఆయన అలవాటు ప్రకారం నందమూరి సోదరులతో వచ్చిన విభేదాల వలన  మధ్యలో ఈ చిత్రం నుండి తొలగిపోతే, అంతవరకూ అజ్ఞాతవాసంలో వున్న మొదటి తరం సంగీత దర్శకుడు గాలి పెంచలనరసింహారావుగారిని రప్పించి వారికి అవకాశం కల్పించి మిగిలిన సినిమా సంగీతం పూర్తి చేయించారు.

అధికారదర్పంతో మహేశ్వరుని దర్శించవచ్చిన రావణాసురుని(ఎన్టీఆర్) లోనికి వెళ్ళకుండా నంది (రాజారెడ్డి) అడ్డగించడంతో  కలహానికి దిగిన రావణుడు బలప్రయోగం మంచిదికాదన్న నారదుని (కాంతారావు) సలహాతో "కానరార కైలాసనివాస" అని భక్తి మార్గంలో శివుని ప్రార్ధిస్తాడు. శంకరాభరణం (29వ మేళకర్త - ధీరశంకరాభరణం జన్యం) రాగంలోని శుధ్ధశాస్త్రీయతను పాటిస్తూ స్వరపర్చబడిన ఈ  శివభక్తి గీతాన్ని పరమ శ్రీవైష్ణవాచార్యుడైన సముద్రాల రాఘవాచార్యులు గారు అత్యద్భుతంగా వ్రాయగా ఆ పాటను భక్తిప్రపత్తులతో  పరమ శాంతంగా ఘంటసాల ఆలపించారు. పాట, పాట మధ్యలో వినవచ్చే నేపధ్య సంగీతం మీద కైలాసంలోని శివపార్వతుల (వెంపటి పెద సత్యం) శృంగారలాస్యం మనలను ఆనంద పరవశులనుజేస్తుంది. తన భక్తి పార్వతీపతిని మెప్పించకపోవడంతో రావణుడు క్రోధంతో, ఆవేశపూరితుడై, అహంకారంతో "జయత్వద భ్రవిభ్రమత్ భ్రమద్భుజంగ మస్ఫుర" అనే దండకంతో శివుని స్తుతిస్తూ శివపార్వతుల లాస్యానికి భంగపాటు కలిగిస్తూ రావణుడు కైలాసపర్వతాన్నే పెకలించబోతాడు. ఈ దండకానికి కూర్చిన వరస , దానిని ఘంటసాలగారు  ఆలపించిన విధానం అనితరసాధ్యం, అనన్యసామాన్యం. ఈ దండకం పాడేప్పుడు ఘంటసాలవారి స్పష్టమైన ఉచ్ఛారణ, భావప్రకటన, రసస్ఫూర్తి మాటలకు అతీతం. ఆయన గాన గంధర్వుడని చెప్పడానికి, గాన వైదుష్యానికి ఈ దండకం ఒక్కటే చాలు.

(నిజం చెప్పొద్దూ - నా 78 ఏళ్ళ కాలంలో ఒక్కసారి కూడా నేను ఈ దండకాన్ని తడబడకుండా, స్పష్టంగా పలకలేకపోయాను. నడకే ప్రధానమైన ఈ దండకంలోని భావార్ధం తెలిసిన వారెందరో మరి?)

ఈ సన్నివేశంలో ఎన్.టి.ఆర్ ప్రతీ కదలిక, హావభావాలు, ఆ పాత్ర పట్ల గల పరిపూర్ణ అవగాహన నటుడిగా ఆయనను శిఖరాగ్రాలకు చేర్చాయి.

కైలాస పర్వతం పెకలించేప్పుడు పది తలలతో రావణుడు కనిపించే ఆ ఒక్క సీన్ మాత్రం షూట్ చేయడానికి కెమేరామన్ రవికాంత్ నగాయిచ్ కు దాదాపు ఐదారు గంటల సమయం పట్టిందట.  షూటింగ్ మధ్యలోలంచ్ బ్రేక్ సమయంలో టెక్నీషియన్స్ అందరూ బయటకు వెళ్ళిపోయినా రామారావుగారు మాత్రం అదే పొజిషన్లో ఆ పది తలలతో నిశ్చలంగా అలాగే కూర్చొని ఆ సీన్  షూటింగ్ పూర్తయి కెమేరామన్ ఓకే చెప్పిన తర్వాతగాని ఆ చోటునుండి కదలలేదని, మేకప్  తీయలేదని రవికాంత్ నగాయిచ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఎన్.టి.రామారావుగారికి తన వృత్తిపట్ల గల కమిట్మెంట్, డివోషన్.

రావణవిరచితంగా చెప్పబడే ఈ దండకం తర్వాత ఒక పద్యం. ఈ సందర్భానికి హంసధ్వని, మలయమారుతం, మోహన, సింధుభైరవి రాగాలను సందర్భోచితంగా ప్రయోగించారు.

రావణుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఖిన్నుడై ఆత్మత్యాగానికి సిధ్ధమైన తన పొట్టను చీల్చి అందులోని ప్రేవులను తంత్రులుగాజేసి తన వీణావాదనంతో శివుని మెప్పించాలని ఆశిస్తాడు. ఈ దృశ్యానికిదే పరాకాష్ట. ఈ సన్నివేశ చిత్రీకరణలో డైరెక్టర్ గా ఎన్.టి.రామారావు చూపిన ప్రతిభ, అభిరుచి ఎంతైనా కొనియాడదగ్గది. ఈ సందర్భంలో వీణను వాయించడానికి ఈమని శంకరశాస్తి వంటి సుప్రసిధ్ధ సంగీత విద్వాంసుడిని ఎన్నుకోవడంలో రామారావుగారి ప్రజ్ఞ, విజ్ఞత గోచరమవుతాయి. ఈ రావణ వీణావాదనానికి వేద మంత్రాలు పఠించడానికి ఉపయోగించే స్వరాలనే ప్రయోగించారు. వేద మంత్రాలు ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే మూడు మాత్రమే కాక కింద పంచమం కూడా కలిపి నాలుగు స్వరాలలో గానం చేస్తారని దానికి ప్రత్యేకించి రాగం పేరు ఉండదని గతంలో చెప్పడం జరిగింది. తర్వాత వచ్చే తానాన్ని ముఖారి రాగంలో స్వరపర్చగా ఈమనివారు అమోఘంగా తన వీణా గాన వైదుష్యాన్ని చూపించారు.  ముఖారి రాగం శోకరస ప్రధాన రాగం. ఇది 22వ మేళకర్త ఖరహరప్రియ జన్యరాగం. ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి.

రావణబ్రహ్మ ఆత్మత్యాగం చేసి పరమేశ్వరుని కరుణాకటాక్షాలతో అమోఘ వరాలు పొందడంతో ఈ దృశ్యం పూర్తి అవుతుంది. 

ఈ సినీమాలో ఎన్.టి.రామారావుగారు కానీ, ఘంటసాలగారు కానీ, ప్రశంసలకు, బిరుదులకు అతీతమైన కళా ప్రతిభను కనపర్చి చలనచిత్రసీమలో  లక్షలాది ప్రజల హృదయాలలో సుస్థిరమైన, శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 

శ్రీమద్రామాయణ, మహాభారత, భాగవత కావ్యాలలాగే ఎన్.టి.రామారావుగారి సీతారామకల్యాణం, అందులోని ఘంటసాలవారి పాటలు, పద్యాలు తెలుగువారికి చిరస్మరణీయంగా వుంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చును.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...