Saturday, 23 August 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 96వ భాగం - తిరుమల మందిర సుందర

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభైయైదవ భాగం ఇక్కడ

96వ సజీవరాగం - తిరుమల మందిర సుందర

చిత్రం - మేనకోడలు
గానం - ఘంటసాల
రచన - దాశరథి

సంగీతం - 
ఘంటసాల

పల్లవి 
తిరుమల మందిర సుందర

సుమధుర కరుణాసాగరా

ఏ పేరున నిను పిలిచేనురా

ఏ రూపముగా కొలిచేనురా

చరణం 1: 

పాలకడలిలో శేషశయ్యపై

పవళించిన శ్రీపతివో 

వెండికొండపై    నిండు 

మనముతో వెలిగే గౌరీపతివో 

ముగురమ్మలకే మూలపుటమ్మగ 

భువిలో వెలసిన ఆదిశక్తివో

                            !!తిరుమల మందిర !!

 

చరణం 2:

కాంతులు చిందే నీ ముఖబింబము

కాంచిన చాలును ఘడియైనా-2

నీ గుడివాకిట దివ్వెను నేనై

వెలిగిన చాలొక రేయైనా

నీ పదములపై కుసుమము నేనై

నిలిచిన చాలును క్షణమైనా

తిరుమల మందిర సుందర

సుమధుర కరుణా సాగరా!!

వేంకటాద్రి సమం స్థానం నాస్తి కించన 

వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి

అని పురాణ వాక్కు. ఈ అనంతవిశ్వంలో వేంకటాద్రి కి సమానమైన పుణ్యక్షేత్రంగాని, కలియుగ దైవంగా విరాజిల్లే శ్రీ వేంకటేశ్వర స్వామికి మించిన దేవుడుగానీ ఇప్పటికి, ఎప్పటికీ మరెవ్వరూ వుండరని ఈ శ్లోకానికి అర్ధం.

శ్రీవేంకటేశ్వరునిగా,బాలాజీగాసప్తగిరీశునిగామలయప్పగా, ఇలా అనేక నామాలతో యుగాదిగా విరాజిల్లుతూ ప్రపంచవ్యాప్తంగా ఈనాటికీ భక్తజనులచే అనునిత్యము కొనియాడబడుతున్న ఈ తిరుమలగిరివాసుడైన శ్రీనివాసునికి ఇంతటి ప్రశస్తి ఎలా సంప్రాప్తించిందో!

అసలు, స్వయంభూగా వెలసిన ఈ వేంకటేశ్వరుడు ఎవరుపాలకడలిలో శేషశయ్యపై పవళించి సకలలోకాలను పాలించే శ్రీపతియాలేక, వెండికొండపై నెలకొని  నిండుమనసుతో  వెలుగొందే గౌరీపతా?అదీ కాదు, ముగురమ్మలకే మూలపుటమ్మగా ఈ భువిని వెలసిన ఆదిశక్తియా? ఎవరు ఈ తిరుమల మందిర సుందరుడు  అనే జిజ్ఞాసను పామరులకు రేకెత్తిస్తూ ఒక అద్భుతమైన పాటను మనకు ప్రసాదించారు దాశరధి కృష్ణమాచార్యులవారు. ఆ గీతమే "తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగరా"... ఇదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.

మారుతున్న కాలానుగుణ్యంగా పౌరాణిక సినీమాల ప్రాభవం తగ్గి నూతన పోకడల సంగీతసాహితీ ధోరణులతో తెలుపు నలుపు యుగం నుండి క్రమక్రమంగా రంగులహంగుల సినీమా వేపు దృష్టిసారిస్తున్న సమయంలో   ఒక తెలుపు నలుపుల సాంఘిక సినీమాలో ప్రేక్షకులలో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావన పెంపొందిస్తూ ఈలాటి భక్తిగీతం చోటు చేసుకోవడంఆ పాట బహుళ జనాదరణ పొంది ఈనాటివరకు సంగీతాభిమానుల హృదయాలలో పదిలంగా గూడుకట్టుకొని వుండడం చాలా గొప్ప విషయం. ఇందుకు కారణం, ఆ పాట తిరుపతి వేంకటేశ్వరునికి సంబంధించినది కావడమా? లేక అజరామరమైన సంగీతాన్ని సమకూర్చి గానం చేసిన ఘంటసాల వేంకటేశ్వరుడి ప్రతిభా? లేక మంచి సాహిత్యాన్ని అందించిన కవి దాశరధిగారి విశిష్టతా  ఏది ఏమైనా ఒక మంచి విశ్లేషణకు అవకాశమిచ్చే మనోజ్ఞ భక్తిగీతం 'తిరుమల మందిర సుందరా....'

పల్లవిలో అనంత నామాలు గల ఆ దేవదేవుని ఏ నామంతో పిలిచిఏ రూపంతో కొలవాలని ప్రశ్నిస్తున్నాడు కవి. అలాగే చరణంలో, వేంకటేశ్వరుడు ముగ్గురు మూర్తుల సమన్వయ రూపమనే అనాది వాక్కును బలపరుస్తున్నాడాయన. నా ఉద్దేశ్యంలో, ఈ ముమూర్తుల సమన్వయ రూప కారణం చేతనే తిరుపతి వేంకటేశ్వరుడు అన్ని వర్గాలకు, మత విశ్వాసాలకు చెందిన కోట్లాది భక్తులందరిచేత సమానంగా కొలవబడి  సకల భోగాలు,నిత్య నీరాజానాలు అందుకుంటున్నాడు.

ఆఖరు చరణంలో కవి స్వామి సన్నిధిలో దివ్వెగా ఒక రేయైనాలేదా స్వామి దివ్య చరణాలపై కుసుమంగానైనా నిలవాలని ఆకాంక్షిస్తూ నవ విధ భక్తి మార్గంలోని ఆత్మనివేదనాన్ని  సూచిస్తున్నారు.

శ్రీవైష్ణవాచార్యునిగా దాశరథిగారు ఈ పాటలో తన భక్తితత్పరతను చాటిచెప్పుకున్నారు. 

ఇక సంగీతం విషయానికి వస్తే  ఈ గీతాన్ని రూపొందించడానికి సకలజన సమ్మోహనకారకమైన మోహన రాగాన్ని ఎన్నుకున్నారు ఘంటసాల మాస్టారు. మోహన రాగం కర్నాటక సంగీతంలో 28వ మేళకర్త అయిన హరికాంభోజికి జన్యరాగం. ఐదు స్వరాలు మాత్రమే కల ఔడవరాగం. 'సరిగపద', 'సదపగరి' అనే ఐదు స్వరాలు మాత్రమే ఆరోహణఅవరోహణ క్రమంలో పలికే ఈ మోహనరాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'భూప్' అని వ్యవహరిస్తారు. ఘంటసాల మాస్టారు ఈ మోహన రాగంలో కూడా అన్యస్వర ప్రయోగాలు చేసి సినీగీతాలలో మోహన రాగానికి  ఒక వినూతనత్వాన్ని కల్పించారు.

'మేనకోడలు' సినిమా కోసం స్వరపర్చబడిన ఈ భక్తిగీతం పి.సుశీల, ఘంటసాల ఇద్దరి గళాలలో విడివిడిగా గ్రామఫోన్ రికార్డ్ లుగా బహుళ ప్రచారం పొందాయి. భక్తిగీతాలమీద ముఖ్యంగా తన ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామి పై గల ఆరాధనతో ఘంటసాల మాస్టారు ఈ పాటను మరోసారి పాడి రికార్డ్ చేశారు. మాస్టారు పాడిన పాట 'మేనకోడలు' సినిమా లో వుండదు.  ఘంటసాలగారు ముందుగా ఈ పాట ట్రాక్ పాడగా తర్వాత మరో రోజున ఎప్పుడో సుశీలగారు  వచ్చి ట్రాక్ మిక్స్ చేశారు. సుశీలగారు పాడిన వెర్షన్ మాత్రమే సినిమా లో జమునపై చిత్రీకరించడం జరిగింది.  ఈ చిత్రంలోని ఒక పాటను సెన్సర్ వారు కట్ చేయడం వలన ఆ పాట స్థానంలో మాస్టారు తిరిగి పాడిన 'తిరుమల మందిర సుందరా' పాట గ్రామఫోన్ రికార్డ్ గా తీసుకురావడం జరిగిందని  ఘంటసాలగారంటే అమిత భక్తి గల ఆ చిత్ర నిర్మాత వై సునీల్ చౌదరి  తర్వాతి కాలంలో ప్రకటించడం జరిగింది. ఆ విధంగా  సుశీలగారుఘంటసాలగారు పాడిన సుమధుర భక్తిగీతం 'తిరుమల మందిర సుందరా' పాట రూపుదిద్దుకుంది, ఆ రెండూ ఐదు దశాబ్దాలుగా వేంకటేశ్వర భక్తులనుసంగీతాభిమానులను అలరిస్తూండడం జరిగింది.

బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన మేనకోడలు చిత్రానికి మాదిరెడ్డి సులోచన గారి 'శిక్ష' నవల ఆధారం. కృష్ణజమునగుమ్మడి, రావు గోపాలరావు, సత్యనారాయణ, రాజబాబు, సూర్యకాంతం, మొదలగువారు నటించారు. ఈ సినిమా కు సంభాషణలు వ్రాసిన దాసరి నారాయణరావు  సహాయ దర్శకుడిగా పనిచేశారు.  పాటల కంపోజింగ్ అంతా ఘంటసాల మాస్టారి ఇంట్లోనే జరిగేది.  ఆ సందర్భంగా నిర్మాత సునీల్ చౌదరిగారు, డైరెక్టర్ బిఎస్ నారాయణ గారు, పాటల రచయిత లు  దాశరథి, సినారెకొసరాజు వచ్చేవారు.  అసిస్టెంట్ డైరక్టర్ దాసరి నారాయణరావు కూడా ఘంటసాలగారింటికి వచ్చి పాట సన్నివేశ పూర్వాపరాలను అత్యుత్సాహం తో వివరించడం నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత దాసరి దశ తిరిగి తెలుగు చిత్రసీమ ను ఏలిన విషయం అందరికీ తెలిసిందే.

ఘంటసాల మాస్టారుసుశీల పాడిన రెండు పాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే చిన్నచిన్న మార్పులు కనిపిస్తాయి. ఘంటసాల మాస్టారి వెర్షన్ లో సుశీల పాట ప్రారంభంలో వచ్చే హార్ప్ఫ్లూట్హార్ప్ బిట్స్ వుండవు. సరాసరి సితార్ బిట్ నుండి బిజిఎమ్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్), తర్వాత  పల్లవితో పాట ప్రారంభమౌతుంది. 

మాస్టారి కంపొజిషన్స్  ఎప్పుడూ రాగభావానికి, పద స్పష్టతకు ఎక్కువ ప్రధాన్యమిస్తారు.  పాట వరస సరళంగా వుంటుంది. నోట్స్ ఎక్కడా గజిబిజిగా కాంప్లికేటెడ్ గా వుండవు. పాట పల్లవో, చరణమో మరచిపోయేటంత సుదీర్ఘ బిజిఎమ్స్ వుండవు. చరణ చరణానికి వరస మార్చే పధ్ధతి ఘంటసాలగారి సంగీతంలో చాలా అరుదు. పల్లవి ఒక వరసలో సాగితే దానిని అనుసరించే మిగిలిన చరణాలు వుంటాయి. ఈ పాటలో వినవచ్చే దగ్గరదగ్గరి గమకాలు సుశ్రావ్యంగా వుంటూ గాయనీగాయకుల ప్రతిభకు దర్పణం పడతాయి. అనుభవం వుంటే తప్ప ఆ యా గమకాలను స్పష్టంగా పలకడం కష్టం.

ఘంటసాల మాస్టారు ఈ పాటలో హార్ప్, వైబ్రోఫోన్, ఫ్లూట్సితార్వైలిన్స్తబలడోలక్ ఇత్యాది వాద్యాలను ఉపయోగించారు.

తిరుపతి వెంకన్నలాగే, ఘంటసాలగారి 'తిరుమల మందిర సుందరా' గీతం కూడా  తెలుగువారి హృదయాలలో సుస్థిరంగా, శాశ్వతంగా నిలిచేవుంటుంది. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...