Saturday, 3 August 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 41వ భాగం - అలిగితివా సఖి ప్రియ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైయవ భాగం ఇక్కడ

41వ సజీవరాగం - అలిగితివా సఖీ ప్రియా

చిత్రం - శ్రీకృష్ణార్జున యుద్ధం
గానం - ఘంటసాల
రచన - పింగళి
సంగీతం - పెండ్యాల

నంది తిమ్మనగారు ఆంధ్రభోజునిగా కీర్తిపొందిన శ్రీకృష్ణ దేవరాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఈయన కవిత్వం సరళంగా, సుకుమారంగా, బహురమ్యంగా వుంటుంది.  అందమైన స్త్రీ నాసికను వర్ణిస్తూ ఎంతో రమణీయమైన పద్యాన్ని చెప్పిన తిమ్మనగారు కవి ప్రపంచంలో 'ముక్కు' తిమ్మనగా అనంత ఖ్యాతిని పొందిన కవికులాలంకారుడు. 

ముక్కు తిమ్మనగారు రాయలవారి పట్టమహిషి తిరుమలదేవి వివాహ సందర్భంలో అరణపు కవిగా విజయనగరానికి వచ్చినవాడు. మహారాణివారి మంచి చెడ్డలను గమనిస్తూ ఆమెకు చేదోడువాదోడుగా వుండేవాడు. ఒకసారి తిరుమలదేవి, కృష్ణదేవరాయల మధ్య ఒక రకమైన ప్రణయకలహం ఏర్పడింది. రాణీవారిమీద అలగిన రాయలు ఆమెను ఉదాసినపర్చి ఆమె మందిరానికే రావడం మానేసాడు. ఈ అంతఃపుర కలహానికి కారణమేదైనా తమ రాణివారి జీవితాన్ని చక్కపర్చవలసిన గురుతర బాధ్యత తనమీదనున్నదని భావించిన నంది తిమ్మనగారు రాయలవారిని నేరుగా మందలించే ధైర్యం చేయలేక, కలహ సమయంలో భార్యలను అనునయించి, సానుకూలంగా సమాధానపర్చి తమ దారికెలా తెచ్చుకోవాలో  రాజావారికి తెలిసివచ్చేలా వెంటనే  'పారిజాతాపహరణం'  అనే కావ్యాన్ని రచించి రాయలవారికి వినిపించాడు. 

నారదుడు తెచ్చిచ్చిన ఒక స్వర్గలోకపు పారిజాత పుష్పం సత్యభామ అలకకు ఎలా కారణమయిందో, ఆమె ఆగ్రహాన్ని తీర్చడానికి సత్యాపతి ఎంతవరకూ సిధ్ధపడ్డాడో అత్యంత మనోహరంగా పారిజాతాపహరణం కావ్యంలో తిమ్మనగారు వర్ణించారు. అందులోని పద్యమే -'నను భవదీయదాసుని  మనంబున నెయ్యపుకిన్క బూని తాచిన యది నాకు మన్ననయ..." అని భామ కాలితాపులను కూడా భరించాడు శ్రీకృష్ణుడు. ఆ కావ్యాన్ని   ఆసాంతం రసహృదయంతో ఆస్వాదించిన కవిభోజుడు కృష్ణరాయలవారు తన తప్పిదాన్ని గ్రహించి తిరుమలదేవితో తిరిగి సఖ్యత పొందాడు.

శ్రీకృష్ణార్జున యుధ్ధం సినీమాలో సందర్భోచితంగా ఉపయోగించుకున్న నంది తిమ్మనగారి ఆ పద్యము, దానికి అనుగుణంగా ముందు వచ్చే పాటే నేటి మన సజీవరాగం.

ఒక పాటో, పద్యమో గురించి చెప్పడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరమాయని కొందరికి సందేహం కలగవచ్చు, కానీ అవసరమే.

ఒక చిత్రంలోని పాటైనా, పద్యమైనా రసోద్దీపన కలిగించి ప్రేక్షకుల హృదయాలలో కలకాలం నిలిచిపోవాలంటే ఆ సందర్భంయొక్క పూర్వాపరాలు, ఆయా పాత్రల స్వభావాల పట్ల  ఆ పాటతో సంబంధమున్న కవికి, దర్శకునికి, సంగీతదర్శకునికి, గాయనీగాయకులకు, తెరమీద నటించే నటీనటులకు పరిపూర్ణంగా అవగాహన వుండాలి. అప్పుడే ఆ సన్నివేశం మనోజ్ఞంగా రూపొంది ప్రేక్షకులను అలరిస్తుంది.

అటువంటి సదవగాహన కల దర్శకుడైనందు వల్లనే కె.వి.రెడ్డిగారు ఆణిముత్యాలవంటి కళాఖండలను చలనచిత్రాలుగా,  మాధుర్యమైన చిత్రగీతాలను రసగుళికలుగా తెలుగువారి సొంతం చేయగలిగారు.

కె.వి.రెడ్డిగారు నిర్మించి దర్శకత్వం వహించిన అద్భుత పౌరాణిక చిత్రరాజం 'శ్రీ కృష్ణార్జున యుధ్ధం'. పింగళి, పెండ్యాల, ఘంటసాల, సుశీల, ఎన్.టి.ఆర్, అక్కినేని, సరోజాదేవి, ఎస్.వరలక్ష్మి వంటి హేమాహేమీల సహాయ సహకారాలతో అజరామర చిత్రంగా నిల్చిపోయింది. ఆ సినీమా లోని అన్ని పాటలు, పద్యాలు  ఈనాటికీ మన మనసులలో నిల్చిపోయాయి. అందులోని "అలిగితివా సఖీ ప్రియా కలత మానవా" అనే పాట భార్యభర్తల మధ్య ప్రణయ కలహాలు, చిలిపి కయ్యాలు వున్నంతవరకూ సజీవరాగమై నిత్యనూతనంగా వినిపిస్తూనేవుంటుంది. వైవాహిక జీవితం అనుభవంలేని బ్రహ్మచారి పింగళి నాగేంద్రరావుగారు మధురమైన  ఊహాపోహలతో మృదువైన శృంగార రసభావనలతో ఈ పాటను వ్రాసారు. (వివాహం అయివుంటే ఇలా వ్రాయగలిగేవారు కారేమో!)

'లేని తగవు నటించడం', ' సత్యాపతి నా బిరుదని నింద', ' సరసనుండి విరహం విధించడం' వంటి ప్రయోగాలు పింగళివారి రచనా శైలికి దర్పణం.

శృంగారభావాలను, విరహవేదనలను వెలిబుచ్చే రాగమైన 'భాగేశ్వరి'ని తీసుకొని పెండ్యాలగారు ఈ పాటను స్వరపర్చారు. భాగేశ్వరి, రాగేశ్వరి రాగాలు రెండూ సామాన్య శ్రోతల చెవులకు ఒకేలా వినిపిస్తాయి. ఈ రెండు రాగాలలో పలికే 'గ' ( గాంధారం) లలో తేడా వుంది. ఆ తేడా  తెలియకపోతే భాగేశ్వరి ని రాగేశ్వరి గా లేదా రాగేశ్వరి ని భాగేశ్వరి గా పొరబడే ప్రమాదముంది. ఈ భాగేశ్వరి రాగం కూడా మియా తాన్సేన్ ద్వారా సంగీతప్రపంచం లో బహుళ ప్రచారంలోకి వచ్చింది. 

ఇలాటి రాగాలపట్ల ఎంతో అవగాహన, అనుభవం వుండడం చేతనే ఘంటసాల మాస్టారు ఈ పాటను ఎంతో హృద్యంగా పాడగలిగారు. శ్రీకృష్ణుడి లోని చిలిపిదనం, జాణతనం పూర్తిగా అర్ధం చేసుకొని అనుభవించి  ఘంటసాల ఆలపించడం వలన తెర మీద కృష్ణుడు ఎన్.టి.రామారావు పాటకు తగినట్లుగా సునాయాసంగా తన హావభావాలతో ప్రేక్షకులను అలరించి కృష్ణుడంటే తాను తప్ప వేరెవరు కారని నిరూపించారు. అలిగితివా, సఖీ ప్రియా అంటూ భామామణిని అనునయించే క్రమంలో చివరికి  తన శిరసును ఆమె కాలితో తన్నినా కూడా అది ఆవిడనే బాధించిందేమోనని సత్యాపతి కలత చెందడం విషయంలో అటు ఘంటసాలగారు, ఇటు రామారావుగారు కనపర్చిన  గాత్ర, నట వైదుష్యం మనలను పులకాంకితులను చేస్తుంది. కవి కల్పనలోని చమత్కారాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకుంటేనే తప్ప ఆ గాయకుడు తన గళంలో ఆ మాడ్యులేషన్స్ పలికించలేడు,  ఆ నటుడు తన ముఖభావాలు ప్రస్ఫుటంగా చూపించలేడు. ఈవిషయంలో ఘంటసాలగారు, రామారావుగారు తమ తమ ప్రజ్ఞను చాటి చెప్పారు.

భాగేశ్వరిలో రూపొందిన ఈ పాటలో పెండ్యాలగారు పియోనా, సితార్, ఫ్లూట్, వైయొలిన్స్, తబలా, తదితర రిథిమ్స్ ను చక్కగా ఉపయోగించారు.

ఈ పాట చరణాలలో  'దయను చూడవా' అనే చోట, 'నింద ఎరుగవా' అనే చోట వచ్చే సంగతులు,  వెనువెంటనే చిన్న నవ్వు, 'విరహమిటుల విధింతువా'  దగ్గర రాగాలాపన వింటేనే చాలు ఘంటసాల గాత్ర విశేషం మనకు తెలియడానికి. అలాటి సంగతులను  అంత నిర్దిష్టంగా పలకగల  లలిత సంగీత గాయకులే ఈనాడు కరువయ్యారు. ఒకరిద్దరు ఎవరైనా పాడినా ఆ గాత్రాలలో లాలిత్యం, నిండుదనం, రిఫైన్నెస్ కనపడదు.

ఇక్కడ మరో చిన్న విషయం చెప్పాల్సివుంది. మన తెలుగు సినీ దర్శకులకు ముక్కు తిమ్మనగారి పారిజాతాపహరణం లోని ఈ పద్యం పట్ల మక్కువ 1958 నుండే ప్రారంభమయింది. మొదటసారిగా ఈ పద్యాన్ని శ్రీకృష్ణమాయ సినీమాలో పెట్టారు.  అప్పుడు కూడా  ఈ పద్యాన్ని ఘంటసాలవారు ఆలపించగా నారద పాత్రధారి అక్కినేని, జమున (మాయ) పై చిత్రీకరించారు. అయితే పద్యం ఆఖరులో 'అరాళకుంతలా' అనే మాటను మార్చి 'వినీలకుంతలా' అనే పదప్రయోగం చేసారు.   ఆ తర్వాత, శ్రీకృష్ణార్జునయుధ్ధం. చివరగా, శ్రీకృష్ణతులాభారం సినీమాలో భామా కృష్ణులపై ఇదే సన్నివేశంలో ఒక పాట తర్వాత మరల ఈ పద్యం పెట్టారు. ఖమాస్ రాగంలోని ఈ పాటకు, పద్యానికి సంగీతం మరల పెండ్యాలగారే. గాయకుడూ ఘంటసాలగారే. కృష్ణుడూ ఎన్.టి.ఆర్ గారే. 'అలకబూనిన అరాళకుంతల 'మాత్రం మారింది. సత్యభామగా జమున నటించారు.

ఈవిధంగా పలు పౌరాణిక పద్యాలను పలు సినీమాలలో పలుసార్లు గానం చేసిన ఘనత ఒక్క ఘంటసాలవారికే చెందుతుంది.  ఎన్నిసార్లు, ఏ విధంగా గ్రోలినా తనివితీరని గానామృతం ఘంటసాల గళామృతం.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...