Saturday 13 April 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 25వ భాగం - పయనించే మన వలపుల బంగరు నావ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఇరవై నాలుగవ భాగం ఇక్కడ

25వ సజీవరాగం -   

పయనించె మన వలపుల బంగరునావ
శయనించవె హాయిగ జీవనతారా 

నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో చెలరేగే అలల మీద ఊయలలూగే.. పయనించె...

వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు , రవళించె వేణుగీతి
రమ్మని పిలువ ---
పయనించె మన వలపుల ...

చాలా చిన్న పాట, కానీ, చిరకాలం మదిలో మెదిలే మధురాతి మధురమైన పాట. ఈ సినీమా ఎవరికీ తెలియదు. చూసిన గుర్తు చాలామందికి లేదు. అయినా ఈ సినీమా లోని మొత్తం పది పాటల్లో నాలుగు పాటలు - 'నీలి మేఘాలలో‌, ' పయనించె మన వలపుల', ' ముక్కోటి దేవతలు', 'హృదయమా ఓ బేల హృదయమా', ఎప్పుడు, ఎక్కడ విన్నా సరే, వెంటనే ఈ పాటలు "బావామరదళ్ళు' సినీమాలోవి కదా అని ఈనాటికి గుర్తుపట్టి మనసారా, హాయిగా హమ్ చేసుకుంటున్నారు.

'మామా, అల్లుళ్ళు' - మహా ప్రస్థాన కవి శ్రీశ్రీగారు, సమగ్రాంధ్ర సాహిత్య గ్రంథకర్త ఆరుద్రగారు ఈ పాటలకు నిత్యనూతనత్వం, చిరంజీవత్వం కల్పించారు. ఇందులో స్వరకర్త పెండ్యాల, గాయకులు ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకిగార్ల పాత్ర తక్కువేమీ కాదు.

ఈనాడు ఈ పాట సన్నివేశం ఏమిటో నాకు గుర్తులేదు కానీ సినీమాలో రెండుసార్లు వస్తుంది - ఒకటి సంతోషంగా, మరొకటి విషాదంగా. మృదుమధురమైన ఘంటసాల, సుశీల గాత్రాలలో ఈ పాటలోని సంతోషం, దుఃఖం మధ్య గల వైవిధ్యం అనితరసాధ్యం గా వినిపిస్తుంది. ఈ రెండు పాటలూ వెనువెంటనే వినడానికి అందుబాటులో లేవు, ఒక్క విషాద గీతం తప్ప. రెండు పాటల సాహిత్యం, వరస ఒకటే అయినా రసపోషణ, భావ ప్రకటన వేరే వేరే.

నెలబాలుని చిరునవ్వులు, తెలివెన్నెల సోనలు, చెలరేగే అలల మీద ఊగిసలాటలు ... వికసించె విరజాజులు, వెదజల్లుతున్న పరిమళాలు , రవళించె వేణుగీతాలు మనలను రారమ్మని ఆహ్వానిస్తున్నా సన్నివేశపరమైన విషాదాన్ని హృదయం నిండా నింపుకొని శ్రోతల హృదయాలను బరువెక్కించి కంటతడి పెట్టించారు ఘంటసాల, సుశీల.

ఈ సినీమాకు పెండ్యాలగారు అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు.   పెండ్యాలగారు ఈ పాటను ఖరహరప్రియ రాగంలో స్వరపర్చి ఆ రాగ మాధుర్యాన్నంతా పిండి  ఘంటసాలవారి గళం ద్వారా మనకు అందించారు. 

కర్నాటక సంగీతంలోని 72 మేళకర్తలలో ఖరహరప్రియ 22వ మేళకర్త. సప్తస్వరాలు కలిగిన సంపూర్ణరాగం. అత్యంత కరుణారస ప్రధానమైనది.  హిందుస్థానీ సంగీతంలో ఈ రాగానికి సమాంతర రాగం కాపి. పయనించె మన వలపుల పాటకు ఖరహరప్రియ రాగాన్ని ఎన్నుకొని ఆ పాటకు ఎంతో సార్ధకతను చేకూర్చారు పెండ్యాల.  పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఫ్లూట్ , వైలిన్స్ కాంబినేషన్ ఎంతో హృద్యంగా ఉంటుంది. శ్రీశ్రీగారి కవిత్వంలోని సున్నితత్వమంతా పెండ్యాలగారి స్వరకల్పనలో, ఘంటసాల, సుశీల అమృతగానంలో ద్యోతకమవుతుంది.

"బావ మరదళ్ళు" లో బావ రమణమూర్తి అయితే ఒక మరదలు (భార్య కూడా) మాలిని , మరో మరదలు కృష్ణకుమారి. ఈ ముగ్గురి మధ్య సాగే మానసిక సంఘర్షణలు, సమస్యలే ఈ సినీమా ఇతివృత్తం.

ఈ పాట విన్నప్పుడల్లా మరొక మరపురాని సంఘటన కూడా గుర్తుకు వచ్చి  ఆనందంతో పాటు మనసు బరువెక్కుతూంటుంది. 

అది 1985 - 90 ల మధ్య జరిగినది. మా మద్రాస్ తెలుగు అకాడెమీ ఒక ఉగాది సందర్భంగా ఘంటసాలవారికి నివాళిగా సకల గాయక సంగీతోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపింది. ఆనాడు తెలుగు సినిమా రంగంలో ప్రసిధ్ధులైన గాయనీగాయకులంతా పాల్గొని ఘంటసాలవారి పాటలు తలా ఒక పాట పాడారు. వేదిక మద్రాస్ మ్యూజిక్ ఎకాడమీ మెయిన్ ఆడిటోరియం.  ఆడిటోరియం కెపాసిటికి మించి ప్రేక్షకులు రావడంతో ఎసి యూనిట్లు పనిచేయని పరిస్థితి. అంతటి వేడిలో కూడా దాదాపు పది పన్నెండు గంటల భారీ కార్యక్రమాలు ప్రతీ ఏటా నిర్వహించడం మాకు, క్రమం తప్పక వేల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి ఈ ఉగాది ఉత్సవాలు చూసి ఆనందించడం, ఆనవాయితీగా జరిగేదే.

ఘంటసాలవారి నిలువెత్తు కటౌట్ వేదిక మీద కనిపిస్తుండగా ప్రతీ గాయనీ గాయకుడు తమ స్వరార్చనతో ఆ గాన గంధర్వునికి నివాళులు అర్పించారు. ఆ కార్యక్రమంలో ఆఖరు పాటగా ఘంటసాలవారు పాడిన " పయనించే మన వలపుల బంగరునావ"  పాటను ప్రముఖ బహుభాషా గాయకుడు, మా జంట సంస్థల గౌరవ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయిన శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ఘంటసాలవారి గురించి వినయపూర్వకంగా ప్రస్తుతిస్తూ, మాస్టారి పాటలు పాడడంలో తనకు గల సాధకబాధకాలను వివరించి పాట ప్రారంభించారు. పాటలో లీనమైపోయి అద్భుతంగా ఆలపిస్తున్నారు. పాట చివరకు వచ్చేప్పటికి స్టేజ్ మీద ఉన్న ఘంటసాలవారి నిలువెత్తు కటౌట్ క్రమక్రమంగా నీలిమేఘాలలోకి మాయమైపోయింది( సురభి నాటక సంస్థ సాంకేతిక కళాకారుల సౌజన్యంతో).  ఒక్కసారిగా ఆడిటోరియం లోని వేలాది  ప్రేక్షకులంతా బరువెక్కిన హృదయాలతో తమ సీట్లలోంచి లేచి నిలబడి నాన్ స్టాప్ గా కరతాళ ధ్వనులు చేయడం మొదలెట్టారు. బాలుగారికి బ్యాక్ గ్రౌండ్ లో జరిగిన విషయమే తెలియదు. విషయం తెలిసి ఆయన కూడా కన్నీటిపర్యంతమై మౌనంగా నిలబడిపోయారు. 

 మధురమైన ఈ అపురూప సంఘటన నాకెన్నటికీ మరపురాని విషయం.









వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.


ప్రణవ స్వరాట్

2 comments:

  1. మరపురాని మధుర జ్ఞాపకాలతో కూడిన ఈ వ్యాసం చాలా బాగుంది🙏

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.

      Delete

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...