Saturday 24 February 2024

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 18వ భాగం - మది శారదాదేవి మందిరమే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   


ఘంటసాల
మదిలో సదా మెదిలే సజీవరాగం!!
పదిహేడవ భాగం ఇక్కడ

18వ సజీవరాగం - 

"మది శారదాదేవి మందిరమే"

సాహిత్యం : మల్లాది రామకృష్ణ శాస్త్రి 
రాగం - కళ్యాణి 
చిత్రం - జయభేరి
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు


పాట సాహిత్యం - 
ముందుగా ఘంటసాలవారి ఆలాపన &
పల్లవి : 
మది శారదాదేవి మందిరమే - 2
కుదురైన నీమమున కొలిచే వారి
మది శారదాదేవి మందిరమే !

చరణం : పిబిఎస్ :
రాగ భావ మమరే గమకములా - 3

పాణిగ్రాహి :
నాద సాధనలే  దేవికి పూజా - 4

తరళ గానములే హారములౌ - 4

ఘంటసాలవారి స్వరకల్పనలు.... 

తరళ గానములే హారములౌ...

చరణం : ఘంటసాల
వరదాయిని గని గురుతెరిగిన 
మన మది శారదాదేవి మందిరమే

కుదురైన నీమమున కొలిచేవారి 
మది శారదాదేవి మందిరమే....

గత వారం ఘంటసాలవారి గళం నుండి మధురాతి మధుర కళ్యాణి రాగ కింకిణీ స్వనాలు విని పరవశం చెందాము. ఈ వారం కూడా అదే కళ్యాణి రాగాన్ని మరో కోణంలో విని ఆస్వాదిద్దాము. ఒకే రాగం వివిధ రసానుభూతులను శ్రోతలలో ఎలా కలిగిస్తుందో ఈ వారం పాట వింటే తెలుస్తుంది. అదే 1959 లో విడుదలైన "జయభేరి" చిత్రంలోని "మది శారదాదేవి మందిరమే" అనే పాట.

గత వారం కళ్యాణి ఘంటసాల బాణి. ఈ వారం కళ్యాణి పెండ్యాలగారి బాణి. ఆ వాణి చల్లగా,  శ్రావ్యంగా మనసులో ఏవో తెలియని మధుర ప్రణయ రాగాలను రేకెత్తిస్తే, పెండ్యాలగారి వాణి మరోవిధమైన అనుభూతిని, భావావేశాన్ని కలిగిస్తుంది. గత వారపు "రావే నా చెలియా"ను ఘంటసాలవారు ఏక గళ గీతంగా ఆలపిస్తే "మది శారదాదేవి మందిరమే" గీతాన్ని ఆయన, పి.బి. శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహిలతో కలసి గానం చేశారు.  ఈ రెండు పాటలు కళ్యాణి రాగంలో చేసినవే అయినా రెండు పాటల మధ్య ఎంతో వైవిధ్యాన్ని కనపర్చారు ఘంటసాల. అందుకే ఘంటసాల ఆ తరం గాయకులకు , ఈ తరం గాయకులకు మాస్టారు అయ్యారు.

"మది శారదాదేవి మందిరమే" గీతాన్ని సంగీత సాహిత్యాలలో మంచి అభినివేశం, అవగాహన కలిగిన జాను తెనుగు కవి  మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు వ్రాసారు. ఈ పాటలో కళావాణి, వాగ్దేవి అయిన సరస్వతీదేవీ అనుగ్రహం ఎలాటివారికి సిధ్ధిస్తుందో కవి ఒక నిశ్చితాభిప్రాయంగా (statement) తెలియజేసారు. పల్లవి లో కవి "కుదురైన నీమమున కొలిచేవారి మది శారదాదేవి మందిరమే " అంటారు. అంటే నియమనిష్టలతో ఏకాగ్ర చిత్తంతో ఎవరైతే సరస్వతీదేవిని ఉపాసిస్తారో వారి మనస్సు ఒక ఆలయం వలె పవిత్రంగా, నిర్మలంగా వుంటుంది.

మొదటి చరణంలో " రాగభావ మమరే గమకములా నాద సాధనలే దేవికి పూజ" అని వెల్లడించారు. రాగ భావాలతో, గమకయుక్తంగా గాయకులు  భక్తి ప్రపత్తులతో చేసే సాధన, నాదోపాసనే దేవి శార్వాణికి పూజలుగా అమరుతాయి. అమూల్యమైన కృతులను రత్నాల హారములుగా ధరించే ఆ వరప్రదాయిని సరస్వతి దేవిని గుర్తించగలిగితే మన మది శారదాదేవి మందిరమౌతుందని నొక్కి వక్కాణించారు కవి రామకృష్ణ శాస్త్రిగారు. 

కవి భావాన్ని క్షుణంగా అర్ధంచేసుకున్న సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారు ఈ పాటను అత్యద్భుతంగా, ఆపాతమధురంగా కళ్యాణి రాగంలో మలిచారు. ఈ గీతం సన్నివేశం  నిష్టాగరిష్టుడైన ఒక సంగీత గురువుగారి సన్నిధిలో పలువురు విద్యార్ధులు సంగీత సాధన చేస్తూ పాడే గీతం.  ఈ గీతంలో అనేక రసానుభూతులు వ్యక్తమయేలా పెండ్యాలగారు స్వరపర్చారు. విద్యార్ధులకు విద్యపట్ల, గురువులపట్ల గల శ్రధ్ధాసక్తులు,  భయభక్తులు, అదే సమయంలో తమ మధ్య గల పోటీ తత్త్వాన్ని కనపర్చే గుణం అన్నింటినీ మిళితం చేసి "మది శారదాదేవి మందిరమే" గీతాన్ని మలిచారు పెండ్యాల.

ఈ గీతాన్ని ఘంటసాల, పిబి శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి పోటాపోటీగా ఆలపించారు. ఈ పాటకు జీవస్వరం ఘంటసాలవారి గళ మాధుర్యం, గాన ప్రతిభే అంటే అది అతిశయోక్తి కాదు. అందుకు ఈ గీతంలో ఘంటసాలవారి గమకయుక్తమైన కళ్యాణి రాగ ఆలాపనలు, స్వరకల్పనలే సాక్ష్యంగా నిలుస్తాయి. ఘంటసాలవారి సంగీత ప్రతిభకు గీటురాయిగా నిలిచే పాట "మది శారదాదేవి మందిరమే". ఈ పాటలో ఘంటసాలవారి కంఠం ధాటీగా, అన్ని స్థాయిలలో కంచు గంటలా మ్రోగింది.  ఏ పాటైనా సజీవమై నిలవాలంటే  నాదం నాభిస్థానం నుండి పలికించాలనే తమ గురువాక్కును ఘంటసాల  ఈ పాటలోనే కాక జీవితాంతం పాటించారు. సంగీతపరంగా ఈ పాట గొప్పతనం సాధారణ శ్రోత వివరించలేడు. అనిర్వచనీయమైన రసానుభూతిని కలిగించి అజరామరత్వం పొందిన పాట ఇది. ఈ పాటలో పాలుపంచుకున్నవారంతా దిగ్దంతలే. ఒకరిని మించి మరొకరు తమ ఆధిక్యతను చాటుకోవడానికి చేసిన తపన కనిపిస్తుంది.

ఈ పాటలో మాస్టారు, పిబిశ్రీనివాస్ లతో గళం కలపిన రఘునాథే పాణిగ్రాహి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ గాయకుడు. ఈయన కూడా చిన్నతనంలో విజయనగరంలో సంగీతాభ్యాసం చేసినట్లు వినికిడి. తెలుగు బాగా వచ్చును. జయభేరి సినీమాలో ఈ  పాట రికార్డింగ్  కోసం మద్రాసులో ఉన్నప్పుడు తరచూ ఘంటసాలవారింటికి వచ్చేవారు. ఘంటసాలగారు, పాణిగ్రాహిగారు మంచి మైత్రితో మెలిగేవారు. తర్వాత కాలంలో రఘునాధ్ పాణిగ్రాహిగారు ప్రముఖ ఒడిస్సీ నర్తకి సంయుక్తగారిని వివాహం చేసుకొని ఒడిసీ సంగీత, నృత్య కళలకే అంకితమై ప్రసిధ్ధి పొందారు.

" మది శారదాదేవి మందిరమే"  పాటలో శుధ్ధ శాస్త్రీయ సంగీత కచేరీ గీతానికి కావలసిన లక్ష్య, లక్షణాలన్నీ ఉన్నాయి. గీతం ఆరంభంలో వినవచ్చే తంబురా శృతి, పాటకోసం ఉపయోగించిన సితార్, వీణ, ఫ్లూట్ వాద్యాలు;  ఆలాపనలు, స్వర కల్పనలు, లయ, తాళాల కోసం వాడిన మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్ లు ఈ గీతానికి  శుధ్ధ శాస్త్రీయ సంగీత కచేరీ అంతస్తును కలిగించాయి.

తెరపై ఈ గీతాన్ని సంగీతాచార్యుడు వి.నాగయ్యగారి మీద , శిష్యులు అక్కినేని , బృందం మీద చిత్రీకరించారు. "జయభేరి" సినీమాలో పాటలన్నీ ఆణిముత్యాలే. ఇది గొప్ప, ఇది తక్కువ అని చెప్పలేని సంగీతభరిత చిత్రం "జయభేరి". ఈ సినీమా లో ఉన్న 13 పాటలలో తొమ్మిది పాటలను ఘంటసాల మాస్టారే పాడారు. నవరసాలు ప్రతిబింబించేలా గానం చేయడంలో ఘంటసాలవారి విద్వత్ అణువణువునా గోచరమవుతుంది.  ఈ సినీమాలోని ఇతర గీతాలను పి సుశీల, ఎస్ జానకి, మాధవపెద్ది, పిఠాపురం పాడారు. వీరితోపాటు టి.ఎమ్.సౌందరరాజన్, బాలమురళీకృష్ణ, ఎమ్.ఎల్.వసంతకుమారి కూడా  పాడడం ఒక విశేషం.  ఈ పాటలలో అధిక భాగం మల్లాదివారి రచనలే. మిగిలిన వాటిని ఆరుద్ర, శ్రీశ్రీ, నారపురెడ్డి రచించారు.

అక్కినేని, నాగయ్య, గుమ్మడి, అంజలీ దేవి, ఎస్ వి రంగారావు, రాజసులోచన, రేలంగి , రమణారెడ్డి ముఖ్య తారాగణం. పి పుల్లయ్య దర్శకత్వం చేపట్టిన ఈ సంగీతభరిత కళాఖండాన్నివాసిరెడ్డి నారాయణరావు నిర్మించారు.

"జయభేరి " సినీమా కు మూలం సుప్రసిధ్ధ కళాత్మక దర్శక నిర్మాత వి.శాంతారాం తీసిన "మత్ వాలా షాయర్ రామ్ జోషి" అనే హిందీ సినీమా. తెలుగు వాతావరణానికి కావలసిన సముచిత మార్పులు, చేర్పులతో జయభేరిని పి.పుల్లయ్య తీసారు. తెలుగు చిత్రంతో పాటే తమిళంలో కూడా "కలైవాణన్" పేరిట నిర్మించారు. తెలుగులోని ప్రధాన పాత్రధారులతో పాటు పలువురు తమిళ నటీనటులు కూడా నటించారు. తెలుగు వరసలే తమిళంలో కూడా ఉపయోగించారు. తమిళంలో  కూడా "మదిశారదాదేవి",  "రాగమయీ రావే", "యమునా తీరమునా" పాటలను ఘంటసాలవారే పాడి అక్కడి శ్రోతల మెప్పులు పొందారు.  'రసికరాజా' పాటను శీర్కాళి గోవిందరాజన్ పాడారు. ఇతర పాటలను సౌందరరాజన్ ఆలపించారు.

జయభేరి సినీమా పాటల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఘంటసాల మాస్టారు  "మది శారదాదేవి మందిరమే" పాటే తనకు సవాలుగా, తన హృదయానికి హత్తుకుపోయిన పాటగా చెప్పేవారు. ఈ  పాట దృశ్యం విజయనగరంలో తమ గురుదేవులు పట్రాయని సీతారామశాస్త్రిగారి సన్నిధిలో ఇతర విద్యార్ధులతో కలసి చేసిన సంగీత సాధనలు, బోధనలు తనకు గుర్తుకు తెచ్చాయని,  చిత్రంలో గురుశిష్య సంబంధాన్ని చాలా బాగా చిత్రీకరించారని ఘంటసాలగారు అనేవారు.

జయభేరి సంగీత పరంగా అద్భుత కళాఖండమే అయినా ఆర్ధికంగా ఘన విజయం సాధించలేకపోయింది. ఉత్తమ చిత్రంగా ప్రభుత్వపు మెరిట్ సర్టిఫికెట్ మాత్రం లభించింది.

కొసమెరుపు -  జయభేరిలోని పాటల గాయకునిగా ఘంటసాలవారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభించినా, ఈ సినీమా లోని పాటలకుగాను తనకు రావలసిన పూర్తి పారితోషికాన్ని సినీమా రిలీజ్ అయిన తర్వాత కూడా నిర్మాత నుండి ఘంటసాల రాబట్టుకోలేకపోయారు.

(ఈ సినీమా తర్వాత ఆ నిర్మాత మరల సినీమాలు తీసినట్లుగా కనపడదు.)

సినీమా విజయానికి  అందులోని క్వాలిటీ కన్నా మార్కెటింగ్ స్ట్రాటజీ, మేనేజ్మెంట్ స్కిల్ మాత్రం అత్యంత ఆవశ్యకం.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" - 30వ భాగం - రసికరాజ తగువారము కామా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించి...