Saturday, 27 July 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 40వ భాగం - ఝణ ఝణ కింకిణీ చరణ చారణ లాస్య మధూదయమ్ములో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ముప్ఫై తొమ్మిదవ భాగం ఇక్కడ  

40వ సజీవరాగం -  
ఝణ ఝణ కింకిణీ చరణ చారణ 
లాస్య మధూదయమ్ములో 

చిత్రం - కన్నకొడుకు
గానం - ఘంటసాల
రచన - జగ్గయ్య
సంగీతం - ఎస్.పి.కోదండపాణి

ఝణ ఝణ కింకిణీ చరణ చారణ లాస్య మధూదయమ్ములో
తొణికెడు నీ తనూలతిక దోరగ పూచిన యవ్వనాలు నా
మనసున నింపెనే వలపు మంచుల చల్లదనాలు కోరికల్
పెనగొను స్వప్నలోకముల వెన్నెల మేడల  వెల్గెనో చెలీ

లలిత శరదిందు రేఖల పలుకరించి
కన్నె విరజాజి తావుల కలలు పండి
వలపు సెలయేటి కెరటాల పులకరించి
ఎగిరి వచ్చిన వనకన్యవేమొ నీవు

నీ మధురాధరాలు, కుసుమించిన 
హాసవసంత శోభనై
నీ మధుభాషణాల రవళించిన 
మోహన వేణునాదమై
నీ మదిలోని భావమై నిన్నెడబాయని నీలినీడవై
మామక జీవితమ్మె రసమంజరిగా తరియింతునో చెలీ... 

ఘంటసాల చిత్రజగత్తులో కాలుపెట్టాక సినీమా సంగీత కళామతల్లి నూతన కింకిణీ ధ్వనులు వినిపించడం మొదలెట్టింది - కొంగర జగ్గయ్య, సినీ నటుడు తెరమీద విలన్ గా వికటాట్టహాసం చేస్తూ ఆడపిల్లల మనసులలో భయాందోళనలు కలిగించే జగ్గయ్యగారిలో గొప్ప భావుకత కూడా వుంది. ఆయన హృదయంలోనుండి ఉద్భవించి ఘంటసాల కంఠాన ప్రతిధ్వనించిన కింకిణీ ధ్వనులే నేటి మన సజీవరాగం.

1961లో కృష్ణారావు అనే ఆయన దర్శకత్వంలో 'కన్నకొడుకు' అనే సినీమా వచ్చింది. జగ్గయ్య, దేవిక, కృష్ణకుమారి, రాజనాల, మొదలగువారు నటించిన ఈ చిత్రంలోని ఒక వైవిధ్య భరితమైన గీతాన్ని జగ్గయ్య వ్రాయగా ఘంటసాల ఆలపించారు. చిత్రంలో ఓ పదకొండు పాటలుండగా ఘంటసాలవారు ఆలపించిన ఈ ఏకైక గీతమే మకుటాయమానంగా నిలిచింది.

ఈ 'కన్నకొడుకు" స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఎస్.పి.కోదండపాణిగారి తొలి చిత్రం. సుసర్ల దక్షిణామూర్తిగారి సహాయకుడిగా  అనేక సినీమాలలో పనిచేసి గడించిన అనుభవంతో ఈ కన్నకొడుకు పాటలను ఆయన స్వరపర్చారు. ఈ సినీమాలో వున్న పదకొండు పాటలను ఆనాడువున్న ప్రముఖగాయకులందరిచేతా తలా ఓ పాట పాడించారు.  ఘంటసాల, ఎ.ఎ. రాజా, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది, సుశీల, కె.రాణి, ఎస్. జానకి, స్వర్ణలత ఈ చిత్రంలోని పాటలు పాడారు. 

ఈ సినీమాలో ఘంటసాల మాస్టారు పాడిన ఈ ఏకైక గీతం నన్నెంతో ఆకర్షించింది.

ఈ పాటను వ్రాసినవారు ఈ చిత్ర కధానాయకుడు కె.జగ్గయ్య. నటనలోనే కాక కవిగా కూడా చాలా  విలక్షణమైనవారని చాలా కొద్దిమందికే ఎరిక. వైవిధ్యభరితమైన కవితలెన్నో ఆయన కలంనుండి జాలువారాయి. రబీంద్రనాథ్ టాగోర్ గీతాంజలిని తెనుగులో అనువదించి బహు ప్రశంసలు పొందారు. సినీమాలలో నటిస్తూనే రాజకీయాలలో ప్రవేశించి నాలుగవ లోక్ సభకి ఒంగోల్ నియోజకవర్గ నుంచి ఎన్నికై, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ సినీమా నటుడిగా ఖ్యాతి పొందారు. ఆలిండియా రేడియో న్యూస్ రీడర్ గా తన జీవితాన్ని  ప్రారంభించి,  నాటకాల ద్వారా సినీమాలకు వచ్చిన విద్యాధికుడు. 

నేటి మన ప్రహేళిక గీతాన్ని కోదండపాణి కళ్యాణి, భాగేశ్వరి, హిందోళ రాగాలలో స్వరపఱచగా అనన్యసామాన్యంగా ఘంటసాల మాస్టారు గానం చేసి జీవం పోసారు. ఈ రాగాలు 'యమన్', 'భాగేశ్రీ', 'మాల్కౌంస్' గా హిందుస్థానీ సంగీతంలో కూడా బహు ప్రసిధ్ధికెక్కిన రాగాలు. ఈ గీతంలో సితార్, ఫ్లూట్, ఎలక్ట్రిక్ గిటార్, బేస్ గిటార్, వైయొలిన్స్, తబలా వాద్యాలు అతి సున్నితంగా గాత్రాన్ని అనుసరించి  మనోరంజకంగా సాగాయి. 

ఈ పాట ఒక నూతన పంథాలో వినిపిస్తుంది. సాహితీ పరంగా, సంగీతపరంగా ముందు ఒక గజల్ లా అనిపించినా సాకీల ప్రక్రియలో మిగిలిన భాగం కొనసాగింది. ఈ పాటను ఘంటసాల మాస్టారి చేత మాత్రమే పాడించడంలో సంగీత దర్శకుడు, దర్శక నిర్మాతలు ఎంతో ఔచిత్యాన్ని పాటించారనే చెప్పాలి. ఈ తరహా గీతాలు ఘంటసాలవారి గంభీర నాదంలోనే  సజీవమై శ్రోతల హృదయాలను తట్టి కుదుపుతూంటాయి.

ముఖ్యంగా పై స్వరస్థాయిలలో సాగే ఈ గీతం ' వనకన్యవేమో' అనే చోట ఘంటసాల మాస్టారు ఇచ్చిన భావప్రకటనకు, స్వరప్రస్తారానికి సంగీతజ్ఞానంలేని పామరశ్రోత కూడా  'వహవ్వా'  అనకతప్పదు. అలాగే పాట ఆఖరున వచ్చే ఆలాపన  ఆయనకు మాత్రమేసాధ్యం, అది వారికే సొంతం.

గత దశాబ్దాలలోని హిందుస్థానీ గజల్ విద్వాంసుల గానానికి ఏమాత్రం తీసిపోని తెలుగు గజల్ గా ఘంటసాలవారి  ఈ గీతం కలకాలం నిలిచిపోతుంది.






వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్  

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...