చిత్రం - మూగనోము
గానం - ఘంటసాల
రచన - దాశరధి
సంగీతం - ఆర్. గోవర్ధనం
పల్లవి :
'నిజమైనా కలయైనా
నిరాశలో ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే
!నిజమైనా!
చరణం 1:
పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేవు
నా నీడే తోడై జగమంతా తిరిగేను
!నిజమైనా!
చరణం 2:
గులాబినై నీ జడలో మురిసానే ఆనాడు
బికారినై నీకోసం వెతికానే ఈనాడు
!నిజమైనా!చెలీ చెలీ నా మదిలో చితులెన్నో రగిలేను
చెలి లేని నాకేమో విషాదమే మిగిలేను
!నిజమైనా!
ఎడారిలో ఒకటేలే
ఒకటేలే....
మనిషి ఆశాజీవి. జీవితమంతా ఆశలతోనే సతమతమవుతూ వాటిని నెరవేర్చుకోవడం అహర్నిశలు కృషిచేస్తూనేవుంటాడు. ఆ ఆశలో నుండే నిరాశ కూడా ఏర్పడుతుంది. ఆశించినవి సఫలం కాకపోతే మిగిలేది నిరాశే. ఈ ఆశ, నిరాశ రెండూ మానసికస్థితులే. మితిమీరిన ఆశ, నిరాశ రెండూ మనిషి పురోభివృద్ధికి నిరోధకాలే. వీటిని అధిగమించి ముందుకుసాగాలంటే బుధ్ధిని సక్రమరీతిలో ఉపయోగించాలి. మనుషులలో రెండు రకాలవారు - బుధ్ధికారకులు, మనసుకారకులు. బుధ్ధికారకులు వివేకంతో, విచక్షణాజ్ఞానంతో సమతుల్యంగా వుంటే మనసుకారకులు అత్యధిక భావోద్వేగాలతో, మానసికోద్రేకాలతో ప్రతీ చిన్న విషయానికీ విపరీతంగా చలించిపోతారు. ఇలాటివారే ఎక్కువగా నిరాశా నిస్పృహలకు గురియై తీవ్రంగా బాధపడుతూంటారు. ఇలాటి నిరాశా నిస్పృహలు వర్తక వ్యాపారాలలోని వైఫల్యాలవలన లేదా ఆర్ధిక సంబంధ కష్ట నష్టాల వలన బాధపడేవారికంటే ప్రేమ సంబంధిత వ్యవహారాలలో విఫలమైనవారిలోనే తీవ్రస్థాయిలో కనిపిస్తాయి.
నడి ఎడారిలో వున్నవారికి తమ గమ్యం కడు దూరం కనుక రేయింబగళ్ళతో పనిలేదు. అలాగే నిరాశలో మునిగితేలే వారు నిజమైనా కలయైనా ఒకటే అనే భావనలో వుంటారు. అలా ప్రేమలో విఫలమైన ఒక భగ్న ప్రేమికుడి మనోగతమే నేటి మన సజీవరాగం.
అదే ఘంటసాలగారు మృదుమధురంగా, ఆవేదనాభరితంగా ఆలపించిన దాశరధిగారి 'నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే'.
ఈ భగ్నప్రేమికుడు ఒక ధనవంతుని కొడుకు. ఒక పేదరైతు కూతురిని ప్రేమించి రహస్యంగా పెళ్ళాడుతాడు. ఈ విషయం తెలిసిన ఆ ధనవంతుడు పై చదువుల పేరిట కొడుకును విదేశాలకు పంపి, తన పరువుప్రతిష్టలకు భంగకరమైన గర్భవతి కోడలు దగ్గర బలవంతంగా ప్రమాణం చేయించుకొని ఆ కుటుంబాన్ని ఆ ఊరినుండి సాగనంపుతాడు. తర్వాత విదేశాల నుండి తిరిగివచ్చిన కొడుకుకు అతని భార్యమీద అభాండాలు వేసి అతని మనసు విరిచేస్తారు. భార్య శీలాన్ని శంకించిన కథానాయకుడు త్రాగుడుకు అలవాటు పడి భార్య ఎడబాటు వల్ల కలిగిన నైరాశ్యంతో ఒంటరిగా తిరుగుతూ 'ఒకనాడు ప్రేయసి జడలో గులాబినై మురిసిన తాను ఈనాడు బికారిలా ఆమె కోసం వెతుకులాడుతున్నానని'... 'నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే' అని పాడుతూ తన మనోవేదనను వ్యక్తం చేస్తాడు.
కథా సన్నివేశానికి పరిపుష్టి కలిగించే మాటలతో దాశరధిగారు వ్రాసిన ఈ సందర్భోచిత గీతానికి హరికాంభోజి స్వరాలతో హృదయాలకు హత్తుకుపోయేలా ఒక చక్కటి పాటను మలిచారు సంగీత దర్శకుడు ఆర్.గోవర్ధనం. హరికాంభోజి రాగం కర్నాటక సంగీతంలో 28వ మేళకర్త కాక అత్యంత ప్రాచీనమైనది కూడా. ఖమాస్, యదుకుల కాంభోజి, నాటకురంజి, శహన వంటివి ఎన్నో ఈ హరికాంభోజికి జన్యరాగాలుగా ప్రసిద్ధి చెందివున్నాయి.
గత ఐదు దశాబ్దాలుగా సజీవమై నిలచిన ఈ నైరాశ్యగీతాన్ని ఘంటసాల మాస్టారు ఎంతో భావయుక్తంగా, సన్నివేశానికి కావలసిన విషాదాన్ని, గాంభీర్యాన్ని తన గొంతుకలో పలికిస్తూ అతి సునాయాసంగా ఆలపించారు.
'మూగనోము' సినిమాలో వున్న ఏడు పాటల్లో నాలుగు పాటలు ఘంటసాలగారు పాడినవే. రెండు సోలోలు, రెండు డ్యూయెట్ లు. అన్ని పాటలకు మంచి శ్రావ్యమైన వరసలను కూర్చారు గోవర్ధనం. ఘంటసాల, సుశీల గానం చేసిన ఈ మనోజ్ఞగీతాలకు తెరపై అక్కినేని, జమున తమ నటనతో సజీవత్వం కల్పించారు. డి.యోగానంద్, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ చాలా అనుభవజ్ఞులైన కళాకారులే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా కొద్ది సినీమాలలో ' మూగనోము' ఒకటి దీనిని ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎ.వి.మెయ్యప్ప చెట్టియార్ వారసులు మురుగన్, శరవణన్, కుమరన్, బాలసుబ్రహ్మణ్యన్, గుహన్ ఈ సినిమాను నిర్మించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నిర్మాతలందరి పేర్లు ఒక్క దేవుడికి సంబంధించినవే. ఈ పేర్లన్నీ శివుని కుమారుడైన కార్తికేయుడు లేదా షణ్ముఖునికి చెందిన నామాలే.
ఇదే ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ వారు 1960లో ఎ.భీమ్ సింగ్ డైరెక్టర్ గా, సావిత్రి, జెమినీ గణేశన్ నాయికా నాయకులుగా 'కళత్తూర్ కణ్ణమ్మ' అనే తమిళం సినీమా తీసారు. ఆర్.గోవర్ధనం సోదరుడు ఆర్.సుదర్శనం సంగీతం నిర్వహించారు. సుప్రసిద్ధ బహుభాషా చిత్ర కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త అయిన కమలహాసన్ బాలనటుడిగా పరిచయం చేయబడిన సినిమా. ఆ సినిమాయే 1969లో అదే సంస్థ ద్వారా 'మూగనోము' గా తెలుగులో రీమేక్ చేయబడింది. తమిళంలో కమలహాసన్ నటించిన పాత్రను తెలుగులో మాస్టర్ బ్రహ్మాజీ పోషించాడు.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
No comments:
Post a Comment