చిత్రం - జీవితచక్రం
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
సంగీతం - శంకర్ జైకిషన్
సుడిగాలి లోన దీపం
కడవరకు వెలుగునా ---2
చరణం 1:
లోకాన పన్నీరు
జల్లేవులే
నీకేమొ కన్నీరు
మిగిలిందిలే
పెరవారి గాయాలు
మాన్పేవులే
నీలోన
పెనుగాయమాయేనులే
అణగారిపోవు ఆశ నీ
వల్లను ఫలించె
!సుడిగాలి!
ఒక కన్ను నవ్వేటి
వేళ లో
ఒక కన్ను
చెమరించసాగునా
ఒకచోట రాగాలు
వికసించునా
ఒకచోట హృదయాలు
ద్రవియించునా
ఎనలేని ప్రాణదానం ఎద బాధ తీర్చునా
!సుడిగాలి!చరణం 3:
కల్లోల పవనాలు
చెలరేగునా
గరళాల జడివాన
కురిపించునా
అనుకోని చీకట్లు
తెలవారునా
ఆనంద కిరణాలు
ఉదయించునా-2
విధికేమొ లీలయైన మది బరువు మోయునా
!సుడిగాలి!ప్రేమ సాఫల్యానికి ప్రేమికులలో స్వార్ధపరత్వం తప్పనిసరి. తమ ప్రేమను నిర్భయంగా బాహాటంగా ప్రకటించకుండా పిరికితనమో లేక మెతకదనమో ప్రదర్శిస్తే ఆ ప్రేమికులు జీవితాంతం కలవనేలేరు. వారి ప్రేమ సుడిగాలి లో దీపంలా రెపరెపలాడుతూ ఏ క్షణాన్నైనా కొండెక్కిపోయి వారి కథ విషాదాంతమే అవుతుంది. పెద్దలమాటను కాదనలేక, బంధుప్రీతిని చంపుకోలేక చావుబ్రతుకుల మధ్యనున్న మరదలి మెడలో తాళికట్టి, తాను మనసారా ప్రేమించిన యువతికి ద్రోహం చేయలేక, నిజం చెప్పలేక తనలో తానే కుమిలి కృంగిపోతూ ఇద్దరు యువతుల మధ్య నలిగిపోయే ఓ భగ్నప్రేమికుడు ఆలపించే విషాద గీతమే 'సుడిగాలి లోన దీపం...' నేటి మన సజీవరాగం.
ఎగుడుదిగుళ్ళ బాటపై భగ్నప్రేమికుల జీవితచక్రం అపసవ్యంగానే తిరుగుతుంది. ఒకరి శాంతి మరొకరి అశాంతి, ఒకరి ఆనందం మరొకరి దుఃఖం. ఈరకమైన అల్లకల్లోల మనస్థితిలో కథానాయకుడు ఆలపించే ఈ గీతాన్ని 'జీవితచక్రం' సినిమా కోసం ఆరుద్ర వ్రాయగా శ్రోతల మనసులు కరిగించేలా చాలా హృద్యంగా ఘంటసాల గానం చేశారు. ఎన్.టి.ఆర్, శారద, వాణిశ్రీల మీద నేపథ్యం నుండి వినిపించే ఉద్విగ్నభరితమైన ఈ పాటను డైరెక్టర్ సి.ఎస్.రావు చిత్రీకరించారు. గంభీరమైన, ఉద్రిక్తతతో కూడిన విషాద నేపథ్యగీతాలు పాడాలంటే ఘంటసాలగారికి ప్రత్యమ్నాయ గాయకుడే లేడని దర్శక నిర్మాతలంతా గాఢంగా విశ్వసించిన కాలమది. ఘంటసాలగారు పాడినన్ని శోకమయ నేపథేయగీతాలను మరే గాయకుడు పాడలేదంటే అది అతిశయోక్తి కానేకాదు.
ముక్కోణ ప్రేమకధయైన జీవితచక్రం సినిమాకు గొప్ప ఆశాజ్యోతి శంకర్-జైకిషన్ ల సంగీతం. నిజానికి ఈ సినిమా సంగీత దర్శకుడు శంకర్. ఏవో కారణాల వలన వృత్తిపరంగా శంకర్ జైకిషన్ ల జోడీ ఏనాడో విడిపోయినా రాజ్ కపూర్ మీది గౌరవంతో వీరిద్దరిలో ఎవరు ఏ సినిమా చేసినా సంగీత దర్శకులుగా ఇద్దరి పేర్లు వుండేలా ఒప్పందం జరిగింది. ఆ రకంగా 'జీవితచక్రం' సంగీతం శంకర్ సమకూర్చారు. మొత్తం ఏడు పాటల్లో ఒక పాట రెండుసార్లు వేర్వేరు గొంతులతో వినిపిస్తుంది ఈ సినిమా లోని పాటలను ఆరుద్ర, సి.నా.రె. వ్రాయగా ఘంటసాల, హిందీ నేపథ్యగాయని శారద, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వసంతలు పాడారు. ఘంటసాలగారు ఈ సినిమాలో సుశీలగారితో ఒక పాటకూడా పాడకపోవడం ఒక విశేషం.
మాస్టారు ఈ సినిమాలో రెండు డ్యూయెట్లను, రెండు సోలోలను
పాడారు. ఈ పాటల రికార్డింగ్ బొంబాయి (ఆనాడు) ఫిలిం సెంటర్ స్టూడియోలో
జరిగింది. అందుకుగాను గాయనీగాయకులు అంతా మద్రాసు నుండి బొంబాయి వెళ్ళారు.
ఘంటసాలగారు పాడవలసిన నాలుగు పాటలకోసం ఒకవారం రోజులు షెడ్యూల్ చేశారు. ఘంటసాలగారికి పామర్తి-సంగీతరావులా; కెవిమహాదేవన్ కు పుహళేందిలా, రాజేశ్వరరావుగారికి రాజగోపాల్-కృష్ణన్ లా శంకర్ జైకిషన్ లకు చిరకాల సంగీత సహాయ దర్శకులు దత్తారాం-శెబాస్టియన్లు. శంకర్ జైకిషన్ ల స్వరకల్పనలో రూపొందిన పాటలన్నిటికీ హెవీ ఆర్కెష్ట్రా ను ఉపయోగించడం ఆనవాయితీ. ఆ అలవాటు ప్రకారం జీవితచక్రంలో ఘంటసాలగారు పాడిన పాటలన్నింటికీ 40-50 మందికి తక్కువలేకుండా వివిధ రకాలైన వాద్యాలను ఉపయోగించారు. ఏ హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా కనిపించే ఈ 'మద్రాసి'ని (ఘంటసాల) అక్కడి ఆర్కెష్ట్రా ప్లేయర్స్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకటి రెండు ఫైనల్ రిహార్సల్స్ చూసి ఘంటసాలగారు మైక్ ముందు నిల్చొని గళం విప్పేటప్పటికి ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. ఆ వాయిస్ లోని డెప్త్ కు, మెలోడికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంతవరకు ఘంటసాల అనే గాయకుడి మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏడు రోజుల్లో చేయాలనుకున్న ఆ నాలుగు పాటలను ఘంటసాలగారు మూడురోజుల్లోనే పాడి ముగించారు. ఆ నాలుగు పాటల కంపోజిషన్ తనకే ఇబ్బంది కలిగించలేదని, అవి పాడడంలో తానేమీ కష్టపడలేదని, అలాటి పాటలు రోజుకు రెండు మూడైనా పాడవచ్చని ఘంటసాలగారు తమ సన్నిహితులకు చెప్పడం నాకు గుర్తుంది. శంకర్-జైకిషన్ ల పాటలన్నీ ఎప్పుడో ఎక్కడో వారి పాత సినిమా లలో విన్నట్లనిపిస్తాయి. అలాగే జీవితచక్రంలోని పాటలన్నీ శంకర్ జైకిషన్ ల హిందీ పాటల ఛాయల్లోనే వినిపిస్తాయి.
నేటి మన సజీవరాగం 'సుడిగాలిలోన దీపం' పాటను అన్యస్వరాలతో కూడిన హిందోళరాగంలో స్వరపర్చడం జరిగింది. అనేకమైన వైయొలిన్స్, పియోనా, గిటార్, మేండలిన్స్, ట్రంపెట్స్ వంటి వెస్ట్రన్ టైప్ ఆర్కెష్ట్రా తో ఈ పాటను మనసుకు హత్తుకుపోయేలా శంకర్ కంపోజ్ చేశారు. ఘంటసాలవారి కంఠంలో ఈ పాట మరింత రిచ్ గా వినిపించింది. ఘంటసాలగారి చేత మరెన్నో హిందీ చిత్రాలలో పాటలు పాడిస్తానని, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీషు భాషలలో ప్రైవేట్ ఆల్బమ్స్ పాడిస్తానని కొన్ని నెలలు బొంబాయి లోనే వుండమని శంకర్ బలవంతం చేశారట. కానీ, మద్రాసు వాతావరణానికి అక్కడి వృత్తిపరమైన వ్యవహారశైలికి బాగా అలవాటు పడిన ఘంటసాల బొంబాయి లో వుండడానికి ఇష్టపడలేదు. తెలుగు సినిమాలకు సంబంధించినంతవరకు తాను ఉన్న ఉన్నతస్థాయి తనకు చాలని అంతకుమించిన ఆశలేదనే అభిప్రాయాన్ని సున్నితంగా వెల్లడించి మద్రాసు తిరిగి వచ్చేశారు. మొత్తం మీద శంకర్-జైకిషన్ ఘంటసాల కాంబినేషన్లో వచ్చిన ఏకైక తెలుగు సినిమా ' జీవితచక్రం' లోని పాటలన్ని బాగానే హిట్ అయాయి.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
ఘంటసాల మాస్టారు వంటి మహోన్నతులు చాలా అరుదుగా జన్మిస్తారు వారు మంచివారు కాబట్టి లోకమంతా మంచివారే అనుకుంటారు పక్క అవకాశవాదులు వీరి ని స్నేహితుల రూపంలో నమ్మించి నట్టేట ముంచుతారు భాగస్వామ్య నిర్మాణంతో ఘంటసాల వంటి ఉత్తములు కష్టాల పాలవుతారు జీవిత చక్రం చిత్రంలో పాట ఆప్తమిత్రులు చిత్రంలోని ఈ లోకము మహా మోసం వంటి పాటల్లో లోకం తీరు చక్కగా వివరించబడుతుంది. గంధర్వ గాయకుల సహచర్యంలో కాలం గడిపిన మీరు వారీ జీవిత విశేషాలను వివరించడం చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ భగవంతుడు మీకు ఆ సదవకాశాన్ని కలిగించాడు. సజీవ రాగాలు అన్ని భాగాలు చదవగలిగే అవకాశం కలిగింది మీకు హృదయపూర్వక నమస్సుమాంజలి
ReplyDelete